సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని నిందితులు కుట్రపన్నారని అందులో వివరించింది. సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసే నాటికే కేసుకు సంబంధించిన పలు వివరాలు బహిర్గతం అయ్యాయని, ఆయన కొత్తగా వివరించింది ఏమీ లేదని పేర్కొంది.
సీఎం వివరాలు వెల్లడించే సమయానికి సిట్ ఏర్పాటుకాలేదని, కేసు మెటీరియల్ చేరవేసే అవకాశమే లేదని, సింగిల్ జడ్జి ఈ విషయంలో పొరపడ్డారని తెలిపింది. ఒక రాజకీయ నేతగా తన ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందని తెలిసినప్పుడు మీడియాకు వివరాలు వెల్లడించడం తప్పు ఎలా అవుతుందని సింగిల్ జడ్జి ఒప్పుకున్నారని వివరించింది. అందువల్ల సిట్ దర్యాప్తును కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. దీనిపై గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది.
కీలక అంశాలను పరిశీలించలేదు..
ప్రభుత్వం తన అప్పీలులో మరిన్ని అంశాలను వివరించింది. ‘‘హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసే నాటికి సీఎం ప్రెస్‌మీట్ నిర్వహించలేదు. సిట్ ఏర్పాటు కాలేదు. మొయినాబాద్ పోలీసులు కేసునమోదు చేసిన కొన్ని గంటల్లోనే దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదంటూ బీజేపీ పిటిషన్ దాఖలు చేయడం ఆమోద యోగ్యం కాదు. నిజానికి ఈ కేసులో నిందితులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడాన్ని సింగిల్ జడ్జి ప్రశంసించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా పోలీసుల చర్య స్వాగతించదగినదని వ్యాఖ్యానించారు.
అయితే గతంలో పీవీ నరసింహారావు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్ర జరిగిందనడానికి, ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర వేసేందుకు ప్రయత్నించారనడానికి అన్ని వీడియో, ఆడియో ఆధారాలు ఉన్నాయి. రిట్ పిటిషన్ పరిధిలో లేని అంశంలోకి సింగిల్ జడ్జి వెళ్లారు. సిట్ దర్యాప్తును అడ్డుకోవడానికి బలమైన కారణాలేమీ లేకపోయినా.. నిందితుల హక్కుల పరిరక్షణ కోసమంటూ సిట్‌ను రద్దు చేసి, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడం సరికాదు’’ అని పేర్కొంది.
అడుగడుగునా అడ్డుకునే యత్నం..
తొలుత సిట్ దర్యాప్తుపై సింగిల్ జడ్జి స్టే విధించగా.. ద్విసభ్య ధర్మాసనం దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించిందని, సుప్రీంకోర్టుకు కూడా సిట్ దర్యాప్తును అడ్డుకోలేదని ప్రభుత్వం అప్పీలులో వివరించింది. దర్యాప్తును హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షించాలన్న ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టు రద్దు చేసిందని.. సిట్ స్వతంత్రంగా దర్యాప్తు చేయవచ్చని సూచించిందని గుర్తు చేసింది.
ఇలా సిట్ దర్యాప్తును అడుగడుగునా అడ్డుకునేందుకు నిందితులు ప్రయత్నించిన విషయాన్ని సింగిల్ జడ్జి గమనంలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేగాకుండా తమపై నమోదైన కేసును ఏ సంస్థ దర్యాప్తు చేయాలో నిందితులే కోరుకోవడం చట్ట విరుద్ధమని.. ఈ విషయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను సింగిల్ జడ్జి పరిశీలించలేని వివరించింది.
నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌లో సీఎంను ప్రతివాదిగా చేయలేదన్న అంశాన్ని సింగిల్ జడ్జి విస్మరించారని.. కేసు దర్యాప్తు కొనసాగుతుండగా ఇలాంటి ఉత్తర్వులివ్వడం ద్వారా సాక్షులు ప్రభావితం అవుతారని, పోలీసుల నిబద్ధతను తప్పుబట్టినట్టు అవుతుందని పేర్కొంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని.. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment