చెరకు రైతుకు నిరాశే!
- మద్దతు ధరపై చేతులెత్తేసిన ‘గోవాడ’
- టన్నుకు రూ.2100 మాత్రమేనని ప్రకటన
- గిట్టుబాటు కాదని అన్నదాతల ఆందోళన
చోడవరం, న్యూస్‌లైన్ : రైతుల ఆశలపై గోవాడ సుగర్ ఫ్యాక్టరీ నీళ్లు చల్లింది. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో టన్నుకు కనీసం రూ.2500 అయినా చెల్లిస్తారని ఎదురుచూసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. 2014-15 సీజన్‌కు సంబంధించి టన్ను రూ.2100లే ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. టీడీపీకి చెందిన ప్రస్తుత చైర్మన్ మల్లునాయుడు అధికారంలోకి రాకముందు టన్నుకు రూ. కనీసం 2500దాటి ఇవ్వాలని పలుమార్లు తన పార్టీ ఎమ్మెల్యేలు కెఎస్‌ఎన్‌ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడుతో కలిసి ఫ్యాక్టరీ ఎదుటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు.
రైతులు దీనిని నమ్మి మల్లునాయుడు బృందానికి పట్టం కట్టారు. అధికారం చేపట్టిన వెంటనే గత సీజన్‌లో టన్నుకు రూ.300 బోనస్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం రూ.2100లుగా మద్దతు ధర ప్రకటించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతేడాది వరకు కేంద్రం మద్దతు ధర ఆశాజనకంగా ప్రకటించకపోవడం వల్లే తాము ఇవ్వలేకపోతున్నామంటూ ఫ్యాక్టరీలు తప్పించుకునేవి.
ఈ సారి టన్నుకు రూ.2125 విధిగా చెల్లించాలని కేంద్రం ముందుగానే ప్రకటించింది. గతంలో కేంద్రం ప్రకటించిన ధరకు అదనంగా మూడు నాలుగు వందలు కలిపి రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెల్లించేవి. కేంద్రం ప్రకటించిన రూ.2125 ధరను కూడా గోవాడ ఫ్యాక్టరీ ఇవ్వకపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఈ ఫ్యాక్టరీ కంటే చిన్నదైన ఏటికొప్పాక ఇటీవల జరిగిన మహాజన సభలో రూ.2125లు మద్దతు ధరను ప్రకటించిన విషయం తెలిసిందే. సమీపంలోని ఫ్యాక్టరీ చెల్లిస్తున్న ధరను కూడా గోవాడ ఎందుకు ఇవ్వలేకపోతోందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రైతులకు ప్రస్తుత ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టు బడులు బాగా పెరిగాయి. తుఫాన్లకు పంట ముంపునకు గురయింది. రోజుల తరబడి నీటి నిల్వతో దిగుబడి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ గతేడాది కంటే ఎక్కువ ధర ఇచ్చి ఆదుకుంటుందని అనుకుంటే చేతులత్తేయడంతో చెరకు రైతు దిగ్గుతోచని స్థితిలో పడ్డాడు. ఇక చెరకు సాగు చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
ఇంతకు మించి ఇవ్వలేం: చైర్మన్, ఎండీ
ప్రస్తుత పరిస్థితుల్లో టన్నుకు రూ.2100 మించి చెల్లించలేమని ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు,ఎండీ వెంకటరమణారావు బుధవారం తేల్చి చెప్పేశారు. మార్కెట్‌లో క్వింటా పంచదార ధర రూ.2600కు ఘోరంగా పడిపోవడంతో ఉత్పత్తి ఖరీదే రావడంలేదని వారు చెప్పా రు. పంచదార నిల్వలు అమ్ముడవ్వక ఇప్పటికే ఇబ్బందిపడుతున్నామని చెప్పారు.