మెదక్ రూరల్: ఇప్పుడు..అప్పుడంటూ..ఇన్నాళ్లూ క్రషింగ్ తేదీలను వాయిదా వేస్తూ వచ్చిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్డీఎస్‌ఎల్) శనివారం చెరకు రైతులకు చేదు వార్త చెవిన వేసింది. వాతావరణ పరిస్థితుల వల్ల క్రషింగ్ సమయానికి ఇంకొంత సమయం పడుతుందని, అందువల్ల ఫ్యాక్టరీకి తెచ్చిన చెరకును బోదన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలని సూచించింది. దీంతో చేసేది లేక నాలుగు రోజులుగా ఫ్యాక్టరీ వద్ద పడిగాపులుగాచిన రైతులు చెరకును తీసుకుని బోధన్ బాట పట్టారు.
మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో 12 మండలాల చెరకు రైతుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాతికేళ్ల క్రితం ఎన్‌ఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని నిర్మించింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు ప్రభుత్వం నష్టాలను సాకుగా చూపుతూ ఆ ఫ్యాక్టరీని దక్కన్ పేపర్ మిల్లు యజమానికి చాలా తక్కువకు విక్రయించింది. నాటి నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులతో పాటు ఈ ప్రాంత చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రషింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభించడం...డబ్బు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో చెరకు రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
నెల ఆలస్యమన్నారు...ఇపుడు అదీలేదు
ఎన్డీఎస్‌ఎల్‌లో ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి వారంలో క్రషింగ్‌ను ప్రారంభించాల్సి ఉండగా, ఈ సంవత్సరం డిసెంబర్ 10న క్రషిం గ్‌ను ప్రారంభించారు. అయితే ఇంతవరకు టన్ను చెరకును కూడా గానుగ ఆడించలేదు. అయితే క్రషింగ్ తేదీని యాజమాన్యం ముందుగానే ప్రకటించడంతో 12 మండలాల నుంచి వందలాది మంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలతో చెరకును ఫ్యాక్టరీకి తరలించారు. తీరా నాలుగు రోజులు గడిచాక, వాతావరణం చల్లగా ఉందన్న సాకును చూపుతూ క్రషింగ్ ప్రారంభించలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. ఎన్డీఎస్‌ఎల్‌లో క్రషింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున రైతులంతా తమ చెరకును బోధన్‌లోని ఫ్యాక్టరీకి తీసుకువెళ్లాలని సూచించింది.
కావాలంటే బోధన్ వరకు రవాణా చార్జీల కింద టన్నుకు రూ.400 చొప్పున చెల్లిస్తామని వెల్లడించింది. దీంతో ఇప్పటికే నాలుగురోజులుగా ఫ్యాక్టరీ ఎదుట చెరకుతో నిరీక్షిస్తున్న రైతులు ఏం చేయాలో తెలియని స్థితిలో బోధన్ బాటపట్టారు. అయితే 100 కి.మీ దూరం తీసుకెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారిందని, పైగా చెరకు బరువు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాలకులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా నడిచేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
అధికారి వివరణ
ఈ విషయంపై ఫ్యాక్టరీ జీఎం నాగరాజును వివరణ కోరగా వాతావరణ చల్లగా ఉన్నందున క్రషింగ్ నడవటం లేదు. అందుకే నాలుగు రోజులుగా నిలువ ఉన్న చెరకును బోధన్ పంపుతున్నామని తెలిపారు.
చేదు కబురు
Published Sat, Dec 13 2014 11:30 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement