ఇక శ్రీశైలం పర్యటనకు హెలికాప్టర్?
Published Wed, Aug 10 2016 12:19 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఈఓ నారాయణభరత్ గుప్త ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్‌లో వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. అందులో భాగంగా న్యూఢిల్లీకి చెందిన ఓల్గా సమ్మిట్ ఏవియేషన్ సంస్థకు చెందిన సభ్యుల బందం మంగళవారం క్షేత్రానికి చేరుకుని ఈఓతో సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ సంస్థ ఆధీనంలో కొన్ని హెలికాప్టర్లు ఉన్నందున ప్రయాణికులను హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి తీసుకొచ్చి దర్శనానంతరం తిరిగి హైదరాబాద్‌కు చేర్చే విషయంపై సాధ్యాసాధ్యాలను చర్చించినట్లు సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీతో పాటు శ్రీశైలంలో ఉన్న హెలిప్యాడ్‌లను కూడా ఈ బందం పరిశీలించినట్లు తెలిసింది. దీనిపై పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించాక ప్రభుత్వ అనుమతితో ఏవియేషన్ సంస్థతో దేవస్థానం అగ్రిమెంట్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
Advertisement