ఇలాగేనా ఆదుకోవడం | Looking To Hike Prices adukovadam | Sakshi
Sakshi News home page

ఇలాగేనా ఆదుకోవడం

Published Mon, Jan 12 2015 6:30 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

Looking To Hike Prices adukovadam

  • నష్టానికి తగ్గ సాయం అందలేదు
  •  కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ర్టం విఫలం
  •  మరింత సాయం కోసం నివేదిస్తాం
  •  రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీ అవసరం
  •  విపత్తు సాయం పెంచేలా పాలసీ మార్పు కోసం సిఫార్సు చేస్తాం
  •  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ
  • సాక్షి, విశాఖపట్నం: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండురోజుల పర్యటన ముగిసింది. హుద్‌హుద్ తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి..అందిన సాయానికి పొంతన లేదని తమ పర్యటనలో గుర్తించినట్టు పేర్కొన్న కమిటీ సభ్యులు సాయం కోసం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని భావిస్తున్నామన్నారు. విపత్తు వచ్చి మూడు నెలలైనా బాధితులు నేటికీ తేరుకోలేక పోతున్నా రని..నిబంధనలనుపక్కనపెట్టి వారిని ఉదారంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

    తీవ్రంగా నష్ట పోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ర్టప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్రం నుంచి మరింత మెరుగైన సాయం అందే విధంగా తాము నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు. సీనియర్ పార్లమెంటేరియన్ పి.భట్టాచార్య నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆటోనగర్‌లోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ కారిడార్‌ను పరిశీలించి పరిశ్రమలకు జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకుంది.

    అనంతరం నేరుగా అనకాపల్లి మండలం సుబ్రహ్మణ్యకాలనీ, రాంబిల్లి మండలం గొరపూడి గ్రామాల్లో పర్యటించిన కమిటీ సభ్యులు దెబ్బతిన్న ఇళ్లు, నేలకూలిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని కమిటీ సభ్యుల ఎదుట బాధితులు గగ్గోలు పెట్టారు. ముఖ్యంగా గోరపూడిలో కొబ్బరి రైతులు మాట్లాడుతూ చెట్టుకు రూ.1000 చొప్పున ఇచ్చారని, ఈ మొత్తం కనీసం చెట్టును నరికి..తరలించేందుకు కూడా సరిపోలేదని, ప్లాంటేషన్‌కు ఎలాంటి సాయం లేదని వాపోయారు. కేంద్రానికి నివేదించి తగిన రీతిలో సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నేరుగా కలెక్టరేట్‌కు చేరుకుని ప్రభుత్వాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమయ్యారు.
     
    చట్టంలో మార్పునకు సిఫారసు చేస్తాం

    విపత్తుల్లో దెబ్బతిన్న ప్రాంతాలకు జాతీయ ప్రకృతి విపత్తుల నిధి నుంచి మరింత సాయం అందేలా చట్టంలో నిబంధనలు మార్చేలా సిఫారసు చేస్తామని కమిటీ చైర్మన్ భట్టాచార్య అన్నారు. తరచూ ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొనే ఆంధ్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు కూడా ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వ పథకాలకు విడుదల చేసే నిధుల్లో 10 శాతం నిధులను ఇలాంటి విపత్తుల సమయంలో వినియోగించుకోవచ్చునని సూచించారు.  

    కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల నుంచే కాకుండా రాష్ర్ట ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేటు రంగ పరిశ్రమల నుంచి కూడా విపత్తులకు సీఆర్‌ఎస్ నిధులు వినియోగించవచ్చునన్నారు. మరపడవలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలకు నష్టం వాటిల్లినప్పుడు సాయానికి ప్రస్తుత చట్టంలోని నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయన్నారు. తుఫాన్ అనంతరం అధికారులు, స్వచ్ఛంద సంస్థలు స్పందించిన తీరు నిజంగా ప్రశంసనీయమన్నారు. స్వచ్ఛంద సంస్థలు తుఫాన్‌కు దెబ్బతిన్న గ్రామాలను దత్తత తీసుకుని జిల్లా అధికారుల సహకారంతో ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావాలని కమిటీ చైర్మన్ భట్టాచార్య సూచించారు.    
     
    విశాఖ పోర్టు ట్రస్టుకు జరిగిన నష్టంపై ట్రస్ట్ సీఎండీ కృష్ణబాబు, సహాయ పునరావాస చర్యలపై విపత్తుల నిర్వహణ కమిషనర్ ఎఆర్ సుకుమార్, జిల్లాలో చేపట్టిన సహాయ చర్యలపై కలెక్టర్ ఎన్.యువరాజ్‌లు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు ఇచ్చారు. అనంతరం ప్రత్యేక విమానంలో కమిటీ సభ్యులు ఢిల్లీకి పయనమయ్యారు.
     
    కమిటీ సభ్యులు సీతారాం ఏచూరి, వైష్ణభ్‌పరీడా, సెల్వకుమార్, చిన్నయన్చ, కింజరపు రామ్మోహననాయుడు, హరీష్ మీనా, నాగరాజన్, డాక్టర్ సత్యపాల్ సింగ్, బిష్ణుపాదర్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఇన్‌చార్జి కలెక్టర్లు బి.రామారావు, వివేక్ యాదవ్,వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూదనరావు,  జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వీసీ బాబూరావునాయుడు, ఏపీఈపీడీసీఎస్ సీఎండీ శేషగిరిబాబు, డీఆర్వో నాగేశ్వరరావ పాల్గొన్నారు.
     
    కేంద్రం నిధులు ఏమైనట్టు?
     
    హుద్‌హుద్ తుఫాన్‌కు దెబ్బతిన్న ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకునేందుకు కేంద్రం, దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలందరూ కలిసి ప్రకటించిన ఆర్ధిక సాయం ఏమైందో అంతుచిక్కడం లేదని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చిస్తామని పార్లమెంటరీ స్టాండింగ్ కమీటీ చైర్మన్ పి.భట్టాచార్య అన్నారు.  కమిటీ చైర్మన్ పి.భట్టాచార్య, సభ్యులు సీతారాం ఏచూరి తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ లెక్కలకు అందని నష్టం జరిగిందని, కానీ కేంద్ర సాయం కోసం సమగ్రమైన నివేదికలందించడంలో రాష్ర్ట ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు.

    కేంద్రం ప్రకటించిన రూ. వెయ్యి కోట్లలో కేవలం రూ.435 కోట్లు మాత్రమే విడుద లైందని, మిగిలిన మొత్తాన్ని ఎందుకు విడుదల చేయలేదో తాము పార్లమెంటులో ప్రశ్నిస్తామన్నారు. జరిగిన నష్టం అపారంగా ఉంటే ప్రకటించిన సాయాన్ని రూ.680కోట్లకు కుదించడం  సమంజం కాదని చెప్పారు.   తుఫాన్ సంభవించిన వెంటనే ఎంపీ లాడ్స్ నుంచి ఒక్కొక్కరు రూ.50 లక్షల చొప్పున  దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలంతా ఏకగ్రీవంగా మంజూరు చేశారని, అలా సమకూరిన రూ.400 కోట్లకు పైగా నిధులు ఏం చేసారో లెక్కాపత్రం లేదని తప్పుపట్టారు. ఈ అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తు తామన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement