- చెరకు రైతులను నిరాశపరిచిన
- టన్ను రూ.2270 మద్దతు ధర
- ఇలా అయితే వచ్చే ఏడు చెరకు వేయలేమంటున్న రైతాంగం
- రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
'చెరకు రైతులను హుద్‌హుద్ తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడులు 40 శాతం మేర పెరిగాయి. చెరకు టన్ను కనీస ధర కేంద్రం రూ.2500లైనా ప్రకటిస్తుందని రైతులు ఆశించారు. కేవలం రూ.2125 ధర ప్రకటించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుంటే ఇక చెరకు పంట వేసే పరిస్థితి ఉండదని అంటున్నారు.
చోడవరం: చెరకు రైతుల కష్టాలు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మద్దతు ధరపై ఏటా వీరు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కనికరించడంలేదు. ఐదేళ్లుగా చెరకు రైతులకు మద్దతు ధర లేక ఏటా అప్పుల పాలవుతున్నారు. రైతులకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది కూడా రైతులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర ప్రకటించలేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడులు 40 శాతం మేర పెరిగాయి.
కనీస గిట్టుబాటు ధర రూ.145 మాత్రమే పెంచుతూ కేంద్ర వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ కమిటీ తాజాగా ప్రకటించింది. గత ఏడాది చెరకు టన్నుకు రూ.2125 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ఈ ఏడాది రూ. 2,270గా ప్రకటించింది. 2013-14 సీజన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒక్కపైసా ఫ్యాక్టరీలకు ఇవ్వకపోయినా గోవాడ ఫ్యాక్టరీ టన్నుకు రూ.2350, ఏటికొప్పాక రూ.2125, తాండవ రూ.2వేలు, అనకాపల్లి ఫ్యాక్టరీ రూ.1800 చొప్పున రైతులకు చెల్లించాయి. కేంద్రం ఈ ఏడాది టన్నుకు కనీస మద్దతు ధర రూ.2500 ప్రకటిస్తుందని రైతులంతా ఎదురు చూడగా ఆ ఆశ కూడా లేకుండాపోయింది.
హుద్‌హుద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్న అయిదు సహకార చక్కెర కర్మాగారాలు తీవ్రంగా నష్టపోయాయి. చెరకు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సరిగ్గా చెరకు పంట ఎదుగుతున్న సమయంలో తుఫాన్ రావడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. ఎకరాకు 30-40 టన్నులకు పైబడి దిగుబడి వచ్చే చెరకు ఈ ఏడాది కనీసం 15-20 టన్నులు కూడా రాలేదు. పెట్టుబడి మాత్రం ఎకరాకు సుమారు రూ.45 వేలకు మించి ఖర్చుపెట్లాల్సి వచ్చింది.
ఈ పరిస్థితిలో టన్నుకు కనీస మద్దతు ధర రూ.2600 నుంచి 3 వేల వరకు ఇస్తే కాని రైతుకు గిట్టుబాటు కాదు. అలాంటిది కేంద్రం కనీస మద్దతు ధర రూ. 2270 ప్రకటించడంపై రైతుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది కూడా 9.5 రికవరీ ఉంటేనే ఈ ధర ఇస్తారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న సుగర్ ఫ్యాక్టరీలు సాధారణ సీజన్లలోనే ఇంత రికవరీని సాధించడం లేదు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత, ఫ్యాక్టరీలు కొంత కలిపి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాల్సి ఉంది.
మరో పక్క ప్యాక్టరీలైనా అదనపు ప్రోత్సాహకం ఇస్తాయనుకుంటే మార్కెట్‌లో పంచదార ధరలు ఘోరంగా పడిపోయి అవికూడా చదికిలబడే పరిస్థితి నెలకొంది. పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది చెరకు విస్తీర్ణం 20 శాతం జిల్లాలో తగ్గిపోయింది. పెట్టుబడులు పెరిగిపోవడంతో అంతా సరుగుడు పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించిన ధరకు అదనంగా టన్నుకు రూ.300-500 వరకు రాష్ట్రం ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకుంటే తప్ప వచ్చే సీజన్‌కు చెరకు పంట వేసే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.
గిట్టుబాటు ధర ఘోరం
ఈ ఏడాది చెరకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేను 3 ఎకరాల్లో చెరకు వేశాను. తుఫాన్ వల్ల తోట ఎదుదల తగ్గిపోయింది. కనీసం 20 టన్నులు కూడా దిగుబడి రాలేదు. పెట్టుబడి ఎకరాకు రూ.40 వేలకు పైబడి ఖర్చయింది. ఇప్పుడు గిట్టుబాటు ధర చూస్తే ఘోరంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకోవాలి.
-అడ్డూరు పాల, చెరకు రైతు, లక్కవరం
ఇలా అయితే చెరకు పండించలేం
ఈ ఏడాది గిట్టుబాటు ధర ఆశించిన మేర ఇవ్వకపోతే వచ్చే ఏడాది చెరకు పండించడం కష్టమే. పెట్టుబడులు చూస్తే చాలా పెరిగిపోయాయి. డీఏపీ, యూరియా ధరలతోపాటు విత్తనం ఖరీదైపోయింది. తుఫాన్ వల్ల అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో తుఫాన్‌కు తోటలన్నీ నీటిలో మునిగిపోయి చాలా రోజులు ఉండిపోవడం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్రప్రభుత్వం ఆదుకొని టన్నుకు రూ.2600 పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలి.
-అప్పలనాయుడు, చెరకు రైతు, చాకిపల్లి