పోలింగ్ తర్వాత పంపిణీకి ఆదేశం
సీఎం కోడ్ ఉల్లంఘించారని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రైతు భరోసా పథకం కింద నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మే 13న ఎన్నికలు ముగిసి న తర్వాతే పంపిణీ చేయాలని ఆదేశించింది. నిధుల విడుదలపై ఆంక్షలు విధించింది. రైతు భరో సా విషయంలో రాష్ట్రానికి చెందిన ఎన్.వేణుకుమార్ సోమవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యా దు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా పథకం చెల్లింపులపై చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఫిర్యాదును పరిశీలించిన ఈసీ, ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉల్లఘించారని పేర్కొంది. రైతు భరోసా నిధుల విడుదలపై ఆంక్షలు విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు సమ్మతిని తెలుపుతూ నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోలింగ్ పూర్తయిన తర్వాతే..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధు నిధులు విడుదలకు సంబం«ధించి ఎన్నికల కమిషన్ విధించిన షరతులను ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన నేపథ్యంలో.. అంతకుముందు రైతు బంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్న (నవంబరు 27, 2023న) విషయం గుర్తు చేసింది.
ఎన్.వేణుకుమార్ ఫిర్యాదు, తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నివేదిక పరిశీలించిన తర్వాత.. నిధుల విడుదలకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడటం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడం గానే భావించినట్లు ఈసీ వివరించింది. రాష్ట్రంలో పోలింగ్ పూర్తయిన తర్వాత 2023 రబీ సీజన్ నిధులు విడుదల చేయాలని ఆదేశిస్తున్నట్లు తెలిపింది.
ఈసీ ఆదేశాలతోనే రైతు భరోసా ఆగింది: భట్టివిక్రమార్క
చౌటుప్పల్, మునుగోడు: రాష్ట్రంలోని రైతులందరికీ పూర్తిస్థాయిలో రూ.7,624 కోట్ల రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అందులో భాగంగా ఇప్పటికే ఐదు ఎకరాల వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని తెలిపారు. ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులకు సైతం సాయం అందించాలని భావించినప్పటికీ కొంతమంది ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, దాంతో ఈసీ ఆదేశాలతో నిధులు జమచేసే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం రాత్రి కార్నర్ మీటింగ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో స్థానికంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment