సాక్షి, విశాఖపట్నం : ఆదాయం పెంపు కోసం ఆర్టీసీ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రయాణికుల ద్వారా వచ్చే రాబడికంటే దానికయ్యే ఖర్చే అధికంగా ఉంటోంది. అయినప్పటికీ సేవా దృక్పథంతో ప్రజల కోసం బస్సులను నడుపుతోంది. దీంతో ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తోంది.
ఇప్పటికే లాజిస్టిక్స్ ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. కొత్తగా కార్గోలో డోర్ డెలివరీ, పికప్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదార్ల నుంచి ఆదరణ బాగుంటోంది. ఈ నేపథ్యంలో సరికొత్తగా టెంపుల్ టూరిజంపై ఫోకస్ పెట్టింది.
ఇందులోభాగంగా విశాఖపట్నం నుంచి తమిళనాడులోని అరుణాచలం, పొరుగున ఒడిశాలో ఉన్న పూరీ సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఇప్పటికే నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి అరుణాచలానికి 120 వరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.
ప్రతి పౌర్ణమికి అరుణాచల గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విశాఖ (ద్వారకా బస్‌స్టేషన్) నుంచి అరుణాచలానికి ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ జోన్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.
మే 5 నాటి పౌర్ణమికి 3వ తేదీ నుంచే ఇక్కడ నుంచి ఈ బస్సులు బయలుదేరేలా ప్రణాళిక రూపొందించామన్నారు. అరుణాచలం వెళ్లేటప్పుడే కాణిపాకం, శ్రీపురం, కంచి, శ్రీకాళహస్తి దేవాలయాలను కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. పౌర్ణమి దర్శనం అయ్యాక ఏడో తేదీన విశాఖలో చేరుస్తామన్నారు.
సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.4,000, ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ.5,000 చొప్పున ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర నిర్ణయించామన్నారు. ఈ యాత్రకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్ చేసుకునే వీలు కల్పించామన్నారు.
పూరీ, భువనేశ్వర్‌లకు కూడా..
మరోవైపు పొరుగున ఒడిశాలోని కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా స్పెషల్ ప్యాకేజీతో బస్సులను నడపనున్నట్టు ఈడీ రవికుమార్ తెలిపారు. పూరీలోని జగన్నాథస్వామి, భువనేశ్వర్‌లోని లింగరాజస్వామి, కోణార్క్ సూర్య దేవాలయం, చిలక సరస్సుల సందర్శనకు ప్రతి వారాంతం (శనివారం)లో వీటిని నడుపుతామన్నారు.
ఈనెల 29 నుంచి ఈ బస్సులను ప్రారంభిస్తామన్నారు. ఈ ప్యాకేజీలో (సూపర్ లగ్జరీ) టిక్కెట్టు ధర రూ.2,350గా నిర్ణయించామని చెప్పారు. డిమాండ్‌ను బట్టి ఏసీ సర్వీసులను కూడా ప్రవేశపెడతామన్నారు. అరుణాచలంతో పాటు ఒడిశా పుణ్యక్షేత్రాలకు ఏడాది పొడవునా ఈ టెంపుల్ టూరిజం బస్సులు నడుపుతామని తెలిపారు.
మీడియా సమావేశంలో ఆర్టీసీ డీపీటీవో బలిజి అప్పలనాయుడు, డిప్యూటి సీటీఎం జి.సత్యనారాయణ, విశాఖ డిపో మేనేజర్ గంగాధరరావులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment