సాక్షి, అమరావతి: రాజధాని బాండ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక వడ్డీ రేట్లకు చేస్తున్న అప్పులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వానికి మూడు రోజుల క్రితం పలు ప్రశ్నలు సందించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఆర్‌డీయే, కుటుంబరావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పలు అంశాలు ప్రస్తావించారు. కాగా ఈ అంశాల్లో వారి డొల్లతనాన్ని బుగ్గన మరోసారి ఘూటుగా ప్రశ్నించారు. ప్రభుత్వం తాను ప్రస్తావించిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిందంటూ మండిపడ్డారు. రాజధాని బాండ్ల విషయంలో వాస్తవాలను ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
బాండ్ల విషయంలో వడ్డీ రేటు 10.5 శాతం కాదని, 10.32 మాత్రమేనని ప్రభుత్వం చెబుతుందని వాటి మధ్య ఎంత తేడా ఉందో గమనించాల్సిందిగా ప్రజలను కోరారు. ముంబై స్టాక్ ఎక్చ్సేంజ్‌కు కమిషన్ ఇవ్వలేదని కుటుంబరావు చెప్పారు. కానీ ప్రభుత్వ జీవోలోనే 0.85 శాతం కమిషన్‌తో పాటు జీఎస్టీ చెల్లిస్తున్నట్టు రాసి ఉందని ఆయన గుర్తుచేశారు. జీఎస్టీ కలుపుకొని ఏకంగా 20 కోట్ల మేర కమిషన్ చెల్లించడం దారుణం కాదా అని ఆయన ప్రశ్నించారు. 2000 కోట్లకు 1573 కోట్లు మాత్రమే వడ్డీ కడుతున్నామని చెప్పడం ద్వారా ప్రజల సొమ్ము పట్ల వారు ఎంత ఆషామాషీగా వ్యవహరిస్తున్నారనేది అర్ధం అవుతుందన్నారు. అప్పుల విషయంలో ప్రభుత్వం జీవోల్లో రాసేది ఒకటి బయట వ్యవహరించేది మరోటి అని మండిపడ్డారు. ఇంత ఎక్కువ వడ్డీ రేటుకు అప్పులు ఎందుకు చేస్తున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అంతేకాకుండా కుటుంబరావు వివరణలోని లోపాలను ఎత్తి చూపారు.
Comments
Please login to add a commentAdd a comment