పాపం తుమ్మపాల
- సీఎం ప్రకటనతో డోలాయమానంలో రైతులు
- వచ్చే సీజన్ క్రషింగ్‌పై నీలినీడలు
- మిల్లు భవితవ్యం సందిగ్ధం
కాలం చెల్లిన యంత్రాలతో నెట్టుకొస్తున్న తుమ్మపాల చక్కెర మిల్లుపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయే పరిస్థితులు కానరావడం లేదు. రైతులు,ఉద్యోగులు, కార్మికులు, చివరకు రాజకీయనాయకులు దీనిని సమస్యల నుంచి గట్టెక్కించేందుకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనలేకపోతున్నారు. ఏడాదికేడాది తగ్గిపోతున్న రికవరీ, దయనీయంగా క్రషింగ్ సామర్థ్యం వెరశి మిల్లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కర్మాగారాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు కూడా మూడు నెలల్లో కమిటీ నివేదిక అంటూ చెప్పి వెళ్లిపోవడంతో అన్ని వర్గాల్లో పరిస్థితి ఏమిటన్న వాదన వ్యక్తమవుతోంది.
అనకాపల్లి: సహకార రంగంలోని తుమ్మపాల చక్కెరమిల్లు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనిపై ఆధారపడి ఉన్న అన్ని వర్గాల్లోనూ కలవరం మొదలయింది. కర్మాగారం కష్టాల నుంచి తాత్కాలికంగా గట్టెక్కడానికి రూ.12 కోట్లు అవసరమని యాజమాన్యం ఇటీవల కర్మాగారాన్ని సందర్శించి సీఎం చంద్రబాబునాయుడుకు విన్నవించింది.
మూడు నెలల కమిటీ నివేదిక మేరకు న్యాయం చేస్తామంటూ చెప్పి ఆయన వెళ్లిపోయారు. వాస్తవానికి గతంలో చంద్రబాబు హయాంలోనే ఇది రెండేళ్లు మూతపడింది. మళ్లీ అధికారం చేపట్టిన చంద్రబాబు మిల్లు విషయంలో గతంలో చేసిన తప్పిదాలను సవరించుకుంటారని అంతా భావించినప్పటికీ ఊరటనిచ్చే ప్రకటన చేయలేదు. గతేడాదికి సంబంధించిన బకాయిలు టన్నుకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తామని ఇటీవల యాజమాన్యం ప్రకటించింది.
మిగిలిన మద్దతు ధర కోసం ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఫ్యాక్టరీ పరిధిలో13,400 మంది సభ్య రైతులు ఉన్నారు. మద్దతు ధర విషయంలో నమ్మకం లేని వీరంతా తుమ్మపాలకు చెరకు సరఫరాకు ఆసక్తి చూపడంలేదు. దీనికి తోడు ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదు. ఉద్యోగ విరమణ చేసినవారికి పీఎఫ్ వంటి బకాయిల చెల్లింపు పెండింగ్‌లోనే ఉంది.
ఇక వచ్చే సీజన్‌కు సమాయత్తం కావాలి. పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగాటకు రైతులు నవంబర్ నుంచి మిల్లుకు తరలిస్తుంటారు. అంటే ఈలోగా ఫ్యాక్టరీలో ఓవర్‌హాలింగ్ పనులు పూర్తి చేసి మిషనరీని సిద్ధం చేయాలి. కాలం చెల్లిన మిషనరీ ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని దుస్థితి. రెండేళ్లుగా ఈశాన్య రుతుపవనాలు వరదలు సృష్టించడంతో చెరకు పంటకు నష్టం వాటిల్లుతోంది.
రికవరీ శాతం పడిపోతోంది. ఇన్ని సమస్యలతో మిల్లు యాజమాన్యం కొట్టుమిట్టాడుతుండగా.. సీఎం మూడు నెలల కమిటీ ఎప్పుడు వస్తుందో..? నివేదిక ఎలా ఉంటుందో? తదుపరి ప్రభుత్వం స్పందన ఏమిటో రైతులకు అర్థం కావడం లేదు. ఈ పరిస్థితుల్లో రానున్న క్రషింగ్ సీజన్‌పై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఓవ ర్‌హాలింగ్ పనులకు నిధుల కొరత ప్రస్తుతం వేధిస్తుంది.
సీఎం తన పర్యటనలో మిల్లు గురించి కొద్దిసేపు ఆరా తీసి తాత్కాలిక ఉపశమనం కోసం రూ.12కోట్లు సర్దుబాటు చేసి ఉంటే ఊపిరిపోసినట్టయ్యేది. మూడు నెలల కమిటీ ప్రకటన పుణ్యమా అని ఇప్పటికిప్పుడు కర్మాగారానికి నిధులు సర్దుబాటు అనుమానమే. నవంబర్ లోపు ప్రభుత్వ స్పందన వేగంగా లేకుంటే రానున్న సీజన్‌పై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. రైతులకు, ఉద్యోగులకు కష్టాలు తప్పవని కర్మాగారం వర్గాలు మదనపడుతున్నాయి.