సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవాలు విసిరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. ‘గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడమంటే వాస్తవాలను కప్పి పుచ్చడమే. అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలోని దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించి పెద్ద తప్పును చిన్న తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేశారని తేలుతోంది. ప్రతి రోజూ కొన్ని వేల లారీలతో ఖనిజాన్ని తరలించారు.
ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవరికీ తెలియదని అనుకోవాలా? ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీలో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా? రాష్ట్రంలో జరుగుతున్న అనేక దోపిడీల్లో ఇదొక దోపిడీ మాత్రమే. ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే ఏ సహజ వనరులనూ మిగల్చలేదు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తరువాత చంద్రబాబు గారు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. ‘మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది. మాకూ సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించలేదా? సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అలాంటి వ్యక్తి పల్నాడు గనుల దోపిడీపై సీఐడీ చేత దర్యాప్తు చేయించడం అపహాస్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజెన్సీతోనే గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయి’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
పల్నాడు గనుల దోపిడీపై సీబీఐతో విచారణకు చంద్రబాబుగారు సిద్ధమా? pic.twitter.com/vsNveKwePX
— YS Jagan Mohan Reddy (@ysjagan) 19 August 2018
Comments
Please login to add a commentAdd a comment