చంద్రబాబు నిర్వాకం వల్లే ఇదంతా.. | Buggana Rajendranath Reddy Slams Chandrababu Over Allegations On Power Finance | Sakshi
Sakshi News home page

బాబు.. అప్పు కూడా పుట్టకుండా చేశారు: బుగ్గన

Published Fri, Oct 11 2019 7:50 PM | Last Updated on Fri, Oct 11 2019 8:12 PM

Buggana Rajendranath Reddy Slams Chandrababu Over Allegations On Power Finance - Sakshi

సాక్షి, అమరావతి : పవర్‌ ఫైనాన్స్‌ అప్పుపై ప్రతిపక్షం ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేయడం తగదని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ రంగంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...గత ప్రభుత్వం డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టిందని తెలిపారు. విద్యుత్‌ను ఎక్కువ రేటుకు తీసుకోవడం వల్ల రూ. 2700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు.  టీడీపీ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందని.. ఇప్పుడు తమపై అసత్యాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘ హడావుడిగా పీపీఏలు కుదుర్చుకున్నారు. ధరలు తగ్గుతున్నాయని తెలిసినా ఎక్కువ రేట్లకు కొన్నారు. రూ. లక్షా 23వేల కోట్లుగా ఉన్న అప్పును 2.58 లక్షల కోట్లకు పెంచారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు 9 నెలల జీతాలు పెండింగ్‌లో పెట్టారు. అయితే బడా కాంట్రాక్టర్లకు మాత్రం ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ. 3358 కోట్లు చెల్లించారు. అదే నెలలో రూ. 5 వేల కోట్లు అప్పులు తెచ్చారు. సివిల్‌ సప్లైయ్స్‌ కార్పొరేషన్‌ను నిండా అప్పుల్లో ముంచారు. డబ్బులన్నీ పసుపు- కుంకుమకు వాడేశారు. నచ్చిన కాంట్రాక్టర్లకు రూ. 1060 కోట్లు చెల్లించారు. ఎన్నికలకు ముందు రూ. 38 వేల కోట్ల సప్లిమెంటరీ గ్రాంట్‌ తీసుకున్నారు’ అని గత ప్రభుత్వ తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు తెలియదా..?
విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది బాబు ప్రభుత్వం కాదా అని బుగ్గన ప్రశ్నించారు. రూ. 7 వేల 200 కోట్ల నష్టాన్ని రూ. 14 వేల కోట్లకు పెంచారని మండిపడ్డారు. ‘ఎక్కువ ధరకు పవన విద్యుత్ కొనుగోలు చేశారు. దాని వలన ఇప్పటిక వరకు రూ. 2700 కోట్లు నష్టం వాటిల్లింది. థర్మల్ విద్యుత్ తక్కువకి వచ్చినా విండ్ పవర్ కోసం లాలూచీ పడి ఒప్పందాలు చేసుకున్నారు. మద్యం కంపెనీలకు రేట్లు ఎవరు పెంచారు..? విలువ ఆధారిత పన్ను, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ గత ప్రభుత్వంలో వేసినవే.10 శాతం మార్జిన్, బాటిల్‌పై పెంచిన ధరల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కంపెనీలకు ఎలా వెళ్తుంది..? చంద్రబాబు తెలిసీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. టీడీపీ వాళ్ళు మద్యపాన నిషేధం కోసం మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు’అని మంత్రి ఎద్దేవా చేశారు. తాము మద్యపాన నిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. 

చంద్రబాబు నిర్వాకం వల్లే ఇలా
‘అందరినీ ప్రశ్నిస్తానంటున్న చంద్రబాబు అక్రమ నివాసంలో ఎందుకు ఉంటున్నారో చెప్పాలి. యనమల కూడా మాట్లాడుతున్నారు. రూ. 2 లక్షల 58 వేల కోట్లకు ప్రజా అప్పులు పెంచింది మీరు కాదా..? రూ. 42 వేల కోట్ల బిల్లులు అప్పులు పెట్టి వెళ్లిపోయారు. మధ్యాహ్న భోజనం, విద్యుత్ బకాయిలు, ఆస్పత్రి వస్తువుల అప్పులు, ఔట్ సోర్సింగ్ జీతాలు పెండింగ్‌లో పెట్టారు. అప్పులను 3 నెలల్లో సరిదిద్దడం సాధ్యమా..?? బడా కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం చెల్లించేశారు. వీళ్ళు తలసరి ఆదాయం గురించి మాట్లాడతారా..? 25 శాతం నుంచి 22 శాతానికి పారిశ్రామిక రంగం తగ్గింది. అప్పు 20 శాతం నుండి 28 శాతానికి పెంచారు. బాబు, యనమల అధికారంలోకి వస్తే.. అప్పు, పేదరికం పెంచుతారనే విషయం తెలిసిందే. గతంలో ఇదే చేశారు. రూ. 38 వేల కోట్లు సప్లిమెంటరీ గ్రాంట్ తీసుకున్నారు. వెళ్లిపోతూ రూ. 65 వేల కోట్లు చెల్లింపులు బాధ్యత ఇచ్చి...అప్పు కూడా పుట్టకుండా చేశారు. చంద్రబాబు నిర్వాకాల వల్లనే విద్యుత్ కోతల సమస్య’ అని బుగ్గన చంద్రబాబు తీరును ఎండగట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement