శ్రీశైలం చేరుకున్న హెలికాప్టర్
శ్రీశైలానికి హెలికాప్టర్ సర్వీసు
Published Sat, Aug 27 2016 9:30 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– శ్రీశైలం టు హైదరాబాద్ రాను, పోను రూ.15వేలు
– జాయ్‌ట్రిప్‌కు రూ.2,500
శ్రీశైలం ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా టెంపుల్ టూరిజంలో భాగంగా శ్రీశైలానికి హెలికాప్టర్ సర్వీసు శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమ్మిట్ ఏవియేషన్ సంస్థ డైరెక్టర్ ఎన్.వి.ఆర్.సురేష్ విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున రానుపోను చార్జీ నిర్ణయించామన్నారు. హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం దేవస్థానం ఉద్యోగులు భక్తులను ఇన్నోవా వాహనంలో దేవాలయానికి తీసుకెళ్లి ఒక ఏసీ గదిని ఏర్పాటు చేయడంతో పాటు అమ్మవారికి కుంకుమార్చన, స్వామి వార్లకు అభిషేకం నిర్వహిస్తారన్నారు. అనంతరం రోప్‌వే ద్వారా కృష్ణానది(పాతాళగంగ)కి తీసుకెళ్లి నదిలో బోటింగ్ ఏర్పాటు చేసి తిరిగి ప్రయాణికులను హెలికాప్టర్ వద్దకు చేరుస్తారని.. ఇందుకోసం దేవస్థానం అదనంగా ఒక్కొక్కరి నుంచి రూ.2వేలను వసూలు చేస్తుందన్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులు కూడా హెలికాప్టర్‌లో నల్లమల అందాలు, కృష్ణమ్మ సోయగాలను హెలికాప్టర్ నుంచి వీక్షించేందుకు 10 నిమిషాల జాయ్ ట్రిప్ ఏర్పాటు చేస్తున్నామని.. ఇందుకు ఒక్కొక్కరి నుంచి రూ.2,500 వసూలు చేస్తామన్నారు. ఇతర వివరాలకు దేవస్థానం సెంట్రల్ రిజర్వేషన్ కౌంటర్ లేదా ఏవియేషన్ సంస్థకు చెందిన 94402 57312 మొబైల్ నెంబర్‌ను సంప్రదించాలన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగితే ప్రతి రోజూ హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి 45 నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. తొలి రోజున దేవస్థానం ఈఓ నారాయణ భరత్‌గుప్త, జేఈఓ హరినాథ్‌రెడ్డిలు కుటుంబ సమేతంగా హెలికాప్టర్‌లో జాయ్‌ట్రిప్‌ను ఎంజాయ్ చేశారు.
Advertisement