Hudhud area
-
ఈ ఇళ్లు ఏమూలకు..
లక్షల్లో దెబ్బతిన్న గృహాలు అయినా ఆరు వేల ఇళ్ల నిర్మాణానికే సర్కారు సంకల్పం ఈ ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపన విశాఖపట్నం: హుద్‌హుద్ తుఫాన్ బాధితుల కోసం ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల్లో నిర్మించతలపెట్టిన గృహ నిర్మా ణ సముదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. గతేడాది హుద్‌హుద్ పెనుతుఫాన్ ఉత్తరాంధ్రను కకావికలం చేసింది. ఒక్క విశాఖలోనే లక్షా 20వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయనగరం, శ్రీకాకుళంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో మరో లక్ష ఇళ్ల వరకు రూపురేఖలు లేకుండా పునాదులు కదిలిపోయాయి. ఇంటికి తీవ్రతను బట్టి రూ.5వేలను రూ.50వేల వరకు ఆర్ధిక సహాయం చేశారు. చిరునామాలు దొరక్క,అకౌంట్లు, ఆధార్ నెంబర్లు సరిపోకపోవడంతో సుమారు 50వేల మంది వరకు ఇంకా పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఇళ్లు దెబ్బతిన్న 2లక్షల మందిలో మూడో వంతు మంది ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సహాయం కోసం ఎనిమిది నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. తుపాను సమయంలో కేంద్రప్రభుత్వం వెయ్యికోట్లు ప్రకటించి రూ.650 కోట్ల వరకు సాయం అందజేసింది. దేశవిదేశాల నుంచి విరాళాల పేరుతో ప్రభుత్వానికి వందల కోట్లు సమకూరాయి. మరో పక్క ప్రపంచ బ్యాంకు రూ.2350 కోట్ల ఆర్ధిక సహాయం చేసేందుకు అంగీకరించింది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూరినా తుఫాన్ పునర్నిర్మాణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.8 నెలల తర్వాత అదీ దాతల సహకారంతో కేవలం 10వేల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించారు. రూ.560 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు టెండర్లు కొలిక్కిరాలేదు. ఈ ప్రాజెక్టుకు బుధవారం సీఎం శ్రీకారం చుట్ట బోతున్నారు. ఇన్ఫోసిస్, బీహెచ్ఈఎల్,సీసీఎల్ హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలు అందజేసిన రూ.170కోట్లకు మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ర్ట ప్రభుత్వం మరో రూ.170కోట్లు సమకూర్చ నుండగా రూ.10కోట్ల వరకు లబ్దిదారులు వాటాగా భరించనున్నారు. మిగిలిన మొత్తాన్ని స్వచ్చ భారత్ మిషన్ నుంచి సమకూర్చనున్నారు. ఈ ప్రాజెక్టులో ఇళ్లు విశాఖలో 6వేలు, శ్రీకాకుళం జిల్లాలో 2,500, విజయనగరం జిల్లాలో 1500 ఇళ్లు నిర్మించ నున్నారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం పేరుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం వుడా పార్కులో ప్రత్యేకంగా ఫైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 9.40 గంటలకు ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎందరికి కేటాయి స్తున్నారు అన్న దానిపై స్పష్టత లేకపోవడం విశే షం. అనంతరం నోవాటెల్‌లో ఇం డస్ట్రీమిషన్ను ప్రారంభించి ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నారు. -
ఈ సారీ చేదు ధరే
చెరకు రైతులను నిరాశపరిచిన టన్ను రూ.2270 మద్దతు ధర ఇలా అయితే వచ్చే ఏడు చెరకు వేయలేమంటున్న రైతాంగం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ 'చెరకు రైతులను హుద్‌హుద్ తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడులు 40 శాతం మేర పెరిగాయి. చెరకు టన్ను కనీస ధర కేంద్రం రూ.2500లైనా ప్రకటిస్తుందని రైతులు ఆశించారు. కేవలం రూ.2125 ధర ప్రకటించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుంటే ఇక చెరకు పంట వేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. చోడవరం: చెరకు రైతుల కష్టాలు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మద్దతు ధరపై ఏటా వీరు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కనికరించడంలేదు. ఐదేళ్లుగా చెరకు రైతులకు మద్దతు ధర లేక ఏటా అప్పుల పాలవుతున్నారు. రైతులకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది కూడా రైతులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర ప్రకటించలేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడులు 40 శాతం మేర పెరిగాయి. కనీస గిట్టుబాటు ధర రూ.145 మాత్రమే పెంచుతూ కేంద్ర వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ కమిటీ తాజాగా ప్రకటించింది. గత ఏడాది చెరకు టన్నుకు రూ.2125 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ఈ ఏడాది రూ. 2,270గా ప్రకటించింది. 2013-14 సీజన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒక్కపైసా ఫ్యాక్టరీలకు ఇవ్వకపోయినా గోవాడ ఫ్యాక్టరీ టన్నుకు రూ.2350, ఏటికొప్పాక రూ.2125, తాండవ రూ.2వేలు, అనకాపల్లి ఫ్యాక్టరీ రూ.1800 చొప్పున రైతులకు చెల్లించాయి. కేంద్రం ఈ ఏడాది టన్నుకు కనీస మద్దతు ధర రూ.2500 ప్రకటిస్తుందని రైతులంతా ఎదురు చూడగా ఆ ఆశ కూడా లేకుండాపోయింది. హుద్‌హుద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్న అయిదు సహకార చక్కెర కర్మాగారాలు తీవ్రంగా నష్టపోయాయి. చెరకు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సరిగ్గా చెరకు పంట ఎదుగుతున్న సమయంలో తుఫాన్ రావడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. ఎకరాకు 30-40 టన్నులకు పైబడి దిగుబడి వచ్చే చెరకు ఈ ఏడాది కనీసం 15-20 టన్నులు కూడా రాలేదు. పెట్టుబడి మాత్రం ఎకరాకు సుమారు రూ.45 వేలకు మించి ఖర్చుపెట్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో టన్నుకు కనీస మద్దతు ధర రూ.2600 నుంచి 3 వేల వరకు ఇస్తే కాని రైతుకు గిట్టుబాటు కాదు. అలాంటిది కేంద్రం కనీస మద్దతు ధర రూ. 2270 ప్రకటించడంపై రైతుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది కూడా 9.5 రికవరీ ఉంటేనే ఈ ధర ఇస్తారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న సుగర్ ఫ్యాక్టరీలు సాధారణ సీజన్లలోనే ఇంత రికవరీని సాధించడం లేదు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత, ఫ్యాక్టరీలు కొంత కలిపి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాల్సి ఉంది. మరో పక్క ప్యాక్టరీలైనా అదనపు ప్రోత్సాహకం ఇస్తాయనుకుంటే మార్కెట్లో పంచదార ధరలు ఘోరంగా పడిపోయి అవికూడా చదికిలబడే పరిస్థితి నెలకొంది. పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది చెరకు విస్తీర్ణం 20 శాతం జిల్లాలో తగ్గిపోయింది. పెట్టుబడులు పెరిగిపోవడంతో అంతా సరుగుడు పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించిన ధరకు అదనంగా టన్నుకు రూ.300-500 వరకు రాష్ట్రం ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకుంటే తప్ప వచ్చే సీజన్‌కు చెరకు పంట వేసే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర ఘోరం ఈ ఏడాది చెరకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేను 3 ఎకరాల్లో చెరకు వేశాను. తుఫాన్ వల్ల తోట ఎదుదల తగ్గిపోయింది. కనీసం 20 టన్నులు కూడా దిగుబడి రాలేదు. పెట్టుబడి ఎకరాకు రూ.40 వేలకు పైబడి ఖర్చయింది. ఇప్పుడు గిట్టుబాటు ధర చూస్తే ఘోరంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకోవాలి. -అడ్డూరు పాల, చెరకు రైతు, లక్కవరం ఇలా అయితే చెరకు పండించలేం ఈ ఏడాది గిట్టుబాటు ధర ఆశించిన మేర ఇవ్వకపోతే వచ్చే ఏడాది చెరకు పండించడం కష్టమే. పెట్టుబడులు చూస్తే చాలా పెరిగిపోయాయి. డీఏపీ, యూరియా ధరలతోపాటు విత్తనం ఖరీదైపోయింది. తుఫాన్ వల్ల అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో తుఫాన్‌కు తోటలన్నీ నీటిలో మునిగిపోయి చాలా రోజులు ఉండిపోవడం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్రప్రభుత్వం ఆదుకొని టన్నుకు రూ.2600 పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలి. -అప్పలనాయుడు, చెరకు రైతు, చాకిపల్లి -
ఇలాగేనా ఆదుకోవడం
నష్టానికి తగ్గ సాయం అందలేదు కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ర్టం విఫలం మరింత సాయం కోసం నివేదిస్తాం రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ అవసరం విపత్తు సాయం పెంచేలా పాలసీ మార్పు కోసం సిఫార్సు చేస్తాం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సాక్షి, విశాఖపట్నం: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండురోజుల పర్యటన ముగిసింది. హుద్‌హుద్ తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి..అందిన సాయానికి పొంతన లేదని తమ పర్యటనలో గుర్తించినట్టు పేర్కొన్న కమిటీ సభ్యులు సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నామన్నారు. విపత్తు వచ్చి మూడు నెలలైనా బాధితులు నేటికీ తేరుకోలేక పోతున్నా రని..నిబంధనలనుపక్కనపెట్టి వారిని ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తీవ్రంగా నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రం నుంచి మరింత మెరుగైన సాయం అందే విధంగా తాము నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు. సీనియర్ పార్లమెంటేరియన్ పి.భట్టాచార్య నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ కారిడార్‌ను పరిశీలించి పరిశ్రమలకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుంది. అనంతరం నేరుగా అనకాపల్లి మండలం సుబ్రహ్మణ్యకాలనీ, రాంబిల్లి మండలం గొరపూడి గ్రామాల్లో పర్యటించిన కమిటీ సభ్యులు దెబ్బతిన్న ఇళ్లు, నేలకూలిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని కమిటీ సభ్యుల ఎదుట బాధితులు గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా గోరపూడిలో కొబ్బరి రైతులు మాట్లాడుతూ చెట్టుకు రూ.1000 చొప్పున ఇచ్చారని, ఈ మొత్తం కనీసం చెట్టును నరికి..తరలించేందుకు కూడా సరిపోలేదని, ప్లాంటేషన్‌కు ఎలాంటి సాయం లేదని వాపోయారు. కేంద్రానికి నివేదించి తగిన రీతిలో సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చట్టంలో మార్పునకు సిఫారసు చేస్తాం విపత్తుల్లో దెబ్బతిన్న ప్రాంతాలకు జాతీయ ప్రకృతి విపత్తుల నిధి నుంచి మరింత సాయం అందేలా చట్టంలో నిబంధనలు మార్చేలా సిఫారసు చేస్తామని కమిటీ చైర్మన్ భట్టాచార్య అన్నారు. తరచూ ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనే ఆంధ్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు కూడా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వ పథకాలకు విడుదల చేసే నిధుల్లో 10 శాతం నిధులను ఇలాంటి విపత్తుల సమయంలో వినియోగించుకోవచ్చునని సూచించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచే కాకుండా రాష్ర్ట ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేటు రంగ పరిశ్రమల నుంచి కూడా విపత్తులకు సీఆర్ఎస్ నిధులు వినియోగించవచ్చునన్నారు. మరపడవలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం వాటిల్లినప్పుడు సాయానికి ప్రస్తుత చట్టంలోని నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయన్నారు. తుఫాన్ అనంతరం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు తుఫాన్‌కు దెబ్బతిన్న గ్రామాలను దత్తత తీసుకుని జిల్లా అధికారుల సహకారంతో ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావాలని కమిటీ చైర్మన్ భట్టాచార్య సూచించారు. విశాఖ పోర్టు ట్రస్టుకు జరిగిన నష్టంపై ట్రస్ట్ సీఎండీ కృష్ణబాబు, సహాయ పునరావాస చర్యలపై విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎఆర్ సుకుమార్, జిల్లాలో చేపట్టిన సహాయ చర్యలపై కలెక్టర్ ఎన్.యువరాజ్లు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చారు. అనంతరం ప్రత్యేక విమానంలో కమిటీ సభ్యులు ఢిల్లీకి పయనమయ్యారు. కమిటీ సభ్యులు సీతారాం ఏచూరి, వైష్ణభ్పరీడా, సెల్వకుమార్, చిన్నయన్చ, కింజరపు రామ్మోహననాయుడు, హరీష్ మీనా, నాగరాజన్, డాక్టర్ సత్యపాల్ సింగ్, బిష్ణుపాదర్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్చార్జి కలెక్టర్లు బి.రామారావు, వివేక్ యాదవ్,వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు, జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బాబూరావునాయుడు, ఏపీఈపీడీసీఎస్ సీఎండీ శేషగిరిబాబు, డీఆర్వో నాగేశ్వరరావ పాల్గొన్నారు. కేంద్రం నిధులు ఏమైనట్టు? హుద్‌హుద్ తుఫాన్‌కు దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకునేందుకు కేంద్రం, దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ కలిసి ప్రకటించిన ఆర్ధిక సాయం ఏమైందో అంతుచిక్కడం లేదని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చిస్తామని పార్లమెంటరీ స్టాండింగ్ కమీటీ చైర్మన్ పి.భట్టాచార్య అన్నారు. కమిటీ చైర్మన్ పి.భట్టాచార్య, సభ్యులు సీతారాం ఏచూరి తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ లెక్కలకు అందని నష్టం జరిగిందని, కానీ కేంద్ర సాయం కోసం సమగ్రమైన నివేదికలందించడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రకటించిన రూ. వెయ్యి కోట్లలో కేవలం రూ.435 కోట్లు మాత్రమే విడుద లైందని, మిగిలిన మొత్తాన్ని ఎందుకు విడుదల చేయలేదో తాము పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు. జరిగిన నష్టం అపారంగా ఉంటే ప్రకటించిన సాయాన్ని రూ.680కోట్లకు కుదించడం సమంజం కాదని చెప్పారు. తుఫాన్ సంభవించిన వెంటనే ఎంపీ లాడ్స్ నుంచి ఒక్కొక్కరు రూ.50 లక్షల చొప్పున దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా ఏకగ్రీవంగా మంజూరు చేశారని, అలా సమకూరిన రూ.400 కోట్లకు పైగా నిధులు ఏం చేసారో లెక్కాపత్రం లేదని తప్పుపట్టారు. ఈ అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తు తామన్నారు. -
ఉత్సవ్ కలెక్షన్
విశాఖఉత్సవ్ కోసం భారీగా టార్గెట్లు నలిగిపోతున్న పారిశ్రామిక సంస్థలు.. దాతలు {పజాప్రతినిధుల మెప్పుకోసంఅధికారుల వెంపర్లాట నిర్వహణ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు విశాఖపట్నం: సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చినట్టుంది విశాఖ ఉత్సవ్ నిర్వహణ తీరు. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించతలపెట్టిన ఈ ఉత్సవాల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి విదిల్చిన పాపానపోలేదు. భారమంతా ప్రయివేట్ సంస్థలపై మోపుతున్నారు. దీంతో ఈ పేరు వింటేనే ప్రయివేటు సంస్థలు.. పరిశ్రమల యజమానులు భయపడుతున్నారు. ఉత్సవాల నిర్వహణకు రూ.5కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు లెక్కలేస్తున్నారు. వుడా రూ.50 లక్షలు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. ఏపీ టూరిజంతో సహా అనుబంధ శాఖల న్నీ దాదాపు చేతులెత్తాశాయి. దీంతో ‘ప్రయివేటు’ గా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ‘మంత్రి గారు ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని త లపెట్టారు. ఆయనకు మాట రాకూడదు.. నిర్వహణలో ఎక్కడా ఫెయిల్ కాకూడదంటూ ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉదయం కలెక్టరేట్లో..మధ్యాహ్నం వుడాలో.. సాయంత్రం సర్క్యూట్ హౌస్‌లో అన్నట్టుగా సాగుతున్న ఈ సమీక్షల సారాంశం ఒక్కటే. ఎవరెవరు ఎంత ఇస్తామన్నారు? ఇప్పటి వరకు ఎంత ఇచ్చారు? మిగిలిన మొత్తం ఎప్పటిలోగా ఇవ్వను న్నారు? చెప్పండంటూ రహస్య(ఇన్‌కెమెరా)సమావేశాల్లో టార్గెట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోక అధికారులు తలలుపట్టుకుంటున్నారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల అన్ని వర్గాలతోపాటు పారిశ్రామిక రంగానికి తీరని నష్టం వాటిల్లింది. ఈనష్టాన్ని పూడ్చేచర్యలు చేపట్టడంలో అటు కేంద్రం..ఇటు రాష్ర్టం ఇప్పటివరకూ రూపాయి విదిల్చింది లేదు. పుట్టెడు నష్టాల్లో ఉన్న ఈసంస్థలకు ఇప్పుడు ఉత్సవాల పేరిట ఇండెంట్లు పెడుతున్నారు. ఇస్తారా?..చస్తారా?అన్నట్టుగా మెడపై కత్తిపెడుతున్నారు. ఒక కమి టీ వచ్చి ఇండెంట్ పెట్టిన కొద్ది గం టలకే మరొక కమిటీ వచ్చి మరో ఇం డెంట్ పెడుతుందని ఓ సంస్థ యజ మాని ఆవేదన చెందారు. మా వల్ల కాదని సంస్థలు చెబుతుంటే కన్నెర్ర చేస్తున్నట్లు తెలిసింది. ఇలా ఒక్కొక్క సంస్థకు ఐదు లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఇండెంట్లు పెడుతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో దా తలు కొట్టు మిట్టాడుతున్నారు. ప్రతీ నెలా ఏదో ఒక కార్యక్రమం పేరుతో విరాళా లు ఇవ్వాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలని ఓ ప్రముఖసంస్థ సీఈఒ సాక్షి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్నికీలల అలజడి
విశాఖలో తరచూ ఎక్కడో ఓ చోట కొండలపై మంటలు చెలరేగుతున్నాయి. ఆయా ప్రాంతీయులను భయాం దోళనలకు గురిచేస్తున్నాయి. అగ్నిమాపక శాఖ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నాయి. హుద్‌హుద్ తుఫాన్‌కు చెట్లు నేలకొరిగి బాగా ఎండిపోవడంతో చిన్నపాటి నిప్పురవ్వ పడినా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. సీతమ్మధార కొండపై మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంత ప్రజలు భయంతో పరుగులు తీశారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చినా వెళ్లడానికి దారిలేకపోవడంతో కిందనుంచే పరిస్థితిని గమనించాల్సి వచ్చింది. - విశాఖపట్నం