ఈనాడు, జ్యోతి, టీవీ-9 ఒక్కటై ప్రచారం చేశాయి..
గుంటూరు : ఓట్లు, సీట్ల కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి ఉండేదని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాలపై ఆయన గురువారం సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావడానికి ఏ గడ్డయినా తినేరకం చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు తప్పుడు వాగ్గానాలకు తోడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 ఒక్కటై ప్రచారం చేసి ఆయనను సీఎం పీఠంపై కూర్చోబెట్టాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లో టీడీపీ నేతలు తిరిగే పరిస్థితి లేదన్నారు. రుణాల విషయంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందన్నారు. బాబు పూటకో అబద్ధం, రోజుకో మాట చెబుతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరి సలహాలు, సూచనలు అవసరమని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించాలని ఆయన సూచించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. తొలి రోజు సమావేశానికి గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలపై నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.