ఈ ఇళ్లు ఏమూలకు..
లక్షల్లో దెబ్బతిన్న గృహాలు
అయినా ఆరు వేల ఇళ్ల నిర్మాణానికే సర్కారు సంకల్పం
ఈ ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపన
విశాఖపట్నం: హుద్‌హుద్ తుఫాన్ బాధితుల కోసం ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల్లో నిర్మించతలపెట్టిన గృహ నిర్మా ణ సముదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. గతేడాది హుద్‌హుద్ పెనుతుఫాన్ ఉత్తరాంధ్రను కకావికలం చేసింది. ఒక్క విశాఖలోనే లక్షా 20వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయనగరం, శ్రీకాకుళంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో మరో లక్ష ఇళ్ల వరకు రూపురేఖలు లేకుండా పునాదులు కదిలిపోయాయి. ఇంటికి తీవ్రతను బట్టి రూ.5వేలను రూ.50వేల వరకు ఆర్ధిక సహాయం చేశారు. చిరునామాలు దొరక్క,అకౌంట్లు, ఆధార్ నెంబర్లు సరిపోకపోవడంతో సుమారు 50వేల మంది వరకు ఇంకా పరిహారం అందని పరిస్థితి నెలకొంది. ఇళ్లు దెబ్బతిన్న 2లక్షల మందిలో మూడో వంతు మంది ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సహాయం కోసం ఎనిమిది నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. తుపాను సమయంలో కేంద్రప్రభుత్వం వెయ్యికోట్లు ప్రకటించి రూ.650 కోట్ల వరకు సాయం అందజేసింది. దేశవిదేశాల నుంచి విరాళాల పేరుతో ప్రభుత్వానికి వందల కోట్లు సమకూరాయి. మరో పక్క ప్రపంచ బ్యాంకు రూ.2350 కోట్ల ఆర్ధిక సహాయం చేసేందుకు అంగీకరించింది.
ఇంత పెద్ద ఎత్తున నిధులు సమకూరినా తుఫాన్ పునర్నిర్మాణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.8 నెలల తర్వాత అదీ దాతల సహకారంతో కేవలం 10వేల ఇళ్ల నిర్మాణానికి సంకల్పించారు. రూ.560 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ భారీ ప్రాజెక్టుకు టెండర్లు కొలిక్కిరాలేదు. ఈ ప్రాజెక్టుకు బుధవారం సీఎం శ్రీకారం చుట్ట బోతున్నారు. ఇన్ఫోసిస్, బీహెచ్‌ఈఎల్,సీసీఎల్ హెచ్‌పీసీఎల్ వంటి సంస్థలు అందజేసిన రూ.170కోట్లకు మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ర్ట ప్రభుత్వం మరో రూ.170కోట్లు సమకూర్చ నుండగా రూ.10కోట్ల వరకు లబ్దిదారులు వాటాగా భరించనున్నారు. మిగిలిన మొత్తాన్ని స్వచ్చ భారత్ మిషన్ నుంచి సమకూర్చనున్నారు. ఈ ప్రాజెక్టులో ఇళ్లు విశాఖలో 6వేలు, శ్రీకాకుళం జిల్లాలో 2,500, విజయనగరం జిల్లాలో 1500 ఇళ్లు నిర్మించ నున్నారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం పేరుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం వుడా పార్కులో ప్రత్యేకంగా ఫైలాన్‌ను ఏర్పాటు చేశారు. ఉదయం 9.40 గంటలకు ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేయనున్నారు. ఈ ఇళ్లు ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎందరికి కేటాయి స్తున్నారు అన్న దానిపై స్పష్టత లేకపోవడం విశే షం. అనంతరం నోవాటెల్‌లో ఇం డస్ట్రీమిషన్‌ను ప్రారంభించి ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించనున్నారు.