పుంగనూరు కోడె దూడ
సాక్షి, అమరావతి/ రైల్వేకోడూరు : దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పుంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. చింతలదీవి పశు క్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న ఘనీకృత పుంగనూరు జాతి పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో స్థానిక పశువైద్యుడు డాక్టర్ ప్రతాప్ మార్చి 4న ప్రవేశపెట్టగా, మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టినట్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరీఫ్ నిర్థారించారు.
చూలుకాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.2,500 విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు. ఈ నాటు ఆవు ఈనెల 17వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో మేలుజాతి పుంగనూరు జాతి కోడెదూడెకు జన్మనిచ్చింది. కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశువైద్యులు ధృవీకరించారు. దేశంలోనే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్సఫర్ విధానంలో పుంగనూరు కోడెదూడ జన్మించడం ఇది తొలిసారి.
తొలిసారిగా సాహివాల్ దూడకు..: గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించింది. తిరుపతి ఎస్వీ గో సంరక్షణ శాలలో మేలు జాతి ఆవుల అండాలు సేకరించి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయంలోని ఐవీఎఫ్ ల్యాబ్‌లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేసి టీటీడీ గోసాలలోని ఆవులలో ప్రవేశపెట్టి దేశంలోనే తొలిసారిగా సాహీవాల్ దూడకు జన్మనిచ్చేలా చేశారు.
ఈసారి ఓ రైతు ఇంట ఓ నాటు ఆవు గర్భంలో సరోగసి విధానంలో పిండమార్పిడి చేసి మేలుజాతి పుంగనూరు దూడకు జన్మనివ్వడం గమనార్హం. సమీప భవిష్యత్‌లో మేలుజాతి దేశీ ఆవుల సంతతిని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ సహకారంతో కృషిచేస్తామని చింతలదీవి పశు క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment