Anakapalle District Latest News
-
సీబీఎస్ఈ ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత
పాయకరావుపేట: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ మంగళవారం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ఎన్.సత్యసాయి 483/500, ఎమ్.యశ్వసి 482/500, పి.తరుణ్ 481/500, ఎస్.రఘునందన్ 478/500 మార్కులతో సత్తా చాటారని, ప్లస్ –2 ఫలితాల్లో జి.సాయి అనీష్ 469/500, ధాత్రి నిహారిక 466/500 మార్కులు సాధించారన్నారు. నూటికి నూరు శాతం ఉత్తీర్ణతతో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు. మాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో తమ విద్యార్థులు 100/100 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
5 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
రోలుగుంట: హత్యాయత్నం కేసులో అయిదేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై రామకృష్ణారావు మంగళవారం తెలిపారు. మండలంలోని బీబీపట్నం గ్రామానికి చెందిన బాకూరి రామరాజుపై హత్యాయత్నం కేసు నమోదు కాగా, అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి వచ్చినట్టు సమాచారం అందుకుని మంగళవారం ఇతన్ని అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరిచామని తెలిపారు. ఇద్దరు యువకులపై పోక్సో కేసు అనకాపల్లి టౌన్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోక్సో కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై రవికుమార్ మంగళవారం తెలిపారు. ఓ గ్రామానికి చెందిన బాలిక(14)పై తగరంపూడి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడినట్టు ఫిర్యాదు అందిందన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు సాక్షి, విశాఖపట్నం : స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో బ్లాస్ట్‌ఫర్నేస్–1 విభాగంలో సమ్మె ప్రచారం నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన యాజమాన్యం కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిప్రదేశం వదిలి వెళ్లడాన్ని తప్పు పడుతూ 11 మంది కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరికొందరికి బుధవారం నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కార్మిక నాయకులకు షోకాజ్ నోటీసు జారీ చేయడం పట్ల కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యాజమాన్యం వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం కూడలి వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు కార్మిక నాయకులు ప్రకటించారు. -
నృత్యంలో రాణించడమే లక్ష్యం
శాసీ్త్రయ నృత్యమంటే ఇష్టం. చదువుకుంటూనే సమయాన్ని వృథా చేయకుండా అకాడమీకి వచ్చి ఆంధ్ర న్యాటం నేర్చుకుంటున్నాను. శాసీ్త్రయ నృత్యాల్లో రాణించాలనేది నా కల. –లలితా శాన్విక, పెదబొడ్డేపల్లి నృత్యం నేర్చుకోవటం అదృష్టం... అన్నమయ్య, త్యాగరాజు కీర్తనలకు నృత్యం నేర్చుకోవటం నా అదృష్టం. నృత్యంలో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాను. నృత్యంలో రాణిస్తానన్న నమ్మకం ఉంది. టీచర్ ఉమాదేవి ప్రోత్సహంతో నృత్యంలో రాణిస్తాను. –యశ్విత, నర్సీపట్నం -
భళా... ఆమె నృత్య కళ
● ఉద్యోగం చేస్తూనే శిక్షణ ● ఆసక్తి చూపుతున్న బాలబాలికలు ● శాసీ్త్రయ నృత్యంలో రాణింపు ● నాట్య గురువు ఉమాదేవి స్ఫూర్తిదాయకం నర్సీపట్నం: సంస్కృతీ సంప్రదాయాలను బోధిస్తూనే... మనసుకు ఆహ్లాదం పంచుతోంది నృత్యం. ఈ కళావైభవాన్ని భావితరాలకు పంచేందుకు కృషి చేస్తున్నారు నాట్యగురువు ఉమాదేవి. అభినయం, నృత్యంలో ఎవరూ సాటిరారనేలా తన శిష్య బృందంతో నర్తిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. శాసీ్త్రయ నృత్యంలో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. తొలుత నృత్యంపై ఆసక్తి పెంచుకున్నామె, అందులో పట్టుసాధించి శిక్షకురాలిగా మారారు. ప్రభు త్వ సంస్థలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగిగా స్థిరపడినప్పటికీ నృత్యంపై మక్కువతో పది మందిని తీర్చిదిద్దాలనే తపనతో పెదబొడ్డేపల్లిలో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తర్ఫీదు ఇస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు... శాశ్వత శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న బాలికలు, శిక్షకురాలు ఉమాదేవి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. తిరుపతి, అన్నవరం, అప్పనపల్లి పాటు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అటు చదువులోనూ ఇటు కళల్లోనూ రాణిస్తూ పలువురి మెప్పు అందుకుంటున్నారు. బాలబాలికల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభకు పదును పెడుతూ శాసీ్త్రయ నృత్యంలో ఎంతో మంది ప్రముఖల మన్ననలు పొందుతున్నారు. సంప్రదాయ నృత్యంతో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ బాలికలు నర్సీపట్నం పేరున నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు. వేసవి విజ్ఞాన శిబిరంలోనూ తర్ఫీదు మరికొంత మంది బాలబాలికలను శాసీ్త్రయ నృత్యంలో తీర్చిదిద్దేందుకు నర్సీపట్నం శారదానగర్‌లో వేసవి నృత్య శిక్షణ శిబిరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ శిబిరంలో ఆంధ్రనాట్యంలోని అన్నమాచార్యులు, త్యాగరాజు కీర్తనలపై శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శాసీ్త్రయ నృత్యంపై 35 మంది బాలబాలికలకు నేర్పిస్తున్నారు. అటు చదువులోనూ..ఇటు సంప్రదాయ నృత్యంపై చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు. -
నృత్యం అంటే మక్కువ...
చిన్నప్పటి నుంచి శాసీ్త్రయ నృత్యం అంటే ఇష్టం. గజముఖ నృత్య అకాడమీ ధనం మాస్టారు దగ్గర శాసీ్త్రయ నృత్యంలో తర్ఫీదు పొందాను. నేను నేర్చుకున్న కలను పలువురికి అందించాలనే తపనతో సొంతంగా శ్రీమృతేశ్వర నృత్య అకాడమీని స్థాపించాను. నా దగ్గర ప్రస్తుతం 47 మంది బాలబాలికలు శిక్షణ పొందుతున్నారు. శిక్షణకే పరిమితం కాకుండా బాలికలతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ఉద్యోగం ఉన్నప్పటికీ కళ మీద మక్కువతో శిక్షణ ఇస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లల అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహించాలి. –ఉమాదేవి, అకాడమీ శిక్షకురాలు, నర్సీపట్నం -
నునపర్తిలో అక్రమ గ్రావెల్ దందా
రాత్రిళ్లు భారీగా లారీల్లో తరలింపు అచ్యుతాపురం రూరల్: మండలంలోని నునపర్తి శివారు నడింపల్లి కొండల్ని రాత్రికి రాత్రి గ్రావెల్ దొంగలు దోచేస్తున్నారు. రెండు జేసీబీలతో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి సుమారు 20కుపైగా లారీలతో తరలిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికంగా కొందరు యువకులు తెలిపారు. అక్రమ కేసుల్లో ఇరికిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. రేయింబవళ్లు అని తేడా లేకుండా ఇష్టారాజ్యంగా చెట్లను నరికేయడం, కొండలను పిండి చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ ధనార్జన చేస్తున్నారు. ఎవరైనా అధికారులు తూతూమంత్రంగా ఆపినా ఒకట్రెండు రోజులు తర్వాత షరామామూలే అన్నట్టుగా గ్రావెల్ దందా చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని పర్యావరణాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
పింఛన్ల డ్యూటీ నుంచి మినహాయించాలి
అనకాపల్లి: గ్రామాల్లో సామాజిక పింఛన్లు పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు రెండు, మూడు నెలలు పాటు సహకరించాలని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. నాగశేషు తెలిపారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో మంగళవారం ఆమె మాట్లాడారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పిల్లల బరువు తీయడం, టీహెచ్ఆర్(టేక్ హోమ్ రేషన్) పంపిణీ చేయడం, పిల్లలకు వండి పెట్టడం, ప్రీ స్కూల్ నిర్వహించటం, యాప్‌లో అప్లోడ్ చేయడం ఇలా అనేక పనులతో సతమతమవుతున్న నేపథ్యంలో పెన్షన్ పంపిణీ భారం మోపొద్దన్నారు. అంగన్వాడీ సిబ్బంది తీవ్ర పని ఒత్తిడితో అనార్యోగానికి గురవుతున్నట్లు వాపోయారు. గుంటూరులో రాజకీయ జోక్యం వల్ల ఒక కార్యకర్తను సస్పెండ్ చేశారన్నారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షురాలు ఎం. దుర్గరాణి, సభ్యురాలు సిహెచ్ రామలక్ష్మి, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
నర్సీపట్నం: గంజాయి తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ పి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ముందుస్తు సమాచారం మేరకు సీఐ జి.గోవిందరావు, ఎస్సై ఉమామహేశ్వరరావు, సిబ్బంది ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మంగళవారం వాహన తనిఖీలు చేపట్టారు. చింతపల్లి వైపు నుంచి వస్తూ పోలీసులను గమనించిన స్మగ్లర్లు కారును కొంత దూరంలో ఆపి పారిపోయేందుకు ప్రయత్నించారు. అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. కారు వెనక సీటుకు ప్రత్యేకంగా అర తయారు చేయించి 2 కిలోల చొప్పున ఐదు ప్యాకెట్లలో పది కిలోల గంజాయిని అమర్చారు. తమ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించడంతో గంజాయి బయటపడింది. తమిళనాడు, తిరుపూర్ భారతి నగర్ స్కూల్ వీధికి చెందిన కార్తీక్ అండవర్(34), అదే రాష్ట్రం విజయపురి రోడ్ మేలాతేరు, కోవిలపట్టికి చెందిన కారు డ్రైవర్ దీపన్(34)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కారుతో పాటు వీరి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, రూ.8 వేలు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. గంజాయిని కేసును ఛేదించిన సిబ్బందికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో ఎస్సై రమేష్ పాల్గొన్నారు. -
పచ్చిరొట్ట సాగుకు అనుకూలం
అనకాపల్లి: వర్ష సూచన ఉన్నందున కోత దశలో నువ్వు పైరును వాతావరణ పరిస్థితులు గమనించి కోసుకోవాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ సీహెచ్.ముకుందరావు తెలిపారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కోసిన పంటలు వర్షానికి తడవకుండా రైతులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రాగల వర్షాన్ని ఉపయోగించుకుని ఖరీఫ్‌కి ముందు జనుము లేదా జీలుగ లేదా పిల్లిపెసర లేదా పెసర వంటి పచ్చిరొట్ట పైరును వేసుకోవడానికి ఇదే అనువైన సమయమని పేర్కొన్నారు. వర్షాన్ని వినియోగించుకుని చెరకు వేసే రైతులు నేల తయారీ చేసుకోవాలన్నారు. చెరకులో నల్లి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పక్వానికి వచ్చి మామిడి, బొప్పాయి పండ్లను కోసి మార్కెట్‌కు తరలించాలన్నారు. పక్వానికి రాని గెలలు ఉంటే, కింద పడకుండా ఉండడానికి కర్రలతో ఊతమివ్వాలన్నారు. మామిడిలో పండు ఈగ ఆశించే అవకాశం ఉందని, నివారణకు రాలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలన్నారు. ప్లాస్టిక్ పళ్లెంలో మిథైల్ యూజినాల్ 2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి తోటలో వేలగట్టాలని లేదా మార్కెట్లో లభ్యమయ్యే పండు ఈగను ఆకర్షించే బుట్టలను ఎకరాకు 5 చొప్పున 5–6 అడుగుల ఎత్తులో కొమ్మలకు కట్టాలని సూచించారు. వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. లోతు దుక్కులు చేయడం వల్ల కలుపు సమస్యను అధిగమించవచ్చని, పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు బి.భవాని, పి.వి.పద్మావతి. ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
మట్టి..కొల్లగొట్టి
రెచ్చిపోతున్న గ్రావెల్ మాఫియా పోలవరం ఎడమ కాల్వ, అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలు● యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు ● అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్ యలమంచిలి రూరల్: మండలంలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది.అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా నిర్వహిస్తూ రూ.కోట్లు గడిస్తోంది.అధికార టీడీపీ,జనసేన నేతల అండదండలు మట్టి మాఫియాకు ఉండడంతో అధికారులు సైతం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్టు,చెరువులు,అసైన్డ్ భూములు,పంట పొలాల్లో మట్టిని యంత్రాలతో యథేచ్ఛగా తవ్వు తూ టిప్పర్లు,ట్రాక్టర్లతో ప్రైవేటు వెంచర్లు,కట్టడాలు, ఇటుక బట్టీలకు తరలించి రూ.లక్షలు గడిస్తున్నారు. ఈ అక్రమ మట్టి తవ్వకాలను రెవెన్యూ,గనుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఇంతవరకు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.మండలంలో నిత్యం కొంతమంది టీడీపీ,జనసేన గ్రామ,మండల స్థాయి నాయకుల కనుసన్నల్లో ప్రతి రోజూ పదుల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో సచివాలయం ఎదురుగా ఉన్న రహదారి మీదుగా వీఆర్వో చూస్తుండగానే పది ట్రాక్టర్లతో మట్టిని ఓ ఇంటి నిర్మాణ పనులకు తరలించడం,ఆ వివరాలను సేకరించేందుకు వెళ్లిన కొందరు మీడియా ప్రతినిధులపై మట్టి మాఫియా దురుసుగా ప్రవర్తించడం, మీ ఇష్టం వచ్చిన పనిచేసుకోండని ప్రవర్తించిన తీరు మండలంలో చర్చనీయాంశమైంది. కల్పతరువు.. పోలవరం కాల్వ గట్లు యలమంచిలి మండలంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ గట్ల నుంచి గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి.కొందరు అక్రమార్కులు అధికార కూటమి నేతల అండదండలతో రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా యంత్రాలతో తవ్వకాలు జరిపి,లారీలు,ట్రాక్టర్లతో అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారు.లారీ సైజును బట్టీ గ్రావెల్ లేదా మట్టి లోడుకు రూ.6 వేల నుంచి రూ.22,500 వేలు,ట్రాక్టరుకు రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నారు. నిరంతరాయంగా ఈ దందా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ముఖ్యంగా ఈ అక్రమ తవ్వకాలపై నిఘా ఉంచి, అడ్డుకోవాల్సిన రెవెన్యూ,గనుల శాఖ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ఎవరైనా మీడియా ప్రతినిధులు తెలియజేసినప్పుడు లేదా పత్రికల్లో వార్తలు వచ్చిన సందర్భాల్లో ఒకటి రెండ్రోజులు హడావుడి చేయడం తప్ప పకడ్బందీగా మట్టి మాఫియా ఆగడాలు కట్టించడంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి.మట్టి అక్రమ తవ్వకాలు ఎక్కువగా శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారే వరకు,ఇతర సెలవు దినాల్లో జరుగుతున్నాయి.ఇక కొన్ని చోట్ల పట్టపగలే దర్జాగా అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల అండదండలతో ఈ దందా కొనసాగుతోంది. వెంచర్లు,బట్టీలు,నిర్మాణాలకు తరలింపు యలమంచిలి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు,ఇటుక బట్టీలు, నిర్మాణాలకు మట్టిని భారీగా తరలిస్తున్నారు.వెంచర్లు వేసేటప్పుడు మట్టి ఎక్కువగా అవసరమతుంది.వీటికి అవసరమయ్యే మట్టి లేదా గ్రావెల్‌ను జనసేన,టీడీపీ నేతలు గంపగుత్తగా మాట్లాడుకుని మట్టి తోలుకుని రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ గ్రావెల్,మట్టి తవ్వకాల సమాచారం అందించినా గనుల శాఖ అధికారులు సిబ్బంది కొరత పేరుతో తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు.ఎక్కడైనా మట్టి అక్రమంగా తవ్వకాలు జరుపితే ఎంత మొత్తంలో మట్టి తరలించారో నిర్థారించాల్సిన గనుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.ఇక రెవెన్యూ అధికారులు,సిబ్బంది సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తమ కళ్లముందే అక్రమ వ్యవహారం జరుగుతున్నా కళ్లకు గంతలు కట్టుకోవడం మరీ దారుణం. చర్యలు తీసుకుంటాం అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి,గ్రావెల్ తవ్వకాలపై ని ఘా ఉంచుతున్నాం.గ్రామ స్థాయిలో వీఆర్వో,ఆపైన ఆర్ఐలు పర్యవేక్షించేలా ఆదేశాలిస్తున్నాం.ఎక్కడైనా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తే మాకు సమాచారం అందించాలి.తక్షణమే మా సిబ్బందిని ఆ ప్రాంతానికి పంపించి ఆయా వాహనాలను స్వాధీనపర్చుకుని. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. –కె.వరహాలు, తహసీల్దార్, యలమంచిలి మీడియాపై దౌర్జన్యం మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న సంగతి తెలిసి కొందరు మీడియా ప్రతినిధులు వాటిని కవర్ చేసేందుకు వెళుతున్నపుడు అక్రమార్కులు వారిపై దురుసుగా ప్రవర్తించడం,కొందరు దుర్భాషలాడుతూ,దౌర్జన్యాలకు దిగడానికి కూడా వెనుకాడడం లేదు. ఫొటోలు,వీడియోలు తీస్తున్న మీడియా ప్రనినిధులను అడ్డుకోవడం,వారిపట్ల దురుసుగా మాట్లాడడం పరిపాటిగా మారింది.ఇటీవల యలమంచిలి సమీపంలో మామిడివాడ,కొత్తూరు ప్రాంతాల్లో ఒక జనసేన నాయకుడు అక్రమంగా చేస్తున్న మట్టి తవ్వకాల వద్దకు వెళ్లిన ఒక మీడియా ప్రతినిధిపై దౌర్జన్యానికి దిగాడు.మంగళవారం యలమంచిలి మండలం ఏటికొప్పాకలో జరుగుతున్న మట్టి అక్రమ రవాణా వద్దకు వెళ్లిన మీడియా ప్రతినిధులతో అక్రమార్కులు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోండి..ఏమీ చేయలేరని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం వెనుక అధికార యంత్రాంగం అండదండలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి.మీడియా ప్రతినిధులు సమాచారం ఇచ్చినా గ్రామస్థాయిలో వీఆర్వో అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్,మట్టి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను అక్కడి నుంచి తరలించుకుపోయిన తర్వాత అక్కడకు వెళ్తుండడం వెనుక ఆంతర్యం బహిరంగ రహస్యమే. -
నేడు మాక్ ఎక్సర్సైజ్
తుమ్మపాల: శత్రువుల దాడులు చేసే సమయంలో తమను తాము రక్షించుకునే విధానంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 14న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్టు ఇన్చార్జి కలెక్టర్, జేసి ఎం.జాహ్నవి తెలిపారు. మన దేశంపై శత్రువులు దాడిచేసే పరిస్థితి సంభవించినప్పుడు ఏర్పడిన అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు అనకాపల్లి బైపాస్ రోడ్డులోని జయభేరి మారుతీ షోరూం ఎదురుగా గల గ్రీన్ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ వద్ద ఉదయం 9.30 గంటల నుంచి నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని, జాగ్రత్తలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర సంసిద్ధతపై పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. -
రూ.31 కోట్లతో తాగునీటి సమస్యకు పరిష్కారం
● ఉపాధి హామీలో ఇంకుడు గుంతల తవ్వకాలు ● జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో చైర్పర్సన్ సుభద్ర వెల్లడి మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖజిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.31 కోట్లు కేటాయించిందని, ఈ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర మంగళవారం తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన పలు స్థాయీ సంఘాల సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మూడు ఇంకుడు గుంతల తవ్వకానికి అనుమతిస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న మురుగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్టు చైర్పర్సన్ వెల్లడించారు. ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి సుమారు రూ. 74 వేల వరకు ఖర్చు అవుతుందని, ఈ నిధులను పూర్తిగా ఉపాధి హామీ పథకం ద్వారానే వెచ్చిస్తామని ఆమె స్పష్టం చేశారు. సమావేశంలో గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సభకు సమర్పించగా, సభ్యులు పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీపై స్పందిస్తూ, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఎవరికై నా పింఛను అందకపోతే వెంటనే ఎంపీడీవోని సంప్రదించాలని చైర్పర్సన్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం కలిగిన రైతులు తమ భూముల్లో మొక్కలు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు. మన్యంలో దోమల బెడద అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉందని, దీని నివారణకు తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని కోరారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె చెప్పారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్‌కుమార్, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఖాళీ క్యారేజీలతో ఉపాధి వేతనదారుల ఆందోళన
దేవరాపల్లి: ఉపాధి హామీపథకం బకాయిల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కూలీలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మండలంలోని తిమిరాం, వెంకటరాజుపురం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం వేతనదారులు ఖాళీ క్యారేజీలతో ఆందోళన చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ఉపాధి వేతనదారులకు కూలి సొమ్ముతో పాటు ఆశాఖలో ఉద్యోగులకు సైతం జీతాలు చెల్లించక పోవడం దారుణమన్నారు. కూటమి పాలనలో ఉపాధి హామీపథకం అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల శ్రామిక కుటుంబాలకు రూ. 800 కోట్లు మేర బకాయిలు ఉండడంతో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవిలో వ్యవసాయ పనులు లభించక ఉపాధి హామీ పనులపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ పథకంలో రాజకీయ జోక్యం మితిమీరిపోతోందని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఏక పక్షంగా తొలగించి కూటమి సానుభూతి పరులను నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో పార్టీల వారీగా పను లకు కేటాయిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పనులు కల్పించేలా ఒత్తిళ్లు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితులు మునుపెన్నడూ లేవని, ఉపాధి బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న ఉపాధి పనులు బంద్ చేస్తామని, దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని వెంకన్న కోరారు. పథకం అమలులోమితిమీరిన రాజకీయ జోక్యం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
పూటకో మాట.. రోజుకో నిబంధన
● గందరగోళంగా పాఠశాలలపునర్వ్యవస్థీకరణ ● యూటీఎఫ్ ధ్వజం అనకాపల్లి: పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో లోపాలను సవరించాలని, పూటకోక మాట.. రోజుకో నిబంధనలతో విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టడం జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొందవి చిన్నబ్బాయ్ అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విద్య వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తూ టీచర్ల బదిలీలు, పదోన్నతులను ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలుగా విభజిస్తే, ప్రస్తుత ప్రభుత్వం వాటిని తొమ్మిది రకాల పాఠశాలలుగా విభజించి ప్రజలను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జీవో నంబర్ 117 ను రద్దు చేస్తామని ఏడాదిపాటు చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ రద్దు చేయలేదన్నారు, ఆ జీవోలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని కొనసాగించడం తగదన్నారు. హై స్కూళ్లలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 గా ఉండాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో 1:20 గా ఉండాలని, యూపీ పాఠశాలలను ఎత్తి వేయడం వల్ల పల్లె విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. 40 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా మార్చాలని పేర్కొన్నారు. రేషనలైజేషన్‌కు ఏప్రిల్ 23 నాటి విద్యార్థుల రోల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బదిలీలు, పదోన్నతులకు స్థిరమైన మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సమస్యల సాధన కోసం ఈనెల 15న రాష్ట్ర స్థాయి ధర్నా విజయవాడలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యుటీఎఫ్ గౌరవాధ్యక్షుడు బోయిన వెంకటరావు, సహాధ్యక్షుడు రొంగళి అక్కునాయుడు, కోశాధికారి రాజేష్, కార్యదర్శులు సూర్య ప్రకాష్, రాజునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ కస్టడీకి గర్నికం హత్యకేసు నిందితులు
రావికమతం: మండలంలో మేడివాడ యువకుడు కొలిపాక పవన్‌కుమార్‌ను గత నెల 6 వ తేదీన గర్నికం తిరుమల ఫంక్షన్‌హాల్ దగ్గర స్నేహితులు వేపాడ నరేంద్ర కుమార్, దుర్గాప్రసాద్, మైనర్ బాలుడితో కలిసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసు, వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి సంబంధించి దుర్గా ప్రసాధ్, నరేంద్రకుమార్‌లను రెండు రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్నామని కొత్తకోట సీఐ కోటేశ్వరరావు తెలిపారు. దుర్గాప్రసాద్, నరేంద్రకుమార్ తూర్పుగోదావరి జిల్లాలో మూడు బైక్‌లు, కాకినాడ జిల్లాలో ఒక్కటి, గాజువాకలో ఒక్కటి, మొత్తం 5 బైకులను చోరీకి పాల్పడ్డారని, నిందితుల సమాచారం మేరకు వాటిని స్వాధీనం చేసుకుని, సంబంధిత పోలీసుస్టేషన్లకు అందజేశామని సీఐ కోటేశ్వరరావు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రఘువర్మ పాల్గొన్నారు. -
వికలాంగుడి భూమి కబ్జాకు యత్నం..
చీడికాడ మండలం చినగోగాడ గ్రామంలో ఉన్న తన భూమి రికార్డులు ట్యాంపరింగ్ చేసి భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా గాజువాక మండలం నాతయ్యపాలెం గ్రామానికి చెందిన వికలాంగుడు అక్కిరెడ్డి అప్పారావు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. చినగోగాడ గ్రామం సర్వే నెం.10–6లో 35 సెంట్ల భూమిని 2006లో కొనుగోలు ద్వారా వచ్చిందని, సదరు భూమిని తానే సాగుచేసుకుంటున్నానని, తాను వికలాంగుడిని కావడం, విశాఖ జిల్లాలో నివాసముండడంతో గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తనకు తెలియకుండా తన భూమిని వారి పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించుకుని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వారి నుంచి తమకు రక్షణ కల్పించి తమ భూమిని కాపాడాలని కోరారు. -
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
అక్కిరెడ్డిపాలెం: మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాకకు చెందిన చింతలపూడి లావణ్య వెంకటసత్యకుమార్, కొండపల్లి తరుణ్ వద్ద 2.4 గ్రాముల ఎండీఎంఏ మత్తు పదార్థాలు ఉన్నాయని, వారు ఆటోనగర్ వద్ద ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు దాడి చేసి, వారి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి మత్తు పదార్థాలను తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో యువకులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు. -
40 మందికి చికిత్సలు, 10 మందికి రక్త పరీక్షలు
పెద గరువులో వైద్య శిబిరం రోలుగుంట: అర్ల పంచాయతీ శివారు పెద గరువులో జ్వరాలపై సోమవారం పత్రికల్లో వచ్చిన వార్తపై వైద్య సిబ్బంది స్పందించారు. బుచ్చింపేట వైద్యుడు ఎస్.శ్రీనివాసరాజు ఫీల్డ్ సిబ్బందితో కలసి పెద గురువు గ్రామంలో సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 62 మంది జనాభా గల ఇక్కడ 40 మందికి ఆరోగ్య పరీక్షలు చేశారు. పది మందికి రక్తపు పూతలు తీశారు. వారిలో కిలో ప్రవీణ్‌కుమార్(8)కి జ్వరమని నిర్ధారించి పీహెచ్‌సీకి రిఫర్ చేశారు. సిరిడి రాణి(7), కిలో ఆశ(5), కిలో పౌలి (ఏడాదిన్నర వయసు)కి దగ్గు, జలుబుగా గుర్తించి మందులు అందజేశారు. వైద్యాధికారి మాట్లాడుతూ గ్రామంలో పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. వాతావరణ మార్పులు, వేసవి ఎండలకు వైరల్ జ్వరాలు సాధారణమన్నారు. మరగకాచిన నీరు తాగాలని, నిల్వ ఆహారం తీసుకోకూడదని గ్రామస్తులకు సూచించారు. -
జగ్గప్పారావుకు జ్ఞానీ జైల్‌సింగ్ పురస్కారం
మునగపాక: మండలంలోని గవర్ల అనకాపల్లికి చెందిన సామాజిక కార్యకర్త బొడ్డేడ జగ్గప్పారావు (జగన్) జ్ఞానీ జైల్‌సింగ్ అవార్డును దక్కించుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షరీఫ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డే, ఏపీజేయూ 5 వసంతాల వార్షికోత్సవంలో భాగంగా జగన్‌ను సత్కరించారు. ఆదరణ చారిటబుల్ ట్రస్ట్ , వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో జగన్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. సహచట్టం, వినియోగదారుల హక్కు చట్టం తదితర కార్యక్రమాలపై జగ్గప్పారావు విస్తృత ప్రచారం చేస్తూ అవార్డుకు ఎంపిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. -
దస్తావేజు ఇవ్వకుండా వీఆర్వో వేధిస్తున్నారు...
ల్యాండ్‌పూలింగ్ ద్వారా సంపతిపురం గ్రామంలో సర్వే నెం.286/5లో 1.28 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుని బదులుగా సర్వే నెం.284/30లో 378 చదరపు గజాల ప్లాట్‌ను తమ పేరున దస్తావేజు – 8333/2023 లో రిజిస్ట్రేషన్ చేశారని, కానీ దస్తావేజులు ఇవ్వకుండా అప్పటి వీఆర్వో శ్రీనివాసరావు ఇబ్బందులకు గురి చేశారని అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామానికి చెందిన ఈరుగుల పైడిరాజు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. బదిలీపై మరోచోటకు వెళ్లినప్పటికీ తన పేరున గల దస్తావేజులు ఇవ్వడం లేదని, అతని వద్ద ఉన్న దస్తావేజు పత్రాన్ని ఇప్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రెవెన్యూ సమస్యలే అధికం
● పీజీఆర్ఎస్లో పరిష్కారం కాని అర్జీలు ● అర్జీని ఎండార్స్‌మెంట్‌తో ముగిస్తున్న అధికారులు భూ పంపకాల్లో వివాదం గతంలో కుమారుడితో పాటు కుమార్తెలకు సమానంగా పంచి మూడు భాగాలుగా ఏర్పాటు చేసుకుని సాగుతో పాటు రెవెన్యూ రికార్డుల్లో ముగ్గురి పేరున నమోదు చేయించుకున్న పంపకాలను కాదని కొడుకు ఇబ్బందులు పెడుతున్నాడని చోడవరం మండలం పీఎస్ పేట గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు బండారు దేముడమ్మ కలెక్టరేట్లో జిల్లా అధికారులకు తెలిపింది. నడవలేని ఆమె కుమార్తె సహాయంతో ఆటోలో కలెక్టరేట్‌కు చేరుకుని తనకు భర్తమూలంగా, స్వార్జితంగాను వచ్చిన భూమి వివరాలతో పీజీఆర్ఎస్లో నమోదు చేసింది. ఆర్వోఆర్ కేసులు, ఎంఎల్‌సీసీ మీటింగ్‌లకు కూడా తాము హాజరవుతున్నామని, అయినా పరిష్కారం దొరకడం లేదని ఆమె కుమార్తె బోకం పైడితల్లమ్మ తెలిపింది. తుమ్మపాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రోజురోజుకు ప్రజల మన్ననలు కోల్పోతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తి కాకుండానే ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతకు పీజీఆర్ఎస్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని అధికారులు, పాలకులు చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని ప్రజలు చేసుకున్న అర్జీలకు పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారి ధ్రువీకరణతో సమస్యపై ఎండార్స్మెంట్ మాత్రం ఇస్తున్నారని తెలిపారు. సోమవారం ఎండ తీవ్రంగా ఉండడంతో కలెక్టరేట్ వద్ద నిరసనల సంఖ్య తగ్గింది. పీజీఆర్ఎస్ వేదిక నుంచి ఇంచార్జి కలెక్టర్ ఎం.జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణరావు, జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి–170, పంచాయతీ రాజ్ –25, పోలీస్–13, ఇతర శాఖల్లోను ఫిర్యాదులు నమోదయ్యాయి. బార్క్ నిర్వాసితుల నిరసన బార్క్ నిర్వాసితుల జాబితాలో కక్షపూరితంగా తమ పేర్లు తొలగించారంటూ అచ్చుతాపురం మండలం తంతడి శివారు యాతపాలేనికి చెందిన 30 మందికి పైగా నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. బార్క్ ఎక్స్టెన్సన్లో ఇల్లు కోల్పోయిన తమకు 2005 ఏడాదిలో నష్టపరిహారం మంజూరు చేసారని, తదుపరి ప్రభుత్వం చేపట్టిన రెండు సర్వేల్లో నిర్వాసితుల జాబితాలో తమ పేర్లు కొనసాగాయని, ఇటీవల చేపట్టిన సర్వేలో తమ పేర్లను తొలగించి ఈ నెల 8న సచివాలయంలో జాబితా ప్రదర్శించారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. కేబుల్ ఆపరేటర్ సంఘాల నిరసన ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ పథకంపై సీఎం చంద్రబాబు కేబుల్ ఆపరేటర్ సంఘాల నేతలతో రివ్యూ మీటింగ్ నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ), ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ (ఎఫ్ఓఎఫ్), మల్టీ సర్వీసెస్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల శ్రీరామ్, మల్టీ సర్వీసెస్ జిల్లా అధ్యక్షుడు కొణతాల ప్రకాష్, ఎఫ్ఓఎఫ్ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తున్న ఫైబర్ నెట్ పథకం రానురాను దిగజారి పోతుందని, 2017లో పారంభించి ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ల్యాండ్ ఫోన్‌ను నాణ్యతతో కూడిన సేవలు తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో కొనసాగుతున్నాయని, ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఏపి ఫైబర్‌లో ఉన్నఫలంగా వందలాది మంది సిబ్బందిని తొలగించడంతో సేవలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెటాప్ బాక్స్‌లపై రూ. 59 రెంట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పీజీఆర్ఎస్లో ఇంచార్జి కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. మత్స్యాకార భరోసా అందలేదు అచ్యుతాపురం రూరల్: అర్హులైన మత్స్యకారులకు మ త్స్యకార భరోసా అందలేదని మండల వైస్ ఎంపీపీ వాసుపల్లి పద్మావతి శ్రీనివాస్ అన్నారు. అర్హులైన మ త్స్యకారులకు వేట నిషేధ భృతి అందేలా న్యాయం చేయాలంటూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. బోటుకు ఇద్దరు చొప్పున మత్స్యకార భరో సా అర్హులకు అందనీయకుండా పక్కదోవ పట్టించారని, సుమారు 200 మంది అర్హులైన మత్స్యకారులకు వే ట నిషేధ భృతి అందలేదని తెలిపారు. అవకతవకలపై విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేయాలన్నారు. చెరకు రైతుకు రవాణా చార్జీలు చెల్లించాలిబుచ్చెయ్యపేట: గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేసిన వారికి రవాణా ఖర్చులు, వెయిటింగ్ చార్జీలు అందించాలని బుచ్చెయ్యపేటకు చెందిన పలువురు చెరకు రైతులు జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్‌కు చెరకు కాటాల నుంచి లారీల ద్వారా చెరకును తరలించాల్సిన కాంట్రాక్టర్ చెరకును పూర్తిగా తరలించకుండా మధ్యలోనే ఆపేయడంతో రైతులే సొంత ఖర్చుతో తరలించారని, ఫ్యాక్టరీ మరమ్మతులతో క్రషింగ్ నిలిచిపోవడంతో ఫ్యాక్టరీ అధికారులు రవాణా ఖర్చులతో పాటు వెయిటింగ్ ఛార్జీలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కానీ కాంట్రాక్టర్‌కు రవాణా ఛార్జీలు చెల్లించిన అధికారులు రైతులకు మాత్రం ఇవ్వలేదని రైతులు గోపిశెట్టి శ్రీను, గాడి శ్రీను, రమణబాబు,ఐయితరెడ్డి రమణ తదితరులు తెలిపారు. ఈ మేరకు సోమవారం అనకాపల్లి కలెక్టరేట్లో జరిగిన స్పందనలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్‌కు వినతి పత్రం అందించారు. -
పంట భూములను ఖాళీగా ఉంచొద్దు
కశింకోట: పంట భూములను ఖాళీ ఉంచకుండా ఏదో పంట వేసి పచ్చగా ఉంచడానికి రైతులు కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ సిహెచ్.లచ్చన్న కోరారు. మండలంలోని సుందరయ్యపేట శివారు లాలంకొత్తూరులో ఉన్న మండల మెగా ప్రకృతి వనరుల కేంద్రం వద్ద మూడో విడత నవ ధాన్యాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట భూములను పంటలు వేయకుండా వృథాగా ఉంచరాదన్నారు. ప్రకృతి వ్యవసాయం సాగుకు విత్తనాలను రైతుల నుంచి సేకరించి పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ఈ ఏడాది పండించిన నవ ధాన్య పంటల విత్తనాలను కూడా స్థానిక రైతుల నుంచి సేకరించి వచ్చే ఏడాది రైతులకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నవ ధాన్యాలను సకాలంలో నాటుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం సమర్ధంగా చేస్తున్న కూండ్రపు నూకాలమ్మను ఉత్తమ రైతుగా ఎంపిక చేసి దుశ్శాలువా కప్పి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. సర్పంచ్ వాసు, ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకురాలు అరుణ, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, వీహెచ్‌ఎ కిషోర్ పాల్గొన్నారు. -
మహిళలకు, దివ్యాంగులకు సత్యసాయి సంస్థల వితరణ
అనకాపల్లి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని సత్యసాయి సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు అన్నారు. స్థానిక ఆర్టీసీ రహదారి సేవా సంస్థ కార్యాలయంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, మహిళలకు కుట్టు మిషన్లు, రైతులకు స్ప్రేయింగ్ యూనిట్లు పంపిణీ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఏపీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ ఉపకరణాలను భగవాన్ బాబా వారి తల్లి ఈశ్వరమ్మ డే సందర్భంగా జిల్లాకు 22 మందికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఏడుగురు మహిళలకు కుట్టు మిషన్లు, ఇద్దరు మహిళలకు జ్యూట్ కుట్టుమిషన్లు, ఏడుగురుకు వ్యవసాయదారులకు స్ప్రేయర్లు, అరుగురు వికలాంగులకు వీల్ చైర్లు అందజేసినట్టు తెలిపారు. సంస్థ సభ్యులు రాజశేఖర్, కామరాజు, అప్పలనాయుడు తదితరులతో పాటు జోనల్ ఇంచార్జిలు రామారావు, ప్రసాదు, లోపరాజు, రవిశంకర్, మహిళా యూత్ కో–ఆర్డినేటర్ భారతి, జాయింట్ సర్వీస్ కో–ఆర్డినేటర్ సరోజ, కన్వీనరు నాగరాజు పాల్గొన్నారు. -
కనుల పండువగా వెంకన్నకు చక్రస్నానం
చోడవరం: స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈనెల 13న స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సోమవారం స్వామివారికి శ్రీ చక్ర స్నానం నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరపారు. ప్రత్యేకంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలకు శ్రీ చక్రస్నానం చేశారు. ఎమ్మెల్యే రాజుతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ వింజుమూరి శంకర్, దేవదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణమూర్తి, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉపాధ్యాయుల శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. -
ఎస్పీ కార్యాలయానికి 20 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యలు ఫిర్యాదుల పరిష్కార వేదికకు 20 అర్జీలు వచ్చాయి. తమ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, చీటింగ్ వంటి అంశాలపై అర్జీలు వచ్చినట్లు చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయానికి అందిన ఫిర్యాదుల్లో కొన్ని... బంగారం తాకట్టు విడిపించాలని... తనకు నగదు అవసరమై బాబాయి వరస అయిన నారాయణరావు పేరు మీద అనకాపల్లి అన్నపూర్ణ బ్యాంక్‌లో 5.5 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టానని, అయితే తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని కోరగా తన సొంత ఖర్చులకు రూ.2 లక్షలు ఇస్తేనే విడిపిస్తానని అంటున్నారని అనకాపల్లి మండలం మార్టూరుకు చెందిన గిసాల కుమారి తెలిపింది. దీనిపై గ్రామ పెద్దల సమక్షంలో పెట్టినప్పటికీ సమస్య పరిష్కరించలేదని, దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై ఫిర్యాదు తన కుమారుడికి మెడికల్ డిపార్టుమెంట్లో ఉద్యోగం వేయిస్తామని చెప్పడంతో విశాఖ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న తన బంధువు ద్వారా అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక హెడ్ కానిస్టేబుల్‌కు 2003 జూలై 1వ తేదీన రూ.5.10 లక్షలు ఇచ్చానని కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లం అప్పలనర్సయ్య తెలిపారు. ఆ హెడ్ కానిస్టేబుల్ అమరావతిలో డిప్యూటేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారని, త్వరలో ఉద్యోగం వేయిస్తానని చెప్పి నేటికీ ఉద్యోగం వేయించలేదని, దీంతో ఇచ్చిన నగదును ఇవ్వాలని కోరినా స్పందించడం లేదని తెలిపారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసగించిన హెడ్ కానిస్టేబుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. -
ఆశా కార్యకర్తపై దాడికి పాల్పడిన నర్స్పై చర్యలు తీసుకోవాలి
అనకాపల్లి: కశింకోట మండలం మూలపేట గ్రామం ఆశా కార్యకర్తపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)జిల్లా నాయకులు ఎల్.శాంతి, ఈ.పార్వతి, కె.వరలక్ష్మి, బి రామలక్ష్మిలు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేసి, వైద్యాలయంలో సూపరిటెండెంట్ ఎం.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఎన్టీఆర్ ఆస్పత్రికి గర్భిణిని డెలివరీకి తీసుకువచ్చిన కశింకోట మండలం మూలపేట ఆశా కార్యకర్త సిహెచ్ మాధవిపై రాత్రి ఎన్టీఆర్ ఆసప6తిలో ‘మేటి అసిస్టెంట్‘ సరళ మిశ్రా అకారణంగా దాడి చేసిందన్నారు. ఆశాలకు భద్రత కల్పించాలని, ఆశా కార్యకర్తను దుర్భాషలాడిన సరళ మిశ్రాపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి శ్రీనివాసరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సూర్యకళ, లక్ష్మి, రమణమ్మ పాల్గొన్నారు. -
మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసుల తీరు దారుణం
దేవరాపల్లి: బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మహిళా నాయకురాలు విడదల రజని పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ మండిపడ్డారు. కూట మి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కొరవడిందని, మాజీ మంత్రి రజనిపై పోలీసులు వ్యవహరించి న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. తారువలో సోమ వారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ‘సీఐ గారు ఏమిటి విషయమ’ని మర్యాదపూర్వకంగా అడిగిన మాజీ మంత్రిపై సదరు సీఐ దురుసుగా ప్రవర్తించడంతోపాటు ‘నీపై కూడా కేసులు పెడతామం’టూ బెదిరింపులకు దిగడం అత్యంత దారుణమన్నారు. మాజీ మంత్రి పట్ల పోలీసులు ఇలా వ్యవహరిస్తే.. రాష్ట్రంలో సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు. తమ 11 నెలల పాలనలో వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే కూటమి ప్రభుత్వం ప్రశ్నించే వారిపై ఇలా కక్ష సాధింపులకు దిగుతూ, అరాచకంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో మహిళల ను గౌరవిస్తాం, రక్షణ కల్పిస్తామని చెబుతున్న కూటమి నేతలకు మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అరాచకాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పోలీస్ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరించిన సీఐపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ డిమాండ్ చేశారు. -
దేవరాపల్లి హైస్కూల్లో నాగుపాము కలకలం
దేవరాపల్లి: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం నాగుపాము హడావుడి సృష్టించింది. హైస్కూలు ఆవరణలో చేపడుతున్న బాలికల వసతి గృహ నిర్మాణ పనుల కోసం తీసిన గొయ్యిలో ఎలుకను మింగేసి కదలలేని స్థితిలో ఉన్న నాగుపామును స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారుల ద్వారా స్నేక్ క్యాచర్ కృష్ణకు సమాచారం అందించారు. నిచ్చెన సహాయంతో గొయ్యిలోకి దిగిన స్నేక్ క్యాచర్ సుమారు అరగంటపాటు శ్రమించి మూడున్నర అడుగుల పొడవున్న నాగుపామును పట్టుకొని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
గురువులకు సర్దుపోటు!
● ఉపాధ్యాయుల్లో బదిలీల గుబులు ● తుదిదశకు ఖాళీల కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో భారీగా సర్ప్లస్ టీచర్లు ● మోడల్ స్కూళ్లకు హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లు ● సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండం విశాఖ విద్య: ఉపాధ్యాయుల బదిలీలకు నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్న నేపథ్యంలో స్కూళ్లలో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనే లెక్క తీసే పనిలో జిల్లా విద్యాశాఖ యంత్రాంగం తలమునకలై ఉంది. మంగళవారం నాటికి వాస్తవ ఖాళీలను ధ్రువీకరించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని ఎంఈవోలు, డీఈవో కార్యాలయ సిబ్బంది అంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఎంఈవోలను తన కార్యాలయానికి పిలిపించి.. వారి సమక్షంలోనే వాస్తవ ఖాళీలను లెక్క తీసి, వాటిని ధ్రువీకరించేలా డీఈవో ప్రేమ్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో సోమవారం రాత్రి కూడా డీఈవో కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది అంతా క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహించారు. జిల్లాలో ఏడు రకాల బడులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను రద్దు చేసి, దానికి ప్రత్యామ్నాయంగా జిల్లాలో ఏడు రకాల బడుల ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 3,158 పాఠశాలలు ఉండగా ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా ఏడు రకాలుగా బడులు (ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక, మోడల్ ప్రాథమిక, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ మోడల్ ప్రాథమిక పాఠశాలలు) కూర్పు చేసి ఇక్కడి అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. 2024 డిసెంబర్ నాటికి స్కూళ్లలో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను లెక్క కట్టి, ఇందుకనుగుణంగానే ఖాళీల జాబితాలను సిద్ధం చేశారు. ఎస్జీటీ పోస్టులకు గండం ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారుగా 596 మోడల్ ప్రాథమిక స్కూళ్లును ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయిస్తున్నారు. కాగా వీటిలో ప్రధానోపాధ్యాయుడిగా స్కూల్ అసిస్టెంట్‌ను నియమించనున్నారు. దీంతో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు గండిపడే అవకాశం ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. హైస్కూళ్లలో భారీగా సర్ప్లస్ టీచర్లు కొత్తగా ఏర్పాటు కాబోయే స్కూళ్లకు అనుగుణంగా పోస్టులు రేషనలైజేషన్ చేపట్టగా, హైస్కూళ్లలో భారీగా మిగులు ఉపాధ్యాయులు లెక్క తేలారు. గణితం, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ పోస్టుల్లో పనిచేసే వారే ఎక్కువగా మిగులుగా తేలారు. తాజా లెక్కల ప్రకారం సుమారుగా 234 మంది స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్ కాబోతున్నారు. వీరందరినీ మోడల్ ప్రాథమిక స్కూళ్లులో సర్దుబాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు. గుబులు మొదలు రేషనలైజేషన్ ప్రక్రియతో ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది. బదిలీలకు అంతా సిద్ధం చేస్తున్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో భారీగా సర్‌ప్లస్‌లో ఉపాధ్యాయులు ఉండటంతో.. బదిలీల్లో ఎక్కడికి స్థానభ్రంశం కలుగుతుందోనన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో మొదలైంది. డీఈవో కార్యాలయ అధికారులు ప్రకటించిన ఖాళీల జాబితాలతో తాము ఎక్కడికి బదిలీపై వెళ్లాలనే దానిపై ఉపాధ్యాయులు లెక్కలేసుకుంటున్నారు. రేషనలైజేషన్ మేరకు ఏ పోస్టులు పోతున్నాయి? ఏ పోస్టులు మిగులుతున్నాయనే విషయాన్ని డీఈవో కార్యాలయ అధికారులు ఎప్పుడు ప్రకటిస్తారా అని ఉపాధ్యాయులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. -
అన్న ట్యాబ్‌లో గేమ్‌లు ఆడవద్దన్నాడని..
● బాలిక బలవన్మరణం ● కేజిహెచ్లో చికిత్స పొందుతూ మృతి కె.కోటపాడు: ట్యాబ్‌లో గేమ్‌లు ఆడుతోందని అన్న మందలించడంతో క్షణికావేశంలో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పాచిలవానిపాలెం గ్రామానికి చెందిన పాచిల యమున (16) గత నెల 27న ట్యాబ్‌లో గేమ్‌లు ఆడడం చూసి అన్న జయంత్ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బాలిక.. తల్లిదండ్రులు పాచిల వరలక్ష్మి, శ్రీరామ్మూర్తి, అన్న జయంత్ పొలం పనులపై మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లాక ఉరి వేసుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి యమున ఫ్యాన్‌కు వేలాడడం గమనించి భర్తకు తెలపగా కుమార్తెను హుటాహుటిన చౌడువాడ పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లిలో గల ఉషా ప్రైమ్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 2 వరకూ అక్కడే వైద్యం అందించారు. ఆమె ఆరోగ్య పరిస్ధితిలో మార్పు రాకపోవడంతో ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు యమునను అదే రోజు విశాఖ కేజీహెచ్‌లో చేర్చారు. ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న యమున ఆరోగ్య పరిస్ధితి మరింత విషమించి ఈనెల 11వ తేదీ ఆదివారం రాత్రి ఆస్పత్రిలో మృతి చెందింది. యమున మృతిపై కె.కోటపాడు పోలీసులకు మేనమామ దొగ్గ కృష్ణ సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ విచారణ జరుపుతున్నారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయ్యాక శవాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఏడాది పదిలో 531 మార్కులు ఈ ఏడాది పది పబ్లిక్ పరీక్షల్లో మృతురాలు పాచిల యమున 531 మార్కులు సాధించింది. యమున ప్రతి పరీక్షలో మంచి మార్కులు సాధించేందని బంధుమిత్రులు తెలిపారు. యమున 8వ తరగతి నుంచి ప్రస్తుతం 10 వరకు తానాం రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియట్లో చేరాల్సి ఉన్న ఆ బాలిక అన్నతో జరిగిన ఘర్షణ కారణంగా క్షణికావేశంలో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. -
సింహగిరికి వైశాఖ పౌర్ణమి శోభ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సింహగిరికి భక్తులు పోటెత్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఇలవేల్పుగా పూజించే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు కుటుంబసమేతంగా పెద్ద సంఖ్యలో సింహాచలం తరలివచ్చారు. తొలుత కొండదిగువ వరాహ పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. వంటలు వండుకుని కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు. కోలలతో నృత్యాలు చేస్తూ స్వామిని కీర్తించారు. గరిడీ నృత్యాలు చేశారు. మెట్లమార్గం ద్వారా నడిచి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. స్నానమాచరించేందుకు తరలివచ్చిన భక్తులతో వరాహ పుష్కరిణి ప్రాంగణం కిక్కిరిసింది. పుష్కరిణి నుంచి అడవివరం మార్కెట్ కూడలి వరకు ఉన్న మార్గం భక్తజన సంద్రంగా మారింది. సింహగిరిపై దర్శన క్యూలు, కేశఖండనశాల, ప్రసాద విక్రయశాల, భక్తులతో నిండిపోయాయి. వరాహ పుష్కరిణి వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం గార్డులు బందోబస్తు నిర్వహించారు. పుష్కరిణి మార్గంలో ఎలాంటి వాహనాలు వెళ్లకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. -
ఏయూ వీసీకి ఎక్స్‌లెన్స్ అవార్డు
విశాఖ విద్య : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్‌కు ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (హైదరాబాద్) అందించిన ఈ అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా ఆదివారం హైదరాబాదులోని ఐఐసీటీలో జరిగిన నేషనల్ టెక్నాలజీ డే కార్యక్రమంలో అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆచార్య రాజశేఖర్ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును అందించడం పట్ల విశ్వవిద్యాలయ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
అవిశ్వాస తీర్మానంపై సమావేశం మినిట్స్ ఇవ్వండి
మహారాణిపేట (విశాఖ): జీవీఎంసీ ప్రత్యేక సమావేశం మినిట్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం ఇన్చార్జి రవిరెడ్డి కోరారు. గత నెల 19న జరిగిన ఈ సమావేశం ప్రక్రియల మినిట్స్, వాటి ప్రతిని వెంటనే అందించాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న తాను రాసిన లేఖకు ఈ వినతి అనుసంధానంగా ఇస్తున్నట్లు తైనాల విజయకుమార్ పేర్కొన్నారు. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానంపై చర్చించిన సమావేశం వివరాలు, చేపట్టిన చర్యల మినిట్స్ కాపీని అందించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియమిత పార్టీ విప్‌గా, తాను కోరిన పత్రాలను వీలైనంత త్వరగా అందజేయాలన్నారు. గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలన్నారు.కలెక్టర్‌కు తైనాల, రవిరెడ్డి వినతి -
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మురళీ నాయక్కువైఎస్సార్ సీపీ నేతల నివాళి మహరాణిపేట(విశాఖ): పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీనాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఏమండి సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామిరెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్‌రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోబింద్ బోధాపు, శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రంభ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లయిన మూడు రోజులకే..
రావికమతం: మండలంలో టి.అర్జాపురం శివారు పాత కొట్నాబిల్లి గ్రామానికి చెందిన ఆసరి జగదీష్ (26)కు అదే గ్రామానికి చెందిన ఉమ(22)తో గిరిజన సంప్రదాయంలో ఈ నెల 8 న గురువారం రాత్రి వివాహం జరిగింది. స్నేహితులకు పెళ్లి పార్టీ ఇవ్వడానికి వెళ్లిన జగదీష్ అనుకోని రీతిలో మృత్యువాత పడ్డాడు. గ్రానైట్ క్వారీ వద్ద భారీ గొయ్యిలో ఈతకు దిగి దుర్మరణం పొందాడు. ఈ సంఘటన పాత కొట్నాబిల్లిలో చోటు చేసుకొంది. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాల మేరకు ఐదుగురు మిత్రులకు పెళ్లి పార్టీ శనివారం గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ వద్ద ఇచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. జగదీష్ మాత్రం తవ్వకాల వల్ల ఏర్పడిన గోతిలో ఈతకు దిగాడు. మిగిలిన స్నేహితులకు ఓపిక లేక ఒడ్డునే ఉన్నారు. జగదీష్ ఈతకు దిగి మునిగి పోయిన సంగతి స్నేహితులు గమనించలేదు. స్నేహితులకు మద్యం మత్తు వదిలాక జగదీష్ అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడని భావించి ఊర్లోకి వచ్చేశారు. శనివారం రాత్రి జగదీష్ రాకపోవడంతో బంధువుల ఇళ్ల వద్ద విచారించారు. ఆదివారం క్వారీ వద్ద గోతిలో శవమై తేలాడు. ఘటనపై మృతుడి తండ్రి సీతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. స్నేహితులతో స్నానానికి వెళ్లి నవ వరుడు దుర్మరణం -
పెదగరువులో జ్వరాల విజృంభణ
రోలుగుంట: మండలంలోని అర్ట పంచాయతీ శివారు పెదగరువులో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే పలువురు మంచం పట్టారు. అందుబాటులో వైద్య సిబ్బంది లేకపోవడంతో చికిత్స అందడం లేదని, జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఎక్కువ మంది పిల్లలు జ్వరాలబారిన పడుతున్నారని చెప్పారు. కిలో ప్రేమ్ కుమార్ (15), కిలో పావులు (1), కిలో అక్ష(4), సేదరి రాణి(4)తో పాటు మరో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వైద్యాధికారులు స్పందించి, గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజన సంఘం నాయకుడు కిలో నర్సయ్య, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు కోరారు. -
విద్యుత్‌రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి
అనకాపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించనున్న సమ్మెకు అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు వస్తోందని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వాలు కుట్రపన్నుతున్నాయని చెప్పారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణను అందరూ వ్యతిరేకించాలన్నారు. సోలార్ విద్యుత్, విండ్ విద్యుత్, హైదరాబాద్ ప్రాజెక్టులను, స్మార్ట్ మీటర్లను ఇలా అన్నింటినీ అదానీ సంస్థలకు కట్టబెడుతూ ప్రజలపై విపరీతమైన భారాన్ని ప్రభుత్వం మోపుతోందన్నారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయడం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదని తెలిపారు. సచివాలయ లైన్మన్లను విద్యుత్‌శాఖలో విలీనం చేసి, వారికి ప్రమోషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ భవిష్యత్తులో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యకతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆర్.కె.వి.ఎస్. కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి వి.వి.శ్రీనివాసరావు, సభ్యులు అవతారం, కేదారేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న సేవలోఒడిశా దాసులు
పది.. ఇరవయ్యేళ్లు కాదు.. ఏకంగా 300 ఏళ్లకు పైనే.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి సేవలో ఓ కుటుంబం తరిస్తోంది. ఏటా మూడు మాసాలు సింహగిరిపైనే ఉంటూ.. స్వామిని పూజిస్తూ, ఆర్జిత సేవలు చేస్తూ.. భక్తులకు ఇతోధికంగా సాయపడుతోంది. వారే ఒడిశాలోని గంజాం జిల్లా పట్టుపురం గ్రామానికి చెందిన దాసుల కుంటుంబం. ప్రస్తుతం ఆ వంశానికి చెందిన నాలుగో తరం వారైన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ అప్పన్నస్వామి సేవలో తరించేందుకు సింహాచలానికి చేరుకున్నారు. సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంతో ఒడిశా భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులోనూ గంజాంలోని పట్టుపురం గ్రామానికి చెందిన నాయక్‌దాస్ కుటుంబానిది మరీ ప్రత్యేకం. మూడు వందల ఏళ్లకు పైనుంచే ఈ కుటుంబానికి చెందిన ఒకరు స్వామి సేవకు అంకితమవడం ఆనవాయితీ. ఏటా మూడు నెలలు సింహగిరిపై ఉండి స్వామి సేవతోపాటు, తమ వద్దకు వచ్చే భక్తులకు స్వామివారి విశిష్టతను, సింహాచల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్తుంటారు. స్వామి సేవలో నాలుగో తరం నాలుగో తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ ప్రస్తుతం అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఈయన తాతగారి పెదనాన్న ముకుంద నాయక్ దాస్ నుంచే స్వామికి వీరి కుటుంబం సేవలందించే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామిపై ఉన్న ఎనలేని భక్తి కారణంగా అప్పట్లో ఒడిశా నుంచి ముకుంద నాయక్‌దాస్ సింహాచలం వచ్చేశారు. సింహగిరిపై ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ, స్వామి సేవలో తరించేవారు. కొన్నేళ్లకు కంటిచూపు మందగించడంతో తమ్ముడి కొడుకై న రుషికేష్‌నాయక్‌దాస్ ఏడేళ్ల వయస్సు నుంచే ఆయన వద్దకు చేరారు. తనకు 9 ఏళ్ల వయసులో పెదనాన్న పరమపదించడంతో ఆ బాధ్యతలను రుషికేష్ నాయక్‌దాస్ స్వీకరించారు. ఆయన 95 ఏళ్లపాటు స్వామి సేవలో గడిపారు. ఒడిశా భక్తుల ఆశ్రయం దాస సత్రం రుషికేష్‌నాయక్‌దాస్ 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ సమీపంలో కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మృతితో ఆయన కొడుకు బుచ్చికిషోర్ నాయక్‌దాస్ సింహాద్రి అప్పన్న సేవకు అంకితమయ్యారు. ఆ తర్వాత ఆయన తమ్ముడైన వనమాలిక్ నాయక్‌దాస్ స్వామి సేవను స్వీకరించారు. ఈయన హయాంలోనే రుషికేశ్నాయక్దాస్ శ్రీకారం చుట్టిన ఆశ్రమం దాస సత్రం నిర్మాణం పూర్తయింది. 2006లో వనమాలిక్ మృతితో ఆయన కొడుకు ప్రస్తుత దాసుడు లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ స్వామి సేవకు అంకితమయ్యారు. అంతా స్వామి అనుగ్రహం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఎంతో మహిమాన్వితుడు. నీతి, నియమాలు పాటిస్తూ నిర్మల హృదయంతో ఆరాధిస్తే ఖచ్చితంగా స్వామి అనుగ్రహం లభిస్తుంది. నా తండ్రి పరమపదం వరకు నేను మామూలు వ్యక్తిగానే తిరిగాను. ఆ తర్వాత నాలో భక్తిభావం కలగడం స్వామి కృప. తరతరాల సాంప్రదాయం కొనసాగించే అవకాశం ఆ స్వామి అనుగ్రహంగానే భావిస్తాను. – లక్ష్మీకాంత్ నాయక్ దాస్ 3 తరతరాల కుటుంబ సంప్రదాయం... ఒడిశా దాసుల సొంతం ప్రస్తుతం స్వామి సేవలో 4వ తరానికి చెందిన లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ 300 ఏళ్లు.. ఐదుగురు దాసులు ముకుందనాయక్ దాస్ (ప్రారంభకులు) రుషికేష్‌నాయక్ దాస్ (ముకుందనాయక్ తమ్ముడి కొడుకు) బుచ్చికిశోర్‌నాయక్ దాస్ (రుషికేష్‌నాయక్ కొడుకు) వనమాలిక్నాయక్ దాస్ (బుచ్చికిశోర్‌నాయక్ తమ్ముడు) లక్ష్మీకాంత్‌నాయక్ దాస్ (వనమాలినాయక్ కొడుకు) -
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
● మాజీ మంత్రి రజనిపై సీఐ దౌర్జన్యం హేయం ● వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అనకాపల్లి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మన రాష్ట్రంలో అమలు కావడం లేదని, రెడ్‌బుక్ పాలన మాత్రమే సాగుతుందని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. స్థానిక రింగ్‌రోడ్డులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ధర్మశ్రీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోగా, వైఎస్సార్సీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై సీఐ సుబ్బారాయుడు దౌర్జన్యం చేయడం ఏమిటని ప్రశ్నించారు. అతడిని డీజీపీ, గుంటూరు ఎస్పీ తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల మహిళలకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపెట వేశారని, చంద్రబాబు పాలనలో దాడులు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో వైఎస్సార్సీపీ మహిళా ఎంపీటీసీని అర్ధరాత్రి అరెస్టు చేయడమే నిదర్శనమన్నారు. అధికారులు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలా కాకుండా హుందాగా విధులు నిర్వహించాలని హితవు పలికారు. సోషల్ మీడియోలో ఐదారేళ్ల క్రితం పెట్టిన పోస్టులపై ఇప్పుడు కేసులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, అల్లూరి జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజల రక్షణకు అండగా ఉండే సీఐ గుంటూరులో మాజీ మంత్రి రజనీపై అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కూటమి పాలనలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ మహిళలపై దాడులకు నిరసనగా త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు పెతకంశెట్టి శివసత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు మలసాల కుమార్ రాజా, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, 80, 83 వార్డుల ఇన్చార్జులు కె.ఎం.నాయుడు, జాజుల రమేష్, సీనియర్ నాయకులు బొడ్డేడ శివ, ఉగ్గిన అప్పారావు, అనకాపల్లి, కశింకోట మండలాల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద, మలసాల కిశోర్, పార్టీ నాయకురాలు నదియా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జూలో ‘సన్’డే సందడి
పోటెత్తిన సందర్శకులు.. రూ.3.62 లక్షల ఆదాయం ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కు ఆదివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు రావడం, అందులోనూ ఆదివారం కావడంతో సందర్శకులు పోటెత్తారు. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ సమయం జూ లోపల చెట్ల కిందే గడిపారు. చిన్నారులు చెట్ల నీడలో గంటల తరబడి ఆటలాడుతూ ఎండ వేడిమి కాస్త తగ్గుముఖం పట్టాక జూలో వన్యప్రాణులను తిలకించారు. వాటికి ఫొటోలు తీస్తూ, ఎన్క్లోజర్ల వద్ద సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ఇక్కడ ఏనుగులు, పులులు, కోతులు, జిరాఫీ, జీబ్రాలు, జింకలతో పాటు నెమళ్లు, ఆఫ్రికన్ చిలుకలు, ఆస్ట్రిచ్‌లు, ఈములు వాటి ఎన్క్లోజర్లలో ఉదయం, సాయంత్రం సమయంలో హుషారుగా తిరుగుతూ జూకు వచ్చిన పిల్లల్ని, పెద్దలను అలరించాయి. మొసళ్ల జోన్ కొలనులో నీరు వేడెక్కడంతో వాటిలో మొసళ్లు సాయంత్రం వరకు బయటకు రాకుండా అడుగు భాగంలోనే ఉండిపోయాయి. ఆదివారం 4,303 మంది సందర్శించినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. వారి ద్వారా రూ 3.62 లక్షల ఆదాయం లభించిందన్నారు. -
కాన్పు
కొంతమంది వైద్య సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి ధర్మాసుపత్రి అర్థాన్నే మార్చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా ప్రసవం చేయాల్సి ఉండగా, గర్భిణులకు ముందుగానే పురిటి కష్టాలు చూపిస్తున్నారు. మూడు నెలల క్రితం డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు గుంజు కున్న గైనిక్ సివిల్ సర్జన్ డాక్టర్ శోభాదేవిని కలెక్టర్ సస్పెండ్ చేయడం తీవ్ర చర్చనీయాం శమైంది. అయినప్పటికీ ఎన్టీఆర్ ఆస్పత్రిలో గైనిక్ విభాగంలో మార్పు కానరాలేదు. సాధారణ కాన్పుకు రూ.3 వేలు, సిజేరియన్‌కు రూ.5 వేలు..అంటూ రేటు పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని గర్భిణులు గగ్గోలు పెడుతున్నారు. గైనిక్ విభాగంలో ప్రబలుతున్న సమస్యలివే.. సాక్షి, అనకాపల్లి: పండంటి బిడ్డ కోసం నవమాసాలు మోయడం ఒక కష్టం.. నెలలు నిండాక ఆ బిడ్డ తల్లి పొత్తిళ్లలోకి రావాలంటే అది మరింత కష్టం. కాన్పుల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేని పేదోళ్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిని వైద్యులు, సిబ్బంది పీడిస్తున్నారు. కాసులు సమర్పిస్తేనే కాన్పు అంటున్నారు. లేదంటే బిడ్డ అడ్డం తిరిగింది.. ఉమ్మనీరు తాగిందంటూ రకరకాల కారణాలు సాకుగా చెప్పి విశాఖలో కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లలేని వారు అప్పోసప్పో చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల డీఆర్సీ మీటింగ్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి నేరుగా జిల్లా ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ ముందే ఎన్టీఆర్ ఆస్పత్రిలో పేదోళ్ల ప్రసవ వేదన దుస్థితిని ఎండగట్టారు. అయినా ఆస్పత్రి గైనిక్ విభాగంలో అదే తీరు కొనసాగుతోంది. కాసులు గలగలలాడితేనే వైద్యం అందేది.. ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయరావుపేట, చోడవరం నియోజకవర్గాల నుంచి రోగులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా.. పేదలు ఉండడం వల్ల వారంతా సాధారణ ప్రసవం కోసం వస్తారు. వారిని కొంతమంది డాక్టర్లు కాసులిస్తేనే కాన్పు చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. సాధారణ కాన్పుకు రూ.3 వేలు, సిజేరియన్లకు రూ.5 వేల వరకూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ● అనకాపల్లిలో జిల్లా స్థాయి ఎన్టీఆర్ ఆస్పత్రికి అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి రోగులు వస్తుంటారు. సమీప ప్రాంతాలకు ఇదే పెద్దాసుపత్రి కావడంతో గైనిక్ విభాగంలో ఓపీలు ఎక్కువగా నమోదవుతాయి. ● గైనిక్ వార్డులో ఫ్యాన్లు తిరగక బాలింతలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. జనరేటర్ సదుపాయం ఉన్నా.. అది పది నిమిషాల వరకే పని చేస్తోంది. గైనిక్ వార్డులో ఇన్వెర్టర్ సదుపాయం లేదు. ● స్కానింగ్, ఎక్స్‌రే గదుల్లో ఏసీ సౌకర్యం లేదు. ● నిరంతరం రద్దీగా ఉండే ఆల్ట్రా స్కానింగ్ రూంలో ఒక్కరే రేడియాలజిస్టు అందుబాటులో ఉన్నారు. నెలవారీ చెకప్‌లో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణులను సైతం మూడు గంటలకు పైగా స్కానింగ్ సెంటర్ల ముందు వెయింటింగ్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ● డిస్టిక్ ఆస్పత్రిలో ముగ్గురే గైనిక్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ● గర్భిణులకు అల్ట్రా సౌండ్ స్కాన్ చేస్తున్నా.. వారికి రిపోర్టు ఇవ్వడం లేదు. తెల్ల పేపర్‌పై పెన్‌తో రాసి పంపిస్తున్నారు. రేడియాలజీ విభాగం వైద్యులు ఒక్కరే ఉండడంతో రోజువారీ 30 స్కాన్లు చేయడం కష్టతరమవుతోంది. ● సర్జికల్ గ్లౌజులు లేవు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ చేసిన సమయంలో కావలసిన కాటన్, ఐవీ క్యానల్, స్కానింగ్ జల్ కొరత ఉంది. కొన్ని రకాల సర్జికల్ వస్తువులు, రోజుకు రూ.3 వేల లోపు సామగ్రి ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నారు. ● ఆపరేషన్ సమయంలో కావాల్సిన మందులను ప్రైవేట్ దుకాణంలో రోగులతో కొనుగోలు చేయిస్తున్నారు. మామూళ్లు తీసుకుంటే విధుల నుంచి తొలగిస్తాం ఆస్పత్రి మాతాశిశు విభాగంలో గర్భిణులకు ఆపరేషన్ సమయంలో కొంత నగదు తీసుకున్నట్టు వచ్చిన అభియోగాలతో వైద్యురాలిని విధుల నుంచి తొలగించాం. ప్రస్తుత వైద్యులు అటువంటి చర్యలకు పాల్పడడం లేదు. ఎక్కడైనా నగదు తీసుకున్నట్లు మా దృష్టికి వచ్చినట్లయితే తక్షణమే విధుల నుంచి తొలగిస్తాం. –ఎస్.శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, అనకాపల్లి కాసులిస్తేనేఓపీ ఫుల్.. వైద్యం నిల్ రోజువారీ సగటున ఎన్టీఆర్ ఆస్పత్రికి 600 వరకూ ఓపీ రోగులు వస్తుంటారు. (సోమవారం) 535 ఓపీలు నమోదయ్యాయి. వీరిలో 31 మంది రోగులు అడ్మిట్ అయ్యారు. ఈ ఆస్పత్రిలో 250 నుంచి 300 వరకూ బెడ్స్ సదుపాయం కలదు. వీటిలో కాన్పుల విభాగంలో రోజూ గర్భిణుల ఓపీనే రోజుకు సగటున 200 వరకూ సీ్త్రలకు సంబంధించిన వ్యాధుల ఓపీ ఉంటుంది. రోజూ కాన్పుల కోసం అడ్మిషన్లు 10 నుంచి 20 నమోదవుతున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.3 వేలు, సిజేరియన్‌కు రూ.5 వేలు లేదంటే బిడ్డ అడ్డం తిరిగిందని మెలిక ఇటీవలే లంచం తీసుకున్న గైనికాలజిస్ట్పై వేటు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో దందా గతంలో రోజుకు 300 ఓపీలు, మెటర్నల్ చెకప్‌లు ఇప్పుడు సగానికి తగ్గిన ఓపీ సంఖ్య 10 నుంచి ముగ్గురికి తగ్గిన గైనిక్ వైద్యులు ప్రసవ వేదనే.. ప్రసవం కోసం ఎన్టీఆర్ ఆస్పత్రికి పురుడు కోసం వస్తే, వారి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. సిజేరియన్‌కు సరిపడా సర్జికల్ గ్లౌజులు, కాటన్‌తోపాటు ఇతర వస్తువులను తెచ్చుకోవాలని ప్రైవేట్ మెడికల్ షాపులకు రాస్తున్నారు. వాటి ధర రూ.2 వేల వరకూ ఉంటుంది. డెలివరీ అయి ఇంటికి వెళ్లేసరికి దాదాపుగా రూ.10 వేలు ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇలా ఖర్చయితే పేదోళ్ల పరిస్థితి ఏంటి? తక్షణమే అధికారులు చొరవ తీసుకుని సరిదిద్దాలి. లేదంటే ఆస్పత్రి రావడానికే భయపడాల్సి పరిస్థితి నెలకొంటుంది. –కోన కోటేశ్వరి, సామాజిక కార్యకర్త -
సింహాచలం ఈవోగా సుజాత బాధ్యతల స్వీకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవో(పూర్తి అదనపు బాధ్యతలు)గా దేవదాయ శాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సింహగిరికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో ఆనంద్‌కుమార్, సూపరింటెండెంట్ కంచెమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో పలుమార్లు దేవస్థానం ఇన్చార్జి ఈవోగా, డిప్యూటీ ఈవోగా ఆమె విధులు నిర్వర్తించారు. -
నేడు రెండో విడత చందనం సమర్పణ
సింహాచలం: వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం రెండో విడత చందనం సమర్పణను శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు సింహాచలం దేవస్థానం వైదికులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే సిద్ధం చేసిన మూడు మణుగుల పచ్చి చందనంలో ఆదివారం పలు సుగంధ ద్రవ్యాలను కలిపారు. సోమవారం తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ అనంతరం చందనాన్ని సమర్పించనున్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు, వైదికులు చందనంలో సుగంధ ద్రవ్యాలను కలిపి సమర్పణకు వీలుగా సిద్ధం చేశారు. ఆలయ ఏఈవో ఆనంద్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సింహాచలం క్షేత్రంలో సోమవారం వైశాఖ పౌర్ణమి ఉత్సవం కావడంతో ఆదివారం సాయంత్రానికే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల భక్తులు, మత్స్యకారులు తరలివచ్చారు. -
రాష్ట్ర స్థాయి వుషు పోటీలకు నింజాస్ అకాడమీ క్రీడాకారులు
నర్సీపట్నం: స్టేట్ వుషు చాంపియన్‌షిప్ పోటీల్లో నర్సీపట్నానికి చెందిన నింజాస్ అకాడమీ నుంచి 17 మంది బాక్సింగ్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ నెల 12 నుంచి 14 వరకు కర్నూలులో జరగనున్న సబ్ జూనియర్, సీనియర్ బాయ్స్, గర్ల్స్ రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్లో వీరు పాల్గొంటున్నారని కోచ్ ప్రియాంక తెలిపారు. పోటీలకు తరలివెళ్తున్న క్రీడాకారులను అకాడమీ డైరెక్టర్స్ సుతాపల్లి శ్రీకాంత్, వెలగా నారాయణరావు, ఎన్ఆర్ఐ అల్లాడ సురేష్, సీనియర్ కోచ్ యర్రా శేఖర్ అభినందించారు. ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని వారు శుభాకాంక్షలు తెలిపారు. -
ఎన్సీసీ శిక్షణ శిబిరంలో విద్యార్థుల ప్రతిభ
పాయకరావుపేట : సూరంపాలెంలో ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు జరిగిన 3వ ఆంధ్రా ఎన్సీసీ బాలికల బెటాలియన్ జూనియర్, సీనియర్ ఉమ్మడి వార్షిక శిక్షణ శిబిరం –1లో నిర్వహించిన వివిధ పోటీల్లో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్‌కు చెందిన జూనియర్ వింగ్, శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాలకు చెందిన సీనియర్ క్యాడెట్లు ప్రతిభ కనబరిచారు. ఈ శిబిరానికి ఎనిమిది జూనియర్, ఐదు సీనియర్ వింగ్‌లకు చెందిన మొత్తం 456 మంది క్యాడెట్లు హాజరయ్యారు. పలు పోటీల్లో ప్రతిభ చూపారు. జూనియర్ వింగ్ విభాగంలో సోలో సాంగ్‌లో మొదటి స్థానం, ఖోఖో, చెస్ పోటీల్లో రెండవ స్థానంలో నిలిచి ఒక బంగారు పతకం, పది వెండి పతకాలను, సీనియర్ విభాగంలో బాడ్మింటన్‌లో మొదటి స్థానం, గ్రూప్ సాంగ్, ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి ఒక బంగారు, 13 వెండి పతకాలను సాధించారు. క్యాంప్ కమాండెంట్ కల్నల్ హెచ్ఎస్ మౌనిక, గ్రూప్ కమాండర్ రితిన్ మోహన్ అగర్వాల్, ఎస్ఎం గులాబ్ సింగ్ చేతుల మీదుగా ఈ పతకాలను అందుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సీహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ తదితరులు అభినందించారు. -
విద్యుత్ షాక్‌తో 23 గొర్రెలు మృతి
చోడవరం: మండలంలోని గంధవరంలో విద్యుత్ షాక్‌తో 23 గొర్రెలు మృతిచెందాయి. వివరాలిలా ఉన్నాయి. గంధవరానికి చెందిన దేవర నారాయణ అనే గొర్రెలు పెంపకందారునికి గ్రామ సమీపంలో కల్లం ఉంది. అక్కడ రేకుల షెడ్లో రోజూలాగే శుక్రవారం రాత్రి తన గొర్రెలను ఉంచి, ఇంటికి వెళ్లిపోయాడు. షెడ్ పక్కనే గల విద్యుత్ స్తంభం నుంచి వచ్చిన విద్యుత్ వైరు.. షెడ్డు చుట్టూ వేసిన ఇనుక కంచెకు తగిలింది.ఆ వైరు ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై షెడ్డులో ఉన్న గొర్రెలన్నీ మృతి చెందాయి. శనివారం ఉదయం వెళ్లి చూసేసరికి అన్ని గొర్రెలు మృతిచెంది ఉండడంతో నారాయణ భోరున విలపించాడు. సుమారు రూ.4లక్షలు విలువైన గొర్రెలు మృతిచెందడంతో జీవనాధారం కోల్పోయానని నారాయణ కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామ సర్పంచ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పల్లా నర్సింగరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మొల్లి అప్పలనాయుడు, రాష్ట్ర గొర్రెలు, మేకలు పెంపకందారులు సంఘం అధ్యక్షుడు గంటా శ్రీరామ్ బాధితుడిని పరామర్శించారు. మృతిచెందిన గొర్రెలకు స్థానిక పశువైద్యాధికారి పోస్టుమార్టం చేశారు. విద్యుత్‌శాఖ ఏఈ, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదం వివరాలు తెలుసుకొని, బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు. -
కార్గిల్ యోధుడు కనకరాజు
● యుద్ధంలో వీరోచిత పోరాటం చేసిన మునగపాక వాసి ● పాక్ సైనికులతో జరిగిన పోరులో ఛాతీ కింద దూసుకుపోయిన బుల్లెట్ ● ఆర్మీలో సిపాయిగా చేరి.. హవల్దార్‌గా పదవీ విరమణ మునగపాక: మండల కేంద్రం మునగపాకకు చెందిన కనకరాజు తుపాకీ గుండుకు గుండెను ఎదురొడ్డి కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరుసలిపారు. సరిహద్దులో జరిగిన పోరులో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మునగపాక గ్రామానికి చెందిన బొయిదాపు సాంభమూర్తి–సత్యవతి దంపతుల పెద్ద కుమారుడు కనకరాజ్. ఐటీఐ పూర్తిచేసి, రిజ్మెంటల్ సెంటర్(ఎంఆర్సీ)లో 1994లో శిక్షణలో చేరారు. 1995లో గుజరాత్లో సిపాయిగా ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల పాటు అక్కడే పనిచేసిన ఆయన 1997–99లో ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొన్నారు.ఈ పెరేడ్లో తన బ్యాచ్ (144)మందితో కలిసి ప్రథమబహుమతిని కై వసం చేసుకున్నారు. 1999లో కూడా తన బ్యాచ్‌తో కలిసి ద్వితీయ బహుమతిని అందుకున్నారు. అదే ఏడాదిలో కాశ్మీరులోని కువ్వాడ జిల్లాకు బదిలీపై వెళ్లారు. అదే సమయంలో కనకరాజ్‌కు లాన్స్ నాయక్‌గా పదోన్నతి లభించింది.అదే ఏడాదిలో మే నుంచి జూలై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు. 1999 జూలై 31న భారత సరిహద్దులో పాక్ సైనికులతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన ఛాతీ దిగువ భాగంలో బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన కనకరాజ్‌ను 428 ఫీల్డ్ అంబులెన్స్‌లో ఆపరేషన్ చేశారు.అయినా ఆరోగ్యం కుదటపడక పోవడంతో శ్రీనగర్ ఆస్పత్రిలో మరోసారి శస్త్ర చికిత్స చేశారు.అది కూడా వికటించింది. ఇన్ఫెక్షన్ సోకడంతో గుండె కొట్టుకోవడంలో తేడాలు రావడంతో జమ్మూలోని ఉదంపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. జీర్ణాశయంలో రక్తం గడ్డ కట్టడంతో పేగుకు శస్త్ర చికిత్స నిర్వహించారు.దీంతో సిపాయి ఉద్యోగం చేసే పరిస్థితులు లేకపోవడంతో 2001లో కంప్యూటర్ శిక్షణ పొందారు. నాటి నుంచి రికార్డు ఆఫీసర్‌గా సేవలందించి 2011 అక్టోబర్ 21న హవల్దార్‌గా పదవీ విరమణ చేశారు. నేటికీ అందని సాయం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన కనకరాజుకు నేటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. దేశం కోసం పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం 300 గజాల స్థలాన్ని పట్టణ ప్రాంతాల్లో ఇవ్వాలనే జీవో ఉన్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.దీనికి తోడు మాజీ సైనికుని కోటా కింద 5 ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉంది. పదవీ విరమణ నాటి నుంచి ఇంతవరకు పలు మార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని కనకరాజ్ వాపోయారు. కాగా ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ సైనికులకు సాయం అందించేందుకు ఇటీవల జీవో వచ్చింది. అయితే కనకరాజ్ అనకాపల్లి జిల్లా వాసిగా గుర్తింపు ఉండడంతో ఎటువంటి ఫలం దక్కకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాజీ సైనికులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు మాత్రం ఇక్కడ అందకపోవడం విచారకరమన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
అనకాపల్లి టౌన్: మండలంలోని బవులవాడ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నా యి. చోడవరం నుంచి అనకాపల్లి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటో, అనకాపల్లి నుంచి చోడవరం వైపు వెళుతున్న కారు బవులవాడ సమీపంలో ఎదురెదుగా వస్తూ బలంగా ఢీకొన్నాయి. దీంతో ఆటో పై భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న చోడవరం మండలం అంబేరపురానికి చెందిన ఏడుగురు మహిళల్లో నలుగురికి స్వల్పగాయాలు కాగా, ఆళ్ళ ముత్యాలమ్మ(51) అనే మహిళ తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రులను స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించి చికిత్స అందజేశారు. -
వివాహం కాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య
కశింకోట: వివాహం కాలేదన్న మనస్తాపంతో ఒడిశా రాష్ట్రానికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ అల్లు స్వామినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఉగ్గినపాలెం వద్ద గల బాటిల్స్ ప్రాసెసింగ్ యూనిట్లో ఒడిశాకు చెందిన అర్జు పాంగి (25) కూలీగా పని చేస్తున్నాడు. అతని అన్నదమ్ములకు వివాహం అయింది. అర్జుకు మాత్రం వివాహం కాకపోవడంతో మనస్తాపం చెంది తాను నివాసం ఉంటున్న గదిలో శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శబ్దాలు విని అనుమానించి పక్క గదిలో వారు గ్రామ పెద్దలను తీసుకు వచ్చి తలుపు తెరిచి చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ శ్రీనివాస్ సందర్శించి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
ఎస్సీలకు అమలు కాని ఉచిత విద్యుత్
బుచ్చెయ్యపేట : ఎస్టీ,ఎస్సీల ఉచిత విద్యుత్ పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 200 యూనిట్ల వరకు ఎస్టీ,ఎస్సీల ఇళ్లకు ఉచిత విద్యుత్ అందజేశారు. కూటమి నాయకులు కూడా ఎస్టీ,ఎస్సీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. కాని పలు గ్రామాల్లో ఎస్సీలకు విద్యుత్‌శాఖ అధికార్లు బిల్లులు పంపుతున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. లోపూడి గ్రామంలో బండి అప్పారావు పేరుపై విద్యుత్ కనెక్షన్ ఉంది (సర్వీస్ నంబర్ 115634ఎల్008000095). ఆ సర్వీస్ నంబర్‌కు ఇటీవల వరకూ ఎటువంటి చార్జీలు పడలేదు. అయితే మార్చి నుంచి విద్యుత్‌శాఖ అధికారులు బిల్లులు పంపుతూ నగదు చెల్లించాలని వత్తిడి చేస్తున్నట్టు అప్పారావు భార్య బండి బోడమ్మ తెలిపింది. మార్చి నెలలో బిల్లు అందించగా ఉచిత విద్యుత్ కదా అంటే, ఈ సారి బిల్లు వచ్చింది డబ్బులు కట్టేయాలని, ఇక బిల్లు రాదన్నారని ఆమె చెప్పింది. దీంతో మార్చిలో రూ.300 కట్టానని, తరవాత ఏప్రిల్,మే నెలల్లో కూడా డబ్బులు కట్టాలని బిల్లులు అందించారని బోడమ్మ వాపోయింది. ఈ నెలలో రూ. 290 కట్టాలని బిల్లు అందించారని తెలిపింది. రెక్కాడితేనే గాని డొక్క నిండని నాలాంటి పేదల నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం తగదని, తనకు బిల్లు రాకుండా న్యాయం చేయాలని ఆమె కోరింది.మూడు నెలలుగా బిల్లులు వసూలు చేస్తున్న అధికారులు -
ధ్యానోత్సవాలు ప్రారంభం
పెందుర్తి: స్పిరిచ్యువల్ సొసైటీ మూమెంట్, ఉత్తరాంధ్ర ధ్యాన మాస్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన బుద్ధ పౌర్ణమి ధ్యానోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ధ్యాన మాస్టర్లు మాట్లాడుతూ నిరంతర ధ్యాన ప్రక్రియ వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ధ్యానాన్ని నిత్య జీవనంలో భాగం చేసుకోవాలని సూచించారు. మనిషి మంచి నడవడిక కోసం గౌతమ బుద్ధుని అడుగుజాడల్లో నడవాలని సూచించారు. తొలిరోజు సంగీత ధ్యానంతో ప్రారంభమైంది. అనంతరం సీతమ్మధారకు చెందిన కృష్ణవేణి ఆధ్వర్యంలో శాసీ్త్రయ సంగీతం, రమణి బృందం ఆధ్వర్యంలో రమణీయ రాగాలు, నోరి గాయిత్రి ఆధ్వర్యంలో వీణా నాద ధ్యానం, మిట్టా మనోహర్ ఆధ్వర్యంలో ఆచార్య సాంగత్యం, కృష్ణవేణి బృందం ఆధ్వర్యంలో నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి ధ్యాన మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. -
పెళ్లిలో ప్రతీకారం !
తాళ్లతో బంధించి ఒకరిని హింసించిన బంధువులు తగరపువలస: భీమిలి మండలం చిప్పాడ పంచాయతీ ఆశిపాలెంలో నల్ల తాతారావు అనే వ్యక్తిని కొందరు వ్యక్తులు తాళ్లతో బంధించి హింసించారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తాతారావును ఆసుపత్రికి తరలించారు. చిప్పాడ పంచాయతీలోని కంచేరుపాలేనికి చెందిన అబ్బాయికి, ఆశిపాలెం యువతితో శుక్రవారం రాత్రి ఆశిపాలెంలో వివాహం జరిగింది. ఈ వివాహానికి అమనాంకు చెందిన నల్ల తాతారావు.. అతని అన్నయ్య అప్పన్న, తల్లి తవుడమ్మతో కలిసి వచ్చారు. వివాహం అనంతరం అప్పన్న, తల్లి అమనాంకు తిరిగి వెళ్లగా.. తాతారావు అక్కడే మంచంపై నిద్రించాడు. దీనిని గమనించిన పెళ్లి కుమార్తె బంధువులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో తాతారావు కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి బంధించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాతారావు అన్నయ్య అప్పన్నకు ఈ విషయం తెలియడంతో తన తమ్ముడిని విడిచిపెట్టమని బంధువులను కోరాడు. అయితే వారు నిరాకరించారు. గతంలో తాతారావుకు కంచేరుపాలెం యువతితో వివాహం జరిగింది. వారి మధ్య వివాదాల కారణంగా ప్రస్తుతం తాతారావు అమనాంలో, అతని భార్య కంచేరుపాలెంలో ఉంటోంది. గతంలో తాతారావు తన మామ అనుకుని వేరే వ్యక్తిని తీవ్రంగా కొట్టాడని, అందుకు ప్రతీకారంగానే తాము అతన్ని బంధించామని పెళ్లి కుమార్తె బంధువులు ఆరోపించారు. తాతారావు అన్నయ్య ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు శనివారం సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని విడిపించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు తన తమ్ముడికి పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని అప్పన్న డిమాండ్ చేశాడు. -
చల్లని తల్లి మోదకొండమ్మ
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలు ఈనెల 11వతేదీ నుంచి 13వతేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీల ప్రతినిధులు శ్రమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కలెక్టర్ దినేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ● అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్ని రోడ్లను కలుపుకొని ఐదు కిలోమీటర్ల వరకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధాన జంక్షన్లలో దేవతా మూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ● మోదకొండమ్మతల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మోదకొండమ్మతల్లి మూలవిరాట్ విగ్రహాన్ని బంగారు అభరణాలతో అలంకరించారు. రూ.2లక్షల వ్యయంతో పూల అలంకరణ చేపట్టారు. మెయిన్‌రోడ్డులోని సతకంపట్టు వద్ద మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ● ఆదివారం ఉదయం 5గంటలకు అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఇతర అధికారులు తొలిపూజలు చేస్తారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఇత్తడి ఘటాలను ఆలయం నుంచి తోడ్కోని మెయిన్‌రోడ్డు వరకు ఉరేగిస్తారు. ఘటాలను నెత్తిన పెట్టుకుని భక్తిశ్రద్ధలతో సతకంపట్టు వరకు మోయడం ఉత్సవాల ప్రారంభంలో ప్రధాన ఘట్టం. అమ్మవారి పాదాలు, ఇత్తడి ఘటాలను గుడివాడ మహిళలు శనివారం శుద్ధి చేశారు. ● ఉత్సవాల సందర్భంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు,ఇతర సిబ్బంది మొత్తం వెయ్యి మందితో ఎస్పీ అమిత్ బర్దర్ బందోబస్తు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బందితో ఏఎస్పీ అడ్మిన్ ధీరజ్ శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఘనంగా ఏర్పాట్లు: జేసీ అభిషేక్ గౌడమోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్‌గౌడ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఆయన పరిశీలించారు. జెయింట్ వీల్, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించి భద్రతా చర్యలను అఽధికారులతో సమీక్షించారు. అలాగే మోదకొండమ్మతల్లి ఆలయం, మెయిన్‌రోడ్డులోని సతకంపట్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు, డీఎల్పీవో కుమార్ పాల్గొన్నారు. బందోబస్తుపై ఎస్పీ సమీక్ష ఉత్సవాల మూడు రోజులు పాడేరు పట్టణంలో పోలీసుశాఖ ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు, ఇతర తనిఖీలు, సీసీ,డ్రోన్ కెమెరాల నిఘాపైె ఎస్పీ అమిత్‌బర్దర్ ఽశనివారం సమీక్షించారు. మోదకొండమ్మతల్లి ఆలయం, శతకంపట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. భద్రత ఏర్పాట్ల వివరాలను ఏఎస్పీ (అడ్మిన్) ధీరజ్ తదితర అధికారుల నుంచి తెలుసుకున్నారు. నేటి నుంచి పాడేరులో ఉత్సవాలు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరణ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు -
సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవోగా సుజాత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఇన్చార్జి ఈవోగా దేవదాయశాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ సెక్రటరీ వి.వినయ్‌చంద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా ఇప్పటివరకు ఇన్చార్జి ఈవోగా పనిచేసిన కె.సుబ్బారావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇదిలావుండగా దేవస్థానం పర్మినెంట్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు వ్యక్తిగత కారణాల వల్ల అమెరికా వెళ్లేందుకు ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 30 వరకు సెలవు పెట్టారు. దీంతో రెవెన్యూ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి దేవదాయశాఖ రాజమహేంద్రవరం జోన్–1 ఆర్జేసీగా పనిచేస్తున్న కె.సుబ్బారావుకు 92 రోజులపాటు ఇన్చార్జి ఈవోగా పూర్తి బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఆయన మార్చి ఒకటో తేదీన ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు స్వీకరించగా.. ఈనెలాఖరుకు పదవీకాలం పూర్తవుతుంది. గత నెల 30న చందనోత్సవం రోజు గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో ఆయన సస్పెండ్ అయ్యారు. ఈనెలాఖరుతో దేవస్థానం పర్మినెంట్ ఈవో వి.త్రినాథరావు 92 రోజుల సెలవు కూడా పూర్తవుతుంది. ఆయన తిరిగి ఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారా..లేదా.. అన్న చర్చ దేవస్థానంలో నడుస్తోంది. -
14వ పోప్‌గా లియో నియామకంపై హర్షం
డాబాగార్డెన్స్ (విశాఖ): రోమన్ క్యాథలిక్ మిషన్‌కు 267వ జగద్గురువుగా, పరిశుద్ధ 14వ పోప్‌గా లియో నియామకంపై విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల హర్షం వ్యక్తం చేశారు. సెయింట్ ఆంథోనీ చర్చి ప్రాంగణం, ఆర్చి బిషప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల దైవ సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా, పునీత పేతురు వారసుడిగా లియో నియమితులయ్యారన్నారు. నూతనంగా ఎన్నికై న పోప్‌కు విశాఖ అగ్రపీఠం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. లియో 2015లో పీఠాధిపతిగా, 2023లో కార్డినల్‌గా వ్యవహరించారన్నారు. నూతన పోప్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ఆయన పాలనలో భారత్‌ను దర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
సరుగుడులో లేటరైట్ తవ్వకాలు
నర్సీపట్నం: నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా లేటరైట్ తవ్వకాలు చేపడుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ప్రాంతంలోని 30 వేల ఎకరాల్లో లేటరైట్ తవ్వకాల అనుమతుల కోసం 2013లో బినామీలు పేరున దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో కొయ్యూరు మండలం కాకరపాడుకు చెందిన గిరిజనేతరుడు జర్తా లక్ష్మణరావుకు 121 ఎకరాల్లో అప్పట్లో అనుమతులు ఇవ్వగా, తాము తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. సదరు లీజుదారు గిరిజనుడు కాదని రుజువు కావడంతో మైనింగ్ తవ్వకాలు నిలిచిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం 296,34 హెక్టార్లల్లో మైనింగ్ వ్యాపారులు తవ్వకాలు చేస్తున్నారన్నారు. వీటి వల్ల పోడు వ్యవసాయం, కొండ కింద పండించే వరి, ఇతర ఆహార పంటలకు నీటి వసతి లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. తవ్వకాల ప్రాంతంలో వివిధ రకాల చెట్లు, అడవి ధ్వంసమవుతున్నాయన్నారు. కొన్ని వందల అడుగులు మేర లేటరైట్ తవ్వకాలు చేపట్టి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. సిమెంట్ తయారీకి, ఇతర నిర్మాణ అవసరాలకు ఉపయోగిస్తున్న లేటరైట్‌కు డిమాండ్ ఉండడంతో మైనింగ్ మాఫియా అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. ఈ తవ్వకాల వల్ల అసనగిరి, సిరిపురం, ముంతమామిడి, భమిడికలొద్ది, తొరడ, ఎరకంపేట, సరుగుడు, సుందరకోట, కిండంగి, తదితర గ్రామాల గిరిజనులకు నష్టం జరుగుతుందన్నారు. వీరిని ప్రలోభ పెట్టేందుకు లేటరైట్ లీజుదారుని వెనుక ఉన్న నర్సీపట్నానికి చెందిన మైనింగ్ వ్యాపారి డబ్బులు ఆశ చూపుతున్నారని ఆరోపించారు. గిరిజనులను వర్గాలుగా చీల్చి అక్రమంగా లేటరైట్ తవ్వకాలు చేస్తున్నారని, వెంటనే మైనింగ్ లీజులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల జీవనోపాధికి దెబ్బ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
కంచరపాలెం (విశాఖ): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వా రు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు పంచుతామన్న హామీలను నెరవేర్చలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందిస్తే.. సచివాలయ కార్యదర్శుల ద్వారా టీడీపీ నేతలు దరఖాస్తుదారులను బెదిరించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడలో రైల్వేస్టేషన్ ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదు సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు -
హైదరాబాద్, కాకినాడలకు కొత్త బస్సులు
నర్సీపట్నం: కాకినాడ, హైదరాబాద్‌కు వేసిన కొత్త ఆర్టీసీ బస్సులను స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దూర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. అనంతరం ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని టాయిలెట్లు, క్యాంటీన్‌ను పరిశీలించారు. శుభ్రంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్లు శుభ్రం చేసే సిబ్బందికి నెలకు రూ.6 వేల జీతం ఇస్తున్నారని తెలుసుకొని ఆర్టీసీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. వారికి చట్ట ప్రకారం రూ.12 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయమై ఆర్టీసీ చైర్మన్, ఎండీకి లెటర్ పెడతానన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో 58 దుకాణాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రతి నెలా అద్దె రూపేణా రూ.7.90 లక్షల ఆదాయం వస్తుందన్నారు. వచ్చే ఆదాయంతో సౌకర్యాలు కల్పించాలని జిల్లా ప్రజారవాణాధికారి పద్మావతి, డిపో మేనేజర్ ధీరజ్‌ను ఆదేశించారు. రీజనల్ చైర్మన్ ఏం చేస్తున్నారు? రీజినల్ చైర్మన్‌గా దొన్ను దొరకు సీఎం చంద్రబాబునాయుడు అవకాశం కల్పించారని, ఆయన సక్రమంగా విధులు నిర్వహించాలని స్పీకర్ అన్నారు. రీజినల్ చైర్మన్ కనీసం రెండు నెలలకొకసారైనా డిపోలను సందర్శిస్తే ఇటువంటి సమస్యలు తెలుస్తాయన్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన దొర ఇప్పటి వరకు నర్సీపట్నం, అనకాపల్లి డిపోలను సందర్శించిన సందర్భాలు లేవన్నారు. కార్యాలయంలో కూర్చొని పరిపాలన చేయడం కాదని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. ఆయన వెంట కౌన్సిలర్ సిహెచ్.రాజేష్, పార్టీ నాయకులు ఉన్నారు. నర్సీపట్నం నుంచి నడపనున్న ఆర్టీసీ జెండా ఊపి ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు -
వీర జవాన్ మృతికి ఉపాధి కూలీల నివాళి
నాతవరం: ఆపరేషన్ సిందూర్‌లో జవాన్ మురళీనాయక్ వీర మరణం పొందడం పట్ల ఉపాధి కూలీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు నాతవరం మండలం డి.యర్రవరం పంచాయతీలో శనివారం ఉదయం రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వీర జవాన్ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇ.సత్యవతి, నల్లగొండమ్మ తల్లి ఆలయ నిర్మాణ దాత చింతంరెడ్డి బెన్నయ్యనాయుడు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అంకంరెడ్డి రామకృష్ణ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
టీడీపీ సర్పంచ్ భర్త వేధింపులపై హోంమంత్రికి ఫిర్యాదు
ఎస్.రాయవరం: జేవీ పాలెం గ్రామంలోని తన భూమిలో మట్టిని ప్రస్తుత టీడీపీ సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ వజ్రపు శంకరరావు దౌర్జన్యంగా తరలించుకుపోతున్నాడని గ్రామానికి చెందిన అన్నం కాంతం ఓ వీడియో ద్వారా రాష్ట్ర హోంమంత్రి అనితకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 2016 నుంచి తన భూమిలోకి అక్రమంగా చొరబడి గ్రావెల్ తరలించుకుపోయి సొమ్ము చేసుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.50 వేలు వ్యయంతో నిర్మించుకున్న రేకుల షెడ్డును కూడా శంకరరావు కూల్చివేసి తనకు ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చాడని ఆమె ఆరోపించారు. ఈ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తాను పోలీస్ స్టేషన్‌కు వెళ్లే లోపే ఫిర్యాదు తీసుకోవద్దని అధికారం అండతో అడ్డుపడుతున్నాడని ఆమె వాపోయారు. పోలీసులు కూడా న్యాయ, అన్యాయాలు పరిశీలించకుండా కూటమి పార్టీ నేత అయిన శంకరరావుకే వస్తాసు పలుకుతున్నారన్నారు. ఈ మేరకు హోంమంత్రికి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె చెప్పారు. హోంమంత్రి అండదండలు తనకు మెండుగా ఉన్నాయని, గ్రామంలో ఏ చేసినా చెల్లిపోతుందని శంకరరావు రెచ్చిపోతున్నాడన్నారు. ఇటీవల గ్రామ సభలో తాను ఫిర్యాదు చేస్తే సర్పంచ్ దురుసుగా ప్రవర్తించాడని, ఆ ఘటనను తన మనవడు వీడియో తీస్తే, రూ.20 విలువ చేసే మొబైల్ లాక్కుని పోయాడని చెప్పారు. ఇప్పటికై నా హోంమంత్రి పరిశీలించి శంకరరావు ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరారు. -
హెచ్‌ఎస్‌ఎల్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
విశాఖ సిటీ : హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) డిజిటల్ దిశగా అడుగులు వేయడంలో అత్యుత్తమ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 10వ పీఎస్‌యూ అవార్డుల ప్రదానోత్సవంలో హెచ్‌ఎస్‌ఎల్‌కు అవార్డు దక్కింది. సంస్థలో ఐటీ అప్లికేషన్లు, సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ డైరెక్టర్(కార్పొరేట్ ప్లానింగ్ అండ్ పర్సనల్) కమడోర్ రాకేష్ ప్రసాద్ అందుకున్నారు. -
చెరువు గర్భంలో రోడ్డు తొలగింపు
రోలుగుంట: క్వారీ నుంచి రాయి తరలింపు కోసం మండలంలోని రాజన్నపేట పొలాలకు సాగునీరు అందిస్తున్న చెరువు గర్భంలో నిర్మించిన రహదారిని రోలుగుంట తహసీల్దార్ ఎస్.నాగమ్మ శుక్రవారం తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. రాజన్నపేట గ్రామానికి చెందిన పొలాలకు 57/2 సర్వే నంబరులోని భూపతి చెరువు నుంచి సాగునీరు అందుతుంది. గతేడాది రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని కొండ ప్రాంతంలో క్వారీ నిర్వహణకు అనుమతి పొందారు. అక్కడి నుంచి రాయిని తరలించడానికి మార్గం లేక చెరువు గర్భంలో రహదారి ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా లారీలతో రాయి తరలింపునకు శ్రీకారం చుట్టాడు. భారీ బండ రాళ్లను రాంబల్లి మండలంలో తలపెట్టిన నేవల్ బేస్ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ రైతులు తమ భూములకు జరుగుతున్న నష్టాన్ని నిర్వాహకుడికి పలు దఫాలు మొరపెట్టుకున్నారు. చెరువును ఆక్రమించి రోడ్డు వేయడం తగదని అడ్డగించినా ఫలితం లేదు. దీంతో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో సైతం రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో రమణ ఈ ప్రాంతాన్ని గత వారం తహసీల్దార్ నాగమ్మతో కలిసి సందర్శించి వాస్తవాలపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇక్కడ చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసిన రహదారిని తొలగించి, క్వారీ నిర్వహణలో నిబంధనలు పాటించాలని నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం మండల సర్వేయర్ నాయుడు, ఆర్.రామమూర్తి, వీర్వో శ్రీనివాస్‌తో కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. చెరువు గర్భాన్ని ఆక్రమించి మెటల్, రాతి బుగ్గితో ఏర్పాటు చేసిన రోడ్డును పొక్లెయిన్‌తో తొలగించి, ట్రెంచ్‌లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగానే క్వారీ నిర్వహణ ఉండాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారీ నిర్వహణలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు రోలుగుంట తహసీల్దార్ నాగమ్మ హెచ్చరిక -
ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
ఎంవీపీకాలనీ : వాల్తేర్ ఆర్టీసీ డిపో ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆ సంస్థ డిపో చైర్మన్ బండి రవి తెలిపారు. గురువారం రాత్రి డిపో ఆవరణలో ఉన్న తమ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం సిబ్బంది వచ్చి చూడగా పరిసరాలు చిందరవందరగా ఉండటంతో కుర్చీలు, ఇతర ఫర్నీచర్ వస్తువులు ధ్వంసమై ఉన్నాయన్నారు. ఫ్లెక్సీని సైతం చించేశారన్నారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎన్ఎంయూ డిపో యాజమాన్యంపై అక్కసుతోనే ఈ దాడికి పాల్పడినట్లు సంస్థ డిపో కార్యదర్శి వసంతరావు పేర్కొన్నారు. -
మూడు యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు
కశింకోట: రోకళ్ల అప్పారావు.. భారత్‌తో పాకిస్తాన్, చైనా జరిపిన మూడు ప్రధాన యుద్ధాల్లో పాల్గొన్నారు. యుద్ధాలతోపాటు ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఆర్మీ నుంచి పతకాలు పొందారు. శేష జీవితాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఆది నుంచి ఆరోగ్యంతో ఆనందమయ జీవనాన్ని గడుపుతున్నారు. కశింకోటలోని స్టేట్ బ్యాంకు వీధి ప్రాంతంలో అప్పారావు కుటుంబంతో స్థిర నివాసం ఉంటున్నారు. 1955లో 14వ ఏట ఇండియన్్ ఆర్మీలో చేరి సిపాయిగా వైర్లెస్ విభాగంలో ఆపరేటర్‌గా సేవలందించారు. 1962లో చైనాతోను, 1965, 71 సంవత్సరాల్లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల్లో విధులు నిర్వహించారు. తొలుత 1966 వరకు సేవలందించి విధుల నుంచి రిటైర్ అయ్యారు. మళ్లీ యుద్ధం రావడంతో ఇండియన్ ఆర్మీ అధికారుల నుంచి వచ్చిన పిలుపు మేరకు మరోసారి వెళ్లి 1971లో పాకిస్తాన్ యుద్ధంలో సేవలందించారు. జమ్మూ, కశ్మీర్, అస్సాం, రాజస్థాన్, గుజరాత్, జలంధర్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వహించి సేవలందించారు. మూడు ప్రధాన యుద్ధాలు చవి చూసి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఆయన యుద్ధాల్లోను, సర్వీసులోను అందించిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ ఆర్మీ పతకాలను అందజేసి గౌరవించింది. ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి నిలిపారు. అప్పారావు సొంత గ్రామం ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం. ఆర్మీలో చేరిన తర్వాత ఇక్కడికి వలస వచ్చి స్థిర నివాసం ఉంటున్నారు. పాక్ తుక్కుగా ఓడిపోవడం ఖాయం పాకిస్తాన్‌తో మళ్లీ యుద్ధం వస్తే భారత్ చేతిలో తుక్కుగా ఓడిపోవడం ఖాయమని అప్పారావు ధీమాగా చెప్పారు. సమృద్ధిగా ఆయుధ సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు ఉన్నాయన్నారు. ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన శేష జీవితాన్ని గడుపుతున్నానన్నారు. -
విశాఖ డెయిరీ పాల ధరల పెంపు
అక్కిరెడ్డిపాలెం: విశాఖ డెయిరీ పాల ధరలను పెంచుతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పెరిగిన ధరలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(500 మి.లీ) రూ.25 నుంచి రూ.26కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు(లీ) రూ.50 నుంచి రూ.52కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు(లీ) రూ.54 నుంచి రూ.56కు, టోన్డ్ పాలు (500 మి.లీ) రూ.27 నుంచి రూ.28కు, స్టాండర్డైజ్డ్ పాలు(500 మి.లీ) రూ.30 నుంచి రూ.31కు, ఫుల్ క్రీమ్ పాలు (500 మి.లీ) రూ.32 నుంచి రూ.33కు, ఫుల్ క్రీమ్ పాలు (లీ) రూ.63 నుంచి రూ.66కు, హోమోజినైజ్డ్ టోన్డ్ పాలు–గంగ (500 మి.లీ) రూ.28 నుంచి రూ.29కు, హోమోజినైజ్డ్ డబుల్ టోన్డ్ పాలు–గంగ(500 మి.లీ) రూ.26 నుంచి రూ.27కు, టోన్డ్ పెరుగు (180 గ్రా.) రూ.14 నుంచి రూ.15కు, టోన్డ్ పెరుగు (కిలో) రూ.64 నుంచి రూ.66కు, డబుల్ టోన్డ్ పెరుగు (900 గ్రా.) రూ.54 నుంచి రూ.56కు పెరిగినట్లు యాజమాన్యం తెలిపింది. -
యుద్ధకాలపు అనుభవాలు
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విశాఖపై జపాన్ దాడి తప్పదని ముందుగానే ఊహించారు. 1942 జనవరిలో బర్మా, ఫిబ్రవరిలో సింగపూర్లను జపాన్ ఆక్రమించడంతో, వారి తదుపరి లక్ష్యం భారతదేశ తూర్పు తీరంలోని కీలక నగరమైన విశాఖపట్నం అని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని యూరోపియన్లు రైళ్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ముందు జాగ్రత్త చర్యగా విశాఖపట్నం అంతటా బంకర్లు నిర్మించారు. వీటిలో కొన్ని ఆర్కే బీచ్ పరిసరాలు, దస్పల్లా హిల్స్ ప్రాంతాల్లో ఇప్పటికీ చూడవచ్చు. రేషన్ సరుకులను నిల్వ ఉంచుకోరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆ సమయంలో నెలకొన్న పరిస్థితులను భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంపద(ఇన్టాక్) సంస్థకు చెందిన ఎడ్వర్డ్ పాల్ ‘సాక్షి’కి వివరించారు. ‘దాడిని ఎదుర్కొనేందుకు నగరంలో సరైన ఆయుధ సంపత్తి లేదు. జపాన్ సైన్యం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, పవర్ హౌస్‌లతో పాటు హార్బర్లోని నౌకలపై బాంబులు వేసింది. ఈ దాడిలో ఎనిమిది మంది మరణించారు. దాడి జరుగుతున్న సమయంలో, నౌకల్లోని పాత తుపాకులతో ఎదురుదాడికి ప్రయత్నించినా.. జపాన్ విమానాలు వాటి పరిధిలో లేకపోవడంతో అవి నిష్ఫలమయ్యాయి. పోర్టు నగరంపై దాడి జరుగుతుందని తెలిసినప్పటికీ తగిన ఆయుధాలను మోహరించలేదని ఇది స్పష్టం చేస్తుంది. ఆనాటి దాడిలో మరణించిన వారి పేర్లతో కూడిన శిలాఫలకాన్ని విశాఖపట్నం మ్యూజియంలో, అలాగే జారవిడిచిన ఒక పేలని బాంబును కూడా మ్యూజియంలో భద్రపరిచారు. ప్రజలు ఎడ్లబళ్లు, సైకిళ్లు, కాలినడకన నగరాన్ని విడిచి వెళ్లారు. అధికారులు మాత్రం తమ కుటుంబ సభ్యులను గ్రామాలకు పంపి.. విధుల్లో కొనసాగారు. ఆంధ్రా యూనివర్సిటీ భవనాలను ఖాళీ చేయించి బ్రిటిష్ సైన్యం వినియోగించుకుంది. యూనివర్సిటీని తాత్కాలికంగా గుంటూరు, విజయవాడలకు తరలించారు.’ అని పాల్ వివరించారు. అయితే 1971 నాటి పాకిస్తాన్‌తో యుద్ధ సమయంలో విశాఖపట్నంపై పెద్దగా ప్రభావం పడలేదన్నారు. 1942 నాటి ఘటనతో విశాఖపట్నంనకు రెండు ప్రయోజనాలు చేకూరాయని పేర్కొన్నారు. నగరానికి వచ్చిన సైనిక బలగాల నీటి అవసరాలను తీర్చడానికి ఆర్మీ ఇంజినీర్లు గోస్తనీ తాగునీటి పథకాన్ని నిర్మించారు. రోజుకు 4 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేసే ఈ పథకాన్ని యుద్ధానంతరం మున్సిపాలిటీ వినియోగించుకుంది. అలాగే మేహాద్రి గెడ్డపై ఒక వంతెనను కూడా నిర్మించారని ఆనాటి సంగతులను పంచుకున్నారు. -
భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ యాత్ర
విశాఖ లీగల్ : భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా విశాఖ న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన గేట్ నుంచి జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంఘీభావ ప్రదర్శన అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత సైన్యం శత్రుసేనపై చేస్తున్న పోరాటానికి తాము జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సింధూర పోరాటానికి న్యాయవాదులందరూ సంఘీభావం ప్రకటించారన్నారు. కార్యక్రమంలో వందలాదిగా న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే కోర్టు ప్రధాన గేటు దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయరావు, వెంకటేశ్వరరావు, అల్లు సురేష్, మణి, భవాని, శ్రీధర్, చిట్టిబాబు, శ్రీరామ్ముర్తి, ఆనందరెడ్డి, ఎస్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన వేంకటాద్రి బ్రహ్మోత్సవాలు
పెందుర్తి: వేంకటాద్రిపై కొలువైన వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆఖరి రోజు శుక్రవారం ఉదయం స్వామివారికి చక్రస్నానం, చక్రత్తాళ్వారులతో కలిసి దివ్య స్నానం జరిపారు. సాయంత్రం దేశం, రాష్ట్రం నలుమూలల నుంచి రప్పించిన వివిధ రకాల పుష్పాలతో పుష్పయాగం జరిపారు. స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ద్వాదశారాధన, స్వామివారికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణలతో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. ఆలయ అర్చకుడు మహర్తి శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో ఈవో నీలిమ, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
వెబ్సైట్లో టెన్త్ మార్కుల మెమోలు
అనకాపల్లి టౌన్: టెన్త్ విద్యార్థుల మార్కుల షార్ట్ మెమోలు వెబ్సైట్ లో అందుబాటు లో ఉన్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల మెమోలను ఆయా పాఠశాలల ప్రధానోధ్యాయులు డౌన్లోడ్ చేసి, విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మార్కుల జాబితాలో పుట్టిన తేదీ, ఇంటిపేరు తదితర తప్పులు ఏమైనా ఉన్నట్టయితే అందుకు సంబంధించిన రికార్డులను ఈ నెల 25 లోపు అందజేసి సరిదిద్దుకోవాలన్నారు. ఒక సారి జారీ అయిన మార్కులలిస్టులో తప్పు లను మళ్లీ సవరించే అవకాశం ఉండదని తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మాకవరపాలెం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాకవరపాలేనికి చెందిన లంక గణేష్(26) ఆరేళ్ల క్రితం తూటిపాలకు చెందిన శీరంరెడ్డి సుధారాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గణేష్ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా గణేష్ అత్తగారిల్లు అయిన తూటిపాలలోనే ఉంటున్నాడు. గురువారం మాకవరపాలెం వచ్చి మళ్లీ సాయంత్రం తూటిపాల వెళ్లాడు. శుక్రవారం ఉదయం సమీప జీడితోటలో ఉరివేసుకుని మరణించి కనిపించాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఎస్ఐ దామోదర్‌నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మృతుడి తల్లి నూకరత్నం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఐదేళ్ల ఏళ్ల కుమారుడు ఉన్నారు. -
దేశం కోసం..
● యుద్ధ భూమిలో తండ్రీ కొడుకుల సేవలు ● ఇద్దరూ పాకిస్తాన్‌పై పోరాడినవారే.. మిలటరీ అప్పారావు అగ్గాల అప్పారావును అందరూ మిలటరీ అప్పారావు అని పిలుస్తారు. 1965లో ఆర్మీలో చేరిన వెంటనే పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చింది. 22 సంవత్సరాలు సేవలందించిన ఆయన 1971లో జరిగిన ఇండో పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. మద్రాస్ రెజిమెంట్ సెవెంత్ బెటాలియన్‌లో విధులు నిర్వహించి శత్రువులను తరిమికొట్టారు. ఆనాటి జ్ఞాపకాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.. ప్రస్తుతమున్న టెక్నాలజీ అప్పట్లో లేకపోయినా దేశంపై ఉన్న మక్కువతో ప్రాణాలు తెగించి పోరాడాం. కళ్ల ముందే తోటి సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా అధైర్యపడకుండా ముందుకు దూసుకుపోయేవాళ్లం. ఎక్కువగా ల్యాండ్‌మైన్స్ ఏర్పరచడంతో యుద్ధం సమయంలో 40 మంది జవాన్లకు అప్పట్లో కేవలం 10మంది మాత్రమే తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునేవారు. యుద్ధాలు జరగడం వల్ల దేశాలు ఆర్థికంగా కొన్ని సంవత్సరాలు వెనుకబడిపోతాయి. అమాయక దేశ పౌరులపై కాల్పులు జరిపి పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. దేశ సంరక్షణ కోసం ప్రస్తుతం ఎనిమిది పదుల వయస్సులో కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. ఎర్రవరం గ్రామానికి చెందిన అగ్గాల అప్పారావు.. ఆయన కుమారుడు హనుమంతరావు.. ఇద్దరూ ఆర్మీలో సేవలందించారు. పాక్ సైనికులను ఎదుర్కొన్నారు. మళ్లీ యుద్ధానికి సిద్ధమంటున్నారు. – అచ్యుతాపురం రూరల్ అగ్గాల అప్పారావు తనయుడు హనుమంతరావు కూడా అదే మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసి కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. 74 రోజులపాటు పాకిస్తాన్‌తో పోరాడారు. యుద్ధభూమిలో అడుగు పెడితే దేశమే గానీ కుటుంబం గుర్తుకు రాదని, ప్రాణాలు పణంగా పెట్టడానికై నా సిద్ధంగా ఉంటామని ఆయన చెప్పారు. తన జ్ఞాపకాలను ఇలా నెమరువేసుకున్నారు.. 1999 కార్గిల్ యుద్ధంలో పనిచేస్తునప్పుడు సోలార్ మిసైల్స్ ఉండేవి. వాటిపై ఎప్పుడైతే సూర్యకాంతి పడుతుందో ఆటోమెటిక్‌గా టార్గెట్ చేసిన స్థలానికి చేరుకుని పేలిపోయేవి. మేము ముందుగానే గ్రహించి యుద్ధం సమయంలో అతి చాకచక్యంగా అటువంటి ఎన్నో సోలార్ మిసైల్స్‌ను వెలికితీశాం. ఇంటెలిజెన్స్ ప్రతి సైనికునిపై నిఘా ఉంచుతుంది. సైనికుల విధి విధానాలపై అప్రమత్తత వహిస్తుంది. అచ్యుతాపురం మండలం నుంచి సుమారు 30 మంది మాజీ సైనికులం యుద్ధంలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని పై అధికారులకు లేఖ పంపించాం. కార్గిల్ యుద్ధ భూమిలో దాచిపెట్టిన సోలార్ మిసైళ్లను వెలికి తీసిన అగ్గాల హనుమంతరావు బృందం -
చెరువు..బరువు
కుంటుపడిన రైతు బతుకు తెరువు సాక్షి, అనకాపల్లి: మనవి దాదాపు వర్షాధార భూములు. వానలు పడితేనే పంట పండుతుంది. రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తుంది. తగిన నీటి సదుపాయం ఉంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగేలా చెరువుల అభివృద్ధి, ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. సాగునీటి ఇబ్బందులు తొలగించడానికి ఏపీ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) తీసుకొచ్చింది. ప్రపంచబ్యాంక్ 80 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులు భరించేలా సంయుక్తంగా చెరువుల నిర్మాణం చేపట్టారు. ఇందులో స్వతంత్ర, గొలుసుకట్టు చెరువులు, వంద ఎకరాలకుపైగా ఉన్న పెద్ద చెరువులు, చిన్న చెరువుల నిర్మాణ పనులు ఉన్నాయి. అందులో భాగంగానే జిల్లాలో 98 చెరువులు అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఐదు విభాగాల సహకారం.. వాతావరణంలోని మార్పులను తట్టుకుని వ్యవసాయ ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచే విధంగా రైతులు పంటలను పండించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని విస్తృతం చేశారు. వ్యవసాయ శాఖ, భూగర్భజల శాఖ, నీటిపారుదల శాఖ, ఉద్యావన శాఖ, మత్స్యశాఖ కలిసి సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకంలో చెరువుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 100 ఎకరాల నుంచి 150 ఎకరాలకు సరిపడా నీరు నిల్వ ఉంచుకునేందుకు వీలుగా చెరువులను అభివృద్ధి చేస్తారు. నీటి లభ్యతను రైతులు అంచనా వేసుకోవడానికి, బోరుబావులలో నీరు సమృద్ధిగా ఉండేటట్లు ఈ పథకంలో చర్యలు తీసుకుంటారు. పిజో మీటర్ డ్రిల్లింగ్ చేసి నీటి సాంద్రతను నెల నెలా తెలుసుకోవచ్చు. వర్షపు నీటిని ఒడిసి పట్టి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకోవాలి. చెరువు ఆయకట్టు శివారు పంట పొలాలకు సైతం సాగునీరు అందేలా చెరువులను అభివృద్ధి, ఆధునికీకరణ చేసుకోవాలి. అప్పుడే పల్లెల్లో చెరువులు సైతం వ్యవ‘సాయం’గా మారుతాయి. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయంతో ‘ఏపీ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం’లో భాగంగా చెరువుల అభివృద్ధికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టును 2025 నాటికి పూర్తి చేయాలని శరవేగంగా పనులు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఈ పనులు మందగించాయి. వేసవి కాలంలోనే చెరువులను అభివృద్ధి చేస్తే వచ్చే వర్షాకాలంలో సాగుకు సరిపడా నీటిని నిల్వ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత సర్కారు ఆ దిశగా ఆలోచించడం లేదు. కూటమి ప్రభుత్వంలో చెరువుల ఆధునికీకరణకు గ్రహణం సమీకృత వ్యవసాయ పరివర్తన పథకం ప్రవేశపెట్టిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలో 50 సాగునీటి చెరువులను అభివృద్ధి చేయాలన్నది నాటి ప్రతిపాదన ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆధునికీకరణకు నోచుకోని వైనం రూ.33.46 కోట్ల ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో నిర్మాణ పనులు ఇవి పూర్తయితే 7,232 ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు చెరువుల ద్వారా వ్యవ‘సాయం’ గ్రామాలలో వ్యవసాయానికి తోడ్పాటు అందించేవి చెరువులే. వర్షాలు పడేటప్పుడు నీరు నిల్వ ఉండేందుకు గ్రామాల్లో చెరువులు ఉపయోగపడతాయి. ఈ చెరువుల అభివృద్ధి, నిర్మాణ పనులతో పంటల దిగుబడి పెరిగి రైతుకు మేలు జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయనికి నీరందించే బోరు బావులలో వేసవి సమయాల్లో నీరు అడుగంటకుండా సహాయపడుతుంది. భూగర్భజలాలను నిల్వ చేయడానికి, వాటితోపాటు చేపల పెంపకానికి దోహదపడుతుంది. మరింత ఆదాయవనరులను పెంచుతుంది. ప్రధానంగా వ్యవసాయ సాగునీటి విస్తీర్ణం పెంచుకోవచ్చు. 20 శాతం కన్నా పనులు తక్కువైన చెరువుల వివరాలు ప్రభుత్వానికి పంపాం. – రాజేశ్వరరావు, ఈఈ, భూగర్భ జలవనరుల శాఖ ‘కూటమి’ నిర్లక్ష్యం.. రైతులకు శాపం ఏపీ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో 50 చెరువుల పునరుద్ధరణ కోసం ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 80:20 నిష్పత్తిలో పనులు చేపట్టింది. వీటి కోసం రూ.33.46 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 33 చెరువులకు గానూ రూ.20.84 కోట్లతో ఒప్పందాలు ఖరారయ్యాయి. పనులు ప్రారంభమయ్యాయి. మరో 17 చెరువులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఆ టెండర్లు రద్దు చేశారు. వీటిలో ఒక్కో చెరువు నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు కేటాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 7,232 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పనులు కొనసాగించకపోగా పలు టెండర్లను రద్దు చేసింది. 2025 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2020లో శ్రీకారం చుట్టారు. అదేవిధంగా జపాన్‌లోని అంతర్జాతీయ సహకార సంస్థ ఆర్థిక సహాయంతో 20 మైనర్ ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి కోసం రూ.8.43 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో కోటి రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని టెండర్ దశలోనే ఉన్నాయి. -
కుక్క దాడిలో ఉపాధి కూలీకి గాయాలు
చీడికాడ: మండలంలోని జె.బి.పురంలో పిచ్చికుక్క దాడిలో ఓ ఉపాధి కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రామిశెట్టి దేముడమ్మ ఓ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా అటుగా వచ్చిన పిచ్చికుక్క దాడి చేసింది. దేముడమ్మ చేతులు, కాళ్లపై విచక్షణా రహితంగా గాయపరిచింది. పక్కనే ఉన్న తోటి కూలీలు కుక్కను తరమడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు పెదగోగాడ పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు చోడవరం సీహెచ్‌సీ మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు తెలిపారు. -
ఏపీఐఐసీ ప్రాజెక్టు ఏరియాలో ఆర్డీవో పర్యటన
నక్కపల్లి: ఏపీఐఐసీ ప్రాజెక్టు ఏరియాలో గురువా రం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పర్యటించా రు. ఏపీఐఐసీ సేకరించిన 4500 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్క్ కోసం 2 వేల ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయినేజీలు, తదితర అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన భూముల్లో పరిహారం, ప్యాకేజీ చెల్లించిన భూములను ఏపీఐఐసీ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ఉన్న కొబ్బరి, జీడి, మామిడి తోటలను తొలగించారు. బల్క్‌డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏపీఐఐసీ వారే కల్పిస్తున్నారు. ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో సివిల్ పనులు జరుగుతున్నాయి. వీటిని ఆర్డీవో పరిశీలించారు. ఏయే గ్రామాల్లో ఎంత భూమిని ఏపీఐఐసీ స్వాధీ నం చేసుకుంది.. ఏయే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.. ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.. తదితర వివరాలను ఏపీఐఐసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
సింహాచలం ఈవోని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
సింహాచలం: చందనోత్సవం నాడు సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలైన ఘటనలో దేవస్థానం ఈవో కె.సుబ్బారావును సస్పెండ్ చేస్తూ రెవెన్యూ(విజిలెన్స్) డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఎలాంటి పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లరాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా దేవస్థానం ఈవోతో పాటు ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, జేఈ కె.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్‌ఆర్ స్వామి, ఏఈ పి.మదన్‌మోహన్‌లను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మిగతా ఆరుగురి సస్పెన్షన్ ఆర్డర్లు గురువారం సాయంత్రానికి వచ్చినట్లు చెబుతున్నా.. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
నకిలీ కరెన్సీ.. రైస్ పుల్లింగ్..
● జనాన్ని దోచుకుంటున్న ముఠా గుట్టు రట్టు ● ముగ్గురిని అరెస్టు చేసిన నర్సీపట్నం పోలీసులు నర్సీపట్నం: సీతారాముల కల్యాణ ఘట్టాన్ని ముద్రించిన మహిమ గల రాగి నాణెం.. రైస్ పుల్లింగ్ చేస్తుంది.. తెల్ల బియ్యంపై పెడితే నల్లరంగులోకి మారిపోతుంది.. అతి విలువైన, అరుదైన ఇరీడియం లోహంగా రూపాంతరం చెందుతుంది.. ఇది మీ వద్ద ఉంటే కుబేరులు కావడం ఖాయం.. అంటూ ఆశ పెడతారు. మాటలతో మాయ చేస్తారు. కనికట్టుతో కట్టి పడేస్తారు. ఇలా రైస్ పుల్లింగ్ కాయిన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను నర్సీపట్నం రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నర్సీపట్నం, గొలుగొండ ఎస్సైలు రాజారావు, రామారావు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. సీఐ రేవతమ్మ అందించిన వివరాలు.. నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట జంక్షన్ బుచ్చంపేట వెళ్లే మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సుజుకి సెలెరియో కారు వద్ద ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడిన ముగ్గురి నుంచి రూ.2.60 లక్షల కరెన్సీ నోట్లను, అమెజాన్ చిల్ట్రెన్ బ్యాంకు నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన రూ.10 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద నుంచి కారు, మూడు సెల్ఫోన్లు సీజ్ చేశారు. విజయనగరానికి చెందిన నిమ్మల మనోహర్, తమ్మినేని సుమంత్ కుమార్, నిమ్మల మన్మధ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. పరారైన నిందితులపై ఐదు కేసులు ఉన్నాయన్నారు. కాయిన్ల పేరుతో ఎవరైనా వస్తే పోలీసు ఎమర్జెన్సీ నంబర్ 1121001903కు సమాచారం అందించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. -
కష్టాలు చూడలేని కబోది ప్రభుత్వం
కళ్లకు గంతలతో కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది వినూత్న నిరసన అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్‌సీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకుండా పోయిందని ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి.శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని గురువారం వినూత్న నిరసన తెలియజేశారు. తమ కష్టాలు చూడలేని కబోది ప్రభుత్వమని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని కోరారు. కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బందికి ఆరేళ్లకే పర్మినెంట్ చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది భవాని, యమున, లక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన గ్రామాలకు పండగొచ్చింది..
వై ఆకారంలో వీబీపేట నుంచి కొండెంపూడి గొప్పూరు వెళ్లే రోడ్లు విభజన జరిగిన ప్రాంతంచీడికాడ: మండలంలోని శివారు పంచాయతీ వీరభద్రపేట పరిధిలో కొండెంపూడి, గొప్పూరు, ముడిచర్ల, జైపురం గిరి గ్రామాలు ఉన్నాయి. ఇవి వీరభద్రపేట నుంచి ఐదారు కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. ఆ గ్రామస్తులు ఏ చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా వీరభద్రపేట రావాలి. గ్రామస్తులు బయట ఊళ్లకు వెళితే కచ్చితంగా సాయంత్రంలోగా వెనుదిరగాలి. చీకటి పడితే సరైన రహదారి సౌకర్యం లేక రాత్రి వీరభద్రపేటలో గడిపి ఉదయాన్నే గ్రామాలకు వెళ్లాలి. ఇదీ వారి పరిస్థితి. రాత్రి సమయాల్లో విష పురుగులు కుట్టినా, ప్రమాదాలు సంభవించినా, గర్భిణులకు నొప్పులు ప్రారంభమైనా భగవంతునిపై భారం మోపి ఉదయం వరకు వేచి డోలీ మోతలతో తీసుకురావాల్సి ఉండేది. గతంలో కొందరు మృత్యువాత పడ్డారు. ఈ మొత్తం నాలుగు గ్రామాల్లో 250 మంది జనాభా ఉండడంతో గత ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయాలతో వీరిని పట్టించుకోలేదు. శివారు గ్రామాలకు మెరుగైన రహదారి ఉంటే విద్య, వైద్యం, మెరుగైన మౌలిక వసతులు అందించి ఆదుకోవచ్చన్న జగన్మోహన్రెడ్డి దార్శనికతతో ఇన్నాళ్లకు వారికి మంచి రోజులు వచ్చాయి. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చొరవ తీసుకోవడంతో వైఎస్ జగన్ సర్కారు దండిగా నిధులు మంజూరు చేసింది. నాడు వేసిన బీజం నేడు వారికి మంచి ఫలాలను అందించింది. తళతళలాడే తారు రోడ్లు ముచ్చటగొలిపేలా కనిపిస్తున్నాయి. రహదారి అందుబాటులోకి రావడంతో ఆ నాలుగు గిరిజన గ్రామాలలో గిరిజన సంపదతో పాటు వీరభద్రపేట గ్రామ రైతుల పంటలు చేర్చుకునే వెసులుబాటు కలిగింది. అందుబాటులోకి వచ్చిన వీరభద్రపేట–కొండెంపూడి–వీరభద్రపేట–గొప్పూరు తారురోడ్డు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి దార్శనికత ఫలితం నాలుగు శివారు గిరి గ్రామాలకు తీరిన రహదారి కష్టం మాజీ డిప్యూటీ సీఎం బూడి చొరవతో రూ.5.65 కోట్ల నాబార్డు నిధులు రోడ్లు అందుబాటులోకి రావడంతో గిరి ప్రజల ఆనందం డోలీ మోతలకు స్వస్తి నా చిన్నప్పటి నుంచి మాకు రోడ్డు ఉంటే బాగుండును అనుకునే వాళ్లం. ఎన్నికల సమయంలో మా గ్రామానికి ఓట్ల కోసం వచ్చే నాయకులకు మాకు రోడ్డు వెయ్యండని చెప్పేవాళ్లం. హామీ ఇచ్చి తర్వాత మరిచిపోయేవాళ్లు. మా తల రాత ఇంతేనని మేం అడగడం మానేశాం. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బాధని మా నాయకుల ద్వారా బూడి ముత్యాలనాయుడుకు చెప్పాం. రోడ్డు వేస్తానని చెప్పారు. మాట నిలబెట్టుకున్నారు. మేం ఎప్పటికీ జగనన్నకు రుణపడి ఉంటాం. మా గ్రామాల్లో డోలీ మోతల బాధలు తీరి మా వారి ప్రాణాలకు ఊతం దొరికింది. – బోళం రాము, వార్డు సభ్యుడు, కొండెంపూడి గ్రామం -
అనకాపల్లి రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
అనకాపల్లి: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్ర దాడి, భారత్–పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో పట్టణంలో రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రధాన జంక్షన్లు, జాతీయ రహదారులపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి సోదాలు నిర్వహించామని పట్టణ సీఐ టి.వి.విజయకుమార్ చెప్పారు. అనుమానిత వ్యక్తులు ఎక్కడైనా సంచరించినట్లయితే దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పట్టణ ఎస్ఐలు సత్యనారాయణ, అల్లు వెంకటేశ్వరరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సూర్యప్రకాష్ బాధ్యతలు
విశాఖ సిటీ: ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా టి.వి.సూర్యప్రకాష్ గురువారం సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 1986లో ఏపీఎస్ఈబీ కేటీపీఎస్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా చేరిన ఆయన పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తూ ఏపీఈపీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో 2021లో పదవీ విరమణ పొందారు. ఆయన తాజాగా ఈపీడీసీఎల్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు 24/7 3–ఫేజ్ విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సూర్యప్రకాష్‌ను సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, డైరెక్టర్లు డి.చంద్రం, టి.వనజ అభినందించారు. -
అక్షరంపై కక్షసాధింపా?
అనకాపల్లి: ఎలాంటి అనుమతులు, సమాచారం లేకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా ప్రవేశించి సోదాలు చేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తెస్తుండడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా అంతటా పాత్రికేయులు నిరసన ప్రదర్శనలు చేసి, అధికారులకు వినతి పత్రాలు అందించారు. ముందస్తు సమాచారం లేకుండా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలో పోలీసులు అక్రమంగా సోదాలు నిర్వహించడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే అనకాపల్లి అధ్యక్షుడు మళ్ల భాస్కరరావు అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో షేక్ ఆయిషాకు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్‌తో దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమాలు, అవినీతిని సాక్షి వెలుగులోకి తీసుకొస్తోందన్న అక్కసు, కక్షతో పోలీసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ చర్యలకు దిగినట్లు పాత్రికేయ సంఘాలు భావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలను నిలిపివేయాలన్నారు. యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి గణేష్, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.వెంకట అప్పారావు, పాత్రికేయులు కర్రి గంగాధర్, పెంటకోట సత్యనారాయణ, పి.వీరబాబు, బి.మధుసూదనరావు, వేగి రామచంద్రరావు, పి.సాయి తదితరులు పాల్గొన్నారు. సాక్షిపై ప్రభుత్వం కక్ష సాధింపు నర్సీపట్నం: సాక్షిపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు సిహెచ్బిఎల్ స్వామి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ చింతల పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు అక్రమంగా చొరబడి సోదాలకు పాల్పడటాన్ని నిరసిస్తూ పాత్రికేయులు ఆర్డీవో కార్యాలయం ఇన్చార్జి ఏవో కె.అశోక్‌కు వినతిపత్రం అంజేశారు. ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ లోవరాజు, పాత్రికేయులు అప్పారావు, నానాజీ, ఎ.డి.బాబు, పాండురంగారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కలం గొంతు నొక్కితే ఉద్యమిస్తాం సాక్షి ఎడిటర్ ఇంట్లో సోదాలపై జర్నలిస్టు సంఘాల నిరసన కూటమి సర్కార్ తీరును ఎండగట్టిన పాత్రికేయులు -
మున్సిపల్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం నోటీసు
యలమంచిలి రూరల్: యలమంచిలి మున్సిపల్ వైస్ చైర్మన్లు బెజవాడ గోవిందరాజు నాగేశ్వరరావు, అర్రెపు నాగ త్రినాథ ఈశ్వర గుప్తాలపై అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్‌కు గురువారం వార్డు కౌన్సిలర్లు నోటీసు ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బల పరీక్ష నిర్వహించాలని నోటీసులో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండడంతో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణకు నిర్దేశిత ప్రొఫార్మాలో పూరించిన ఫారాన్ని అందజేశారు. నోటీసుపై 17 మంది వార్డు కౌన్సిలర్ల సంతకాలు ఉన్నాయి. యలమంచిలి మున్సిపాలిటీలో మొత్తం 25 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా.. 23 మంది వైఎస్సార్సీపీ వార్డు సభ్యులు, టీడీపీకి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు కౌన్సిలర్లను ప్రలోభపెట్టిన కూటమి నాయకులు ఇటీవల కొద్దిరోజుల క్రితం మున్సిపల్ చైర్పర్సన్ పిళ్లా రమాకుమారిపై వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయేలా చేసిన సంగతి తెల్సిందే. తాజాగా వైఎస్సార్సీపీ తరఫున కొనసాగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్లపై వార్డు కౌన్సిలర్లు అవిశ్వాసం కోరుతూ నోటీసు ఇవ్వడం చర్చనీయాశంగా మారింది. ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. -
ఆర్టీసీ కాంప్లెక్స్‌లో విస్తృత తనిఖీలు
అల్లిపురం: పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఆర్టీసీ కాంప్లెక్స్, చావులమదుం, గొల్లలపాలెం ప్రాంతాల్లో టూటౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్ సిబ్బందితో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్, బస్సుల్లో ప్రయాణికులు బ్యాగులు, సూట్‌కేసులు తనిఖీ చేశారు. గంజాయి, అనుమానాస్పద వెపన్స్, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారేమో అని తనిఖీలు చేపట్టారు. అదే విధంగా టూటౌన్ ఎస్ఐలు సింహాచలం, మన్మథరావు తమ సిబ్బందితో కలిసి గొల్లలపాలెం, చావులమదుం జంక్షన్లలో వాహనాలు తనిఖీ చేశారు. -
హోంగార్డు కుటుంబానికి రూ.4.26 లక్షల సాయం
అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డు సేవలు అభినందనీయమని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు అర్లబు నారాయణ భార్య పార్వతమ్మకు హోంగార్డుల ఒక రోజు వేతనాన్ని గురువారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో తుహిన్ సిన్హా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సబ్ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో నారాయణ ఇటీవల మృతి చెందారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల ఒక రోజు వేతనం రూ.4,26,385 చెక్కును మృతుడి భార్యకు అందజేశారన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు మిగతా హోంగార్డులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలో ఏవో రామ్‌కుమార్, జూనియర్ అసిస్టెంట్ టి.రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
పూర్తిగా పట్టుకోల్పోయిన మావోయిస్టులు
రంపచోడవరం: సరెండర్లు, అరెస్టుల నేపథ్యంలో మావోయిస్టులు పూర్తిగా పట్టుకోల్పోయారని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. వై.రామవరం మండలం శేషరాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. శేషరాయి అటవీ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్తున్న పోలీసులను చూసిన 15 మంది మావోయిస్టులు కాల్పులు జరిపారన్నారు. దీంతో పోలీసు బలగాలు కూడా కాల్పులు జరిపిన క్రమంలో మావోయిస్టులు కాకూరి పండన్న అలియాస్ జగన్, రమేష్ మృతి చెందారన్నారు. పండన్నపై 400 వరకు కేసులు ఉన్నాయన్నారు. అతనిపై రూ.20 లక్షల నగదు రివార్డు ఉందన్నారు. మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు చెందిన రమేష్‌పై 30 క్రిమినల్ కేసులు నమోదు కాగా రూ.8 లక్షల నగదు రివార్డు ఉందన్నారు. సంఘటన స్థలంలో రెండు ఏకే 47, 303 రైఫిల్, నాలుగు మ్యాగ్జన్స్, ఏకే 47 మ్యాగ్జన్స్ 3, కిట్ బ్యాగ్‌ల్లో విప్లవ సాహిత్యం, రూ.98వేల నగదు, మందులు, ఆలివ్ గ్రీన్ యూనిఫాం లభ్యమయ్యాయన్నారు. ఛత్తీస్గడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ తరువాత ఏవోబీ సుమారు 30 మావోయిస్టులు జిల్లాలోకి వచ్చినట్టు సమాచారం ఉందన్నారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తమై గట్టి నిఘా, కూంబింగ్ చేపట్టిందన్నారు. మావోయిస్టు పార్టీలో కీలక నేతలు అరుణ, ఉదయ్ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్నారు. ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టుల సంఖ్య 13కు తగ్గిపోయిందన్నారు. ఆరు నెలలుగా గిరిజన గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. దీనిపై వారి నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. గిరిజన ప్రాంతం అభివృద్ధికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ఇప్పటికై నా మావోయిస్టులు, సానుభూతి పరులు లొంగిపోవాలని ఎస్పీ సూచించారు. ఎవరైఆన వారికి సహకరించినా, వారిని ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం కూంబింగ్ కొనసాగుతోందన్నారు. పోస్టుమార్టం అనంతరం ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. చత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు. ఈ సమావేశంలో చింతూరు ఏఎస్పీ పంకజ్‌కుమార్ మీనా, అడిషనల్ ఎస్పీ కె.ధీరజ్, రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ పాల్గొన్నారు. పండన్నపై 400, రమేష్‌పై 30 కేసులు ఇప్పటికై నా మిగతావారు, సానుభూతిపరులు లొంగిపోవాలి ఎస్పీ అమిత్‌బర్దర్ -
మోదకొండమ్మ తల్లికి వెండి కవచం, త్రిశూలం
మాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి పండగ వచ్చే నెల 3వ తేదీన జరగనున్న నేపథ్యంలో వెండి కవచం, వెండి త్రిశూలం చేయించారు. వాటిని గురువారం అమ్మవారికి అలంకరించారు. ఈ ఏడాది జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు తెలిపారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనాథు శ్రీనివాసరావు, సర్పంచ్ ఎడ్ల కళావతి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. వాడపల్లికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు డాబాగార్డెన్స్ : తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ప్రతి శనివారం ఉదయం 4 గంటలకు ద్వారకా బస్‌స్టేషన్ నుంచి బయలుదేరి వాడపల్లి చేరుకుంటుందని, భక్తుల ప్రదక్షిణలు, స్వామి దర్శనం అనంతరం సాయంత్రం 4 గంటలకు వాడపల్లిలో బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని చెప్పారు. ప్రయాణ చార్జీ(ఒక్కొక్కరికి) సూపర్ లగ్జరీ రూ.1000గా నిర్ణయించామని, టికెట్లు కావల్సిన వారు https://www.apsrtconline.in లో రిజర్వ్ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9959225602, 9052227083, 9959225594, 9100109731 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. -
కుట్టు శిక్షణలో అవినీతిపై దర్యాప్తు చేయాలి
అనకాపల్లి: బీసీ మహిళల కుట్టు శిక్షణలో రూ.245 కోట్లలో సుమారుగా రూ.167 కోట్లు అవినీతికి పాల్పడిన వ్యక్తులపై కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ఉద్దండం త్రినాథరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జేసీ జాహ్నవి గురువారం ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని, మిషన్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలన్నారు. మొత్తం బీసీ లబ్ధిదారులు లక్ష మందికి ఒక్కొక్కరికి రూ.23 వేలు చొప్పున ఖర్చు అవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక బీసీ లబ్ధిదారునికి కుట్టు మిషన్, శిక్షణకు అయ్యే మొత్తం ఖర్చు రూ.7,300 అవుతుంటే మొత్తం లక్ష మంది మహిళలకు రూ.73 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. అయితే ఈ శిక్షణలో జరిగిన రూ.167 కోట్ల అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు రింగ్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో త్రినాథరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి జెడ్పీటీసీ సేనాపతి సంధ్యారాము, పార్టీ యలమంచిలి బీసీసెల్ అధ్యక్షుడు బి.చల్లయ్య నాయుడు, పార్టీ సీనియర్ నాయకులు కర ణం వెంకటరమణ, యల్లపు గాంధీ, మొగలిపల్లి సుబ్బారావు, దాడి నారాయణరావు, జామి వెంకటరమణ, సింహాద్రి రమణ పాల్గొన్నారు. -
దట్టమైన అటవీ ప్రాంతం నుంచి కాలినడకన..
రంపచోడవరం: వై.రామవరం పోలీసుస్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులు పండన్న, రమేష్ మృతదేహాలను గురువారం సాయంత్రం స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య శేషరాయి అటవీ ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. సంఘటన స్థలం నుంచి వారి మృతదేహాలను తీసుకురావడానికి పోలీసులకు సుమారు 28 గంటల సమయం పట్టింది. మృతదేహాలను కర్రకు కట్టి దట్టమైన అటవీ ప్రాంతం నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేర కాలినడకన మోసుకువచ్చి శేషరాయి చేర్చారు. అక్కడి నుంచి అంబులెన్సులో వై.రామవరం మీదుగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. నేడు స్వగ్రామానికి పండన్న మృతదేహం..తీసుకువచ్చేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులు సీలేరు: వై.రామవరం పోలిస్‌స్టేషన్ పరిధి శేషరాయి అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు కాకూరి పండన్న మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామం కొమ్ములవాడ తీసుకురానున్నారు. ఈ మేరకు అతని తమ్ముడు అప్పన్న, మరదలు వరహాలమ్మ, అల్లుడు వెంకట్రావు, దుప్పులవాడ సర్పంచ్ కుమారి, మరో ఆరుగురు గురువారం ఆస్పత్రికి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను మోసుకువచ్చిన పోలీసు బలగాలు -
స్నేహితుడి ఇంట్లో చోరీ.. నిందితుడి అరెస్ట్
పెదగంట్యాడ: మండలంలోని దయాల్‌నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి చోరీ చేసిన నిందితుడు కాంబలి దిలీప్‌ను న్యూపోర్టు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని హార్బర్ క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు గురువారం న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దయాల్నగర్కు చెందిన బేర రాజు ఈ నెల 4న తన కుటుంబంతో కలిసి స్వగ్రామమైన పాడేరు మండలం సలుగు వెళ్లారు. రాజు కుటుంబం ఊరిలో లేని విషయాన్ని అతని స్నేహితుడైన కంచరపాలెం బర్మా క్యాంప్‌కు చెందిన దిలీప్ తెలుసుకున్నాడు. ఈ నెల 5న అర్ధరాత్రి సమయంలో రాజు ఇంటికి చొరబడి, బీరువాలో ఉంచిన బంగారు పుస్తెలతాడు, రెండు చెయిన్లు, ఒక గొలుసు, ఒక బ్రేస్లెట్, ఒక చిన్న ఉంగరం, ఒక లాకెట్‌తో పాటు రూ. 20 వేల నగదును దొంగిలించాడు. ఈ నెల 6న తిరిగి వచ్చిన రాజు ఇంట్లో వస్తువులు చిందరవందరగా ఉండటం, బీరువా తెరిచి ఉండటం చూసి చోరీ జరిగినట్లు గుర్తించి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం డీసీపీ పర్యవేక్షణలో క్రైం సీఐ జి. శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. గురువారం నిందితుడిని కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని సర్వీస్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ లక్ష్మణరావు మాట్లాడుతూ, నిందితుడు చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసయ్యాడని, జల్సాలకు అలవాటు పడ్డాడని తెలిపారు. నిందితుడిపై గతంలో అనకాపల్లి జిల్లా చీడికాడ, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పాడేరు పోలీస్ స్టేషన్లలో కూడా చోరీ కేసులు ఉన్నాయని వివరించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ అప్పలరాజు చెప్పారు. -
ప్రకృతి వ్యవసాయంతో ఎన్నో ప్రయోజనాలు
యలమంచిలి రూరల్: ప్రకతి వ్యవసాయంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని జిల్లా వ్యవసాయాధికారి వ్యవసాయాధికారి మోహన్‌రావు అన్నారు. మండలంలోని రామారాయుడుపాలెం, పోతురెడ్డిపాలెం, తురంగలపాలెం గ్రామాల్లో రబీ సీజన్లో సాగు చేస్తున్న వరి ఎన్‌ఎల్‌ఆర్ 3648 రకం పైరును గురువారం ఆయన పరిశీలించారు. ఈ రకం వరి వంగడాలు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటాయన్నారు. వరి దుబ్బులను పరిశీలించిన తర్వాత అధిక దిగుబడి పొందవచ్చన్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో రైతులకు ప్రకతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో మండలంలో సుమారు 2వేల ఎకరాల్లో ప్రకతి వ్యవసాయం ద్వారా వివిధ పంటలను సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రకతి వ్యవసాయం సాగు వల్ల రైతులకి, భూమికి, పర్యావరణానికి, ప్రధాన పంట వినియోగదారునికి కలిగే ప్రయోజనాలను ఏవో రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ రకాల విత్తనాలను వేయడం ద్వారా ఎకరాకు వచ్చే పంట దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవోలు పొలిమేర మోహన్‌రావు, సుమంత, సౌజన్య, శంకర్ గోవింద్, రైతు సేవా కేంద్రం సిబ్బంది, ప్రకతి వ్యవసాయం సిబ్బంది పాల్గొన్నారు. -
జ్యోతి వెడ్స్ రాఘవేంద్ర
● ఒక్కటవుతున్న అంధులు ● అనంతపురం అబ్బాయితో విశాఖ అమ్మాయికి వివాహం ● రేపు పెళ్లిరాట ● 11న ప్రేమసమాజం వేదికగా కల్యాణం రేపు పెళ్లి రాట ప్రేమ సమాజం ప్రాంగణంలో శనివారం పెళ్లి రాట కార్యక్రమం జరగనుండగా, శివజ్యోతిని పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేయనున్నారు. మే 11న రాత్రి 7.05 గంటలకు స్వాతి నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో రాఘవేంద్ర, శివజ్యోతిలు ఒక్కటి కానున్నారు. ఈ శుభ సందర్భానికి విచ్చేసిన అతిథులు, వధూవరుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ప్రేమ సమాజం వేదికగా జరుగుతున్న ఈ అపురూపమైన వేడుక అందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది. పేమ సమాజం ముంగిట పెళ్లి సందడి నెలకొంది. ప్రేమ సమాజం కంచర్ల అన్నపూర్ణాదేవి వేదికగా, ప్రేమ సమాజం ఆశ్రిత శివజ్యోతి, అనంతపురం జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన ఎనుముల గంగన్న, నారాయణమ్మల కనిష్ట పుత్రుడు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రల వివాహానికి సర్వం సిద్ధమైంది. వేద మంత్రాలు, పచ్చని తోరణాలు, బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ, దాతల దీవెనలతో ఈ వేడుక కన్నుల పండుగగా జరగనుంది. విందు భోజనాలతో ప్రేమ సమాజం కళకళలాడనుం డగా, పెద్దల ఆశీస్సులతో ఈ అంధుల జంట ఒక్కటి కానుంది. గత నెల 11న పెద్దలు ఈ పెళ్లి తంతుకు శ్రీకారం చుట్టారు. ఇరువురూ అంధులే కావడం విశేషం. చూపులేని యువకుడు, తనలాంటి తోడు కోసం ఎదురుచూసి, ఆ కలను నిజం చేసుకుంటున్న శుభ తరుణమిది. ఈ అరుదైన వివాహం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతు న్నాయి. వివరాల్లోకి వెళితే, జన్మతః అంధుడైన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసి, ప్రస్తుతం కోయింబత్తూర్ పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. రాఘవేంద్ర తల్లిదండ్రులది అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురం. వ్యవసాయ నేపథ్యం కలిగిన వారి కుటుంబంలో రాఘవేంద్ర తనలాంటి కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు, రాఘవేంద్ర సోదరుడు రమణ కొందరు అందించిన సమాచారం ద్వారా విశాఖలోని ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించారు. దీంతో ఈ వివాహానికి మార్గం సుగమమైంది. స్పందించే హృదయముంటే.. చూపుతో పనేముంది? కన్నులు లేకున్నా ప్రేమ వెలుగే జీవితానికి దారి చూపుతుందంటూ వివాహబంధంతో ఒకటవుతున్నారు ఆ జంట. కేంద్రప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్ర తనలాగే కంటి చూపులేని తన నెచ్చెలినే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడు. విధి వంచించినా.. ప్రేమ సమాజం పంచిన ప్రేమతో వెలిగింది శివజ్యోతి. ఇద్దరూ అక్షరాల ఆసరాగా ఎదిగారు. ఒకరికొకరు తోడుగా నిలవాలని కోరుకున్నారు. చీకటి కన్నుల్లో మెరిసిన ఆ వెలుగు రేఖలు భవిష్యత్తుకు బంగారు బాటలు చూపగా.. తమ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది ఆ జంట. ఈ నెల 11న వారి కల సాకారం కానుంది. ప్రేమబంధం ఏడు అడుగులతో పవిత్రబంధంగా మారనుంది. – డాబాగార్డెన్స్ ప్రేమసమాజమే తల్లిగా.. మరోవైపు, శివజ్యోతి పుట్టుకతోనే కంటి చూపును, తల్లిదండ్రులను కూడా కోల్పోయింది. నగరంలోని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సిఫార్సుతో ఆమెకు ప్రేమ సమాజం ఆశ్రయం కల్పించింది. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్, నగరంలోని విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. ఇరువురి అంగీకారంతో, ప్రేమ సమాజం వేదికగా గత నెలలో తాంబూలాలు మార్చుకున్నారు. ఈ నెల 11న వివాహ ముహూర్తం ఖరారైంది. ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ద శివాజీ, కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో శివజ్యోతి తరపున పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. -
ప్రతిభకు పురస్కారం
కశింకోట: పదో తరగతిలో 579 అత్యధిక మార్కులు సాధించిన స్థానిక బాలికల హైస్కూల్ విద్యార్థిని ఎం.గౌరి సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉండి చదువుకున్నవారిలో మేటిగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో టాప్ టెన్‌లో 8వ స్థానంలో నిలవడంతో విజయవాడలో ఆమెకు పురస్కారం అందజేశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టాప్ టెన్ విద్యార్థులకు అవార్డు మహోత్సవాన్ని నిర్వహించారు. గౌరికి పురస్కారం లభించడం పట్ల హెచ్ఎం ఎంఎస్ స్వర్ణకుమారి, స్కూలు నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు. -
పారిశ్రామికవేత్త అప్పగించిన భూమిలో ఆక్రమణలు
● చిన భీమవరంలో అధికార పార్టీ నేతల నిర్వాకం ● తహసీల్దార్‌కు ఫిర్యాదు.. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది బుచ్చెయ్యపేట: మండలంలోని చిన భీమవరం గ్రామంలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. గాజువాకకు చెందిన పారిశ్రామికవేత్త కడియాల రాజేశ్వరరావును నమ్మించి కొంతమంది ప్రభుత్వానికి చెందిన డీ పట్టా భూమిని వేరే సర్వే నంబర్లుతో జిరాయితీ భూమిగా కొనుగోలు చేయించారు. తరువాత అది ప్రభుత్వ భూమి అని తెలుసుకున్న రాజేశ్వరరావు తిరిగి ప్రభుత్వానికే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌ను కలిసి తన వద్ద ఉన్న భూ రికార్డులను అప్పగించారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. డీ పట్టా భూములను అమ్మడం నేరమని, పీవోటీ యాక్ట్ ప్రకారం రాజేశ్వరరావుకు అమ్మిన డీ పట్టాలను రద్దు చేశారు. దీంతో పక్కనే ఉన్న ఆర్ భీమవరానికి చెందిన కొంత మంది అధికార పార్టీ నేతలు.. రాజేశ్వరరావు ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో రాత్రికి రాత్రే పాకలు వేసి భూఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై గ్రామస్తులు తహసీల్దార్ లక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాలతో వీఆర్వో తులసీ, వీఆర్ఏలు మట్టా అప్పారావు, వెంకటేష్ ప్రభుత్వ భూమిలో పాకలు తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. -
తుపాకుల మోత
పచ్చని కొండల్లోరంపచోడవరం: అల్లూరి మన్యంలో పోలీసు తుపాకులు గర్జించాయి. పచ్చని కొండలు కాల్పులతో దద్దరిల్లాయి. వై రామవరం మండలం శేషరాయి వద్ద అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత కాకూరి పండన్న అలియాస్ జగన్ ఉన్నారు. ఏజెన్సీలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు జగన్ ఇటీవల పాతకోట, గుర్తేడు పరిసర ప్రాంతాల్లో పర్యటించి గిరిజనులతో మాట్లాడినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. మావోయిస్టు జగన్ స్పెషల్ జోనల్ కమిటీ మెంబరుగా, పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఇతనిపై రూ. 20 లక్షల పోలీసు రివార్డు ఉంది. మృతి చెందిన మరో మావోయిస్టు రమేష్ డీసీఎం క్యాడర్లో పనిచేస్తున్నారు. గాలిస్తున్న బలగాలు ఎదురు కాల్పుల్లో ఇద్దరితోపాటు మరికొందరు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్న పోలీసు బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. దండకారణ్యంలో మావోయిస్టులపై అణచివేత ఎక్కువ కావడంతో ఆంధ్రా ఒడిశా బోర్డర్ (ఏవోబీ)ను సేఫ్ జోన్‌గా భావించిన మావోయిస్టుల సంచారం అల్లూరి జిల్లా సరిహద్దులో ఎక్కువైంది. ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ పట్టు కోల్పోవడంతో తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు లోతట్టు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి గిరిజనులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే పోలీసులు గట్టి సమాచార వ్యవస్థతో వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం రాబట్టి అప్రమత్తమవుతూ కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. గిరిజన గ్రామాల్లో మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఎన్నో ఏళ్లుగా మారేడుమిల్లిలో నిర్వహిస్తున్న గుర్తేడు పోలీసుస్టేషన్‌ను గుర్తేడులో ఏర్పాటు చేసి అక్కడ నుంచి పోలీసులు తమ కార్యక్రమాలను విస్తృతం చేశారు. దీనిలో భాగంగా ఏవోబీ సరిహద్దు ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఎంతో కాలంగా పూర్తికాని కొన్ని కీలకమైన రోడ్లను పూర్తి చేసేందుకు పోలీస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనిలో భాగంగానే పాతకోట– మంగంపాడు, పోతవరం– వై రామవరం, బొడ్డగండి– డొంకరాయి తదితర రోడ్డు నిర్మాణాలను పూర్తి చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రశాంతంగా ఉన్న మన్యంలో ఎన్కౌంటర్ కలకలం ఇద్దరు మావోయిస్టుల మృతితో భయాందోళనలు అడవిని జల్లెడ పడుతున్న పోలీసు బలగాలు -
ప్రతి సచివాలయ పరిధిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తాం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొద్ది రోజుల్లో నగరంలోని అన్ని వార్డు సచివాలయాల పరిధిలో సివిల్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. అనుకోని రీతిలో ప్రమాదం వాటిల్లితే ప్రజలు ఎలా స్పందించాలో ముందు నుంచే అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. దానిలో భాగంగానే నగరంలో పలు చోట్ల సాధారణ సివిల్ మాక్ డ్రిల్స్‌తో పాటు బ్లాక్ అవుట్ మాక్ డ్రిల్స్ నిర్వహించినట్లు తెలిపారు. అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, ఎమర్జన్సి రెస్పాన్స్ టీమ్‌లు, ఎమర్జన్సి సహాయక వాహనాలు, తాత్కాలిక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, రక్షణ చర్యల్లో వినియోగించే అన్ని రకాల పరికరాలను ప్రదర్శనలో ఉంచామని వివరించారు. -
రెండో బిడ్డను చూడకుండానే అనంత లోకాలకు..
● ఎల్బీ పురం పామాయిల్ ఫ్యాక్టరీలో విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి ● పరిహారం కోసం మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన ● రూ.28 లక్షలు, ప్రతి నెలా జీతం చెల్లింపునకు యాజమాన్యం అంగీకారం బుచ్చెయ్యపేట: మండలంలోని ఎల్బీ పురం పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న కార్మికుడు పల్లా అప్పన్న(30) విద్యుదాఘాతంతో బుధవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. అప్పన్న ఎప్పటిలాగే బుధవారం తోటి కార్మికులతో కలిసి ఫ్యాక్టరీలో విధులకు వచ్చాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న తాటిచెట్టు కాయలను గొల్ల కత్తితో కోస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు కత్తి తగిలింది. పామాయిల్ గెలలు కోసే పొడవాటి ఇనుప కత్తి కావడంతో అప్పన్న విద్యుత్ షాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే ఆయన్ను వడ్డాది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి చోడవరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. దీంతో అప్పన్న మృతదేహాన్ని తిరిగి పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి యాజమాన్యం తమను ఆదుకోవాలంటూ అప్పన్న కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రాత్రి వరకు బాధిత కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీలోనే అప్పన్న మృతదేహంతో ఆందోళన చేశారు. రూ.25 లక్షల పరిహారం, మరో 30 ఏళ్ల పాటు మృతుడి కుటుంబానికి జీతం అందిస్తామని యాజమాన్యం తెలపగా.. బాధిత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఫ్యాక్టరీ యయజమాని విజయ్మిట్టల్ వచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయలు అందించాలని ఆందోళనకు దిగి నినాదాలు చేశారు. చివరకు రూ.28 లక్షలు పరిహారం, 30 ఏళ్ల పాటు ప్రతి నెలా కంపెనీ నుంచి జీతం చెల్లించేందుకు, ఇన్సూరెన్స్, ఇతర అలవెన్స్ వచ్చేలా చేస్తామని యాజమాన్యం అంగీకరించడంతో ఆందోళన విరమించారు. మృతుని భార్య 8వ నెల గర్భిణి మృతుడు భార్య రేవతి 8వ నెల గర్భిణి. వీరికి పెళ్లై రెండేళ్లు కాగా.. ఏడాదిన్నర బాబు ఉన్నాడు. మంగళవారం అప్పన్న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించాడు. కొద్ది రోజుల్లో భార్య రెండో బిడ్డకు జన్మనిస్తుందన్న సంతోషంలో ఉన్నాడు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. విద్యుత్ రూపంలో అప్పన్న మృతి చెందడంతో రేవతి కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు, తన బిడ్డలకు దిక్కెవరంటూ రోదించింది. మృతుని తండ్రి గతంలోనే మృతి చెందగా.. భార్య, తల్లి ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారు. చోడవరం సీఐ అప్పలరాజు, అదనపు ఎస్ఐ భాస్కరరావు వచ్చి యాజమాన్యం, బాధిత కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
అనకాపల్లి టౌన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనకాపల్లి మండలం, పట్టణంలో ఈ నెల 1న జరిగిన వరుస మూడు దొంగతనాలపై అందిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఆదేశాలతో ప్రత్యేక పోలీస్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐ రవికుమార్ నేతృత్యంలో టీమ్‌లు ఆధునిక సాంకేతికత సహాయంతో దొంగలను బుధవారం మారేడిపూడి జంక్షన్లో అదుపులోకి తీసుకున్నారన్నారు. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు(24), ఉప్పల సురేష్(30), కందివలస నరసింహారావు(39), జనార్దన్(30), కంకణాల సుభాష్(19) పాత కేసుల్లో జైలులో ఉన్నప్పుడు పరిచయాలు పెంచుకొని ఐదుగురు ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన వారని, ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తూ డబ్బు అవసరమైనప్పుడు దొంగతనాలకు పాల్పడుతుంటారని ఆమె వివరించారు. నిందితులను విచారించగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించినట్టు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి మూడు దొంగతనాలకు సంబంధించి తులం పావు బంగారం ఆభరణాలు, రూ.1.05 లక్షల నగదు, యాపిల్ ఐఫోన్, రెండు కేజీల వెండి వస్తువులు, ల్యాప్‌టాప్, కారు తాళాలు, పట్టుచీరల బ్యాగ్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. హైదరాబాద్‌కు సంబంధించిన పలు దొంగతనాలలో ఐదు గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోగా, రూ.1.30 లక్షలు జల్సాలకు విజయవాడలో ఖర్చు చేశారని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. -
శత్రుదుర్భేద్యంగా విశాఖ
● భారత్ వినియోగిస్తున్న అత్యాధునిక క్షిపణులన్నీ విశాఖలోనే తయారీ ● ఘాజీని డాల్ఫిన్ నోస్ సమీపంలో మట్టి కరిపించిన తూర్పు నౌకాదళం ● ఎన్ఏడీ, ఐఎన్ఎస్ వర్ష, డేగా బేస్‌ల వద్ద నిరంతర పహారా ● పాక్‌తో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో అప్రమత్తత సాక్షి, విశాఖపట్నం : భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య రోజు రోజుకూ యుద్ధ వాతావరణం భీకరంగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ని శాఖలకు అలెర్ట్ ప్రకటించింది. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ క్షణంలోనైనా.. అనే నినాదంతో భారత రక్షణ రంగం త్రివిధ దళాల్ని అప్రమత్తం చేసింది. అందుకే విశాఖలోనూ కేటగిరి–2 అలెర్ట్ ప్రకటించారు. భారత నౌకాదళంలో కీలక ప్రాంతంగా వ్యవహరించేలా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది. సముద్రజలాల పరిరక్షణ, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలు సాగించే కీలకమైన భద్రతకు అవసరమైన షిప్‌లు, జలాంతర్గాములు, సర్వే వెసెల్స్.. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో కేంద్రీకృతమయ్యాయి. తూర్పు తీరం వెంబడి 2,562 కి.మీల విస్తీర్ణంలో స్థావరాల్ని ఏర్పాటు చేస్తూ.. తీర పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తోంది. దేశంలోని అన్ని సాయుధ దళాల కమాండ్లలో భౌగోళిక పరంగా ‘ది లార్జెస్ట్ కమాండ్’గా విస్తరించి ఉంది. ఈఎన్సీలో ప్రస్తుతం 37,000 మంది సిబ్బంది ఉండగా.. ఇందులో 2,895 మంది అధికారులు, 21,085 మంది నావికులు, 3,695 డీఎస్సీ సిబ్బంది, 9,689 మంది రక్షణ పౌరులున్నారు. ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంటూ రక్షణ రంగంలో రారాజుగా మారింది. ఇప్పటికే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ(ఎన్ఎస్టీఎల్), నేవల్ ఆర్మ్డ్ డిపో(ఎన్ఏడీ)తో పాటు ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ డేగా.. ఇలా ప్రతి అంశంలోనూ విశాఖ నగరం కేంద్రంగా మారింది. శక్తివంతమైన క్షిపణులు ఇక్కడి నుంచే..! భారత నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన క్షిపణుల తయారీ కూడా విశాఖ నుంచే జరుగుతున్నాయి. డీఆర్డీవో నేతృత్వంలో పనిచేస్తున్న నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీస్(ఎన్ఎస్టీఎల్) ఆధ్వర్యంలో 50 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ని మట్టుబెట్టే వరుణారస్త్ర టార్పెడోకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అదేవిధంగా రెండు రోజుల క్రితం అరేబియా సముద్రంలో పాక్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రయోగించిన మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్(ఎంఐజీఎం) కూడా ఇక్కడే తయారైంది. దీంతో పాటు సబ్‌మైరెన్ లాంచ్డ్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్స్, ఎయిర్టూ ఎయిర్, యాంటీ ట్యాంక్, అండర్ వాటర్ వెహికల్స్, యాంటీ సబ్‌మైరెన్ వార్ఫేర్ ఇలా.. శత్రుదేశాన్ని గడగడలాడించే ఆయుధ సంపత్తి విశాఖలోనే రూపుదిద్దుకుంది. అందుకే వైజాగ్ అంటేనే పాక్‌కు భయం కలుగుతుంటుంది. 1971 విజయానికి నాంది వైజాగ్ భారత్ పాకిస్తాన్ మధ్య తక్కువ రోజుల్లో అతిపెద్ద యుద్ధం జరిగింది. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. ఇండియన్ నేవీ కరాచీ ఓడరేవుపై చేసిన దాడిలో పాక్‌కు చెందిన యుద్ధ నౌకలు ధ్వంసమయ్యాయి. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను విశాఖలో రంగంలోకి దించారు. విక్రాంత్‌తో పాటు తూర్పు నౌకాదళాన్ని నాశనం చేసేందుకు అత్యంత శక్తిమంతమైన ఘాజీ సబ్మైరెన్ని పాకిస్థాన్ పంపించగా.. విషయం తెలుసుకున్న భారత్.. ఐఎన్ఎస్ రాజ్‌పుత్ సబ్మైరెన్తో ఘాజీని విశాఖ తీరం సమీపంలోనే డాల్ఫిన్ నోస్ దగ్గరలో సాగరగర్భంలోనే కుప్పకూల్చారు. దీంతో పాక్ నావికాదళంలో 80 శాతం నష్టపోయి.. ఓటమిని అంగీకరించింది. ఈ వేదన పాక్‌ని ఇంకా తొలిచివేస్తోంది. అందుకే దగ్గరలో ఉన్న పశ్చిమ నౌకదాళాన్ని దాటి.. తూర్పు నౌకాదళాన్నే ప్రతిసారీ టార్గెట్ చేస్తూ ఓటమిపాలవుతుంటుంది. ఈసారీ పాక్ మళ్లీ అదే పని చేస్తే జలసమాధి కాకతప్పదు. ఇప్పటికే నగరంలో అప్రమత్తత ప్రకటించి మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈఎన్సీ నేవల్ బేస్‌తో పాటు ఎన్ఏడీ, ఐఎన్ఎస్ వర్ష, డేగా బేస్‌ల వద్ద నిరంతర పహారా మరింత పెంచారు.తిరుగులేని ఆయుధ సంపత్తి ప్రపంచ రక్షణ దళాల్లో కీలకంగా వ్యవహరించేలా తూర్పు నౌకాదళం ఆయుధ సంపత్తి విషయంలోనూ బలోపేతమవుతోంది. ఐఎన్ఎస్ ఢిల్లీ, ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ మైసూర్ యుద్ధ నౌకలు విశాఖ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 2037 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న మరో 20 నుంచి 25 యుద్ధ నౌకలు తూర్పు నౌకాదళ అమ్ముల పొదిలో చేరనున్నాయి. అదేవిధంగా మల్టీ–రోల్ 60ఆర్ 60ఆర్. అప్‌గ్రేడ్ చేసిన యాంటీ సబ్‌మైరెన్ కమోవ్ 28 హెలికాప్టర్లు, మీడియం లిఫ్ట్ ఇ–295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా విశాఖలో ఒక్కొక్కటిగా కేంద్రీకృతమవుతున్నాయి. వీటన్నింటితో రాబోయే రోజుల్లో విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం.. దేశ రక్షణ వ్యవస్థకు పెద్దన్నలా వ్యవహరిస్తోంది. -
విద్యార్థి దశ నుంచే ఉద్యమంలోకి...
సీలేరు: కాకూరి పండన్న అలియాస్ జగన్. అలియాస్ అండు.. అలియాస్ బీరును. అలియాస్ బీమ ఇన్ని పేర్లు కలిగిన వ్యక్తి మావోయిస్టు పార్టీలో కీలక నేత. పాఠశాలలో చదువుకుంటున్న తరుణంలో మావోయిస్టు పార్టీకి ఆకర్షితుడై ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. 30 ఏళ్ల నుంచి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగాడు. ఆయనది గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్ములవాడ. తల్లి పేరు సీతమ్మ. ముగ్గురు సంతానంలో పెద్ద కొడుకు సోమన్న ఇప్పటికే మృతి చెందగా రెండవ కొడుకు కాకూరి పండన్న అలియాస్ జగన్ ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉంటూ ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మూడో కొడుకు అప్పన్న ప్రస్తుతం స్వగ్రామం కొమ్ములువాడలో ఉంటున్నారు. తల్లి వేడుకున్నా.. ఏడాది క్రితం తల్లి సీతమ్మ మృతి చెందింది. ఆమెకు పోలీసులు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె ఎన్నోసార్లు కొడుకుని చూడాలని.. ఉద్యమాన్ని వీడి రావాలని వేడుకున్నా జగన్ రాలేదు. పోలీస్ శాఖ పలుమార్లు లొంగిపోవాలని, పునరావాసం కల్పిస్తామని ప్రకటన చేసినా ఆయన ఉద్యమం నుంచి బయటకు రాలేదు. ఆయన వయసు 65 సంవత్సరాలు పైబడి ఉంటుందని పోలీసులు గతంలోనే నిర్ధారించారు. ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాలపై గట్టి పట్టు ఉన్న పండన్న పలుమార్లు పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. 2021లో తీగల మెట్ట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పుల్లో అతను తప్పించుకున్నట్లు పోలీస్ రికార్డులో నమోదయింది. తల్లి మృతి చెందాక.. ఐదు నెలల క్రితం పండన్న తన అనుచరులతో స్వగ్రామమైన కొమ్ములవాడ గ్రామానికి వచ్చి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి భోజనం చేసి వెళ్లాడు. ఇది తెలుసుకున్న పోలీసులు చుట్టుముట్టినప్పటికీ వారి కంట పడకుండా తప్పించుకున్నాడు. అప్పట్నుంచి కాకూరి పండన్నను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈనేపథ్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో పండన్న ప్రాణాలు కోల్పోయాడు. -
రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులకు అవకాశం
తుమ్మపాల: రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులకు బుధవారం నుంచి అవకాశం కల్పించినట్టు, అవసరమైన వారు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోడ్ సహిత నూతన రేషన్ కార్డుల మంజూరు చేయడంతోపాటు రేషన్ కార్డుల్లో ఏడు సేవల కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. నూతన బియ్యం కార్డు జారీ, కుటుంబ సభ్యుని చేర్పు లేదా తొలగింపు, బియ్యం కార్డు సరెండర్, చిరునామా మార్పు, తప్పు ఆధార్ సంఖ్య సరిచేయుట వంటి సేవలు పొందవచ్చునని సూచించారు. -
అల్లూరికి ఘన నివాళి
తుమ్మపాల: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని కలెక్టర్ విజయ కృష్ణన్ కొనియాడారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి, అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతికి అల్లూరి చేసిన సేవలను కొనియాడారు. బ్రిటిష్ వారిపై ఆయన పోరాటం స్వాతంత్య్ర సమర వీరులకు స్ఫూర్తినిచ్చిందన్నారు. అల్లూరి చరిత్ర స్వాతంత్య్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. జాయింట్ కలెక్టర్ జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ఆర్.ఆర్.సి.సుబ్బలక్ష్మి, సీపీవో బి.రామారావు, డీఎల్డీవో మంజులవాణి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నాగశిరీష, ఇన్చార్జ్ ఏవో వాసునాయుడు, సెక్షన్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అల్లూరి సమాధి వద్ద.. గొలుగొండ: కృష్ణదేవిపేటలోని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సమాధి వద్ద పలువురు నివాళులర్పించారు. స్థానిక సర్పంచ్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాతతోపాటు స్థానికులు సమాధి వద్ద పూలమాలలుంచారు. కృష్ణదేవిపేటలో అల్లూరి విగ్రహానికి స్థానిక సీపీఐ నేతలు నివాళులర్పించారు. -
ఏలేరు కాలువలో పడి ఎలక్ట్రీషియన్ మృతి
కశింకోట: కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి ఏలేరు కాలువలో పడి ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. మండలంలోని బంగారయ్యపేటలో తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట వద్ద ఈ సంఘటన జరిగింది. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగారయ్యపేటకు చెందిన ఓయిబోయిన లక్ష్మణరావు (40) సమీపంలోని ఏలేరు కాలువ వద్దకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి మంగళవారం వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కాలువలో జారి పడి మునిగి గల్లంతయ్యాడు. బుధవారం రామన్నపాలెం వద్ద మృతదేహం బయటపడింది. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్ఐ కె.రమణమ్మ సందర్శించి, మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
● మోగిన సైరన్.. దూసుకెళ్లిన యుద్ధ విమానాలు ● బాంబుల మోతలతో జనం బెంబేలు ● రంగంలోకి విపత్తు నిర్వహణ దళాలు ● మాక్ డ్రిల్‌కు సహకరించిన ప్రజలు
సాక్షి, విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో బుధవారం సమర సన్నాహాక మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలో పలు చోట్ల యుద్ధం జరిగినప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతాయి? వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశాలను విశదీకరిస్తూ మాక్ డ్రిల్స్ చేపట్టారు. అనుకోని రీతిలో ఉగ్రదాడులు జరిగినా, బాంబులు పేలినా, అగ్ని ప్రమాదాలు వాటిల్లినా ఎలా వ్యవహరించాలనే అంశాలపై రక్షణ దళాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. ఈ మాక్ డ్రిల్‌లో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు ఎన్సీసీ, ఎన్డీఆర్ఎఫ్, తూర్పు నౌకాదళం, ఎయిర్‌ఫోర్స్, రైల్వే, విశాఖపట్నం పోర్టు, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ, సివిల్ సప్లయిస్, వైద్య శాఖ, పలువురు వలంటీర్లు భాగస్వామ్యమయ్యారు. -
విప్లవ జ్యోతి అల్లూరికి ఘన నివాళి
అనకాపల్లి: విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహన్‌రావు బుధవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన అల్లూరి బ్రిటిష్ సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడి, వారికి చైతన్యం కలిగించిన మహానుభావుడు అల్లూరి అని కొనియాడారు. 1924 మే 7న బ్రిటిష్ తుపాకులకు బలైపోయినా, ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మోహనరావు, సీఐలు లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, తమలంపూడి లక్ష్మి, రమేష్, గఫూర్, ఎస్ఐ ప్రసాద్, శిరీష, అంజిబాబు, విశ్వనాథం, మదీనా వల్లి, తదితరులు పాల్గొన్నారు. -
పశు వైద్యశాలల్లో ఉచిత గర్భధారణ ఇంజక్షన్లు
అనకాపల్లి: జిల్లాలోని పశు వైద్యశాలల్లో గర్భధారణ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి బి.రామ్మోహనరావు, డిప్యూటీ డైరెక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. గాంధీనగరంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో వారు జిల్లాలోని పశు వైద్యులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. లింగనిర్ధారణ వీర్యం పశువైద్యశాలల్లో అందుబాటులో ఉందని, 60 శాతం సబ్సిడీతో పాడి రైతులకు అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వేసవి కాలంలో పశువులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అధిక ఉష్ణోగ్రతల వల్ల వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలన్నారు. పశుసంవర్ధక శాఖ ఏడీ బి.సౌజన్య, పశువైద్యులు పాల్గొన్నారు. -
దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
అనకాపల్లి: ప్రధాని నరేంద్ర మోదీ పాలనకు వ్యతిరేకంగా ఈనెల 20న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఒక రోజు సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో బుధవారం సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని, కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేశారని తెలిపారు. నాలుగు లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకం వేతనదారులకు 200 రోజుల పాటు పనికల్పించి, రోజుకు రూ.600 చొప్పున కూలి చెల్లించాలని. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, భవన నిర్మాణ, ఆటో, ముఠా కార్మికులకు సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కె.లోకనాథం, రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కోశాధికారి వి.వి. శ్రీనివాసరావు, సీపీఎం మండల కార్యదర్శి గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
డీఆర్ఎం కార్యాలయం వద్ద..
వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ ఎంకే సాహూ నేతృత్వంతో సాయంత్రం వాల్తేరు డీఆర్ఎం కార్యాలయం వద్ద బ్లాక్ అవుట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. యుద్ధ సంక్షోభ సమయంలో రైల్వే సిబ్బంది ఎలా వ్యవహరించాలనే దానిపైనా వాల్తేర్ డివిజన్, సివిల్ డిఫెన్స్ బృంద సభ్యులు డ్రిల్ చేపట్టారు. ఎయిర్ రైడ్, పారాలాల్ రోప్ టెక్నిక్, పిక్ ఎ బ్యాగ్, క్యాజువాల్టీ లిఫ్ట్ టెక్నిక్.. ఇలా విభిన్న రకాల డ్రిల్స్ నిర్వహించి.. రైల్వే సిబ్బందితో పాటు ప్రయాణికులకు అవగాహన కల్పించారు. -
బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
నక్కపల్లి: జాతీయరహదారిపై చినదొడ్డిగల్లు సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరి గిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. మండపేటకు చెందిన నల్లబారిక శివ(25) చినదొడ్డిగల్లు వద్ద గల మా మిడి దుకాణాల వద్ద పనిచేస్తున్నాడు. ఉదయం రోడ్డు దాటుతుండగా నక్కపల్లినుంచి తునివైపు వెళ్తున్న మోటారు సైకిల్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన శివను తుని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ తీసుకువెళతుండగా మార్గమధ్యంలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
మహిళ మెడలో పుస్తెలతాడు అపహరణ
బుచ్చెయ్యపేట: మండల కేంద్రం బుచ్చెయ్యపేటకు చెందిన మహిళ మెడలో మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. గ్రామానికి చెందిన ఐయితరెడ్డి లక్ష్మి బుధవారం చెరుకు కాటా వద్ద గల తన పాన్‌షాపు వద్ద ఉండగా స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లక్ష్మి మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితురాలు బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుచ్చెయ్యపేట ఎస్ఐ సెలవులో ఉండటంతో రావికమతం ఎస్ఐ వర్మ, బుచ్చెయ్యపేట అదనపు ఎస్ఐ భాస్కరరావు కాటా దగ్గరలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను సేకరించి విచారణ చేస్తున్నారు. నంబర్ ప్లేటు లేని స్కూటీపై వచ్చిన వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
నక్కపల్లి: జాతీయ రహదారిపై వేంపాడు సమీపంలో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. కాకినాడ రూరల్ వలస పాకలు గ్రామానికి చెందిన అనుసూరి వెంకట అనిల్(26), పెంకే తేజ మోటారు సైకిల్‌పై విశాఖ వెళ్తుండగా వేంపాడు దాటాక డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో అనిల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను తుని ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. తేజ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు ఎంతో మేలు
చోడవరం: ప్రకృతి వ్యవసాయంతో నేల సారవంతంగా తయారవ్వడంతో పాటు రైతులకు మంచి పంట దిగుబడి వస్తుందని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లచ్చన్న తెలిపారు. మండలంలో చాకిపల్లి గ్రామంలో సర్పంచ్ ఏడువాక సత్యారావు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమౌతున్న సమయంలో రైతులకు ప్రకృతి వ్యవసాయం ద్వారా కలిగే ఉపయోగాలను ఈ సందర్భంగా వివరించారు. పంటకు కావలసిన సూక్ష్మ, స్థూల పోషకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. నవధాన్యాలు సాగుచేయడం వల్ల పశువులకు మంచిన పోషకాహారం కూడా లభిస్తుందన్నారు. నేల గుల్లబారి వానపాములు అభివృద్ధి చెందుతాయని, నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. తొలకరి వర్షాలకు ముందే ప్రకృతి వ్యవసాయం విధానంలో భూమిని సంరక్షిస్తే ఏడాదంతా పంటకు మేలు చేస్తుందని సూచించారు. మిశ్రమ పంటలు వేయడం వల్ల రైతులకు అదనపు ఆదాయం వస్తుందని, ప్రధానంగా రసాయన ఎరువుల వినియోగం పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీపై అపరాలు, నవధాన్యాల విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లూమ్ జిల్లా ఇన్చార్జి గోవిందరావు, ఎన్ఎఫ్ఏ నాగమణి, నాయుడుబాబు, కాండ్రేగుల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
ఏయూలో విద్యార్థులకు చోటేదీ..?
● పోటీ పరీక్షార్థులకు మొండిచేయి ● వసతి కోసం వేడుకున్నా పట్టని అధికారులు విశాఖ విద్య: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో వసతి కావాలని కోరినా.. యూనివర్సిటీ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను కలిసేందుకు వెళ్లిన విద్యార్థులను అనుమతించకపోవటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైస్ ఛాన్సలర్ చాంబర్ వద్దే విద్యార్థులు పడిగాపులు కాశారు. డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు ఏటా వేసవి సెలవుల్లో యూనివర్సిటీలో వసతి కల్పించేవారు. కానీ ఈ సంవత్సరం వర్సిటీ వసతి గృహాలకు జీవీఎంసీ తాగునీరు రావటం లేదనే కారణంతో విద్యార్థులకు అవకాశం కల్పించకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వర్సిటీ విద్యార్థులకు వసతి కల్పిస్తామని హామీ ఇచ్చి కూడా వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాళ్లు, చీఫ్ వార్డెనన్లు చుట్టూ తిప్పించుకొని చివరకు నిరాశ మిగిల్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎకరా స్థలం లీజు ఏడాదికి వెయ్యి రూపాయలేనట
● టీడీపీ కార్యాలయం పట్ల కలెక్టర్ ఔదార్యం ● నిబంధనలకు విరుద్ధంగా భూమి కేటాయింపుపై సీపీఎం ధ్వజం అనకాపల్లి టౌన్: పేదల స్థలాలను కాపాడాల్సిన జిల్లా కలెక్టరే రాజకీయ పార్టీలకు వత్తాసు పలకడం ఏమిటని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం ప్రశ్నించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ప్రయోజనాలకు, సంక్షేమానికి కృషి చేయాల్సిన జిల్లా అధికారి టీడీపీకి స్వామి భక్తి చాటుకోవడం సిగ్గు చేటని అన్నారు. జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయానికి విలువైన కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఎకరా ఏడాదికి వెయ్యి రూపాయలకే లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గంటా శ్రీరామ్, జిల్లా కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. కోర్టుకు స్థలం లేదు కానీ అధికార పార్టీకి కేటాయింపా? జిల్లా కేంద్రంలో ఏళ్ల తరబడి వివిధ న్యాయస్ధానాలు ఓ ప్రెవేట్ భవనంలో నడుస్తున్నా, పట్టించుకోని కూటమి పాలకులు తెలుగుదేశం పార్టీకి మాత్రం రెండెకరాల భూమి కేటాయించుకోవడం తగదని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.ఎస్.అజయ్‌కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. అనకాపల్లి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత కళాశాల కోసం కట్టిన ప్రైవేట్ భవనాన్ని న్యాయస్థానాలకు అద్దెకు ఇచ్చారని, ఆ ఇరుకు గదుల్లోనే కోర్టులను నిర్వహిస్తున్నారన్నారు. స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌కు అనేకసార్లు లేఖలు రాసి, వినతిపత్రాలను ఇచ్చామని, స్థలాలు దొరకడం లేదని చెపుతూ వచ్చిన అధికారులు తెలుగుదేశం పార్టీ అడిగిన వెంటనే మంత్రివర్గంతో సంబంధం లేకుండా రూ. రెండు కోట్ల నుంచి మూడు కోట్ల విలువైన రెండు ఎకరాల స్థలాన్ని ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల అద్దెతో 33 సంవత్సరాలకు భూమిని అప్పగించారన్నారు. -
కలెక్టర్ విజయకృష్ణన్
పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ పనులు వేగవంతం కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మునగపాక కృష్ణంరాజు కాలువపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను ఆమె మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షాకాలం లోగా బ్రిడ్జి పనులు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారి విస్తరణలో భూములు, గృహాలు కోల్పోయే నిర్వాసితులకు ప్రభుత్వం మెరుగైన పరిహారం అందిస్తుందన్నారు. తహసీల్దార్ ఆదిమహేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. -
దాహమో రామచంద్రా..
● అడుగడుగునా రాజకీయం.. దుర్భర ‘జల జీవనం’ ● కుళాయి కనెక్షన్ల ఏర్పాటులో రాజకీయ వివక్ష ● ప్రభుత్వం మారాక పలుచోట్ల పడకేసినపైపులైన్ పనులు ● కొన్నిచోట్ల పనులు పూర్తయినా డబ్బులిస్తేనే ఇంటికి కనెక్షన్లు ఊరూరాదాహం.. దాహం.. సాక్షి, అనకాపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నీటి కుళాయిల ఏర్పాటే లక్ష్యంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. కూటమి నేతలు తాగునీటిని కూడా రాజకీయం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన పనులను రద్దు చేసి, కూటమి ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వాటికే మళ్లీ కొత్త అనుమతులు ఇస్తున్న పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఇలా సుమారు 448 పనులను రద్దు చేశారు. కుళాయి కనెక్షన్ పూర్తయినా, సగం పనులు జరిగి ఆగిపోయినా అలాంటి వాటికి మామూళ్లు ఇస్తేనే కొనసాగిస్తున్నట్లు పలువురు బాధితులు వాపోతున్నారు. జల్ జీవన్ మిషన్ అమలుపై ‘సాక్షి జరిపిన గ్రౌండ్ రిపోర్ట్‌లో అనేక విషయాలు వెలుగు చూశాయి. పాత పనులకు మంగళం గత ప్రభుత్వ హయాంలో మంజూరై ప్రారంభం కాని కనెక్షన్లలో దాదాపు సగానికి పైగా రద్దు చేశారు. కొత్తగా కొన్నింటిని చేర్చారు. వాటికి నిధులు ఇంకా మంజూరు కాలేదు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతంలో ప్రతీ ఇంటికీ కుళాయి ఇవ్వాలనేదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. కానీ కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తే ఆ ఆశయం నెరవేరేలా లేదు. ఈ వేసవిలో కశింకోట, అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, యలమంచిలి, నక్కపల్లి మండలం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ● మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ, కె.కోటపాడు మండలాల్లో 316 గ్రామాల్లో జల్‌జీవన్ మిషన్‌లో రూ.171 కోట్లతో 68,385 కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో 44,464 పూర్తయ్యాయి. ఆనందపురం నుంచి కె.కోటపాడు వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్లకు మాత్రం నేటికి కుళాయిల ఏర్పాటు లేదు. అసలే వేసవికాలం కావడంతో చేతిబోర్ల వెంట నీరు అంతంత మాత్రంగానే వస్తుందని ఆయా ప్రాంతాల్లో గల మహిళలు తెలిపారు. ● అనకాపల్లి రూరల్ పరిధిలో 3 వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో సగానికిపైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక కొన్ని పనులను రద్దు చేశారు. కొత్తగా మరికొన్ని మంజూరు చేసినా బిల్లు ఇప్పటి వరకూ రాలేదు. ● నర్సీపట్నం రూరల్, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం మండల పరిధిలో తాగునీటి సరఫరా అంతంత మాత్రంగా ఉంది. జల్‌జీవన్ మిషన్‌లో భాగంగా సుమారు 40 వేలకు పైగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. వీటిలో 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. మరికొన్ని అసలు ప్రారంభం కాలేదు. ● యలమంచిలి నియోజకవర్గంలో సుమారు 20 వేలకు పైగా కుళాయి కనెక్షన్లు మంజూరయ్యాయి. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం కావడంతో 10 వేలకుపైగా కుళాయిలు మంజూరయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో సగానికిపైగా పూర్తయ్యాయి. కానీ పారిశ్రామిక ప్రాంతంలో గత ప్రభుత్వంలో మంజూరైన పనుల్లో కొన్ని రద్దు చేసి మరికొన్ని కొత్తగా చేర్చారు.వీటికి నిధులు మంజూరు కాలేదు. ఈ ప్రాంతమంతా కలుషితం కావడంతో ఈ ప్రాంతంలో వాటర్ సమస్య ఎక్కువగా ఉంది. స్థానికంగా ఈ రెండు మండలాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా వెంటాడుతుంది. ● చోడవరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రూ.137 కోట్లతో 69 వేల ఇళ్లకు ఇంటింటికీ కుళాయిలు మంజూరు చేశారు. వీటిలో సుమారు 10 వేల కనెక్షన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. చోడవరం టౌన్లో 5,941 ఇంటింటి కుళాయిలు ఇచ్చారు. కందర్పకాలనీ, అన్నవరం ప్రాంతాల్లో ఇంకా 400 ఇళ్లకు ఇంటింటి కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ వాటిని ఏర్పాటు చేయలేదు. దీనితో ఆయా ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉంది. ఏదో అడపాదడపా వీధి కుళాయిల ద్వారా నీరు ఇస్తున్నప్పటికీ ఒక్కొక్క ఇంటికి రెండు బిందెలు నీరు కూడా రావడం లేదు. పూర్తయినవి–రద్దు చేసినవి జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలుకు కూటమి నేతల గ్రహణం -
మెరిసిన రావికమతం దివ్యాంగ విద్యార్థి
రావికమతం: విజయవాడలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి స్పెషల్ ఒలింపిక్ భారత్–2025 క్రీడా పోటీల్లో రావికమతం మండలం కొమిర గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగ విద్యార్థి అప్పికొండ గణేష్ సత్తా చాటాడు. వాలీబాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్ర సమగ్ర శిక్ష సహిత విద్యా కన్సల్టెంట్ డాక్టర్ వై.నరసింహం, హీల్ ప్యారడైజ్ స్కూల్ డైరెక్టర్ అజయ్, స్పెషల్ ఒలింపిక్ భారత కమిటీ జాతీయ స్థాయి క్రీడా నిపుణుడు రాజశేఖర్ చేతుల మీదుగా గణేష్ ప్రశంసా పత్రం, బంగారు పతకం అందుకున్నాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో జూన్‌లో జరిగే జాతీయ స్థాయి దివ్యాంగుల యూనిఫైడ్ వాలీబాల్ స్పెషల్ ఒలింపిక్ భారత క్రీడా పోటీల్లో గణేష్ తలపడనున్నాడు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన మేడివాడ హైస్కూల్ ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మీనాయుడు, జగన్నాథనాయుడును జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు, మండల విద్యా శాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
నేడు ఆపరేషన్ అభ్యాస్
● సివిల్ మాక్ డ్రిల్‌కు సర్వం సిద్ధం ● అత్యవసర సమయాల్లో పౌరుల స్పందనపై అవగాహన విశాఖ సిటీ: ప్రశాంత విశాఖ యుద్ధ క్షేత్రంగా మారనుంది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్ మోత మోగనుంది. శత్రు దేశ యుద్ధ విమానాలు.. క్షిపణులు.. డ్రోన్లు దూసుకొస్తున్న వేళ.. పౌరుల ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై మాక్ డ్రిల్ జరగనుంది. రక్షణ దళాలు, పోలీసులు, ఫైర్, రెవెన్యూ, వైద్య, ఇతర శాఖల అధికారులు.. సంక్షోభ సమయాల్లో పౌరుల ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా అనుసరించాల్సిన విధానాలను వివరించనున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి తరువాత భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్ర హోం శాఖ ముందస్తు చర్యలకు సిద్ధమైంది. సంక్షోభ సమయంలో పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, పౌరులు తమ ప్రాణా లు ఎలా కాపాడుకోవాలన్న విషయంపై ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరుతో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బుధవారం వన్‌టౌన్ ప్రాంతం, సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ వద్ద ఈ డ్రిల్ నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్వీన్మెరీ పాఠశాల, ఆక్సిజన్ టవర్స్ వద్ద డ్రిల్ దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను కేంద్ర హోం శాఖ మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో విశాఖ కేటగిరీ–2లో ఉంది. యుద్ధమే అనివార్యమైతే విశాఖను కూడా పాకిస్తాన్ టార్గెట్‌గా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సాయంత్రం 4 గంటలకు వన్‌టౌన్ ప్రాంతంలో ఉన్న క్వీన్మెరీస్ పాఠశాల వద్ద, రాత్రి 7.15 గంటలకు ఆక్సిజన్ టవర్స్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనుంది. ఆ సమయంలో నగరంలో సైరన్ మోత మోగుతుంది. వెంటనే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, ఇతర స్థానిక అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటా రు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కలిగిస్తారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి, సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించే ప్రక్రియను చేపట్టనున్నారు. సైరన్ మోగినప్పుడు పౌరులు ఎలా స్పందించాలి? విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు (బ్లాక్ అవుట్) తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స కోసం ఇళ్లలో ఉంచుకోవాల్సిన అత్యవసర వస్తువులు, మందులపై ప్రజలకు వివరించనున్నారు. నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో... అలాగే నేవీ, సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పాత పోస్టాఫీస్ వద్ద గల ఎస్బీఐ, కేజీహెచ్ వద్ద గల ఏఎంసీ మహిళా హాస్టల్, దొండపర్తి వద్ద గల డీఆర్ఎం ఆఫీస్, వన్‌టౌన్‌లోని రోజ్ హిల్స్, ఏయూ అవుట్ గేట్ వద్ద ఉన్న జేవీడీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఏయూ నార్త్ క్యాంపస్ వద్ద ఉదయం 10 గంటలకు ఎన్సీసీ, ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టనున్నారు. మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించాలి మహారాణిపేట: మాక్ డ్రిల్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో మాక్ డ్రిల్ సన్నద్ధతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాక్ డ్రిల్ విధివిధానాలపై వారికి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. యుద్ధం జరిగితే తమను తాము ఎలా రక్షించుకోవాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. -
సింహాచలంలో సమన్వయలోపం?
ఆర్జిత సేవల రద్దుపై భక్తురాలి ఆగ్రహం సింహాచలం: వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం ఆర్జిత సేవలను రద్దు చేయడంపై ఓ భక్తురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో శ్రీవైష్ణవ శ్రీరామనవమి వేడుకలను నిర్వహించినందున ఆలయ వర్గాలు మంగళవారం ఆర్జిత సేవలను నిలిపివేశాయి. ఈ విషయాన్ని భక్తులకు ముందుగా తెలియజేయడంలో ఆలయ యంత్రాంగం విఫలమైంది. సోమవారం సాయంత్రం సింహగిరిపై ఉన్న పీఆర్వో కార్యాలయానికి ఓ భక్తురాలు ఫోన్ చేసి గరుడ సేవపై వాకబు చేశారు. సిబ్బంది సేవలు ఉంటాయని సమాధానమిచ్చారు. దీంతో ఉదయం దూర ప్రాంతం నుంచి సింహగిరికి చేరుకున్న ఆమె ఆర్జిత సేవలు గురించి ఆరా తీయగా, ఈ రోజు జరగడం లేదని సిబ్బంది తెలిపారు. దీంతో వాగ్వాదానికి దిగారు. చివరకు చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు. ఆలయ వర్గాలకు, పీఆర్వో కార్యాలయానికి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆర్జిత సేవల రద్దుపై ఆలయ అధికారులు పీఆర్వో కార్యాలయానికి స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. -
టీడీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు
● ఎమ్మెల్యే, బత్తుల మధ్య వర్గపోరు ● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల రాకతో డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే ● ఎమ్మెల్యే రాక కోసం ఎదురు చూసిన అధికారులు ● సమావేశం ఆలస్యంపై ఎంపీడీవోనునిలదీసిన సభ్యులు బుచ్చెయ్యపేట: చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మధ్యన వర్గ పోరు తార స్థాయికి చేరింది. నెల రోజుల కిందట ఎమ్మెల్యే రాజు బుచ్చెయ్యపేటలో మండల టీడీపీ కార్యకర్తల విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. స్ధానికంగా ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తాతయ్యబాబుకు సమాచారం ఇవ్వకపోగా కటౌటులో తాతయ్యబాబు ఫొటో వేయలేదు. దీనిపై తాతయ్యబాబుతో పాటు అతని వర్గీయులు మేడివాడ రమణ, తలారి శంకర్,సయ్యపురెడ్డి మాధవరావు ఎమ్మెల్యేపై ఆగ్రహం చెందారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగే సర్వసభ్య సమావేశానికి వస్తున్నానని ఎమ్మెల్యే రాజు ముందుగానే అధికారులకు, నాయకులకు సమాచారం అందించారు. అప్పటికే రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు మండల సమావేశానికి విచ్చేశారు. ఎమ్మెల్యే రాజు అనుచరులు తాతయ్యబాబు మండల సమావేశానికి వచ్చినట్టు సమాచారం అందించారు. పదిన్నరకు ప్రారంభం కావాల్సిన మండల సమావేశం మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా ఎమ్మెల్యే రాకపోవడంతో సభ ప్రారంభం కాలేదు. దీంతో పలు గ్రామాల నుంచి వచ్చిన సభ్యులు అసలు సమావేశం ఉందా లేదా అంటూ ఎంపీడీవో విజయలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఎంపీడీవో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు గౌరవ అధ్యక్షుడిగా మండల సమావేశాన్ని నడిపించారు. టీడీపీలో గ్రూపు రాజకీయాల వల్ల ఎవరి వైపు వెళ్లాలో తెలియడం లేదంటూ సమావేశానికి వచ్చిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గుసగుసలాడుకున్నారు. -
దర్యాప్తులో ఫోరెన్సిక్ ఆధారాలు కీలకం
అనకాపల్లి: నేరాల దర్యాప్తులో ఆధునిక శాసీ్త్రయ విధానాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. స్థానిక గాంధీనగరం ఎస్ఆర్ శంకరన్ హాల్లో మంగళవారం పోలీసు, వైద్యులు, న్యాయవాదులతో నేరచరిత్రపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నేరస్థలాల్లో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, నిర్వహణ, ’చైన్ ఆఫ్ కస్టడీ’ పాటించాల్సిన విధానాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బాధితులకు న్యాయం జరగాలంటే దర్యాప్తు అధికారులు, ఫోరెన్సిక్, వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పరస్పర సహకారంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరెన్సిక్ ఎవిడెన్న్స్ మేనేజిమెంట్ శిక్షణ ద్వారా నిందితులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో నార్కోటిక్స్, మత్తు పదార్థాలు, విషపదార్థాలు (టాక్సికాలజీ), డిజిటల్ ఆధారాలు, సైబర్ నేరాల పరికరాలు, ఆడియో–వీడియో ఫుటేజ్, డీఎన్ఏ, రక్త నమూనాలు, మానవ అవయవాలు వంటి ఆధారాల సేకరణ, ప్యాకింగ్, భద్రపరచే విధానంపై దృష్టి సారించి, సంబంధిత ఆధారాలతో సకాలంలో కోర్టుకు ఇవ్వడం వల్ల నిందితులకు శిక్ష పడుతుందన్నారు. అంతకుముందు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్.ఎఫ్.ఎస్.ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.నాగరాజు, శాసీ్త్రయ సహాయకులు ఎం.రాంబాబు, పి.వి.ఎస్.బి.చలపతి, ఇ.కిరణ్ కుమార్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, వి.విష్ణు స్వరూప్, ఫోరెన్సిక్ వైద్యులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు లక్ష్మణ్ మూర్తి, బాల సూర్యారావు, లక్ష్మి, విజయ, ఎస్ఐలు ప్రసాద్, రమణయ్య, సురేష్ బాబు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతానికి మహిళా రైతు బలి
కశింకోట: మండలంలోని ఏఎస్ పేట శివారు గొబ్బూరుపాలెంలో మంగళవారం ఓ మహిళా రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సీఐ స్వామినాయుడు వివరాల ప్రకారం.. జెట్టపురెడ్డితునికి చెందిన చవితిన చెల్లయమ్మ (54) గొబ్బూరుపాలెం వద్ద తన చెరకు తోటకు నీరు పెట్టడానికి వెళ్లి వ్యవసాయ విద్యుత్ మోటారు స్విచ్చాన్ చేసింది. ఆ సమయంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. కుమారుడు రమణబాబు ఇచ్చిన ఫిర్యా దు మేరకు ఎస్ఐ కె.రమణమ్మ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చెల్లయమ్మ (ఫైలు) -
కుట్టు శిక్షణ పేరుతో కుంభకోణం
● బీసీ మహిళల సంక్షేమానికంటూరూ.257 కోట్లు స్వాహా చేసేందుకు కుట్ర ● కుట్టు మిషన్ విలువ మూడింతలు పెంచిన కూటమి నేతలు ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత అనకాపల్లి: బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట కూటమి ప్రభుత్వం రూ.257 కోట్ల అవినీతికి పాల్పడిందని వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత విమర్శించారు. రూ.7,300లు విలువైన కుట్టు మిషన్‌కు రూ.23 వేలు ఖర్చు చూపించడం దారుణమని ఆమె అన్నారు. ఈ దోపిడీని ఆపాలని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో వై.సత్యనారాయణరావుకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం రింగ్‌రోడ్డులోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. లక్షమంది బీసీ మహిళలకు రూ.73 కోట్లు ఖర్చవుతుంటే, చంద్రబాబునాయుడు ప్రభుత్వం రూ.257 కోట్లు చూపించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మిగిలిన సొమ్మును పక్కదారి పట్టించారన్నారు. నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ పథకాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పాలన సాగిస్తే, నేటి కూటమి పాలనలో అవినీతి పెరిగిపోయిందన్నారు. పెద్ద కంపెనీలకు టెండర్ ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఎల్2, ఎల్3 కంపెనీలకు టెండర్ కట్టబెట్టి కోట్లాది రూపాయలు దోచుకుంటోందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, మహిళలకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం నాయకులు నీటిపల్లి లక్ష్మి, నదియా, మరిపల్లి శోభ, ఎన్ఎస్.లక్ష్మి, ఎం. విజయలక్ష్మి, కశింకోట మండలపార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తగరంపూడి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
40 కిలోల గంజాయి స్వాధీనం
● పట్టుబడిన నలుగురు నిందితులు ● వారిలో ఒక మహిళ కోటవురట్ల: ఉన్నతాధికారుల ఆదేశాలతో వాహన తనిఖీ నిర్వహించిన పోలీసులకు 40 కిలోల గంజాయి పట్టుబడింది. నక్కపల్లి సర్కిల్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాలివి... మంగళవారం యండపల్లి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కారులో గంజాయిని తరలిస్తూ నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారిలో ఓ యువతి కూడా ఉంది. గంజాయిని, కారును సీజ్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షెహన్వాజ్, షహదాబ్, రుక్సానా కలిసి చింతపల్లి మండలం రేగళ్లు గ్రామానికి చెందిన రాజుబాబు సహకారంతో 40 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు. దాన్ని ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకు ప్రణాళిక చేశారు. ఇందులో భాగంగా కారులో చింతపల్లి నుంచి కోటవురట్ల మీదుగా అడ్డురోడ్డుకు వెళ్లి అక్కడి నుంచి తుని మీదుగా ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేశారు. అక్కడ గంజాయిని విక్రయించి సొమ్ము చేసుకునేందుకు ప్రణాళిక చేశారు. పోలీసుల తనిఖీలో గంజాయితోపాటు నలుగురూ పట్టుబడ్డారు. వీరిలో ఎ –1 ముద్దాయి షెహన్వాజ్ గతంలో నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో 74/21 కేసులో ఎ–3 ముద్దాయిగా ఉన్నట్టు సీఐ తెలిపారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఎస్ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
నక్కపల్లిలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ కోర్టు
● వైఎస్సార్సీపీ హయాంలోనే రూ.1.60 కోట్లతో నిర్మాణం ● ప్రారంభించిన హోంమంత్రి అనిత ● నక్కపల్లికి అంతర్జాతీయ గుర్తింపునకు కృషి నక్కపల్లి: బీఎస్ హాకీ క్లబ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గత వైఎస్సార్సీపీ హయాంలో మంజూరైన రూ.1.60 కోట్లతో నక్కపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించిన ఆస్ట్రోటర్ఫ్ మినీ హాకీ కోర్టును మంగళవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి కోర్టు మన జిల్లాలో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సూరిబాబు అనే ఉద్యోగి నక్కపల్లిలో హాకీ క్లబ్‌ను ఏర్పాటు చేసి వందలాది మందికి శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తర్ఫీదు నివ్వడం, ఈ ప్రాంతానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఉద్యోగాల్లోను, స్పోర్ట్స్ స్కూళ్లలోనూ ప్రవేశాలు పొందారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్, కోచ్ రాంబాబు, ఏరియా ఆస్పత్రికి అభివృద్ధి కమిటీ సభ్యుడు కే వెంకటేష్, సర్పంచ్ రత్నకుమారి, బీఎస్ హాకీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, తాతాజీ, నాయకులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలతో ఆగిన ప్రారంభోత్సవం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ హాకీ క్రీడా మైదానాన్ని సందర్శించిన అప్పటి కలెక్టర్ రవి పట్టన్‌శెట్టికి క్రీడాకారులు తమ సమస్యలను విన్నవించారు. ప్రాక్టీసు కోసం పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఆధునిక సదుపాయాలతో కూడిన కోర్టు నిర్మించాలని కోరారు. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సైతం ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, స్పోర్ట్స్ సెస్ నిధులు నుంచి ఆస్ట్రోటర్ఫ్ కోర్టుకు రూ.1.60 కోట్లు మంజూరు చేశారు. కోర్టు నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు శంకుస్థాపన చేశారు. కోర్టు నిర్మాణం పూర్తయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో దీన్ని ప్రారంభించలేదు. ఇంతలో ఎన్నికల రావడం, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక నాయకులు, హాకీ క్లబ్ నిర్వాహకులు కోర్టుకు విద్యుత్ సరఫరా విషయాన్ని హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె కల్టెక్టర్తో మాట్లాడి సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.4.50 లక్షలు విద్యుత్ సరఫరా కోసం మంజూరు చేయించారు. దీంతో కోర్టు సమీపంలో ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్, హెచ్‌టీ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసి విద్యుత్ సదుపాయం కల్పించారు. తాజాగా ఆమె దీన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో నాలుగో ఆస్ట్రోటర్ఫ్ కోర్టు నక్కపల్లిలోనే.. ఇటువంటి ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు రాష్ట్రంలో నాలుగు చోట్ల మాత్రమే నిర్మించారు. ఇప్పటి వరకు కడప, పులివెందుల, కాకినాడలలో ఉన్నాయి. తాజాగా నక్కపల్లిలో నిర్మించారు. ఇటువంటి కోర్టులు అనుభవం ఉన్న ఫీల్డ్ హాకీ క్రీడాకారులకు మరిన్ని మెలకువలు నేర్పించడం కోసం ఉపయోగిస్తారు. కోర్టు నిర్మాణం ఇలా.. ఈ కోర్టును నాలుగు రకాల ముడిసరుకును ఉపయోగించి నిర్మిస్తారు. మొదటగా గ్రావెల్ వేసి ఆపైన మెటల్ గ్రౌండ్ వేస్తారు. చదునుగా చేసిన తర్వాత ఖరీదైన మొత్తటి రబ్బర్ పౌడర్ మిశ్రమంతో కలిపి తారురోడ్డు మాదిరిగా గ్రౌండ్ తయారు చేస్తారు. తుది దశకు చేరకున్న తర్వాత కృత్తిమ గడ్డితో తయారు చేయబడిన టర్ఫ్ అనే షీటును పరిచి పై పొర మీద సన్నటి ప్లాస్టిక్ వైరు ఒక పొరగా అమర్చి దీనిపై ఒక అంగుళం రబ్బరు షీటుతో పైభాగాన్నా క్రీడాకారులు ఆడేందుకు అనువుగా ఉండేలా తయారు చేస్తారు. ఇటువంటి కోర్టు ఉమ్మడి విశాఖ జిల్లాలో నక్కపల్లిలో మాత్రమే ఉంది. ఈ టర్ఫ్ కోర్టు కింద భాగంలో వాటర్‌ను స్ప్రే చేసేందుకు 5 హెచ్‌పీ మోటార్లను అమర్చారు. వాటర్ స్ప్రే చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్టులో త్వరగా ఆడటానికి అనుకూలంగా ఉంటుంది. ఫీల్డర్స్ వేగంగా పరిగెత్తడానికి, బంతిని నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాళ్లను నియంత్రించడానికి కూడా ఎక్కువ సహకరిస్తుంది. ఇటువంటి ఆస్ట్రోటర్ఫ్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేయడం వల్ల హాకీలో క్రీడాకారులు బాగా రాణిస్తారని బీఎస్ హాకీ క్లబ్ అధ్యక్షుడు బలిరెడ్డి సూరిబాబు తెలిపారు. -
లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు
తుమ్మపాల: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టంపై కలెక్టరేట్లోని మంగళవారం తన చాంబర్లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం 1994ను కఠినంగా అమలు చేయాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం లింగనిష్పత్తి వెయ్యి మంది బాలురు, 972 బాలికలుగా ఉందన్నారు. లింగ నిష్పత్తి సమానంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. లింగ నిష్పత్తి మండలాల వారీగా సమీక్షిస్తూ తక్కువగా ఉన్న మండలాల సీడీపీవోలు మరింత సమర్థవంతమైన పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాలికలపై వివక్ష చూపకూడదని తెలిపారు. ఏ లేబొరేటరీగాని, స్కానింగ్ కేంద్రం గాని గర్భస్థ పిండం లింగాన్ని తెలిపే ఉద్దేశంతో చేయరాదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తారన్నారు. లింగ నిర్ధారణ పరీక్షల ద్వారా ఆడ శిశువు అని తెలిసి గర్భస్రావాలు చేయించడం వంటి సమాచారం తెలిస్తే 102, 104 టోల్ ఫ్రీ నంబరుకు లేదా ఆన్లైన్ గ్రీవియన్స్ (pcpndt.ap.gov.i n) ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆడపిల్ల విలువ కట్టలేనిదని వారి రక్షణ బాధ్యత మనదేనని అన్నారు. ఏఎన్ఎం, ఆశాలు గృహ సందర్శనాల ద్వారా ఆడపిల్లల సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. నూతన వధూవరులకు, గర్భిణులకు, అత్త మామలకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శాంతిప్రభ మాట్లాడుతూ జిల్లాలో 73 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా 03 కేంద్రాలు గుర్తింపు కోసం, రెండు కేంద్రాలు రెన్యువల్ కోసం, ఒక కేంద్రం మోడిఫికేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. స్కానింగు కేంద్రాలను మూడు నెలలకు ఒకసారి తనిఖీలు చేస్తున్నామన్నారు. డెకాయ్ ఆపరేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మోహన్‌రావు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ అనంతలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్వోలు బాలాజీ, కె.వి.జ్యోతి, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆడపిల్లల రక్షణ బాధ్యత మనదే డీఆర్వో సత్యనారాయణరావు -
కోట్లాది రూపాయల అవినీతికి భారీ స్కెచ్
దేవరాపల్లి: రాష్ట్రంలో బీసీ మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరిట భారీ దోపిడీకి కూటమి ప్రభుత్వం పక్కా స్కెచ్ వేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఈర్లె అనురాధ విమర్శించారు. తారువలో మంగళవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడారు. బీసీ మహిళలకు ఇచ్చే కుట్టు శిక్షణలో కోట్లాది రూపాయలను కొల్లగొట్టేందుకు ఈ స్కీమ్‌ను వాడుకుంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. కుట్టు శిక్షణ పేరిట రూ.257 కోట్లకు టెండర్ పెట్టే విధంగా అనుకూలంగా పథకాన్ని మలుచుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లకు ముందస్తు చెల్లింపులకు సిద్ధం కావడం ఇందుకు నిదర్శనమన్నారు. -
నిశీధి వేళలో గ్రావెల్ మాఫియా అలజడి
● వెంకటాపురం కొండలోగ్రావెల్ తవ్వేందుకు యత్నం ● వాహనాలను అడ్డుకున్న స్థానికులు ● కూటమి నేతలు రంగంలోకి దిగినా తేలని పంచాయితీ ● తాత్కాలికంగా విరమించిన తవ్వకందారులు రాంబిల్లి(అచ్యుతాపురం): రాష్ట్రంలో అతి పొడవైన కొండల్లో ఒకటైన చోడపల్లి – కొత్తూరు కొండను మింగేసే ప్రయత్నమిది.. అంతా నిద్రకు ఉపక్రమిస్తున్న వేళ ఉన్నపళంగా గ్రావెల్ మాఫియా వాలిపోయింది. అక్కడ చీకటిని చీల్చుకుంటూ వస్తున్న వెలుగుల్ని చూసి గ్రామస్తులు వెళ్లగా.. పది లారీలు, ఒక జేసీబీ కనిపించాయి. ఇక్కడ గ్రావెల్ తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ అడ్డుకున్నారు. స్థానిక కూటమి నేతలు రంగంలోకి దిగినా వారు వెనక్కి తగ్గకపోవడంతో తవ్వకాలు నిలిచిపోయాయి. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురానికి ఆనుకొని కొండ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రావెల్‌కు ఉన్న డిమాండ్ వల్లే..? యలమంచిలి నియోజకవర్గంలో గ్రావెల్‌కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అటవీ శాఖ, పర్యావరణ నిబంధనల మేరకు నియోజకవర్గంలోని చాలా కొండల్లో ఎటువంటి మైనింగ్ తవ్వకాలకు అనుమతి లేదు. లే –అవుట్లకు, రహదారి విస్తరణ పనులకు, పరిశ్రమలకు, ఇతరత్రా అవసరాల కోసం గ్రావెల్ డిమాండ్ అధికంగా ఉంది. దీని దృష్ట్యా రాత్రి వేళల్లో గ్రావెల్ తవ్వి తస్కరించుకుపోతున్నారు. అది కూడా ఎటువంటి సీనరైజ్ చెల్లించకుండా, స్థానికుల్ని సంప్రదించకుండా తరలించడంతో నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాల వివాదం రాజుకూనే ఉంది. తాజాగా సోమవారం రాత్రి 10 లారీలు, ఒక పెద్ద జేసీబీ చేరుకుని గ్రావెల్‌ను తవ్వేందుకు సమాయత్తమయ్యారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రావెల్ వ్యవహారాలు చూసే స్థానిక కూటమి ప్రతినిధి బంధువు, ఎం.జగన్నాథపురానికి చెందిన నేత, అచ్యుతాపురానికి చెందిన నేత, రాంబిల్లికి చెందిన నేత రంగంలో దిగి స్థానికుల్ని అడ్డుకోవద్దని కోరారు. ఈ పంచాయితీ తేలకపోవడంతో తవ్వకాలను తాత్కాలికంగా ఆపేసినట్లు సమాచారం. రాత్రి వేళ జోరుగా తవ్వకాలు ప్రధానంగా రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో రాత్రిళ్లు గ్రావెల్ తవ్వకాల అలజడి రేగుతోంది. ఇటీవల కాలంలో ఎర్రవరం కొండల వద్ద, కొండకర్ల కొండల వద్ద, పాటిపల్లి కొండల వద్ద, పంచదార్ల కొండల వద్ద గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న ముఠా స్థానికుల అభ్యంతరాలు, ఫిర్యాదులతో తాత్కాలికంగా నిలిపివేసింది. తాజాగా వెంకటాపురం కొండలపై దృష్టి సారించడంతో వివాదం మొదలైంది. స్థానికుల సహకారంతో సాధ్యమైనంత త్వరలోనే గ్రావెల్ తవ్వకాలు మొదలు పెట్టాలనే యోచనతో కూటమి పెద్దలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మైనింగ్ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
సతకంపట్టు కనకదుర్గమ్మ సన్నిధిలో సినీనటి ఇంద్రజ
అనకాపల్లి: స్థానిక గవరపాలెం సతకంపట్టు కనకదుర్గ అమ్మవారిని సినీ నటి ఇంద్రజ మంగళవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు పట్టణానికి వచ్చిన ఆమె కనకదుర్గమ్మను దర్శించి పూజలు చేశారు. ఇంద్రజకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, ఆలయ శాశ్వత చైర్మన్, నిర్వాహకుడు కాండ్రేగుల నాయుడు దంపతులు, ఆలయ అధ్యక్షుడు భీమరశెట్టి వర నూకరాజు, గౌరీ పరమేశ్వరుల ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కొణతాల సంతోష్ అప్పారావునాయుడు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు
యలమంచిలి రూరల్: ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా యలమంచిలి పురపాలక సంఘం పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేయనున్నట్టు తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ బీజేఎస్ ప్రసాదరాజుకు మున్సిపల్ కార్మికులు సమ్మె నోటీసు సోమవారం అందజేశారు. మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల్లో పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26వేలు చేయాలని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలన్న పలు డిమాండ్లతో సమ్మెకు దిగుతున్నట్టు నోటీసులో పేర్కొన్నారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు గనిశెట్టి ఏసుదాసు,మున్సిపల్ వర్కర్ల సంఘం నాయకులు వై.నూకరాజు, సీహెచ్.వెంకటరమణ, సూరిబాబు పాల్గొన్నారు. -
సమస్యలు ఫుల్...పరిష్కారం నిల్...
● కలెక్టరేట్ చుట్టూ అర్జీదారుల ప్రదక్షిణలు ● ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాలు లెక్కచేయని మండల స్థాయి అధికారులు ● ముప్పుతిప్పలు పెడుతున్నక్షేత్రస్థాయి సిబ్బంది ● వాపోతున్న అర్జీదారులు తుమ్మపాల : కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో పలువురి సమస్యలు విని తక్షణమే పరిష్కరించాలని చేస్తున్న కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలన ఆయా మండలాల అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్‌కే ఫిర్యాదు చేస్తారా... కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరిస్తారా ? అంటూ అర్జీదారుల పట్ల అధికారులు దురుసుగా మాట్లాడుతూ మరిన్ని కొర్రెలు పెడుతున్నారు. దీంతో అర్జీదారులు బెంబేలెత్తి మళ్లీ మళ్లీ కలెక్టరేట్‌కే పరుగులు తీస్తున్నారు. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కూడా అలాంటి అర్జీలు అనేకం వచ్చాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లి తమ సమస్యను కలెక్టర్‌కు తెలిపే సౌకర్యం లేక దివ్యాంగులు షరామామూలుగానే అర్జీలతో కలెక్టరేట్ డోర్ వద్దనే వేచియుండి వచ్చిన అధికారికి అర్జీలు సమర్పించారు. సమస్యలపై కలెక్టర్‌కు తెలిపేందుకు వచ్చిన పలు సంఘాలవారిలో ఒక్కరికే లోనికి అనుమతించారు. మొత్తం 278 అర్జీలు వచ్చాయి.. కరెంటు, గుక్కెడు నీళ్లు ఇవ్వలేరా... స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచిన చీకటీలోనే జీవిస్తూ బతుకులు సాగిస్తున్నామని విద్యుత్ సౌకర్యం కల్పించి తమకు వెలుగులు ఇవ్వాలని కోరుతూ దేవరాపల్లి మండలం చింతలపూడి శివారు పీవీటీజీ కొక్కుల బంద, జారురాయి కొత్తవలస గ్రామాల గిరిజనులు కలెక్టరేట్ వద్ద అడ్డాకులు నెత్తిన పెట్టుకుని తమ నిరసన తెలిపారు. కరెంటు సౌకర్యం కల్పించాలంటూ అనేక మార్లు విద్యుత్ శాఖ అధికారులకు కాగితాలు పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేదని, మంచినీటి సౌకర్యం లేక కలుషిత నీరే తాగుతున్నామని అన్నారు. కలెక్టరమ్మ స్పందించి తమ గ్రామాలకు కరెంటు, మంచినీరు అందించేలా చొరవ చూపాలంటూ పీజీఆర్ఎస్లో అర్జీ అందజేశారు. విలేకరి డబ్బు కాజేశాడు... వ్యవసాయ భూమిని ఆన్లైన్ చేస్తానని రూ.1.85 లక్షలు తీసుకుని మోసం చేసిన ఓ ప్రైవేటు సంస్థ విలేకరి పి.శ్రీమాన్ అనే వ్యక్తి నుంచి నగదు ఇప్పించాలని కోరుతూ యలమంచిలి కొత్తపేట వీధికి చెందిన శెలంశెట్టి కనకఅప్పలరాజు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. యలమంచిలిలో తనకు వారసత్వంగా వచ్చిన భూమిని రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఆన్లైన్ చేయిస్తానని, బదులుగా తన వద్ద నుంచి నగదు తీసుకుని ఆన్లైన్ చేయించకుండా నాలుగేళ్లుగా తిప్పించుకుంటున్నాడని తెలిపారు. ఆన్లైన్ చేయకపోవడంతో నగదు ఇవ్వమని కోరగా నగదు ఇవ్వకుండా తిరిగి తనను భయపెట్టి, హింసిస్తున్నావంటూ పోలీసు కేసు పెట్టించి జైల్లో పెట్టిస్తానంటూ బెదిరిస్తున్నాడని, అతని నుంచి నగదు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. న్యాయం చేయమంటే పోలీసులతో బెదిరిస్తున్నారు... వందేళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి తమపై దాడులు చేస్తూ కొందరు నాయకులు ఉపాధి హామీ కూలీలతో చెరువును తవ్విస్తున్నారని, తమ భూమిని తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ గొలుగొండ మండలం రాజుపేట గ్రామానికి చెందిన రైతులు చిపురుబిల్లి కన్నయ్య, కన్నూరు సత్యనారాయణ తమ వద్ద గల భూమి పత్రాలు, ఆధారాలతో కలెక్టర్‌ను కలిసి ప్రాధేయపడ్డారు. రాజుపేట గ్రామంలో సర్వే నెం.15–1బిలో 3 ఎకరాల ఇనాం భూమి తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చి సాగు చేసుకుంటున్నామని, కూటమి ప్రభుత్వంలో కొందరు నాయకులు రాజకీయ కారణాలతో తమపై కక్ష కట్టి మా ఇరువురికి చెందిన 3 ఎకరాల భూమి చెరువంటూ తమకు చెందకుండా చేస్తున్నారని, అధికార బలంతో పోలీసుల అండతో మా భూముల్లో ఉపాధి పనులు చేస్తూ చెరువు గట్టు వేస్తున్నారన్నారు. ఆక్రమణను అడ్డుకున్న తమపై పోలీసు కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అకారణంగా తమను స్టేషన్‌కు పిలిచి ఫోన్ లాక్కుని ఒక రోజంతా స్టేషన్లోనే ఉంచారని, పోలీసులు తాము లేని సమయంలో ఇంటికొచ్చి ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. సదరు ఈనాం భూమిపై ఈనాంకు చెందిన పంతులు గారికి తమకు మధ్య కొన్నేళ్లుగా కోర్టు కేసు కూడా నడుస్తుందంటూ వారి వద్ద ఉన్న పత్రాలతో కలెక్టర్‌కు వినతి అందించారు. గత వారం నర్సీపట్టణంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ అసహనానికి గురై తమపై దురుసుగా మాట్లాడుతున్నారని, సమగ్ర విచారణ చేసి రైతులుగా తమకు న్యాయం చేయమన్న కలెక్టర్ ఆదేశాలను సైతం పక్కనపెట్టి అదే రోజు తమపై పోలీసు కేసు పెట్టి తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కుటిల సర్కారు గద్దె దిగే రోజు వస్తుంది..
మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. అమర్నాథ్ ప్రమాణ స్వీకారంతో తండ్రి తన చేతుల మీదుగా కుమారుడికి బాధ్యతలు అప్పగిస్తున్నంత ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని, త్వరలో రోడ్డెక్కి మరీ ఈ కుటిల సర్కారును గద్దె దించే రోజు వస్తుందన్నారు. కూటమి నాయకులు ఎన్నో దాడులు చేస్తున్నా.. పార్టీ శ్రేణులు ఎదురొడ్డి నిలుస్తున్నారన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ.. మీ అందరి ఉత్సాహం చూస్తే రానున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేఎందుకు సిద్ధంగా ఉన్న సైనికుల్లా కనిపిస్తున్నారన్నారు. రాష్ట్రం అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మారిందని, అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు శోభా హైమావతి మాట్లాడుతూ.. గతంలో జగనన్న పాలనలో ప్రతి పండగకు ఒక సంక్షేమ పథకం అందుకుని ప్రజలు నిజంగా పండగ చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, కన్నబాబు రాజు, కంబాల జోగులు, మలసాల భరత్‌కుమార్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడారు. అరకు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, సూర్యనారాయణరాజు, ముఖ్యనేతలు చింతకాయల సన్యాసిపాత్రుడు, ఈర్లె అనురాధ, చింతలపూడి వెంకట్రామయ్య, దంతులూరి దిలీప్ కుమార్, చిక్కాల రామారావు, రుత్తల ఎర్రాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
నూకాంబిక అమ్మవారి హుండీ ఆదాయం రూ.34.80 లక్షలు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి హుండీల లెక్కింపు సోమవారం జరిగింది. ఏప్రిల్ 16 నుంచి మే 5వ తేదీ వరకు రూ.34,80,099 నగదు, 27,500 మిల్లీగ్రాముల బంగారం, 601 గ్రాముల వెండి కానుకల రూపంలో వచ్చినట్లు ఆలయ హుండీ పర్యవేక్షకుడు టి.సాంబశివరావు చెప్పారు. హుండీ ఆదాయాన్ని గవరపాలెం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేశామన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను (గొల్లబాబు), ఈవో వెంపలి రాంబాబు, కమిటీ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న లారీ...ఒకరికి గాయాలు
అచ్యుతాపురం రూరల్: రామన్నపాలెం గ్రామానికి చెందిన ధర్మిరెడ్డి శ్రీనివాసరావును లారీ ఢీకొనడంతో తీవ్ర రక్త స్రావమై అపస్మారక స్థితిలో ఉన్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం క్షతగాత్రుడు శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వర్తించుకుని అచ్యుతాపురం కూడలి నుంచి రామన్నపాలెం తన ఇంటికి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో రోడ్డుపై పడి ముక్కు, నోటి నుండి తీవ్రంగా రక్త స్రావమైంది. లారీ క్షతగాత్రుని ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడం గమనించిన స్థానికులు లారీని వెంబడించి పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు. రోడ్డుపై పడి తలకు బలంగా గాయం కావడంతో విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. -
జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యం
వైఎస్సార్సీపీ జిల్లా నూతన అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పార్టీ అధినేత తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఈ సమావేశానికి హాజరైన పార్టీ కేడర్ జోష్ చూస్తుంటే తనలో ఉత్సాహం రెట్టింపయిందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు సీఎం కావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఏడాదికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైంది.. ఇప్పుడు మన బాధ్యత మరింత పెరిగిందన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ దొర్లకుండా చూసుకుంటామని, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. గత ఐదేళ్లలో మనం సృష్టించిన వలంటీర్ల వ్యవస్థ ప్రజలకు మేలు చేసింది కానీ వారికి పార్టీని దూరం చేసిందన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. మళ్లీ అధికారంలోకి రావడం తథ్యమని, ఈసారి కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మాటగా మీకు చెప్పమన్నారన్నారు. సింహాచలం దుర్ఘటనలో ఏడుగురు చనిపోవడానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇంటర్నేషనల్ మేస్త్రినంటావు కదా చంద్రబాబూ.. సింహాచలంలో ఏడడుగుల గోడనే నిర్మించలేకపోయావు.. అమరావతిని ఏమి నిర్మిస్తావు అంటూ ఎద్దేవా చేశారు. -
మా భూమిలోకి మమ్మల్ని రానివ్వడం లేదు...
యువతిపై లైంగికదాడి..! కేసు నమోదులో పోలీసుల తాత్సారం.. ఎస్.రాయవరం మండలం దార్లపూడి గ్రామానికి చెందిన చుక్కా నాగమణి మాట్లాడుతూ తన స్వగృహంలో గత నెల 29న రాత్రి ఇంటిలో నిద్రిస్తుండగా తన ఇంట్లోకి అదే గ్రామానికి చెందిన పప్పల మణికంఠ చొరబడి తన కూతురు ధనలక్ష్మిపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ విషయం తల్లిదండ్రులకు గానీ, ఇంకేవరికై నా చెపితే చంపేస్తానని బెదిరించాడని కూతురు తెలిపిందని, తాను, భర్త మేడపై నిద్రిస్తుండగా కింద గదిలో పడుకున్న తన కూతురు సుమారు 2 గంటల సమయంలో కేకలు వేయడంతో వెంటనే వెళ్లి అతనిని బంధించి సమీప ప్రజలను పిలిచి పంచాయతీ నిర్వహించి పెళ్లి చేసుకోమని కోరగా అందుకు నిరాకరించాడని తెలిపింది. వెంటనే 30వ తేదీన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని, అయితే స్టేషన్ అధికారులు ఫిర్యాదు తీసుకోవడానికి తాత్సారం చేస్తున్నారని తెలిపారు. హోంమంత్రి అనిత పీఏ ప్రోద్బలంతోనే ఫిర్యాదు స్వీకరించడంలేదని ఆమె ఆరోపించింది. రెల్లి కులస్ధులమయినందున తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, స్ధానికంగా న్యాయం జరగకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్టు ఆమె తెలిపింది. కశింకోటకు చెందిన కాశిందేవుల నానాజీ మాట్లాడుతూ మాకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పాయకరావుపేట మండలం ఈదటం గ్రామంలో 2.5 ఎకరాలు భూమి అన్ని రికార్డులతో కలిగి ఉన్నామని తెలిపారు. ఆ భూమిలోకి వస్తుంటే భూమికి సంబంధం లేని తమ బంధువులు అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇదే విషయంపై 2019 నుంచి స్పందనలో ఫిర్యాదు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. అధికారులు మారినప్పుడల్లా బంధువులు భూమిలోకి వస్తూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలన్నారు. -
హత్య కేసు మాఫీ యత్నంపై ఎస్పీకి ఫిర్యాదు
● మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి ● కేసును వేరొక అధికారికి బదలాయించాలి ● విలేకరులతో మాజీ ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం: హత్య కేసును మాఫీ చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, కేసును నీరుగార్చేందుకు పోలీసులు సైతం వత్తాసు పలుకుతున్నారని పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఎస్పీని కోరడం జరిగిందన్నారు. ఈ ఏడాది జనవరిలో నర్సీపట్నం మండలం, వేములపూడి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు బండారు అప్పన్నపై దాడి చేసి హత మార్చారన్నారు. హత్య చేసిన వ్యక్తులకు కూటమి నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. కూటమి నాయకుల ఒత్తిడితో కేసును మాఫీ చేసేందుకు నర్సీపట్నం రూరల్ పోలీసులు చూస్తున్నారన్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ఎస్(సస్పైసీవ్ డెత్‌గా కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్నారు. సంఘటన జరిగి నాలుగు నెలలు అవుతున్నా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదన్నారు. సీఐ రేవతమ్మ, ఎస్ఐ రాజారావు కేసు దర్యాప్తును తప్పుతోవ పట్టించి, కేసును క్లోజ్ చేసేందుకు చూస్తున్నారని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. డాక్టర్ ఇచ్చిన పీఎం రిపోర్టు కూడా హత్యకు అద్దం పడుతుందన్నారు. అయినప్పటికీ పోలీసులు కేసును నీరు గారుస్తున్నారన్నారు. మృతుడు అప్పన్న శరీరంపై బలమైన గాయాలు చూస్తే ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, కావాలనే కొట్టి చంపేశారని తెలుస్తుందన్నారు. సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రమేయం ఉండడంతో కేసులో నిందితులకు సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే వేరొక ఆఫీసర్‌కు కేసు బదిలీ చేయాలని ఎస్పీని కోరడం జరిగిందన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగకపోతే న్యాయపోరాటం చేస్తామన్నారు. -
శంకరంలో వ్యక్తి ఆత్మహత్య
అనకాపల్లి టౌన్: మండలంలోని శంకరం గ్రామంలో సోమవారం ఒక వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడని రూరల్ ఎస్ఐ జె.నాగేశ్వరావు తెలిపారు. గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన మూసి ఉన్న కోళ్ల ఫారం వద్ద చింతచెట్టుకు ఉరివేసుకొని ఉండగా సమీపంలోని పిల్లలు గమనించి గ్రామ పెద్దలకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. మృతుని ఫ్యాంట్ జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా త్రిపుర రాష్ట్రానికి చెందిన జితిన్ ముండా(39)గా గుర్తించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
లేటరైట్ తవ్వకాలు నిలిపివేయాలి
● గిరిజనుల హక్కులకు విఘాతం ● స్పీకర్ కల్పించుకోవాలి ● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథం డిమాండ్ నాతవరం: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో జరుగుతున్న అక్రమ లేటరైట్ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. అసనగిరి పంచాయతీ శివారు బమ్మిడికలొద్దు ప్రాంతంలో జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను సోమవారం సీపీఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న లేటరైట్ తవ్వకాలను యుద్ధప్రాతిపదికన నిలుపుదల చేయకపోతే ఉద్యమిస్తామన్నారు. ఈ ప్రాంతం 1/70 యాక్టు పరిధిలో ఉందని, లేటరైట్ తవ్వకాల వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను ఉల్లంఘించి చేస్తున్న ఈ తవ్వకాల కారణంగా అడవి బిడ్డల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. గతంలో లేటరైట్ తవ్వకాలను వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు ప్రోత్సహించడం సిగ్గు చేటన్నారు. ఇదే కొనసాగితే ఈ ప్రాంత గిరిజనులు జీవనం సాగిస్తున్న అటవీ సంపదతో పాటు జీడిమామిడి తోటలు నాశనం అవుతాయన్నారు. లేటరైట్ తవ్వకాలు ఆపకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత గిరిజనులతో కలిసి ఉద్యమిస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యుడు అడిగర్ల రాజు, పార్టీ సీనియర్ నాయకుడు త్రిమూర్తులురెడ్డి, రాజవొమ్మంగి మండల పార్టీ కార్యదర్శి సూరిబాబు, ప్రజా నాణ్యమండలి నాయకుడు రమేష్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు
● నియోజకవర్గాలలో జరిగే పనులు ఎమ్మెల్యేలకు తెలియాలి ● డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తుమ్మపాల: వేసవిలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, కోతలు లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ విజయ కృష్ణన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశానికి ఆయనతోపాటు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గాలలో జరిగే పనుల గురించి ఎమ్మెల్యేలకు తెలియజేయాలని, వారి సలహాలు, సూచనలు అమలుచేయాలన్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యాన రంగాలలో అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పంచాయతీలకు సరఫరా చేసే బ్లీచింగ్‌లో కాంట్రాక్టర్ రెట్టింపు బిల్లు వసూలు చేస్తున్నాడని, తక్షణమే ఆ కాంట్రాక్టర్‌ను తొలగించాలని కలెక్టర్‌కు సూచించారు. మంచినీటి సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేయడానికి వీలుగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని తెలిపారు. వెహికల్ ఫిట్నెస్ సెంటర్ నర్సీపట్నంలో కూడా ఏర్పాటు చేయాలన్నారు. గోవాడ సుగర్స్ రైతులకు బకాయి చెల్లించాలి:బొత్స శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గోవాడ చక్కెర కర్మాగారం రైతులకు వెంటనే బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు, కార్మికులకు కలిపి సుమారు రూ.40 కోట్ల బకాయిలు ఉన్నాయని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ శ్రామికులకు మార్చి 31 నుంచి వేతనాల బకాయిలు చెల్లించాలన్నారు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో ప్రసూతి వార్డులో ప్రసవానికి రూ.3 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల ఒక మహిళ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్న సమయంలో బంగారు చెవి దుద్దులు దొంగతనం జరిగిందని, పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడారు. కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ స్థానిక యువతకు పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించడానికి వారికి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ జాహ్నవి, డీఆర్వో సత్యనారాయణ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యేలు సుందరపు విజయకుమార్, విశాఖ మేయర్ శ్రీనివాసరావు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో నాగజ్యోతి ప్రతిభ
రావికమతం: కొత్తకోటకు చెందిన ఉపాధ్యాయిని పి.ఎం.ఎన్.నాగజ్యోతి పాన్ ఇండియా మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో 4వ నేషనల్ పాన్ ఇండియా మాస్టర్స్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్ షిప్ –2025 పోటీలు ఈ నెల 3,4 తేదీలలో జరిగాయి. నాగజ్యోతి మహిళల విభాగంలో బెంచ్సై, స్క్వాట్, డెడ్ లిఫ్ట్ విభాగాలు మూడింట్లోనూ, ఓవరాల్ ఛాంపియన్ షిప్లోను కలిపి నాలుగు విభాగాల్లో బంగారు పతకాలు సాధించారు. ఛాంపియన్షిప్ నిర్వాహక కమిటీ ప్రెసిడెంట్ దీపుదేవ్, మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ వి.ఎన్.షాజీ చేతుల మీదుగా నాగజ్యోతి అందుకున్నారు. కొత్తకోట గ్రామానికి చెందిన నాగజ్యోతి ప్రస్తుతం రోలుగుంట హైస్కూల్లో ఆంగ్ల ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు బంగారు పతకాలు సాధించిన నాగజ్యోతి ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వాసవీ వనితా క్లబ్ సంఘం మహిళలు, గ్రామస్తులు అభినందించారు. -
ఏటికొప్పాక బొమ్మల తయారీకి చేయూత
యలమంచిలి రూరల్: ఏటికొప్పాక లక్కబొమ్మల తయారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూత అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీరాజ్ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(పీఆర్జీఎస్ఏ) రాష్ట్ర కోఆర్డినేటర్ వినోద్ తెలిపారు. ఆయన అధికారులతో కలిసి సోమవారం ఆర్టిజెన్స్ కాలనీలో హస్త కళాకారులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సీవీ రాజు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి, పెదపాటి శరత్, సంతోష్ కుమార్ సహా పలువురితో సమావేశమయ్యారు. లక్కబొమ్మల తయారీలో సరికొత్త మెలకువలు నేర్పించడానికి కళాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. తమకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ కావాలని, అంకుడు కర్రల డిపోను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రంగుల ధరలు తగ్గించాలని కళాకారులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. కళాకారులను ప్రోత్సహించేందుకు రూ.5 కోట్లతో కొత్త ప్రాజెక్టు మంజూరు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎంపీడీవో కొండలరావు, ఏవో ప్రసాదరావు,ఈవోపీఆర్డీ దీపిక, ఏటికొప్పాక పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులకిచ్చిన హామీలు నెరవేర్చాలి
నక్కపల్లి: ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీటీఎఫ్ ఉపాద్యాయ సంఘ ఆధ్వర్యంలో యలమంచిలి తాలూకా సంఘ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. యలమంచిలి, రాంబిల్లి, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులతో ఏపీటీఎఫ్ యూనియన్ నక్కపల్లి శాఖ అధ్యక్షుడు వై.కృష్ణ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. సంఘ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటపతిరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం తగదన్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. 12వ పీఆర్సీని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని కోరారు. డీఎస్సీ నియామకం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై నిరసన తెలియజేస్తున్నామన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక రోజు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ ఆందోళనలో ఏపీటీఎఫ్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కె.కె.ధర్మారావు, రాష్ట్ర కౌన్సిలర్లు డి. కొండలరావు, పి.గణేష్, కె.శ్రీనివాసరావు, ఐదు మండలాల సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే రామ్‌రహీమ్, పి.శ్రీనివాసరావు, కృష్ణ, అప్పలరాజు, సునీల్, కె.శ్రీనివాసరావు, బి.సత్యనారాయణ, ఎం.సత్యనారాయణ, కిరణ్, అప్పాజీ, బి.శ్రీనివాసరావు, ఎస్.ఫాల్గుణరావు, కిల్లాడ శ్రీనివాసరావు, పాల్గొన్నారు. -
మంత్రుల కమిటీ సంగతేంటి?
● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో బాధ్యులపై చర్యలు ● ఆలయ ఇన్చార్జి ఈవోతో సహా ఆరుగురు అధికారుల సస్పెన్షన్ ● కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలకు ఆదేశం ● మంత్రుల కమిటీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా చర్యల్లేవు.. ● నిజాలను గోడ వెనకే సమాధి చేసేసిన త్రిసభ్య కమిషన్ మంత్రుల కమిటీ సమయంలోనే గోడ నిర్మాణం..! కాంట్రాక్టరు చెప్పినదాని ప్రకారం చందనోత్సవానికి ఆరు రోజుల ముందే గోడ నిర్మాణం పూర్తయింది. ఏప్రిల్ 16న నిర్మాణ పనులు ప్రారంభించారు. అదే రోజున మంత్రుల కమిటీని ఏర్పాటు చేయడం.. దేవస్థానం అధికారులతో కొండపైనే సమావేశమై సమీక్ష నిర్వహించడం జరిగింది. అంటే గోడ నిర్మాణం గురించి మంత్రుల కమిటీ సమీక్షలో ప్రస్తావన వచ్చే ఉంటుంది. కానీ.. దాన్ని బయటికి రానివ్వకుండా అటు త్రిసభ్య కమిషన్.. ఇటు ప్రభుత్వం కప్పిపుచ్చింది. ఈ గోడ నిర్మాణం జరుగుతున్నప్పుడు కూడా కమిటీ ఏర్పాట్లు పరిశీలనకు పలుమార్లు కొండపై హడావుడి చేసింది. కానీ గోడ నిర్మాణం ఎలా జరుగుతోంది.? నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా అనేది పరిశీలించలేదు. ఇలా ప్రతి అంశంలోనూ మంత్రుల కమిటీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వానికి, త్రిసభ్య కమిషన్‌కు ఏమాత్రం కనిపించకపోవడం గమనార్హం. మొత్తంగా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. విషాద ఘటనలో ప్రభుత్వం తమకు, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా కేవలం అధికారులు, ఉద్యోగులపైనే చర్యలు తీసుకోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సందర్భంగా తాత్కాలికంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్రిసభ్య కమిషన్ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు, ఈఈ డీజీ శ్రీనివాసరాజు, డిప్యూటీ ఈఈ కేఎస్ఎన్ మూర్తి, జేఈ కే.బాబ్జీతో పాటు ఏపీటీడీసీకి చెందిన ఈఈ కె.రమణ, డిప్యూటీ ఈఈ ఏబీవీఎల్‌ఆర్ స్వామి, ఏఈ పి.మదన్మోహన్ల సస్పెన్షన్‌కు ఆదేశించింది. అదేవిధంగా గోడ నిర్మించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసమంటూ ఏర్పాటు చేసిన కమిటీలో ఉంటూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు మంత్రులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. సింహాచలం దేవస్థానంలో దుర్ఘటనపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తప్పంతా అధికారులు, దిగువస్థాయి సిబ్బందిదే అన్నట్లుగా వారిపైనే వేటు వేసింది. దాసుని తప్పు దండనతోనే సరి అన్నట్లుగా.. పనుల పర్యవేక్షణ అంటూ ప్రచార ఆర్భాటానికి పరిమితమై.. భక్తుల ప్రాణాలతో చెలగాటమాడిన మంత్రుల కమిటీ మీద మాత్రం ఈగ వాలనీయకుండా జాగ్రత్తపడింది. మంత్రులూ ఘటనకు బాధ్యులేగా..? మూడు రోజుల పాటు విచారణ అంటూ హడావుడి చేసిన త్రిసభ్య కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. గోడ ఎవరు కట్టారు?.. ఎందుకు కట్టారు.? దాని వెనక ఎవరు ఉన్నారు.. నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా అనే కోణాల్లో కేవలం అధికారులకు సంబంధించే విచారణ చేపట్టారే తప్ప.. మంత్రుల కోణం నుంచి కించిత్తు దర్యాప్తు చెయ్యలేదు. వాస్తవానికి చందనోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఏప్రిల్ 7వ తేదీన నలుగురు మంత్రులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్‌తో పాటు అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా అధికారులున్నారు. కమిటీ నియమించిన తర్వాత నుంచి మంత్రుల బృందం కొండపైనే నిరంతర పర్యటన, సమీక్షలంటూ హడావుడి చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించలేదు. -
హేచరీ బస్సు, ఆటో ఢీ
కోటవురట్ల: కోటవురట్ల నుంచి ఎస్.రాయవరం మండలం ధర్మవరం వెళుతున్న హెచరీకి సంబంధించిన బస్సును, అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వస్తున్న ఆటో ఢీకొనడంతో 10 మంది గాయపడ్డారు. మండలంలోని పాత రోడ్డు జంక్షన్ దాటాక జరిగిన ఘటనలో క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పి.లక్ష్మి అనే మహిళ ను మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. నర్సీపట్నంలో ఎన్.నూకరత్నం, జి.నాగపద్మ చికిత్స పొందుతుండగా కోటవురట్ల సీహెచ్‌సీలో కె.నాగ తేజ, డి.సోమన్న, కె.వెంకటలక్ష్మి, జి.అమ్మాణి, పి.రాజులమ్మ, ఆర్.శాంతి, వై.శ్రీనులకు ప్రఽథమ చికిత్స అందించారని ఎస్ఐ రమేష్ తెలిపారు. 10 మందికి గాయాలు -
బొలేరో, ఆటో ఢీ..ఐదుగురికి గాయాలు
● గన్నవరం మెట్ట వద్ద ప్రమాదం ● తీవ్రంగా గాయపడిన ముగ్గురు వైజాగ్ తరలింపు నాతవరం: నర్సీపట్నం తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద బొలోరో, ఆటో ఢీకొన్న సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. ఎస్ఐ సిహెచ్.భీమరాజు అందించిన వివరాలివి. నాతవరం మండలం ఎంబీపట్నం గ్రామానికి చెందిన వారు కాకినాడ జిల్లాలో వివాహం సంబంధించి పెద్దలు భోజనానికి ఆటోపై వెళ్లారు. అక్కడ భోజనాలు అనంతరం తిరిగి ఆటోపై ఇంటికి వస్తుండగా నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్దకు వచ్చేసరికి నర్సీపట్నం నుంచి తుని వైపు వళ్తున్న బొలేరో వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎంబీపట్నం గ్రామానికి చెందిన సలగాల సంతోష్, ఆడ్డాల కృపానందం, పెద్దాడ మరిడియ్య, కోరుబిల్లి దుర్గ, కె.చినరాజుబాబు గాయపడ్డారు. వీరిని వెంటనే వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో సలగాన వసంతకు కుడి కాలికి, కృపానందం ముఖంపైనా, మరిడియ్యకు ఎడమ చేతికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. నాతవరం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి నర్సీపట్నం తుని అర్అండ్బీ రోడ్డుౖపై ట్రాఫిక్‌ను చక్కదిద్దారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ భీమరాజు తెలిపారు. -
పరిహారం కూడా దేవస్థానం సొమ్మే..!
● సింహాచలం ఆలయంలో గోడ కూలిన ఘటనలో ఏడుగురు దుర్మరణం, ఒకరికి గాయాలు ● మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు వంతున ప్రకటించిన ప్రభుత్వం ● ఇప్పుడు దేవస్థానం ఖజానా నుంచే బాధితులకు చెల్లింపులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం మరోసారి తన బుద్ధి చూపించుకుంది. సింహాచలంలో జరిగిన విషాదానికి గల పరిహారాన్ని దేవస్థానంపై రుద్దేసింది. కొండపై గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు దేవస్థానం ఖజానా నుంచే రూ.1.78 కోట్లు చెల్లింపులు చేసింది. చందనోత్సవం రోజున సింహాచలం కొండపై గోడ కూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కాగా, ఒకరికి గాయపడిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు పరిహారంగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హోం మంత్రి అనిత, ఇతర మంత్రులు కూడా హామీలు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు దేవాలయం నిధులు కేటాయించడం పట్ల ఆలయ వర్గాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవస్థానం ఖజానా నుంచే చెల్లింపులు చందనోత్సవం నిర్వహణలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వామపక్ష, ఇతర ప్రజా సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యో గం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పరిహారాన్ని వెంటనే బాధిత కుటుంబాల కు అందించాలని సింహాచలం దేవస్థానం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా దేవస్థానం నిధుల నుంచే బాధితులకు చెల్లింపులు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో దేవస్థానం అధికారులు ఆగమేఘాల మీద బాధితుల కు చెక్కులు పంపిణీ చేసినట్లు సమాచారం. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున రూ.1.75 కోట్లు, క్షతగాత్రుడికి రూ.3 లక్షలు చెల్లించారు. దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులు వాస్తవానికి ఘటన జరిగిన రోజున మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వమే నేరుగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే ఖజానా నుంచి పరిహారం అందిస్తుందని అందరూ భావించారు. అయితే దేవాలయం అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధుల నుంచి పరిహారం కింద బాధిత కుటుంబాలకు అందజేసింది. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండేందుకు భక్తులు దేవాలయానికి సమర్పించిన కానుకల నుంచి ఇవ్వడాన్ని ఆలయ వర్గాలు సైతం తప్పుబడుతున్నాయి. దేవాలయం అభివృద్ధికి కేటాయించాల్సిన నిధులు ఇలా పరిహారాల రూపంలో ఇచ్చుకుంటూ పోతే ఆలయ అభివృద్ధి కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై విమర్శలు సింహాచలం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పరిహారం చెల్లింపులపై వామపక్షాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి అసమర్థ పాలన కారణంగా జరిగిన ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు దేవస్థానం ఖజానా నుంచే పరిహారం అందించి ప్రభుత్వం తప్పించుకోడాన్ని తప్పుబడుతున్నాయి. ఇవి ప్రభుత్వ హత్యలే అని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. చందనోత్సవ నిర్వహణపై ఐదుగురు మంత్రుల కమిటీ నెల రోజుల పాటు విశాఖలోనే తిష్ట వేసి ఏర్పాట్లు చేసిన వేడుకల్లో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి మంత్రులను కూడా బాధ్యులను చేయాలని పట్టుబడుతున్నారు. దేవదాయ శాఖ నుంచి వచ్చాయి దేవదాయ శాఖ నుంచి పరిహారం కింద నిధులు కలెక్టర్ నిధికి వచ్చాయి. వాటిని మాత్రమే బాధిత కుటుంబాలకు చెల్లించాం. – ఎం.ఎన్.హరేందిరప్రసాద్, జిల్లా కలెక్టర్ -
‘సీహెచ్‌వోల సమస్యలు పరిష్కరించాలి’
అనకాపల్లి టౌన్: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (సిహెచ్ఓ)ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ వి.వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పట్ణణంలోని నెహ్రుచౌక్ స్టేట్‌బ్యాంక్ కార్యాలయం ఎదుట 8వ రోజు సమ్మెలో భాగంగా సిహెచ్ఓలు మెకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసనలో పలువురు సీహెచ్‌ఓలు పాల్గొన్నారు. -
ఇక సమరమే..
● హనీమూన్ సమయం ముగిసింది ● ప్రజల పక్షాన పోరాటం చేద్దాం ● రూ.వెయ్యి పింఛను పెంపు మినహా సంక్షేమం శూన్యం ● కూటమి నేతల అభివృద్ధికే లక్షల కోట్ల అప్పులు ● చంద్రబాబు ఓ మాయల మరాఠీ ● వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్ష నేత బొత్స ● పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమర్నాథ్ వాగ్దానాలు విస్మరించిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వర్గాలకూ కష్టాలే.. హామీలన్నీ అటకెక్కాయి.. ప్రజల కష్టాలు తారస్థాయికి చేరాయి.. మాట నిలుపుకుంటారో లేదోనని ఏడాదిపాటు వేచి చూశాం.. హనీమూన్ సమయం ముగిసింది.. ఇక జనం గొంతుకై వారి పక్షాన పోరాటమే మన కర్తవ్యం.. అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్పిలుపునిచ్చారు. సాక్షి, అనకాపల్లి: పార్టీ శ్రేణుల హర్షధ్వానాల మధ్య వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రమాణ స్వీకారం సోమవారం అనకాపల్లిలో అట్టహాసంగా జరిగింది. రింగ్ రోడ్డులో గల పెంటకోట కన్వెన్షన్ హాల్లో పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో అమర్నాథ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. వాటిని పార్టీ కార్యకర్తలు చప్పట్లతో ఆమోదించారు. సమావేశానికి ముందు పార్టీ నేతలందరూ వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. సమావేశానికి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు మాయల మాంత్రికుడు.. తన అనుకూల మీడియా ద్వారా లేనిది ఉన్నట్టు చూపించి ఊహల్లో విహరించేలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తాడు.. మనమంతా అప్రమత్తంగా ఉండాలి.. ప్రజా సమస్యలను, కూటమి నేతల అవినీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలి’ అని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల హామీల అమలుకు ప్రజల తరపున పోరాటం చేసే సమయం ఆసన్నమైందన్నారు. స్థానిక సమస్యలపై దృష్టి సారించి.. వాటి పరిష్కారానికి పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చివరికి ఉపాధి హామీ కూలీల వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. వెయ్యి రూపాయల పెంచను పెంపు తప్ప కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిందేమీ లేదన్నారు. రూ.లక్షా 70 వేల కోట్లు అప్పు చేసి.. కూటమి నేతలు దోచుకుని తింటున్నారన్నారు. ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టండి.. ఆ ప్రాంతంలోని సమస్యలపై చర్చిద్దాం.. పోరాడదాం.. అన్నారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానాలు ఇవే.. మే నెలాఖరులోగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల అధ్యక్షులు, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి. జూలై 31వ తేదీలోగా గ్రామ కమిటీలు, బూత్ కమిటీలను నియమించాలి. ఆరు నెలలకొకసారి జిల్లా పార్టీ విస్తత స్థాయి సమావేశం నిర్వహించుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుందాం. ప్రతి నెలా ఒక మండలంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. -
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వివిధ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేస్తోందని, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా బీజేపీ పాలన సాగుతోందని తెలిపారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న తదితర డిమాండ్లతో ఈనెల 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు చెప్పారు. మోడీ పాలనలో కార్మిక రంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు హక్కులు కోల్పోతారని చెప్పారు. రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కోన మోహనరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, కూలీల జీవితాలు దుర్భరంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షులు దుర్గారాణి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గూనూరు వరలక్ష్మి, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.పార్వతి, జిల్లా నాయకులు వి.వి.శ్రీనివాసరావు, ఆర్.రాము, గనిశెట్టి సత్యనారాయణ, జి.దేవుడు నాయుడు, ప్రేమ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో వంటలు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, సహపంక్తి భోజనం చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు ఉచితంగా తాగునీరు, మజ్జిగ, ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ ఈవో వెంపలి రాంబాబు, ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను(గొల్లబాబు) ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాలింతలకు, చిన్నారులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు మజ్జి శ్రీనివాసరావు, కాండ్రేగుల రాజారావు, మారిశెట్టి శంకరరావు, పోలిమేర ఆనంద్, దాడి రవికుమా ర్, సూరే సతీష్, ఎర్రవరపు లక్ష్మి, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి పాల్గొన్నారు.