సాక్షి, గుంటూరు : రాజధాని పేరుతో టీడీపీ అందమైన కథలు చెప్పిందని ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో భూములు కొనుగోలు చేసి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని దుయ్యబట్టారు. బినామీ పేర్లతో టీడీపీ నేతలు వందల ఎకరాలు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. పంట భూములను నాశనం చేసి ప్లాట్లు వేయడానికి సింగపూర్ కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. గురువారమిక్కడ ఆయన మట్లాడుతూ... ఒక వ్యక్తి కోసం రాష్ట్రమంతా బలి కావాల్సి రావడం బాధకరమని విచారం వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు అసైన్‌్డ భూములను బలవంతంగా లాక్కొన్నారని ధ్వజమెత్తారు. దళితుల కుటుంబంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని బాబు వ్యాఖ్యానించినా ఎల్లో మీడియా ఆయనను మోస్తోందని విమర్శించారు.
‘రాష్ట్ర విభజన తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ హైదరాబాద్‌లో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంపై ఆధారపడ్డ ప్రాంతం. శ్రీకాకుళం నుంచి చిత్తూరుజిల్లా వరకు వ్యవసాయం ఎక్కువ మంది ఆధారపడ్డారు. గుంటూరు, నూజివీడు ప్రాంతంలో బాబు రాజధాని పేరుతో మాయ చేసి.. ఈ ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఎవరికి ఇబ్బంది లేకుండా రాజధానిని నిర్మించాల్సి పోయి.. సింగపూర్ ప్రభుత్వాన్నీ భాగస్వామ్యం చేశామని నమ్మించారు. చంద్రబాబు స్వలాభం కోసమే ఈ పరిస్థితి తీసుకువచ్చారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో ఎన్నో అక్రమాలు జరిగాయి. అవి త్వరలోనే బయటకు వస్తాయి’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి చంద్రబాబు తీరును విమర్శించారు.
ఆనాడు అసెంబ్లీలో చర్చకు రాలేదు..
‘అమరావతి పేరుతో దళితులు భూములు చంద్రబాబు లాక్కున్నారు. నిజానికి రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక అసెంబ్లీలో చర్చకు రాలేదు. కనీసం టేబుల్ ఐటమ్‌గా కూడా పెట్టలేదు.చంద్రబాబు బినామీలు భూములు కొన్నారు. ఎస్సీలను భయపెట్టి భూములు లాక్కుని అభివృద్ధి అని మాట్లాడుతున్నారు. దళితుల భూములతో బాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. చంద్రబాబు చట్టాలను ఉల్లంఘించారు. దళితులకు చెందిన లంక భూములు లాక్కుని, లేని లంక భూములను సృష్టించారు. రాజధానిపై పిలిచిన టెండర్ల విధానాన్ని ప్రపంచ బ్యాంకు తప్పు పట్టింది. రూ. 50 వేల కోట్లు టెండర్లు పిలిస్తే.. 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. చంద్రబాబు రూ. 277 కోట్లు ఖజానా నుంచి ఖర్చు చేశారు. రాజధాని పేరుతో దేశాలు చుట్టి వచ్చారు. ప్రజల్ని నమ్మించారు. అబద్ధాలు చెబుతూ.. గ్రాఫిక్స్ చూపిస్తూ చంద్రబాబు మోసం చేశారు. కాబట్టే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఇచ్చిన సూచనలు పాటించి.. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిని నిర్మిస్తాం’ అని బుగ్గన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment