రాజంపేటలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు
స్కానింగ్ మెషీన్ స్వాధీనం
కామారెడ్డి టౌన్: మొబైల్ వైద్య పరీక్షల ముసుగులో ఇంటి వద్దకే వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన గురువారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్‌లో పని చేస్తూ గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు ఎలా చేయాలో నేర్చుకున్నాడు. ఓ గర్భిణి లింగనిర్ధారణ కేసులో ఆ ఆస్పత్రి రెండేళ్ల క్రితం సీజ్ కావడంతో రవీందర్ రాజంపేటలో స్వయంగా లింగనిర్ధారణ పరీక్షలు ప్రారంభించాడు. ఇందుకోసం ఓ మినీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు.
వాస్తవానికి అతనికి స్కానింగ్ చేసే అర్హత లేదు. అయితే వారి కుటుంబ వృత్తి అయిన బీడీ కార్ఖానా ముసుగులో స్కానింగ్ పరీక్షలు ప్రారంభించాడు. రోజూ బీడీల గంప పేరుతో జిల్లావ్యాప్తంగా పలు గ్రామాల్లో పర్యటించి గర్భిణీలకు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ చేస్తూ ఆడ, మగ శిశువు అని చెప్పి గర్భస్థ పిండాలను చిదిమేసేందుకు కారకుడయ్యాడు. కామారెడ్డి, గాంధారి, తాడ్వాయి, దోమకొండ, బీబీపేట, మాచారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇలా చాలా మండలాలకు తన ద్విచక్ర వాహనంపై మినీ స్కానింగ్ యంత్రాన్ని తీసుకెళ్లి గర్భిణి ఇంటి వద్దనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు.
ఆడ పిల్లలుండి మగ పిల్లలు కావాలనుకునే వారి గురించి ఆరాతీస్తూ గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో కామారెడ్డి సీసీఎస్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి రవీందర్ ఇంటిపై దాడి చేసి అరెస్టు చేశారు. ఇంట్లో ఉన్న స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment