బిల్లు అందదు.. చింత తీరదు | No Money from factory after crushing completes also | Sakshi
Sakshi News home page

బిల్లు అందదు.. చింత తీరదు

Published Wed, Apr 29 2015 12:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

No Money from factory after crushing completes also

క్రషింగ్ ముగిసినా అందని చెరకు బిల్లులు
- మూడు నెలలుగా పేరుకుపోయిన బకాయిలు
- ట్రైడెంట్, ఎన్‌డీఎస్‌ఎల్ తీరుపై రైతుల ఆందోళన

చెరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. సాగు మొదలు పెట్టిన నాటి నుంచి దిగుబడులను ఫ్యాక్టరీకి తోలే వరకే కాదు... బిల్లులు వచ్చేంతవరకు వారిని సమస్యలు వీడడం లేదు. గిట్టుబాటు ధర రాక.. యాజమాన్యం ప్రకటించిన ధర మొత్తం ఒకేసారి అందక సతమతమవుతున్నారు. ఏటా యాజమాన్యం కొంత మొత్తాన్ని పెండింగ్‌లో పెట్టడం కూడా వీరిని ఇబ్బందుల పాల్జేస్తోంది. మెదక్‌లోని ఎన్‌డీఎస్‌ఎల్‌ను ఎత్తేస్తారనే ప్రచారం సాగుతోండడంతో అక్కడి రైతులు బిల్లుల కోసం ఆందోళన చెందుతున్నారు. ఎన్‌డీఎస్‌ఎల్.. రూ.27 కోట్లకుగాను రూ.7 కోట్లే చెల్లించింది. ఇక ట్రైడెంట్ రూ.53.63 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ. 53 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.

జహీరాబాద్: స్థానికంగా గల ట్రైడెంట్ చక్కెర కర్మాగారం పరిధిలోని రైతులు చెరకు బిల్లుల కోసం నానా తంటాలు పడుతున్నారు. గురువారం రాత్రితో క్రషింగ్ ముగిసినా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జనవరి 22 వరకు మాత్రమే బిల్లులు చెల్లించిందని రైతులు పేర్కొంటున్నారు. జనవరి 31వరకు చెరకు బిల్లులను బ్యాంకులకు విడుదల చేసినట్టు అధికారులు చెబుతున్నారు. చెరకును సరఫరా చేసిన 14 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నా యాజమాన్యం తుంగలో తొక్కి ఇబ్బందులకు గురిచేస్తోందని రైతులు పేర్కొంటున్నారు. బిల్లులు సకాలంలో అందకపోవడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ట్రైడెంట్ కర్మాగారం  రూ.53.63 కోట్లు ఇవ్వగా, ఇంకా రూ. 53 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.

ఈ సీజన్‌లో 5.54 లక్షల టన్నుల క్రషింగ్...
ఈ సీజన్‌లో కర్మాగారం 5.54 లక్షల టన్నుల చెరకును గానుగాడించింది. ఈ లెక్కన పూర్తి స్థాయి బిల్లులు చెల్లించాల్సి ఉన్నా ఆ మేరకు జరగలేదు. పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని చూస్తే యాజమాన్యం ప్రకటించిన ధర ఏ మాత్రం గిట్టుబాటుగా కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. అది కూడా పూర్తిగా చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెరకు కోత, రవాణా ఖర్చుల కింద టన్నుకు రూ.1,000 వరకు ఖర్చు చేసుకోవాల్సి వచ్చిందని, ఇందుకోసం కూడా అప్పులు చేయాల్సి వచ్చిందని వారంటున్నారు.

ఇచ్చే బిల్లుల్లో సైతం కోత..
రైతులకు యాజమాన్యం చెల్లిస్తున్న చెరకు బిల్లుల్లో కూడా కోత విధిస్తోంది. టన్నుకు రూ.2,600 ధర చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ప్రస్తుతం రైతులకు టన్నుకు రూ.2,340 మాత్రమే చెల్లిస్తోంది. పూర్తి బిల్లులు చెల్లిస్తే సౌలభ్యంగా ఉండేదని రైతులంటున్నారు. కోత విధించిన మిగతా మొత్తం (టన్నుకు రూ.260 చొప్పున) ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొందంటున్నారు.

గత ఏడాది సైతం టన్నుకు రూ.200 చొప్పున బకాయి పడిన మొత్తాన్ని క్రషింగ్ ఆరంభంలో చెల్లించినట్టు వారు తెలిపారు.ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూడాలంటున్నారు. పంట దిగుబడులు పడిపోయాయని, పెట్టుబడుల వ్యయం కూడా పెరిగిందన్నారు. క్రషింగ్ ముగిసినందున పూర్తి బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.
 కొనుగోలు పన్నూ యాజమాన్యం

ఖాతాలోనే...
చెరకు కొనుగోలు పన్నును ప్రభుత్వం యాజ మాన్యాలకే చెల్లిస్తుండడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.60 కొనుగోలు పన్ను చెల్లిస్తోంది. యాజ మాన్యం మాత్రం ప్రభుత్వం ఇచ్చే ఈ పన్నును కలుపుకొని ధర నిర్ణయిస్తోంది. ఈ రకంగా కూడా తాము నష్టపోతున్నామని రైతులంటున్నారు. కొనుగోలు పన్నును నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement