Sugar cane
-
కాఫీ బ్రేక్, మ్యాంగో మూడ్ చాక్లెట్లు గుర్తున్నాయా..? అవెలా వచ్చాయంటే..
చిన్నతనంలో ఇష్టంగా తిన్న ఎరుపు రంగుని తెచ్చే పాన్ పంద్, మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్ వంటి చాక్లెట్లు గుర్తున్నాయా..?. ఆ సయమంలో ఒక రూపాయికే నాలుగు లేదా రెండు చాక్లెట్లు వచ్చేవి. అవి తింటుంటే నాలుకంతా రంగు మారిపోతుంటే అబ్బో ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం ఎన్నో ఫ్లేవర్లతో కూడిన ఖరీదైన చాక్లెట్లు మరెన్నో వచ్చినపపటికీ..వాటి రుచి ఆ క్రేజ్ వేరు. చిన్నగా చెరుకు మిల్లులతో మొదలైన చాక్లెట్ల వ్యాపారం కాస్తా హిందూస్తాన్ కనెస్ట్రక్షన్ కంపెనీ, విమానా తయారీల కంపెనీలుగా వ్యాపార సామ్రజ్యాన్ని విస్తరించాడు మహారాష్ట్రకు చెందిన వాల్చంద్ హిరాచంద్ దోషి. ఆయన ప్రధాని మోదీ చెప్పే స్వాలంభనకు ఆనాడే బీజం వేశాడు. ఆవిష్కరణలకు పర్యాయ పదంగా నిలిచిన అతడి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం.!. 1923 బ్రిటిష్ పాలనలో భారత్ ఉన్న సమయంలో సేథ్ వాల్చంద్ హిరాచంద్ దోషి దూరదృష్టితో మహారాష్ట్రలోని రావల్గావ్కు వచ్చారు. ఆయన భారత ఆర్థిక స్వేచ్ఛకు మార్గం రాజకీయ వాక్చాతుర్యం కాదు పారిశ్రామిక స్వావలంబనలోనే ఉందని నమ్మాడు. ఆ నేపథ్యంలోనే భారతదేశానికి వెన్నుముక అయిన వ్యవసాయంపై దృష్టిసారించాడు. అదే ఆయన్ను 1,500 ఎకరాల బంజరు భూమి వైపు ఆకర్షించేలా చేసింది. నిజానికి ఇది రాళ్లతో నిండిపోయి.. వ్యవసాయానికి పనికిరాని భూమి ..కానీ దోషికి ఇందులో బంగారం పండిచొచ్చనిపించింది. అందరికీ అది నిరూపయోగమైన భూమిలా కనిపిస్తే.. ఆయనకు మాత్రం పనికొచ్చే భూమిలా అనిపించింది. ఆ నేపథ్యంలోనే రసాయన శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందాన్ని సమీకరించి చెరకు సాగుకు అనువైన సారవంతమైన నేలగా మార్చే ప్రక్రియకు పూనుకున్నాడు. అలా ఆయన తన పట్టుదలతో 1933లో రావల్గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్థాపించారు. ఇదే భారత్‌లోని తొలి చక్కెర మిల్లులో ఒకటి. అక్కడితో ఆగిపోలేదు దోషి పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేశాడు. ఆ నేపథ్యంలోనే మిల్లు చుట్టూ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పాఠశాలలతో పూర్తి సమృద్ధి గల పట్టణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత ఆ ప్రాంతం క్రమేణ వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు నిలయంగా మారింది.ఇది చక్కెర మిల్లింగ్ నుంచి వివిధ పరిశ్రమలకు భారీ ఇంజనీరింగ్ పరికరాలను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది.అలా నిర్మాణ రంగంలోకి వెళ్లి హిందూస్తాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ, ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్ వంటి ఐకానిక్ నిర్మాణాలను నిర్మించారు. అతని కారణంగానే 1940లో భారత్ తొలి విమానాయన తయారీ సంస్థ, 1946లో షిప్‌యార్డ్ వంటివి స్థాపించారు. ఆ తర్వాత ఆ రెండు కంపెనీలు వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా జాతీయం చేసింది ప్రభుత్వం. అయితే 1940లలో రావల్గావ్ చక్కెర ఉత్పత్తి నుంచి తయారైన చాక్లెట్లు మాత్రం మిఠాయి వ్యాపారంగానే ఉండిపోయింది. అయితే భారతీయ చాక్లెట్లకు రావల్గావ్ బ్రాండ్‌గా ఉండేది ఆ కాలంలో. ఆయన చక్కెర మిల్లుల కారణంగా తయారయ్యే పాన్పసంద్ పెద్దవాళ్లలా పాన్ని తిన్నట్లుగా నోరంతా ఎరుపు రంగు తెప్పించేది. ఏడాది పొడవునా మ్యాంగో తిన్న అనుభూతిని కలిగించే మ్యాంగో మూడ్, కాఫీ బ్రేక్, చాకో క్రీమ్ తరదితరాలు ఆ కాలంలో అందరికీ నచ్చే చాక్లెట్లు. ఆ విధంగా మహారాష్ట్ర భారతదేవశంలోని అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రంగా నిలుస్తోంది. ఇప్పటికీ రావల్గావ్ షుగర్ ఫామ్ లిమిటెడ్ స్వతంత్రంగానే పనిచేస్తోంది. దీన్ని ఇటీవలే రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) రావల్గావ్ బ్రాండ్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో ట్రేడ్‌మార్క్‌లు, వంటకాలు , మేధో సంపత్తి హక్కులు ఉన్నాయి. కరోనా సమయంలో తీవ్రమవుతున్న ఖర్చులు, మార్కెట్ పోటీ కారణంగా రావల్గావ్ చాక్లెట్ల వ్యాపారం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే రావల్గావ్ పేరుమీదు ఉన్న మిగతా ఇండస్ట్రీలను మాత్రం యథావిధిగా నిలుపుకుంది. తీపి పదార్థాల నుంచి నిర్మాణ రంగం, పారిశ్రామిక రంగ పరంగా భారతదేశాన్ని అభివృద్ధి బాటపట్టేలా చేశారు. ఆయన వారసత్వం నిర్మించిన సంస్థల్లోనే కాదు, దేశ రూపు రేఖలను మార్చడంలోనే అందించారు. పారిశ్రామిక వేత్త అంటే తనను అభివృద్ధి చేసుకుంటూ..దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకుపోయేవాడని చాటి చెప్పారు వాల్చంద్ హిరాచంద్ దోషి.(చదవండి: '8 సిటీస్ 8 బర్డ్ వాక్‌లు': ఇది చిన్నారులకు ప్రత్యేకం..!) -
సమ్మర్లో చెరుకురసం తాగటం మంచిదేనా? అందరూ తాగొచ్చా..!
వేసవి అనంగానే దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతారు. ఈ కాలంలో ఘన పదార్థాల కంటే ద్రవపదార్థాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే అందరూ కూల్‌డ్రింక్‌లు వంటిపై ఆధారపడుతుంటారు. అయితే కూల్‌డ్రింక్‌లు తాగొద్దని సూచించడంతో అందరూ..కొబ్బరి బొండాలు, చెరుకు రసాలను తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో చెరుకు రసానికి మించిన పానీయం లేదని చెప్పొచ్చు. ఇది తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. పైగా వేసవి తాపాన్ని తగ్గిస్తుంది. అలాంటి ఈ చెరుకు రసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, అందరికీ ఇది మంచిదేనా? కాదా సవివరంగా తెలుసుకుందామా!. నోరూరించే తియ్యటి చెరుకు రసాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు. అలాంటి చెరుకురసంలో ఆరోగ్యానికి ఉపయోగపడే మినరల్స్, విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది బరువును అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపటంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజు ఒక గ్లాసు చెరకురసం తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! ఎన్ని లాభలంటే.. క్రోమియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువుగా ఉంటాయి. అంతేకాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్లు ఎక్కువుగా ఉన్నచెరకు రసం బాలింతలు తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. శరీరంలో అధిక బరువు పెరగడానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను ఈ రసం తగ్గించగలదు. బరువు తగ్గాలనుకునే వారికి చెరకురసం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు చెరకు రసంలో అరచెక్క నిమ్మరసాన్ని కలిపి ప్రతి రోజూ రెండు పూటలా తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడి కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చెరకు రసం పిల్లల్లో తరచూ వచ్చే చిన్నచిన్న అనారోగ్యాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తీవ్ర జ్వరం, మాంసకృత్తులు లోపించడం వంటి సమస్యల నుంచి పిల్లలను ఈ రసం కాపాడుతుంది. మూత్రపిండాలలో ఉన్న రాళ్ల సమస్యల్ని తొలగించడంలో చెరుకురసం ఎంతగానో దోహదపడుతుంది. చెరకు రసం సహజమైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిటెండ్లను, ప్రొటీన్లను సాల్యుబుల్ ఫైబర్‌ను కూడా ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. శరీరానికి పోషణను అందిస్తుంది. వీళ్లు అస్సలు తాగొద్దు.. అయితే చెరకు రసాన్ని ఎట్టి పరిస్థితిలోనూ రోజూ తాగొద్దు. అది కూడా మోతాదుకు మించి అస్సలు తాగకూడాదు. పురుషులు రోజూ ఒక కప్పు, స్త్రీలు అయితే ముప్పావు కప్పు మోతాదులోనే చెరకు రసం తాగాలి. అంతకన్నా ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు చెరకు రసాన్ని తాగకపోవడం మంచింది. డైట్ పాటించే వారు చెరకు రసంకు దూరంగా ఉండాలి. రోజూ దీనిని తాగడంవ వలన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు, 4 ఏళ్లకన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు, విటమిన్ సప్లిమెంట్లు వాడుతున్నవారు, రక్తాన్ని పలుచగా చేసే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నవారు చెరకు రసానికి దూరంగా ఉండాలి. కొన్ని చోట్ల చెరకు రసం తీసే పద్దతి అపరిశుభ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈగలు వాలుతుంటాయి. అలాంటి చోట చెరకు రసం తాగకపోవడమే మంచింది. లేదంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు, విరేచనాలతో బాధపడుతున్నవారు ఎట్టి పరిస్థితిలోనూ చెరకు రసం తాగొద్దు. అలాగే ఒక్కోసారి ఇక ఆరోగ్య వంతులు కూడా చెరకు రసం రోజూ తాగడం అంత మంచిది కాదు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ జీవనశైలిలో దీన్ని భాగం చేసుకోవాలనుకుంటే వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణులను సంప్రదించి పాటించటం ఉత్తమం. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!) -
ఈ సూపర్ స్వీట్ డ్రింక్ తాగితే..అందం,యవ్వనం మీ సొంతం
వేసవి వచ్చిందంటే మన అందరికీ గుర్తు వచ్చే డ్రింక్ చెరుకు రసం. పిల్లా పెద్దా అంతా ఎంతో ఇష్టంగా తాగుతారు. మండు వేసవిలో దాహాన్ని తీర్చడమే కాదు, చెరుకు రసంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. మండు టెండలో, దాహంతో అల్లాడిపోతున్నపుడు చెరుకు రసం బండి కనిపిస్తే ప్రాణం లేచి వస్తుంది. చల్ల చల్లగా గ్లాసు రసం తాగితే తాగితే హాయిగా ఉంటుంది. అయితే చెరుకు రసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఇక అస్సలు వదలరు. శుభ్రమైన చెరుకు రసం ఇన్ఫెక్షన్లను నివారించడంలోనూ, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ బాగా పనిచేస్తుంది. చెరకు రసంలో యాంటీఆక్సిడెంట్లు ,ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యాంటి ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలోనూ దీని ప్రయోజనాలు అద్భుతం అని చెప్ప వచ్చు. చెరుకులో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ B12, ఐరన్‌తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంది. సహజ కండీషనర్‌గా పని చేసి జుట్టును మృదువుగా, సిల్కీగా తయారు చేస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను బలపరిచే మినరల్స్ చెరకు రసంలో పుష్కలంగా ఉన్నాయి చెరకు రసంలో తేనె కలిపి పావుగంట పాటు చర్మానికి మర్దన చేయాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. స్కిన్ గ్లోయింగ్, యంగ్‌గా కనిపించాలంటే ఇంకో చిట్కా ఏంటంటే చెరకు రసంతో తయారు చేసిన ఐస్ క్యూబ్లతో ముఖం, మెడ, చేతులపై మసాజ్ చేసుకోవాలి. అలాగే చెరకురసానికి కాస్తంత కాఫీపొడి చేర్చి స్క్రబ్‌లా ఉపయోగిస్తే మొటిమలు, మచ్చలు తొలగి పోయి కొత్త మెరుపు వస్తుంది. బొప్పాయి గుజ్జులో చెరకు రసాన్ని కలిపి పట్టించి, ఆరిన తరువాత చల్లని నీళ్లతో కడిగేసు కోవాలి స్కిన్ టైట్ అయిన ఫీలింగ్ తెలుస్తుంది. చెరకు రసం నెయ్యి కలిపి, చర్మానికి మర్దనా చేస్తే ఎండ వల్ల కమిలిన చర్మం తిరిగి కొత్త నిగారింపును సంతరించుకుంటుంది. శుభ్రమైన చెరుకు రసాన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చర్మానికి పట్టిస్తే చర్మం ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది. చెరుకు రసంలో కొద్దిగా అల్లం, నిమ్మరసం కలుపుకొని తాగితే అలసట, నీరసం మాయమై కొత్త శక్తి వస్తుంది. -
PM Narendra Modi: రైతు సంక్షేమమే లక్ష్యం: ప్రధాని మోదీ
-
చక్కెర ఉత్పత్తులపై 50 శాతం సుంకం.. కారణం తెలుసా..
ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో చెరకు నుంచి తీసే ఇథనాల్ ఉత్పత్తికి కీలకమైన మొలాసిస్‌పై ప్రభుత్వం 50 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. ఈ నిబంధనలు జనవరి 18 నుంచి అమలులోకి వచ్చాయి. దేశీయ డిస్టిలరీల కోసం మొలాసిస్‌ను అందుబాటులో ఉంచడం, పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో పెట్రోల్‌లో 15 శాతం ఇథనాల్‌ను కలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇథనాల్ మళ్లింపు లేకపోవడం వల్ల 2023-24 సీజన్లో (అక్టోబర్-సెప్టెంబర్) చక్కెర ఉత్పత్తి 37.3 మిలియన్ టన్నుల నుంచి 32.3-33 మిలియన్ టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం తలిపింది. ఇదీ చదవండి: రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే.. వియత్నాం, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ ఫిలిప్పీన్స్‌తో సహా ఇతర దేశాలకు భారతదేశం మొలాసిస్‌ను ఎగుమతి చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు మొలాసిస్‌ను ఎగుమతి చేస్తున్నాయి. -
చెరకు పంట జాగ్రత్తలు మరవకు! లేదంటే?
'చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ పంటలు వేసినప్పటీ నుంచి చేతికందే వరకు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన పద్ధతులు పాటించకుండా పాత పద్ధతులను పాటిస్తే నష్టపోతారు. కొంత మంది రైతులు చెరకు పక్వానికి రాకముందే క్రషింగ్‌కు తరలిస్తూ ఉంటారు. దీంతో చక్కెర ఉత్పత్తి తగ్గడమే కాకుండా సరాసరి చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. చెరకు పంట పక్వానికి వచ్చిందా ?లేదా? కొన్ని మెలకువలు పాటించాలి.' - ప్రస్తుతం చేతికొచ్చిన చెరకు పంటను నరకుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బసంత్‌పూర్–మామిడ్గి గ్రామాల శివారులో గల ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం.విజయ్‌కుమార్ మాట్లాల్లోనే.. పక్వానికి వచ్చిందా.. లేదా? పక్వానికి వచ్చిన చెరకు తోటల ఆకులు పచ్చ రంగులోంచి పసుపు రంగులోకి మారుతాయి. చెరకులో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. గడలు లావై అక్కడక్కడ చిరు పగుళ్లు ఏర్పడి కన్నులు బాగా ఉబ్బినట్లు అవుతాయి. తోటలో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి. చిట్ట చివర నాలుగైదు కణుపులు దగ్గర దగ్గర ఏర్పడి వాటి నుంచి పుట్టు ఆకులు ఒకే చోట కుచ్చువలె ఏర్పడుతాయి. కొన్ని రకాల్లో పూత పూయడం కనబడుతుంది. శాసీ్త్రయంగా గమనిస్తే చెరకును రెండు భాగాలు నరికి వాటి రసంను వేర్వేరుగా గానుగాడిస్తే వాటిలోని ఘన పదార్థాలు సమానంగా ఉండాలి. చేతి రిఫ్రాక్టో మీటర్ ద్వారా కూడా చెరకు పక్వానికి వచ్చింది తెలుసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు! చీడ పీడలు ఆశించిన చెరకును ముందుగా క్రషింగ్‌కు తరలించాలి. లేదా బెల్లం తయారీకి వాడాలి. ఆలస్యం చేస్తే దిగుబడులతో రసం నాణ్యత తగ్గుతుంది. బెల్లం తయారు చేశాక మెత్తగా ఉంటే నిల్వకు పనిరాదు. ఏదైనా ప్రమాదశాత్తు చెరకు కాలిపోతే ముందుగా దాన్ని నరికివేయాలి . లేకపోతే తూకం తగ్గి రోజుకు 3 శాతం చొప్పున తగ్గుతుంది. పూత వచ్చిన, బెండు బారిన చెరకును నరకడం ఆలస్యం చేయరాదు. పూత వచ్చిన చెరకు గడల్లో చివరి ఆరు కండాలు తీసేసి మిగిలిన చెరకును ఫ్యాక్టరీకి తరలించాలి. చెరకును భూ మట్టానికి నరకాలి. రెండు మూడు అంగుళాలు వదిలి నరకడం వల్ల ఎకరానికి రెండు మూడు టన్నులు దిగుబడి తగ్గుతుంది. కింది భాగంలో పంచదార పాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చెరకు వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోయి బలమైన గాలులు వీచినా చెరకు ఒరిగిపోదు. చెరకు క్రషింగ్‌కు తరలించే ముందు చెత్త, ఎండుటాకులు, వేర్లు, మట్టి లేకుండా తరలించాలి. చెత్తా చెదారంతో తరలించడం వల్ల పంచదార దిగుబడిలో 10 శాతం నష్టం వాల్లుతుంది. నీటి ముంపునకు గురైన తోటల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కణుపుల వద్ద వచ్చే వేర్లను తొలగించాలి. వేర్లను తీసేయకుండా చెరకును అలాగే క్రషింగ్‌కు తరలిస్తే 0.4 నుంచి 0.6 శాతం మేర పంచదార దిగుబడి తగ్గుతుంది. నరికిన తర్వాత నరికిన చెరకును 24 గంటల్లో ఫ్యాక్టరీకి సరఫరా చేయాలి. ఆలస్యమైన కొద్ది చెరకు తూకంలో 2 నుంచి 4 శాతం, రసనాణ్యతలో ఒక శాతం తరుగుదల కనిపిస్తోంది. నరికిన చెరకు తొందరగా ఫ్యాక్టరీకి తరలించలేని పక్షంలో కట్టిన చెరకు మోపులను నీడలో పెట్టి వాటిపై చెత్తను కప్పి నీరు పలుచగా పోయాలి.\ రైతులు సాగు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఇలాంటి మెలకువలు పాటిస్తేనే లాభాలు సాధిస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇవి చదవండి: బడ్డింగ్ మెథడ్‌లో గ్రాఫ్టింగ్ చేస్తూ.. పనస వైభవం! -
తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే..
దేశవ్యాప్తంగా గతంలో నెలకొన్న ఎల్‌నినో, వర్షాల ప్రభావం చక్కెర(షుగర్) ఇండస్ట్రీపై పడింది. ప్రస్తుతం చక్కెర ఉత్పత్తి తగ్గుతోంది. ఈ ఏడాది అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య ఉత్పత్తి అయిన చక్కెర గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో 82.05 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. సాధారణంగా షుగర్ మార్కెటింగ్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్ వరకు గరిష్ఠంగా ఉంటుంది. గతేడాది ఉన్న 497 ఫ్యాక్టరీలు ఈ ఏడాదీ ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) పేర్కొంది. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ఫ్యాక్టరీలు 10–15 రోజులు లేటుగా ప్రొడక్షన్ ప్రారంభించినట్లు వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో చక్కెర ఉత్పత్తి అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య 22.11 లక్షల టన్నులుగా నమోదయ్యింది. గతేడాది మార్కెటింగ్ ఇయర్లో ఇదే సమయానికి 20.26 లక్షల టన్నుల చక్కెరను ఉత్పత్తి చేసింది. మహారాష్ట్రలో అయితే చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు పడిపోయింది. చెరుకును చక్కర ఉత్పత్తితోపాటు ఇథనాల్ ప్రొడక్షన్‌కు వినియోగిస్తున్నారు. అయితే చెరుకును ఇథనాల్ కోసం వాడకపోతే ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో 325 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని ఇస్మా అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: వీటిని తెగవాడుతున్నారు..! దేశవ్యాప్తంగా డిస్టిలరీ ప్రాజెక్టులు ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ ప్లాంట్లలో దాదాపు రూ.35,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మరోవైపు ఎల్ నినో, వర్షాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చెరుకు ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకల్లో ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్(ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్) తెలిపింది. దేశంలో చక్కెర ధరలను కంట్రోల్ చేసేందుకు సప్లయ్ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్లో ప్రభుత్వం ఎగుమతులను నిలిపేసింది. -
ఆంధ్రా షుగర్స్‌కు షుగర్ కేన్ హార్వెస్టింగ్ మెషీన్ పేటెంట్
తణుకు: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్రా షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఆంధ్రా షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మెషీన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు 20 సంవత్సరాల కాలవ్యవధికి గాను షుగర్ కేన్ పేటెంట్ వ చ్చింది. ఈ మేరకు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం ఈ నెల 26న పేటెంట్ సరి్టఫికెట్ జారీ చేసింది. సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ముళ్లపూడి నరేంద్రనా«థ్ మార్గదర్శకత్వంలో సంస్థకు చెందిన షుగర్ కేన్ హార్వెస్టర్ డెవలప్మెంట్ టీమ్ దీన్ని నిర్మించడానికి, ఉపయోగించడానికి పదేళ్లుగా అంకిత భావంతో కృషి చేస్తోంది. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్రా షుగర్స్ కావడం విశేషం. -
చెరకు పిప్పితో కాసుల పంట.. టన్నుకు రూ.5000 ఆదాయం!
సాక్షి, అమరావతి: చెరకు పిప్పి.. అదో వ్యర్థ పదార్థం, ఎందుకూ పనికిరాదు అనుకున్నాం ఇన్నాళ్లూ.. కానీ, ఇప్పుడు ఈ వ్యర్థ పదార్థాన్నే శాస్త్రవేత్తలు కాసులు కురిపించే ముడిసరుకుగా తేల్చారు. చెరకు రైతులకు అదనపు ఆదాయం చేకూరుస్తుందని నిరూపించారు. ఈ పిప్పిని బ్రికెట్స్ (ఓ మోస్తరు కర్రలు లాంటివి) మాదిరిగా తయారుచేస్తే వంట చెరుకుగానే కాకుండా ఇంధన కొరతకు ప్రత్యామ్నాయంగా.. శుభకార్యాల్లో ఉపయోగించే కప్పులు, ప్లేట్లులా కూడా తయారుచేసి వాడుకోవచ్చని వారంటున్నారు. చెరకు పిప్పి, ఎండుటాకులను బ్రికెటింగ్ టెక్నాలజీ ద్వారా ఈ బ్రికెట్స్‌ను తయారుచేసి రైతులకు అదనపు ఆదాయం లభించేలా అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు ఆధునిక యంత్ర పరికరాన్ని అభివృద్ధి చేశారు. సాధారణంగా.. పంట కోసిన తర్వాత వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలను ‘బయోమాస్’ అంటారు. వీటిని మెజారిటీ రైతులు వంట చెరుకుగా వినియోగిస్తారు. సహజ రూపంలో నిల్వ చేయాలంటే వీటికి ఎక్కువ స్థలం అవసరం. వీటి రవాణా ఖర్చులూ ఎక్కువే కాదు.. వీటి నుంచి వచ్చే ఉష్ణశక్తి తక్కువే. టన్ను పిప్పి నుంచి 35 టన్నుల బ్రికెట్స్ వంద టన్నుల చెరకు నుంచి సుమారు 30 టన్నుల పిప్పి, 10 టన్నుల ఎండుటాకులు వస్తాయి. పిప్పిలో 70 శాతం, ఎండుటాకుల్లో 50 శాతం వంట చెరకుగా, బెల్లం తయారీ కోసం వినియోగిస్తారు. మిగిలిన వాటిని వృధాగా వదిలేయడం లేదా పంట పొలాల్లో కాల్చేయడం చేస్తుంటారు. అదే బ్రికెటింగ్ టెక్నాలజీ ద్వారా వంద టన్నుల పిప్పి, ఎండుటాకుల నుంచి 35 టన్నుల బ్రికెట్స్ తయారుచెయ్యొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇక సహజ రూపంలో ఈ పిప్పిని వంట చెరుకుగా వినియోగిస్తే కిలోకి 1,200 నుంచి 1,300 కిలో కేలరీల ఉష్ణశక్తి మాత్రమే వెలువడుతుంది. అదే బ్రికెట్స్ రూపంలోకి మార్చి మండిస్తే కిలోకి ఏకంగా 4,452 కిలో కేలరీల ఉష్ణశక్తి వెలువడుతుండడం ఈ బ్రికెట్స్ ప్రత్యేకత. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిల్వచేయడమే కాదు.. వీటిని సులభంగా, చౌకగా కూడా తరలించొచ్చు. అంతేకాదు.. ఇవి మండినప్పుడు పొగ రాకపోవడంవల్ల చుట్టుపక్కల వారికి ఇబ్బంది ఉండదు. పైగా.. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ కన్నా ఇవి భూమిలో సులభంగా కలిసిపోతాయి. మార్కెట్లో బ్రికెట్లకు మంచి గిరాకీ ప్రస్తుతం రెస్టారెంట్లు, హోటళ్లలో వరి ఊకనే ప్రధాన వంట చెరకుగా ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి ఈ బ్రికెట్లను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం ఈ బ్రికెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. టన్ను చెరకు రూ.2,850 ధర పలుకుతుంటే ఈ బ్రికెట్స్ మాత్రం టన్నుకు ఏకంగా రూ.5వేల నుంచి రూ.5,500 వరకు పలుకుతున్నాయి. చెరకు పిప్పిని బ్రికెట్స్గానే కాదు.. శుభకార్యాలకు ఉపయోగించేలా కప్పులు, ప్లేట్లను కూడా తయారుచెయ్యొచ్చు. చెరకు పిప్పిని బాగా ఎండబెట్టి, మెత్తని పొడిలా చేసి ఎటువంటి రసాయనాలు కలపకుండా నేరుగా మౌల్డింగ్ యంత్రం ద్వారా మనకు కావాల్సిన రూపంలో తయారుచేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలంటే.. టబ్రికెటింగ్ యంత్రం ద్వారా ఇతర వృక్ష సంబంధిత వ్యర్థ పదార్థాలను బైండరుతో కలిపి బ్రికెట్లుగా తయారుచేసుకోవచ్చు. అదే చెరకు పిప్పికైతే బైండర్ అవసరం లేకుండానే బ్రికెట్స్ తయారుచెయ్యొచ్చు. ట ముందుగా చెరకు పిప్పిని 7–12 శాతం తేమ వరకు బాగా ఎండబెట్టాలి. ట తరువాత పిప్పిని చిన్నచిన్న ముక్కలుగా చేసి బ్రికెటింగ్ యంత్రంలోని హేమర్ మిల్లు ద్వారా పొడిచేసి బేరల్ ద్వారా పంపించి ఒత్తిడికి గురిచేయాలి. ట బ్రికెటింగ్ మిషన్‌లోని డై సైజును బట్టి బ్రికెట్ల పరిమాణం ఉంటుంది. ట బ్రికెట్లుగా తయారుచేయడం వలన చెరకు పిప్పి పరిమాణం 90 శాతం వరకు తగ్గుతుంది. ట సులభంగా నిల్వచేసుకుని సీజన్లో బెల్లం తయారీకి ఉపయోగించవచ్చు లేదా విక్రయించుకోవచ్చు. చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు! -
అంబులెన్స్‌లో కరోనా రోగి.. చెరుకు రసం కోసం వచ్చిన డ్రైవర్
భోపాల్: కరోనా వైరస్ మరోసారి కోరలు చాచింది. సెకండ్ వేవ్ మరింత భయంకరంగా ఉంది. గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా డెయిలీ లక్షకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా లాభం లేకుండా పోతుంది. కోవిడ్ అంటే జనాల్లో భయం లేదు. వ్యక్తిగత శుభ్రత, శానిటైజర్ వాడకం, మాస్క్ ధరిచడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వైరస్‌ను చాలా తేలిగ్గా అంచనా వేస్తున్నారు. సామాన్యులే అనుకుంటే జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్య సిబ్బంది కూడా ఇలానే ప్రవర్తిస్తున్నారు. తాజాగా కోవిడ్ రోగిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న ఓ అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపి వచ్చి... చెరకు రసం ఆర్డర్ చేశాడు. ఇదేంటి అని ప్రశ్నిస్తే.. అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తికి కోవిడ్.. నాకు కాదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. రాష్ట్రంలోని షాడోల్ జిల్లాలో సదరు అంబులెన్స్ సిబ్బంది కోవిడ్ బారిన పడిని ఓ వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తికి టెస్టులు చేయించడం కోసం రాజేంద్ర టాకీస్ స్క్వయర్ సెంటర్లోని ప్రైవేట్ ల్యాబ్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న ఓ చెరకు రసం బండి దగ్గర వాహనాన్ని ఆపాడు. దాంట్లో నుంచి పీపీఈ కిట్లు ధరించిన అంబులెన్స్ డ్రైవర్ కిందకు దిగి.. చెరకు రసం బండి సమీపానికి వెళ్లి.. మాస్క్ తొలగించి.. ఆర్డర్ ఇచ్చాడు. దీని గురించి అక్కడ ఉన్న వారు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘‘అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తికి కరోనా. నాకు కాదు’’ అంటూ డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలయ్యింది. ఇక సదరు అంబులెన్స్‌ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చెందినదిగా గుర్తించారు. ఇక మధ్యప్రదేశ్‌లో కోవిడ్ విజృంభిస్తుండటంతో పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం (ఏప్రిల్ 14, 2021) ఉదయం 6 గంటలకు వరకు సుమారు 60 గంటల పాటు లాక్డౌన్ విధించారు. చదవండి: దేశాన్ని హడలెత్తిస్తోన్న కరోనా సెకండ్ వేవ్ -
చక్కెర షేర్లు.. బహుతీపి సుమా..!
ప్రపంచవ్యాప్తంగా బలపడిన సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ ర్యాలీ బాటపట్టాయి. ఈ నేపథ్యంలో పలు సానుకూల అంచనాలతో ఉన్నట్లుండి షుగర్ రంగం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో పలు షుగర్ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో షుగర్‌కు డిమాండ్ పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం కనీస విక్రయ ధరను పెంచనున్న అంచనాలు షుగర్ రంగానికి జోష్‌నిస్తున్నట్లు తెలియజేశాయి. రేసు గుర్రాల్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో షుగర్ రంగ కౌంటర్లు 20-5 శాతం మధ్య లాభపడి దూకుడు చూపుతున్నాయి. దాల్మియా భారత్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 90 సమీపానికి చేరగా.. ధంపూర్ 17 శాతం దూసుకెళ్లి రూ. 127 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో బలరామ్‌పూర్ 13 శాతం జంప్‌చేసి రూ. 127 వద్ద, ఉగర్ షుగర్ 12 శాతం ఎగసి రూ. 15 వద్ద, అవధ్ షుగర్, మగధ్ షుగర్ 10 శాతం చొప్పున లాభపడి రూ. 172, 106 వద్ద కదులుతున్నాయి. ఇతర కౌంటర్లలో రాజ్శ్రీ షుగర్స్, శక్తి షుగర్స్, రాణా షుగర్స్, పొన్ని షుగర్స్ 10 శాతం చొప్పున పురోగమించాయి. ఇక ద్వారికేష్, కేఎం షుగర్, కేసర్ ఎంటర్ప్రైజెస్, డీసీఎం శ్రీరామ్, కేసీపీ షుగర్, త్రివేణీ ఇంజినీరింగ్, శ్రీ రేణుకా, ధరణి, బన్నారీ అమ్మన్, ఉత్తమ్, ఈఐడీ ప్యారీ సైతం 9-5 శాతం మధ్య ఎగశాయంటే షుగర్ షేర్లకు కనిపిస్తున్న డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు. ఇదీ విషయం కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న పలు ఆంక్షలను ఇప్పటికే ఎత్తివేయగా.. ఈ నెల 8 నుంచీ మాల్స్, రెస్టారెంట్లుసహా పలు బిజినెస్‌లను అనుమతించనున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్తిస్థాయిలో పుంజుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా షుగర్‌కు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. చెరకు రైతుల బకాయిల చెల్లింపులకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చక్కెర కనీస విక్రయ ధరను కేజీకి రూ. 2 చొప్పున పెంచే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు ఊహిస్తున్నాయి. ఇటీవల చెరకు రైతుల బకాయిలు రూ. 22,000 కోట్లను దాటినట్లు వెలువడిన వార్తలు దీనికి కారణమని చెబుతున్నాయి. గతేడాది ప్రభుత్వం కేజీకి రూ. 2 చొప్పున పెంచడం ద్వారా చక్కెర ధరను రూ. 31గా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం టీఆర్‌క్యూ కింద అమెరికాకు 3569 టన్నుల ముడి, శుద్ధిచేసిన షుగర్‌ను ఎగుమతి చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. -
చెరకు రసం యంత్రంలో చిక్కుకున్న చెయ్యి
కర్ణాటక, దొడ్డబళ్లాపురం: ప్రమాదవశాత్తు కార్మికుడి చెయ్యి చెరకు రసం తీసే యంత్రంలో చిక్కుకుని చేతి వేళ్లు తెగిపోయిన సంఘటన మాగడి పట్టణంలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన యూసుఫ్ (28) చేతి వేళ్లు పోగొట్టుకున్న కార్మికుడు. పట్టణ పరిధిలోని తిరుమల రోడ్డులో యూసుఫ్ చెరకు రసం యంత్రం బండి పెట్టుకుని వ్యాపారం చేస్తుంటాడు. శుక్రవారం యూసుఫ్ యంత్రంలోకి చెరుకు గడలు తోసే క్రమంలో చెయ్యి ఇరుక్కుంది. యూసుఫ్ కేకలు విన్న స్థానికులు గ్యాస్ కట్టర్ సాయంతో రెండు గంటలపాటు శ్రమించి చెయ్యి విడిపించారు. అయితే యూసుఫ్ చేతి వేళ్లు నాలుగు తెగిపోయాయి. యూసుఫ్ రెండు గంటలపాటు బాధతో కేకలు పెండుతూ నరకం చూశాడు. అప్పటికే పోలీసులు అక్కడకు వచ్చి అంబులెన్స్ సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినప్పటికీ తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరు విక్టోరియాకు తరలించారు. -
చెరకు కోత
ఒక మనిషి సంతోషంగా ఉన్నారంటే వారి జీవనం సాఫీగా సాగిపోతోందని. వారి కుటుంబంలోని సభ్యులంతా సంతృప్తిగా ఉన్నారని. మరి దేశం సంతోషంగా ఉందనే వార్త ఎప్పుడు మన చెవిన పడుతుంది?! మన దేశ ప్రజలు సురక్షితంగా, సౌభాగ్యాలతో జీవిస్తున్నారని నిర్ధారణ అయినప్పుడు. అయితే అలాంటిది ఎప్పటికీ నిర్ధారణ కాదేమోనన్న భయాన్ని, సందేహాన్ని కలిగిస్తూ.. ఎక్కడో ఒకచోట, ఏదో ఒక దారుణ సంఘటన బయటపడుతూనే ఉంది! అందుకు ఉదాహరణే మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతం. ఆ ప్రాంతంలో అత్యధికులు చెరకు కార్మికులుగా ఉన్నారు. వారిలో ఎక్కువమంది మహిళలే. నెలసరి రోజుల్లో వారిని చెరకుతోట పనుల్లోకి రానివ్వరు. దాంతో వారు ఇంటివద్దనే ఉండాల్సిన పరిస్థితి. ఆ నాలుగు రోజులూ దినసరి కూలీ కోల్పోయి, కుటుంబంలోని మిగతా సభ్యులూ పస్తులుండాల్సి వస్తుంది. అందుకే అక్కడి మహిళా కూలీలు చాలామంది రోజువారీ వేతనం పోతుందనే భయంతో ఆపరేషన్ ద్వారా తమ గర్భసంచిని తొలగించుకుంటున్నారు! ఇలా చేసింది ఒకరూ ఇద్దరు కాదు. ఇప్పటి వరకు వేల మంది! కొంతమంది చెరకుతోట కాంట్రాక్టర్లు భార్య, భర్త ఇద్దరినీ ఒక యూనిట్‌గా పరిగణించి పని కల్పిస్తారు. భార్య ఆ నాలుగు రోజులు పనిలోకి రాకపోతే రోజుకు రూ.500 జరిమానా వేస్తారు. దాంతో.. రోజూ వచ్చి పని చేస్తున్న భర్తకు రావలసిన కూలీ కూడా చెయ్యిజారి పోతుంది. పైగా పనుల్లో కుదిర్చే కాంట్రాక్టర్లు గర్భసంచి లేని మహిళలనే పనుల్లోకి తీసుకురావడానికి ముందుకు వస్తారని, పర్యవసానంగా ఈ యేడాది 13,000 మంది చెరకు కూలీలు తమ గర్భాశయాన్ని తొలగించుకున్నారని ఇటీవల కొన్ని జాతీయస్థాయి స్వచ్ఛంద సంస్థలు జరిపిన పరిశోధనలో బయటపడింది. దీంతో జీవనోపాధికోసం తమ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితుల్లోకి మహిళలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి వినతులు వెల్లువలా అందుతున్నాయి. -
ప్యాసింజర్ ఆటోను చెరకు రసం బండిగా మార్చి..
కుత్బుల్లాపూర్ :ఆలోచన ఉంటే అవకాశాలెన్నో ఉన్నాయని నిరూపించాడీ యువకుడు. వేసవిలో చెరకు రసానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా తన ప్యాసింజర్ ఆటోను ఇలా చెరకు రసం బండిగా మార్చి ఉపాధి పొందుతున్నాడు జగద్గిరిగుట్టకు చెందిన మహిపాల్. ఆటో నడిపితే వచ్చే డబ్బులు ట్రాఫిక్ అధికారులు విధించే చలాన్లకే సరిపోతున్నాయని... ఆటోను ఇలా చెరకు రసం బండికి అమర్చడంతో చలాన్ల బెడద తప్పిందని పేర్కొన్నాడు. చింతల్ హెచ్ఎంటీ రోడ్డులో దీన్ని ఏర్పాటు చేశాడు. -
మెట్రో బస్సు దూకుడు
కృష్ణాజిల్లా, ఉయ్యూరు (పెనమలూరు) : చెరకు లోడు బండిని మెట్రో సర్వీస్ బస్ ఢీకొన్న ఘటనలో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వివరాల్లోకి వెళితే, తోట్లవల్లూరు మండలం కనకవల్లి గ్రామానికి చెందిన రైతులు ఎడ్ల బళ్లపై చెరకును కేసీపీ కర్మాగారానికి తీసుకువస్తున్నారు. బస్టాండ్ లోపలికి వెళ్లే క్రమంలో విజయవాడ నుంచి వస్తున్న 333 సర్వీస్ మెట్రో బస్సు ప్రమాదవశాత్తూ ఢీకొంది. చెరకు బండి వెనుకగా ఢీకొట్టడంతో రెండు ఎద్దులకు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన రైతులు బస్సు డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించారు. ఆందోళనకు దిగిన రైతులు.. ప్రమాద ఘటనపై ఆగ్రహించిన రైతులు చెరకు బళ్లను బస్టాండ్ సెంటర్లో నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో న్యాయం చేయించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌కు, రైతులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో ఒకరిపై ఒకరు చేతులతో దాడి చేసుకునే పరిస్థితి తలెత్తడంతో సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ సత్యశ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి ఇరువర్గాలతో చర్చించి ఆందోళన విరమింపచేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. -
చెరకు వేరు
♦ చెరకును శుభకార్యాల్లో వినియోగించడం అందరికీ తెలిసిందే. చెరకురసాన్ని పానీయంగానే కాకుండా, అభిషేకాలకు కూడా వినియోగిస్తారు. చెరకుగడ మాత్రమే కాదు, చెరకు వేరు కూడా చాలా శుభప్రదమైనది. చెరకువేరును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ♦ దీపావళి రోజున లక్ష్మీపూజ చేసేవారు ఉదయాన్నే చెరకువేరును సేకరించి, వాటిని శుభ్రపరచి పసుపు కుంకుమలతో అలంకరించి, పూజమందిరంలోని లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు పెట్టి పూజించాలి. ఇలా పూజించిన చెరకువేరును ఎర్రని వస్త్రంలో చిన్న మూటలా కట్టి ఇంట్లోనైనా, దుకాణాల వంటి వ్యాపార సంస్థల్లోనైనా నగదు భద్రపరచే చోట ఉంచడం వల్ల ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ♦ దీపావళి రోజున పూజించిన చెరకు వేరును తాయెత్తులో పట్టే పరిమాణంలో ముక్కలుగా చేసి, ఒక ముక్కను వెండితాయెత్తులో ఉంచి, దానిని మెడలో ధరించడం వల్ల జనాకర్షణ పెరుగుతుంది. సంపాదన మెరుగుపడుతుంది. చెరకువేరు ముక్కను తాయెత్తుగా ధరించలేని వారు కనీసం దానిని ఎర్రవస్త్రంలో చుట్టి పర్సులో భద్రపరచుకున్నా మంచిదే. – పన్యాల జగన్నాథ దాసు -
అనకాపల్లి చెరకు పంట బెల్లం వంట
-
4 లక్షల టన్నుల చెరకు గానుగ లక్ష్యం
తోటలను పరిశీలించిన అసిస్టెంట్ కేన్ కమిషనర్ లోకేశ్వర్ నాయుడుపేట: జిల్లాలో సూదులగుంట షుగర్ ఫ్యాక్టరీ, ఎంపీ చక్కెర కర్మాగారాల పరిధిలో 4లక్షల టన్నుల చెరకు గానుగ లక్ష్యమని జిల్లా అసిస్టెంట్ కేన్ కమిషనర్ కె.లోకేశ్వర్ పేర్కొన్నారు. మండలంలోని చెరుకు తోటలను శనివారం కమిషనర్ పరిశీలించారు. కాపులూరు, కూచివాడ, గునపాడు, పెన్నేపల్లి, పెళ్లకూరు మండలం చెంబేడు, చావాలి గ్రామాలలో చెరకు పంట నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేన్ కమీషనర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 1,611 టన్నులు ఎంపీ షుగర్స్ ఫ్యాక్టరీలోనూ, 27,259 టన్నులు సూదులగుంట షుగర్ ఫ్యాక్టరీలో గానుగ ఆడించినట్లు తెలిపారు. టన్నుకు రూ.2,500లు అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఎంపీ షుగర్స్ వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ మాట్లాడుతూ విత్తన తోటలకు ఎకరానికి నాలుగు టన్నుల చెరకును ఉచితంగా ఫ్యాక్టరీ అందిస్తుందని తెలిపారు. ఆయన వెంట సీఈఓ శివరామ్‌ప్రసాద్, క్షేత్రస్థాయి ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్నారు. -
మెట్పల్లిలో చెరకు రైతుల భారీ ధర్నా
మెట్పల్లి: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని మూతబడిన చెరకు కర్మాగారాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లిలో భారీ ధర్నా జరిగింది. మెట్పల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ముత్యంపేట నుంచి మెట్పల్లి వరకు పాదయాత్రగా తరలివచ్చి పట్టణంలోని చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సీజన్లో చెరకు క్రషింగ్‌ను ముత్యంపేట కర్మాగారంలోనే చేపట్టాలని ఆందోళనకు దిగిన రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, కొమ్‌రెడ్డి రాములు మద్దతు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
తగ్గనున్న చక్కెర ఉత్పత్తి: ఇక్రా
11 శాతం మేర పడిపోతాయంటూ జోస్యం ముంబై: వర్షపాతం హెచ్చుతగ్గుల వల్ల చె రకు పంట దిగుబడి తక్కువగా వుండటంతో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి 11 శాతం మేర తగ్గనుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ సంవత్సరం 25.2 మిలియన్ టన్నుల లోటు ఉండొచ్చునని, ధరలు మాత్రం స్థిరంగా కొనసాగే వీలుందని పేర్కొంది. తద్వారా చ క్కెర ఎగుమతులపైన ప్రభావం చూపనుందని తెలిపింది. గత ఏడాది 9.5 మిలియన్ టన్నులు(ఎంటీ) ఎగుమతి కాగా ఇప్పుడు 7.6 ఎంటీలకు పడిపోయే ప్రమాదముందని చెప్పింది. స్టాక్ దిద్దుబాట్లు, తప్పనిసరి ఎగుమతులు, చెరకు పంట దిగుబడి పై సబ్సిడీ పుణ్యమా అని గత ఆగస్టు నుంచి చక్కెర ధరలుపెరిగాయని గుర్తు చేసింది. చెరకు పండించే ప్రధాన ప్రాంతాల్లో కరువు సంభవించటం కూడా ధరల పెరుగుదలకు కారణమైందని వెల్లడించింది. చ క్కెర ధరలు అమాంతం పెరిగి 2016 మే నాటికి టన్నుకు రూ.34 వేలకు చేరుకుంది. గత ఏడాది ధరతో పోలిస్తే 50 శాతం పెరిగిందని సంస్థ సీనియర్ సీనియర్ ఉపాధ్యక్షులు సబ్యసాచి మజుందర్ తెలిపారు. -
చెరకుపైరు, మామిడితోటఅగ్నికి ఆహుతి
ప్రమాదవశాత్తు సంభవించిన అగ్నిప్రమాదంలో మామిడి తోట, చెరుకు పైరు దగ్ధమయ్యాయి. ఈ ఘటన మెదక్ మండలంలో చోటుచేసుకుంది. సర్ధన గ్రామానికి చెందిన నారా గౌడ్‌కు గ్రామ శివారులో 5 ఎకరాల మామిడి తోట ఉంది. పక్కనేగల కొండు కిష్టయ్య 9 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మామిడి తోటలో మంటలు అంటుకుని చెట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ క్రమంలో మంటలు పక్కనే గల చెరుకుతోటలోకి వ్యాపించాయి. దీంతో చెరుకుతోట సైతం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ప్రమాదంలో మామిడి చెట్లు కాలి రూ.10 లక్షల మేర, చెరుకుతోటకు రూ.8 లక్షల నష్టం వాటిల్లిందని బాధితరైతులు తెలిపారు. -
బెల్లం పొడి భలే..
♦ ఎకరాకు రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం ♦ ప్రకృతి సేద్యంలో మహిళా రైతు ప్రస్థానం ఎటువంటి యంత్రాలు వాడకుండానే సంప్రదాయ పద్ధతుల్లోనే నాణ్యమైన బెల్లం పొడిని తయారు చేసి విక్రయిస్తున్నారు విజయనగరం జిల్లాలోని మెరకముడిదాం మండలం గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా రైతు అల్లూరి విజయ. ఎంఎస్సీ కమ్యూనిటీ హెల్త్ సెన్సైస్ అండ్ న్యూట్రిషన్ కోర్సు చదువుకున్న ఆవిడ... లండన్‌లో ఒకటిన్నర సంవత్సరం ఉద్యోగం చేశారు. 2011లో స్వగ్రామానికి తిరిగొచ్చి సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 30 ఎకరాల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తొలి ఏడాదే టన్ను విక్రయించాం.. ప్రకృతి వ్యవసాయంలో పండించి, తయారు చేస్తున్న బెల్లం, బెల్లం పొడికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాదే ప్రారంభించినా ఇప్పటి వరకు టన్ను బెల్లం పొడిని విక్రయించాం. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. బెల్లం దిమ్మల విక్రయాలతో పోల్చితే.. బెల్లం పొడి ద్వారా 50 శాతం అధిక ఆదాయం లభిస్తుంది. దీనికి భవిష్యత్తులో మరింత గిరాకీ పెరగవచ్చు. చెరకు రైతులు దీనిపై దృష్టి సారిస్తే మిల్లుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మరింత ఆదాయం పొందవచ్చు. - అల్లూరి విజయ (97017 06432), గరుగుబిల్లి, విజయనగరం జిల్లా బెల్లం పొడితో పెరిగిన ఆదాయం 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో చెరకును పండించి నాణ్యమైన బెల్లం పొడిని తయారు చేస్తున్నారు విజయ. బెల్లం దిమ్మెల తయారీలో అనుసరించే ప్రక్రియనే పొడి తయారీలోను అనుసరిస్తారు. తొలుత చెరకును నీటితో కడిగి, యంత్రాల ద్వారా రసం తీసి బాణలిలో పోస్తారు. బాణలిని పొయ్యిపై ఉంచి నాలుగైదు గంటలు వండితే బెల్లం పాకం వస్తుంది. బెల్లం పాకాన్ని పూర్తిగా ఎండబెట్టి జల్లిస్తారు. తరువాత బొరిగెలు వంటి ఇనప పరికరాలతో తురుముతారు. దీంతో పొడి వస్తుంది. 4.8 శాతం తేమ ఉండేలా ఎండబెట్టిన పొడిని అర కిలో, కిలో ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. ముందుగా ఆర్డర్లు తీసుకొని పొడిని తయారు చేసి విశాఖ పట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు పంపుతున్నారు. బెల్లం పొడిని కిలో రూ. 120 చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యత చెడకుండా చెరకు గడల నుంచి రసం తీయడం దగ్గర్నుంచి ప్యాకింగ్ వరకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొడి తయారీ, ప్యాకింగ్ దశల్లోను కూలీల చేతులకు గ్లౌజులు వాడుతున్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ బెల్లం పొడి చెడిపోకుండా ఉండేందుకు యంత్రం సహాయంతో గాలి చొరబడకుండా ప్యాకింగ్ చేస్తారు. ప్రవాస భారతీయులు బెల్లం పొడిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి పద్ధతుల్లో సాగు చేయటం వల్ల వీరి పొలంలో ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి వస్తోంది. దీని నుంచి 4 టన్నుల బెల్లం వస్తుంది. దీన్ని విక్రయిస్తే రూ. 2.80 లక్షల ఆదాయం వస్తుంది. బెల్లం పొడిగా మార్చి విక్రయిస్తే ఎకరాకు రూ. 4.80 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంతర పంటల ద్వారా ఖర్చులు వస్తున్నాయి. అంటే బెల్లం పొడి లేదా దిమ్మెల ద్వారా వచ్చేదంతానికరాదాయమేనని విజయ చెప్పారు. ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి రసాయన సేద్యం చేసిన రైతులు ఎకరాకు 25 - 30 టన్నుల దిగుబడి వస్తుండగా విజయ మాత్రం 50 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. పైగా చెరకులోనే అంతర పంటలుగా కంది, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసి ఎకరాకు 5 బస్తాల దిగుబడి సాధించారు. వీటిని పప్పులుగా చేసి తామే విక్రయించటం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. వేరు శనగలో ఎకరాకు 15 బస్తాల దిగుబడి వచ్చింది. గింజల నుంచి గానుగతో నూనె తీసి విక్రయిస్తున్నారు. ఈ ఆదాయంతో చెరకు సాగు ఖర్చులు వచ్చేస్తున్నాయి. ప్రకృతి సేద్యంలో వరి పంటను సాగు చేసి ఆమె ఎకరాకు 30 బస్తాల దిగుబడి సాధించారు. హుద్‌హుద్ తుపాన్ తాకిడికి కూడా తమ తోటలో అరటి చెట్లు పడిపోలేదన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ఉన్న శక్తి అదేనని ఆమె అన్నారు. - సతీష్ కుమార్ మరిపి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా -
చేదు వార్త
మూసివేత దిశగా గాజులమండ్యం చక్కెర కర్మాగారం నిర్వహించలేము అంటున్న యాజమాన్యం బకాయిలున్నా.. చెరకు తోలేందుకు సిద్ధమంటున్న రైతులు స్పందించని {పభుత్వం తిరుపతి: జిల్లాలోని చెరకు రైతుల బతుకు చేదెక్కుతోంది. వీరి సమస్యల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే చిత్తూరు కర్మాగారం మూతపడగా, అదేబాటలో గాజుల మండ్యం చక్కెర ఫ్యాక్టరీని కూడా మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. నవంబరు మూడో వారంలోనే క్రషింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా... ప్రభుత్వం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది 2,200 మంది రైతులకు రూ.13.5 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు ఆగస్టు నుంచి దాదాపు 300 మంది ఉద్యోగులకు రూ.2 కోట్లకుపైగా జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే దాదాపు 200 మంది రైతులు, ఉద్యోగులు ఇటీవల తిరుపతిలో సమావేశమై బకాయిలు చెల్లించకపోయినా, జీతాలులేక పోయినా ప్రభుత్వం ఇచ్చినప్పుడు తీసుకొంటాం వెంటనే క్రషింగ్‌ను ప్రారంభించాలని జేసీ నారాయణ భరత్‌గుప్త, ఎండీ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు . ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం రాలేదు. తిరుపతి జన్మభూమి బహిరంగ సభలో ైముఖ్యమంత్రిని కలిసిన రైతులకు చుక్కెదురైంది. వినతిపత్రం తీసుకొన్న సీఎం కనీసం నోరు మెదపలేదు. ఆందోళనలో రైతులు.. గతేడాది బకాయిలు రాక, ప్రస్తుతం సిద్ధంగా ఉన్న చెరుకును ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఫ్యాక్టరీ పరిధిలో 1300 రైతులతో ఫ్యాక్టరీ యజమాన్యం అగ్రిమెంట్లను కుదుర్చుకుంది. ఇంత వరకు క్రషింగ్ ప్రారం భం కాకపోడంతో రైతులకు ఎటూ పాలుపోలేదు. ఫ్యా క్టరీ మూసివేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం క్రషింగ్ విషయాన్ని నాన్చుతోందని ఓ అధికారి పేర్కొన్నారు. క్రషింగ్ ప్రారంభించండి.. బకాయిలు ఉన్న ఫర్వాలేదు.. మేం ఫ్యాక్టరీకి చెరుకును తోలేందుకు సిద్ధం. క్రషింగ్ ప్రారంభించాలి. ఈ విషయా న్ని రైతులమంతా ముక్తకంఠంతో విన్నవించాం. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఫ్యాక్ట రీ తెరవాలని యజయాన్యంపై కోర్టులో కేసు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేం దుకే ప్రభుత్వం ప్యాక్టరీని మూసివేయాలను కుంటోంది. - ఎం. పట్టాభిరెడ్డి, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు ప్రభుత్వానికి నివేదిస్తాం.. రైతులతో చర్చించిన విషయాలను జేసీ ప్రభుత్వానికి నివేదించారు. ఉన్నతాధికారులు సమావేశమై సంక్రాంతి పండుగ తరువాత నిర్ణయం తీసుకోవచ్చు. అగ్రిమెంట్ కుదుర్చుకొన్న రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుంది. - వెంకటేశ్వరరావు, ఎండీ, గాజులమండ్యం చక్కెర ఫ్యాక్టరీ -
మద్దతు ధర మాటేమిటి?
మంత్రి అయ్యన్నను నిలదీసిన చెరకు రైతులు అడ్డుకున్న ఎమ్మెల్యే రాజు ఆందోళన వ్యక్తం చేసిన అన్నదాతలు బుచ్చెయ్యపేట: టన్ను చెరకుకు మద్ధతు ధర ఎంత..గతేడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరకు, దవ్వ డబ్బులు ఎప్పుడిస్తారంటూ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును పలువురు చెరకు రైతులు నిలదీశారు. ఆదివారం బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన మంత్రిని ‘గోవాడ’ రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ ప్రారంభమై నెలన్నర గడిచిపోయినా ఫ్యాక్టరీ యాజమాన్యం, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. మంత్రి వివరణ ఇచ్చేలోపే చోడవరం ఎమ్మేల్యే కేఎస్ఎన్ఎస్ రాజు కల్పించుకుని ఇది సమయం కాదని తర్వాత మాట్లాడుదామని రైతులను వారించడంతో పలువురు తీవ్ర ఆగ్రహం చెందారు. మిల్లుకు గతేడాది సరఫరా చేసిన చెరకుకు సంబంధించి బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. సర్కారు విధానాలతో ఏలా బతకాలని వాపోయారు. టీడీపీ అధికారంలో లేనప్పుడు గోవాడ ఫ్యాక్టరీని తమకు అప్పగిస్తే టన్నుకు రూ.3500 ధర చెల్లిస్తామంటూ రోడ్డేక్కి ఆందోళనలు చేపట్టిన ఎమ్మేల్యే ప్రస్తుతం మద్దతు ధర గురించి ప్రశ్నిస్తే నోరు నొక్కడం శోచనీయమని పేర్కొన్నారు. గోవాడ ఫ్యాక్టరీలో రూ.16 కోట్లకుపైగా అవినీతి చోటుచేసుకుందన్న వాదన నేపథ్యంలో విచారణ జరుగుతుండగా ఎమ్మేల్యే రైతులను వారించడంపై విస్మయం వ్యక్తం చేశారు. -
రోడ్డునపడిన నిజాం షుగర్స్ ఉద్యోగులు
హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్ ) మూత పడిన నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. ముందస్తు నోటీసు లేకుండా లే ఆఫ్ ప్రకటించడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన బాట పడ్డాయి. నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ పరిధిలో శక్కర్‌నగర్ (బోధన్), మెట్పల్లి, మంభోజిపల్లి (మెదక్) యూనిట్లు వుండగా.. నష్టాలను సాకుగా చూపుతూ ప్రస్తుత సీజన్ 2015-16లో చెరకు క్రషింగ్ చేయలేమంటూ యాజమాన్యం చేతులెత్తేసింది.ఓ వైపు చెరుకు క్రషింగ్‌ను నిలిపివేసిన యాజమాన్యం తాజాగా.. లే ఆఫ్‌ను ప్రకటిస్తూ ఈ నెల 23న ఆయా యూనిట్లకు నోటీసులు అంటించింది. క్రషింగ్‌కు అవసరమైన చెరుకు లేకపోవడం, నీటి కొరత మూలంగా లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మూడు నెలలుగా ఫ్యాక్టరీ పరిధిలోని 307 మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. కో జెన్ నడిపించాలిః కార్మికులు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం సమస్యను పరిష్కరించే అవకాశం లేనందున ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలని కార్మికులు ప్రతిపాదిస్తున్నారు. ఎన్డీఎస్ఎల్కు అనుబంధంగా వున్న డిస్టిలరీ, కో జెన్ యూనిట్‌ను నడిపించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరమ్మతులకు రూ.3 కోట్లు చెల్లిస్తే ఫ్యాక్టరీ తిరిగి నడిపే వీలుందని చక్కెర పరిశ్రమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అయితే ప్రస్తుతం చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించేందుకు రవాణా చార్జీల రూపంలో రూ.7 కోట్ల మేర చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పరిష్కరిస్తాం: మంత్రి జూపల్లి ఎన్డీఎస్ఎల్ కుట్ర పూరితంగా లే ఆఫ్ ప్రకటించిందని ఆరోపిస్తూ ఉద్యోగులు, కార్మికులు మంగళవారం పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సచివాలయంలో కలిశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, చక్కెర పరిశ్రమ శాఖ డైరక్టర్ భద్రు మాలోత్, ఎన్డీఎస్ఎల్ ప్రతినిధి సుబ్బరాజు, ఎన్ఎస్ఎల్ జీఎం రమేశ్, ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రి చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్డీఎస్ఎల్ ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తానని కృష్ణారావు వెల్లడించారు. కార్మికులకు బకాయిలను తక్షణమే చెల్లించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించామన్నారు. -
మెట్పల్లిలో చెరుకు రైతుల ఆందోళన
మెట్పల్లి: బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. మంగళవారం ఉదయం రైతులు పెద్ద సంఖ్యలో మెట్‌పల్లికి చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముత్యంపేట కర్మాగారంలోనే చెరుకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో చర్చలు జరుపుతున్నారు. -
సీఎం సొంత జిల్లాకే అన్యాయం
హైదరాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత జిల్లా మెదక్ లోనే చెరుకు రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్ క్రషింగ్ సెంటర్ లో లక్ష టన్నుల చెరుకును ఏం చేస్తారో ప్రభుత్వమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చెరుకు రైతులకు రూ.13 కోట్ల బకాయిలు చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
భూములివ్వని రైతులపై దౌర్జన్యం..
-
భూములివ్వని రైతులపై దౌర్జన్యం..
* పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కుట్రలు * బాధితులనే ముద్దాయిలుగా చిత్రీకరించే యత్నం * విచారణ పేరుతో వేధింపులు * గత డిసెంబరులో జరిగిన పంట దహనం కేసుల్లోనూ ఇదే తీరు * ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు, ప్రజాసంఘాలు సాక్షి, గుంటూరు: రాజధానికి భూమి ఇవ్వనందుకు గుంటూరు జిల్లా మల్కాపురం లో చెరకు పంటను దహనం చేసిన సంఘటనపై బాధిత రైతు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేయడం, ఆయన పొలాన్ని స్వయంగా పరిశీలించడంతో ప్రభుత్వ పరువు మంట కలిసిందనే ఆగ్రహంతో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు మరో కుట్రకు తెర తీశారు. బాధితులను పంట దహనం కేసులో బాధ్యులుగా చేసేందుకు రైతు చంద్రశేఖర్ మేనల్లుడు సురేశ్‌ను రెండు రోజుల క్రితం తీసుకెళ్లి రహస్యంగా విచారణ జరుపుతున్నారు. పంటను తానే దహనం చేసినట్లుగా ఒప్పుకోవాలంటూ పోలీసులు సురేశ్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పంట దహనం సంఘటనకు పాల్పడింది తానేనంటూ సురేశ్ చేతనే చెప్పించి ప్రభుత్వానికి ఆ మరక అంటకుండా చూసేందుకు కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా చంద్రశేఖరే తనను దహనం చేయమని చెప్పినట్లుగా సురేశ్ చేత చెప్పించి కేసులో ఆయన్ను సైతం ఇరికించేందుకు భారీ స్థాయిలో పథక రచన చేశారు. ఇందులో భాగంగా చంద్రశేఖర్‌ను కూడా గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రైతు, ప్రజాసంఘాల నాయకులు, ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఈనెల 23న తుళ్లూరు మండలం మల్కాపురంలో ల్యాండ్‌పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతు గద్దె చంద్రశేఖర్ పొలంలో చెరకు పంటను గుర్తుతెలియని దుండగులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 26న సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వై.ఎస్.జగన్ బాధిత రైతులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం, పోలీసుల వ్యవహార శైలిపై బాధిత రైతు చంద్రశేఖర్ ఆయనకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సర్కారు మాట వినని రైతులపై కక్ష సాధింపులు గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని రైతులకు నిద్ర లేకుండాపోతోంది. భూ సమీకరణ పేరుతో అనేక మంది రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొన్న ప్రభుత్వ పెద్దలు తమ మాట వినని రైతులను టార్గెట్ చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తిరిగి వారిపైనే కేసులు పెడుతూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంత చేస్తున్నా రైతులు లొంగకపోవడంతో పంటలను దహనం చేసే స్థాయికి దిగజారుతున్నారు. గతేడాది డిసెంబర్లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన ఆరు గ్రామాల్లో 13 మంది రైతులకు చెందిన పంట పొలాల్లో వెదురు బొంగులు దహనం చేసిన సంఘటన తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించినప్పటికీ ఇంత వరకు ఈ కేసులో అసలైన బాధ్యులను గుర్తించి అరెస్టు చేసిన దాఖలాలు లేవు. పైగా అప్పట్లో విచారణ పేరుతో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతులను, వైఎస్సార్సీపీకి చెందిన రైతులను స్టేషన్లకు పిలిచి రోజుల తరబడి విచారణ పేరుతో బెదిరింపులకు దిగుతూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇతర నేతలంతా గవర్నర్‌ను కలిసి పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వీరి తీరు మాత్రం మారలేదు. -
బకాయిల కోసం చెరకు రైతుల ధర్నా
సీతానగరం: బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు చెరకు కర్మాగారం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన సోమవారం విజయనగరం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. మండల కేంద్రం సమీపంలోని ఎన్సీహెచ్ చక్కెర కర్మాగారం ఎదుట బాధిత రైతులు ఆందోళన దిగారు. ఫ్యాక్టరీ యాజమాన్యం దాదాపు రూ.7 కోట్లు మేర రైతులకు బకాయి పడింది. దీంతో రైతులు ఫలు దఫాలుగా యాజమాన్యంతో చర్చలు జరిపారు. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు కోర్టుకు వెళ్లారు. దీంతో రైతులుకు ఆగస్టు నెలఖారు లోపు విడతలవారిగా బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాని యాజమన్యాం చెల్లించలేదు. దీంతో రైతులు పలుమారు ఆందోళనకు దిగారు. ఈ రోజు కూడా రైతులకు ఆందోళనకు దిగడంతో ఫ్యాక్టరీ ఎదుట పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను మోహరించారు. -
మద్దతు ధర లేక...
చెరకు పంటకు నిప్పు సింధనూరు టౌన్ : చెరుకు పంటకు ధర పతనం కావడంతో దిక్కుతోచని తాలూకాలోని జాలవాడగి గ్రామానికి చెందిన హంపణ్ణ అనే రైతన్న తన ఏడు ఎకరాల చెరుకు పంటకు నిప్పంటించిన ఘటన శనివారం జరిగింది. రాష్ట్రంలో చెరుకు పంటకు ధర పతనం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగిన నీరు, పండించిన పంటకు ధర లేకపోవడంతో తాము పండించిన పంటను కొనుగోలు చేసేవారే లేకుండాపోయారని, అందువల్లే చెరుకు పంటకు నిప్పంటించానని, వ్యవసాయం చేయడమే కష్టకరంగా మారిందని రైతు హంపణ్ణ వాపోయాడు. తాము పండించిన చెరుకు పంటను విక్రయించినా చేసిన అప్పులు తీరవన్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో రూ.2 లక్షలు, వ్యవసాయ సేవా సహకార సంఘంలో రూ.50 వేలు, ప్రైవేట్‌గా రూ.2.50 లక్షల అప్పులున్నాయని తెలిపాడు. కరువు పరిస్థితుల మధ్య చెరుకు పంటకు ధర లేకుండా పోయిందని, చెరుకు కటావ్ చేసినా కూలీ ఇచ్చేందుకు కూడా తన వద్ద డబ్బులు లేవని తెలిపారు. రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అమీన్‌పాషా దిద్దగి మాట్లాడుతూ... ప్రభుత్వం రైతుల పంటలకు మద్దతు ధర అందించడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. వెంటనే ఎమ్మెల్యే, తాలూకా యంత్రాంగం ఈవైపు దృష్టి సారించాలని, నష్టానికి గురైన రైతుకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. -
పది ఎకరాల్లో చెరకు పంట దగ్ధం
కర్నూలు(గోనెగండ్ల): జిల్లాలోని గోనేగండ్ల మండలంలో పది ఎకరాల్లో చెరకుపంట దగ్ధమైంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. మండలంలోని హెచ్ కైరావలి గ్రామంలో షార్ట్ సర్కూట్ కారణంగా దాదాపు పది ఎకరాల్లో చెరకు పంట ధ్వంసం కావడంతో రైతులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. -
ఈ సారీ చేదు ధరే
చెరకు రైతులను నిరాశపరిచిన టన్ను రూ.2270 మద్దతు ధర ఇలా అయితే వచ్చే ఏడు చెరకు వేయలేమంటున్న రైతాంగం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ 'చెరకు రైతులను హుద్‌హుద్ తుఫాన్ కోలుకోలేని దెబ్బతీసింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడులు 40 శాతం మేర పెరిగాయి. చెరకు టన్ను కనీస ధర కేంద్రం రూ.2500లైనా ప్రకటిస్తుందని రైతులు ఆశించారు. కేవలం రూ.2125 ధర ప్రకటించడంపై రైతులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుంటే ఇక చెరకు పంట వేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. చోడవరం: చెరకు రైతుల కష్టాలు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. మద్దతు ధరపై ఏటా వీరు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం కనికరించడంలేదు. ఐదేళ్లుగా చెరకు రైతులకు మద్దతు ధర లేక ఏటా అప్పుల పాలవుతున్నారు. రైతులకు అండగా ఉంటామని అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది కూడా రైతులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర ప్రకటించలేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టుబడులు 40 శాతం మేర పెరిగాయి. కనీస గిట్టుబాటు ధర రూ.145 మాత్రమే పెంచుతూ కేంద్ర వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ కమిటీ తాజాగా ప్రకటించింది. గత ఏడాది చెరకు టన్నుకు రూ.2125 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం ఈ ఏడాది రూ. 2,270గా ప్రకటించింది. 2013-14 సీజన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఒక్కపైసా ఫ్యాక్టరీలకు ఇవ్వకపోయినా గోవాడ ఫ్యాక్టరీ టన్నుకు రూ.2350, ఏటికొప్పాక రూ.2125, తాండవ రూ.2వేలు, అనకాపల్లి ఫ్యాక్టరీ రూ.1800 చొప్పున రైతులకు చెల్లించాయి. కేంద్రం ఈ ఏడాది టన్నుకు కనీస మద్దతు ధర రూ.2500 ప్రకటిస్తుందని రైతులంతా ఎదురు చూడగా ఆ ఆశ కూడా లేకుండాపోయింది. హుద్‌హుద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉన్న అయిదు సహకార చక్కెర కర్మాగారాలు తీవ్రంగా నష్టపోయాయి. చెరకు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. సరిగ్గా చెరకు పంట ఎదుగుతున్న సమయంలో తుఫాన్ రావడంతో పంట తీవ్రంగా దెబ్బతింది. ఎకరాకు 30-40 టన్నులకు పైబడి దిగుబడి వచ్చే చెరకు ఈ ఏడాది కనీసం 15-20 టన్నులు కూడా రాలేదు. పెట్టుబడి మాత్రం ఎకరాకు సుమారు రూ.45 వేలకు మించి ఖర్చుపెట్లాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో టన్నుకు కనీస మద్దతు ధర రూ.2600 నుంచి 3 వేల వరకు ఇస్తే కాని రైతుకు గిట్టుబాటు కాదు. అలాంటిది కేంద్రం కనీస మద్దతు ధర రూ. 2270 ప్రకటించడంపై రైతుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అది కూడా 9.5 రికవరీ ఉంటేనే ఈ ధర ఇస్తారు. అనేక సమస్యలతో సతమతమవుతున్న సుగర్ ఫ్యాక్టరీలు సాధారణ సీజన్లలోనే ఇంత రికవరీని సాధించడం లేదు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత, ఫ్యాక్టరీలు కొంత కలిపి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాల్సి ఉంది. మరో పక్క ప్యాక్టరీలైనా అదనపు ప్రోత్సాహకం ఇస్తాయనుకుంటే మార్కెట్లో పంచదార ధరలు ఘోరంగా పడిపోయి అవికూడా చదికిలబడే పరిస్థితి నెలకొంది. పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది చెరకు విస్తీర్ణం 20 శాతం జిల్లాలో తగ్గిపోయింది. పెట్టుబడులు పెరిగిపోవడంతో అంతా సరుగుడు పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ప్రకటించిన ధరకు అదనంగా టన్నుకు రూ.300-500 వరకు రాష్ట్రం ప్రభుత్వం రైతులకు ఇచ్చి ఆదుకుంటే తప్ప వచ్చే సీజన్‌కు చెరకు పంట వేసే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. గిట్టుబాటు ధర ఘోరం ఈ ఏడాది చెరకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నేను 3 ఎకరాల్లో చెరకు వేశాను. తుఫాన్ వల్ల తోట ఎదుదల తగ్గిపోయింది. కనీసం 20 టన్నులు కూడా దిగుబడి రాలేదు. పెట్టుబడి ఎకరాకు రూ.40 వేలకు పైబడి ఖర్చయింది. ఇప్పుడు గిట్టుబాటు ధర చూస్తే ఘోరంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకోవాలి. -అడ్డూరు పాల, చెరకు రైతు, లక్కవరం ఇలా అయితే చెరకు పండించలేం ఈ ఏడాది గిట్టుబాటు ధర ఆశించిన మేర ఇవ్వకపోతే వచ్చే ఏడాది చెరకు పండించడం కష్టమే. పెట్టుబడులు చూస్తే చాలా పెరిగిపోయాయి. డీఏపీ, యూరియా ధరలతోపాటు విత్తనం ఖరీదైపోయింది. తుఫాన్ వల్ల అదనపు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఈ ప్రాంతంలో తుఫాన్‌కు తోటలన్నీ నీటిలో మునిగిపోయి చాలా రోజులు ఉండిపోవడం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. రాష్ట్రప్రభుత్వం ఆదుకొని టన్నుకు రూ.2600 పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలి. -అప్పలనాయుడు, చెరకు రైతు, చాకిపల్లి -
చెరుకు ప్రోత్సాహక ధర పెంపు
డిల్లీ: చెరుకు ప్రోత్సాహక ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ కు రూ.230 పెంచుతూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు నేరుగా రైల్వేకు బయో డీజిల్ విక్రయించేందుకు కేంద్రం అంగీకరించింది. అదేవిధంగా ఎఫ్ ఎం రేడియో మూడో దశ వేలానికి కేంద్రం అనుమతి తెలిపింది. -
రాత్రి కరెంట్‌కు తండ్రీకొడుకులు బలి
మెదక్: రాత్రి కరెంట్‌కు తండ్రీ కొడుకులు బలయ్యారు. ఈ సంఘటన మెదక్ మండలం కొచ్చెర్వు తండాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మూడావత్ జగ్న (66), పేమ్ని దంపతుల చిన్న కుమారుడు చిన్నా (25) పొలం వద్దకు వెళ్లారు. చెరకును కొంత మేర నాటారు. ఆ తరువాత ఏమైందో ఏమో కాని ఇరువురూ స్టార్టర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా తండ్రి, సోదరుడు ఇంటికి రాకపోవడంతో మరో కుమారుడు తిన్యా పొలం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే తండ్రి, సోదరుడు విగత జీవులుగా పడి ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
చేదు కబురు
మెదక్ రూరల్: ఇప్పుడు..అప్పుడంటూ..ఇన్నాళ్లూ క్రషింగ్ తేదీలను వాయిదా వేస్తూ వచ్చిన నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్డీఎస్ఎల్) శనివారం చెరకు రైతులకు చేదు వార్త చెవిన వేసింది. వాతావరణ పరిస్థితుల వల్ల క్రషింగ్ సమయానికి ఇంకొంత సమయం పడుతుందని, అందువల్ల ఫ్యాక్టరీకి తెచ్చిన చెరకును బోదన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లాలని సూచించింది. దీంతో చేసేది లేక నాలుగు రోజులుగా ఫ్యాక్టరీ వద్ద పడిగాపులుగాచిన రైతులు చెరకును తీసుకుని బోధన్ బాట పట్టారు. మెదక్ మండల పరిధిలోని మంభోజిపల్లి శివారులో 12 మండలాల చెరకు రైతుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాతికేళ్ల క్రితం ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని నిర్మించింది. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు ప్రభుత్వం నష్టాలను సాకుగా చూపుతూ ఆ ఫ్యాక్టరీని దక్కన్ పేపర్ మిల్లు యజమానికి చాలా తక్కువకు విక్రయించింది. నాటి నుంచి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులతో పాటు ఈ ప్రాంత చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రషింగ్ చాలా ఆలస్యంగా ప్రారంభించడం...డబ్బు కూడా సకాలంలో చెల్లించకపోవడంతో చెరకు రైతు బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. నెల ఆలస్యమన్నారు...ఇపుడు అదీలేదు ఎన్డీఎస్ఎల్లో ప్రతి సంవత్సరం నవంబర్ మొదటి వారంలో క్రషింగ్‌ను ప్రారంభించాల్సి ఉండగా, ఈ సంవత్సరం డిసెంబర్ 10న క్రషిం గ్ను ప్రారంభించారు. అయితే ఇంతవరకు టన్ను చెరకును కూడా గానుగ ఆడించలేదు. అయితే క్రషింగ్ తేదీని యాజమాన్యం ముందుగానే ప్రకటించడంతో 12 మండలాల నుంచి వందలాది మంది రైతులు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లలతో చెరకును ఫ్యాక్టరీకి తరలించారు. తీరా నాలుగు రోజులు గడిచాక, వాతావరణం చల్లగా ఉందన్న సాకును చూపుతూ క్రషింగ్ ప్రారంభించలేమని యాజమాన్యం తేల్చిచెప్పింది. ఎన్డీఎస్ఎల్లో క్రషింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున రైతులంతా తమ చెరకును బోధన్‌లోని ఫ్యాక్టరీకి తీసుకువెళ్లాలని సూచించింది. కావాలంటే బోధన్ వరకు రవాణా చార్జీల కింద టన్నుకు రూ.400 చొప్పున చెల్లిస్తామని వెల్లడించింది. దీంతో ఇప్పటికే నాలుగురోజులుగా ఫ్యాక్టరీ ఎదుట చెరకుతో నిరీక్షిస్తున్న రైతులు ఏం చేయాలో తెలియని స్థితిలో బోధన్ బాటపట్టారు. అయితే 100 కి.మీ దూరం తీసుకెళ్లడం తీవ్ర ఇబ్బందిగా మారిందని, పైగా చెరకు బరువు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై పాలకులు స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఫ్యాక్టరీ క్రషింగ్ సక్రమంగా నడిచేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అధికారి వివరణ ఈ విషయంపై ఫ్యాక్టరీ జీఎం నాగరాజును వివరణ కోరగా వాతావరణ చల్లగా ఉన్నందున క్రషింగ్ నడవటం లేదు. అందుకే నాలుగు రోజులుగా నిలువ ఉన్న చెరకును బోధన్ పంపుతున్నామని తెలిపారు. -
చేదెక్కిన చెరకు సాగు
మోర్తాడ్ : అందరికీ తీపిని పంచే చెరకును సాగు చేసే రైతుకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నియోజకవర్గంలో ఫలితంగా చెరకు సాగు అంతరించిపోయింది. బాల్కొండ నియోజకవర్గంలోని పల్లెల్లో ఒకప్పుడు చెరకు పంట అత్యధికంగా సాగయ్యేది. పం టపండిన తర్వాత చెరకును నరకడానికి వచ్చే కూలీలు, ఫ్యాక్టరీకి పంటను తరలించడానికి వినియోగించే వాహనాలతో పల్లెలు కళక ళలాడేవి. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో బాల్కొండ నియోజకవర్గం ఉండేది. ఒక్కో గ్రామంలో 50 నుంచి 100 హెక్టార్లలో చెరకును సాగు చేసేవారు. బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో పండించే చెరకును ముత్యంపేట్ ఫ్యాక్టరీకి తరలించేవారు. చెరకుకు గిట్టుబాటు ధరను కల్పించకపోవడం, క్రషింగ్‌కు తరలించిన పంటకు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడంతో రైతులకు ఇబ్బంది కర పరిస్థితులు ఎదురయ్యాయి. చెరకు సాగుకు ప్రోత్సాహం కరువు కావడంతో రైతులు ఇతర వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించారు. చెరకు సాగు విస్తీర్ణం తగ్గడం మొదలు కాగా చివరకు పూర్తి గా పంట అంతరించిపోయింది. ఇప్పటి తరం వారికి చెరకు గడల రుచి తెలియదంటే అతిశయోక్తి కాదు. చెరకు పంట సాగు చేయడం వల్ల కూలీలకు ఉపాధి దొరకడంతో పాటు, చెరకు రుచులు ప్రజలకు అందేవి. చెరకును పంచదార తయారీ కోసమే కాకుండా చెరకు ఆకులు, గడలను శుభ కార్యాలకు ఇండ్లలో వినియోగించేవారు. ఆరేళ్లు చెరకు పంట అంతరించిపోయినా పంటను సాగు చేయించడంపై ముత్యంపేట ఫ్యాక్టరీ యాజమాన్యం దృష్టిని సారించలేదు. మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలలో కొనసాగిన చెరకు కార్యాలయాలనూ ఎత్తివేశారు. -
గానుగాడేనా?
తీపి చెరకును పండించే రైతుల బతుకులు చేదుగా మారుతున్నాయి. సీజన్ ముంచుకొస్తున్నా... అందుబాటులో ఉన్న ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ ఈయేడు నడుస్తుందో? లేదో తెలియని సందిగ్ధంలో చెరకు రైతులు ఉన్నారు. ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలన్న మంత్రుల కమిటీ నివేదిక అమలుకు నోచుకుంటుందా? లేక పాత యాజమాన్యమే నడిపిస్తుందా? అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరోవైపు ఇక్కడ పండించిన చెరకును బోధన్‌కు తరలిస్తారన్న ప్రచారం రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మెదక్: మెతుకుసీమలోని 12 మండలాల చెరకు రైతుల ప్రయోజనార్థం మంభోజిపల్లిలో నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ సేవలందిస్తోంది. ఇప్పటివరకు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ గత జనవరి 17న అప్పటి ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అప్పట్లో టీఆర్ఎస్ కూడా ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేయాలని డిమాండ్ చేసింది. అయితే అప్పటికే 2014-15 సంవత్సరానికి సంబంధించి యాజమాన్యంతో చెరకు రైతులు అగ్రిమెంట్ కుదుర్చుకోవడంతో ఈయేడు ప్రభుత్వపరమయ్యే సూచనలు కనిపించడం లేదు. కాగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యమే ఫ్యాక్టరీని నడపాలని ఇటీవల మెదక్‌కు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ముందుకు సాగని మర మ్మతులు: సాధారణంగా ప్రతియేడు నవంబర్‌లో చెరకు క్రషింగ్ ప్రారంభమవుతోంది. అయితే ఫ్యాక్టరీని మరమ్మతులు చేయడానికి సుమారు రెండు నెలలు పడుతుందని సమాచారం. కాని ఇంతవరకు మరమ్మతులు మొదలు కాలేదని రైతులు చెబుతున్నారు. పైగా ఫ్యాక్టరీతో చెరకు అగ్రిమెంట్లు ఉన్న వివరాలను తిరిగి సేకరిస్తున్నారని వారు తెలిపారు. దీంతో క్రషింగ్ కోసం ఇతర ఫ్యాక్టరీలకు తరలిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బోనస్‌కు సంబంధించి బకాయిపడ్డ రూ.4 కోట్లను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బోధన్ కేంద్రంగా మూడు ఫ్యాక్టరీల క్రషింగ్? తెలంగాణ పరిధిలోని మంభోజిపల్లి, బోధన్, మెట్పల్లి ఫ్యాక్టరీలు ఒకే ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేస్తున్నాయి. వీటికింద ఈయేడు సుమారు 3 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతియేటా ఈ మూడు ఫ్యాక్టరీలను మరమ్మతులు చేసి నడపాలంటే సుమారు రూ.18 కోట్లనుంచి 20 కోట్ల ఖర్చు వస్తుందని రైతు నాయకులు చెబుతున్నారు. అందుకే బోధన్ ఫ్యాక్టరీని ప్రారంభించి మిగతా రెండు ఫ్యాక్టరీల పరిధిలోని చెరకును అక్కడికి తరలిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెరకును నరికి దూర ప్రాంతాలకు తరలించడం వల్ల రవాణాలో జాప్యం జరగడం వల్ల తూకంలో నష్టం వాటిల్లుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వమే చక్కెర ఫ్యాక్టరీని నడపాలని చెరకు రైతుల పోరాట సమితి కార్యదర్శి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డికి కూడా విన్నవించామన్నారు. ఎలాంటి ఆదేశాలు రాలేదు ఈయేడు క్రషింగ్ విషయంపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. గత యేడాది చెరకు బిల్లులు చెల్లించాం. బోనస్ బిల్లులు మాత్రమే చెల్లించాల్సి ఉంది. - నాగరాజు, జీఎం, ఎన్డీఎస్ఎల్, మంభోజిపల్లి -
ఎలా నాటాలి? ఎలా పెంచాలి?
పాడి-పంట: అనకాపల్లి (విశాఖపట్నం): చెరకు సాగులో మూడు కళ్ల ముచ్చెలకు బదులు ఒంటికన్ను కణుపులను వినియోగించడం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకొని, నికరాదాయం పెంచుకోవచ్చు. ఈ పద్ధతిలో ముందుగా ట్రేలల్లో నారు మొక్కలను పెంచి, ఆ తర్వాత వాటిని ప్రధాన పొలంలో నాటాలి. నారు మొక్కల పెంపకంపై నిన్నటి ‘పాడి-పంట’లో వివరాలు అందించాం. ఆ మొక్కలను ఎలా నాటాలి? ఎరువులు-నీటి యాజమాన్యం, కలుపు నివారణపై విశాఖపట్నం జిల్లా అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ భరతలక్ష్మి అందిస్తున్న సూచనలు... ఇలా నాటండి ముందుగా ప్రధాన పొలాన్ని 2-3 సార్లు ఇనుప నాగలితో బాగా దున్ని, రోటోవేటర్‌తో మెత్తని దుక్కి చేసి, ఎత్తుపల్లాలు లేకుండా చదును చేయాలి. జంట సాళ్ల పద్ధతిలో... అంటే 60/120 సెంటీమీటర్ల దూరంలో సాళ్లు వేసుకోవాలి. సాళ్ల మధ్య జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు వేసుకొని, ఆ మొక్కలను 40-45 రోజుల వయసులో భూమిలో కలియదున్నితే భూసారం పెరుగుతుంది. భూభౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. పెసర, మినుము, వేరుశనగ వంటి పంటలను అంతరపంటలుగా కూడా వేసుకోవచ్చు. బిందుసేద్యానికి ఈ పద్ధతి చాలా అనువుగా ఉంటుంది. మొక్కల మధ్య 40 సెంటీమీటర్ల దూరాన్ని పాటిస్తే అంతరకృషి, బోదెలు ఎగదోయడం వంటి పనులను మినీ ట్రాక్టర్/పవర్ టిల్లర్‌తో చేసుకోవచ్చు. జంట వరుసల (డబుల్ రో) పద్ధతిలో కూడా మొక్కలు నాటుకోవచ్చు. ఒకే కాలువలో రెండు వరుసల్లోనూ (వరుసల మధ్య 25-30 సెంటీమీటర్ల దూరం ఉండేలా) మొక్కలు నాటుకున్నట్లయితే దిగుబడులు పెరగడంతో పాటు యంత్రం సాయంతో చెరకు నరకడం తేలికవుతుంది. నారు మొక్కలను నాటడానికి ఎకరానికి 6-8 మంది కూలీలు అవసరమవుతారు. యంత్రం సాయంతో నాటితే ఇద్దరు సరిపోతారు. మొక్క నాటే చోట ముందుగా నీరు పోయాలి. వేర్లకు అంటుకొని ఉన్న కొబ్బరి పీచు ఎరువుతో సహా మొక్కను నాటాలి. నాటిన మొక్కలు 4-5 రోజులకు నిలదొక్కుకుంటాయి. నాటిన తర్వాత 3-4 రోజులకు ఒక తడి చొప్పున ఇవ్వాలి. ఎరువుల యాజమాన్యం నారు మొక్కలు నాటినప్పటి నుంచి మట్టిని మొదళ్లకు ఎగదోసే వరకూ (90-100 రోజులు) ఎరువులను దఫదఫాలుగా వేయాలి. దీనివల్ల దిగుబడి పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. మొక్కలు నాటేటప్పుడు ఎకరానికి 1.5 టన్నుల పశువుల ఎరువు, 12.5 కిలోల డీఏపీని మొదళ్ల దగ్గర వేసి మట్టితో కప్పాలి. నాటిన 10 రోజుల తర్వాత మళ్లీ అదే మోతాదులో ఎరువులు వేయాలి. అనంతరం 10-15 రోజుల వ్యవధి ఇచ్చి ఎకరానికి 25 కిలోల డీఏపీని పశువుల ఎరువుతో కలిపి వేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ 10-15 రోజుల వ్యవధి ఇచ్చి ఎకరానికి 25 కిలోల యూరియా, 25 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. తిరిగి 10-15 రోజుల వ్యవధి ఇచ్చి ఎకరానికి 50 కిలోల యూరియా, 25 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ఎరువును పైపాటుగా వేయకుండా మొక్కల మొదళ్ల వద్ద వేసి, మట్టితో కప్పేయాలి. ఎరువులు వేసిన ప్రతిసారీ తేలికపాటి తడి ఇవ్వాలి. పైరు 90-100 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 100 కిలోల యూరియా, 100 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్‌ను మొక్కల మొదళ్ల వద్ద వేసి మట్టిని కప్పాలి. ఆ తర్వాత మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ఇలా దఫదఫాలుగా ఎరువులను అందించడం వల్ల మొక్కలు ఎక్కువ పిలకలను పెడతాయి. మట్టిని మొక్కల మొదళ్లకు ఎగదోసిన తర్వాత కొత్త పిలకలు పుట్టి దృఢంగా తయారవుతాయి. అవన్నీ గడలుగా మారతాయి. కలుపు నివారణ నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటిన 3 రోజుల లోపు ఎకరానికి 450 లీటర్ల నీటిలో 2 కిలోల అట్రాజిన్ లేదా 600 గ్రాముల మెట్రిబుజిన్ కలిపి పిచికారీ చేయాలి. ఆ తర్వాత కలుపు ఉధృతిని బట్టి మొక్కలు నాటిన 20-25 రోజులకు ఎకరానికి 450 లీటర్ల నీటిలో 400 గ్రాముల మెట్రిబుజిన్ + 80 గ్రాముల 2, 4-డీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఏకదళ, ద్విదళ బీజ జాతికి చెందిన కలుపు మొక్కలను నివారించవచ్చు. కూలీల లభ్యతను బట్టి వరుసల మధ్య గొప్పు తవ్వించి కలుపు తీయిస్తే మొక్కల వేర్లకు గాలి బాగా తగులుతుంది. ఎక్కువ పిలకలు వస్తాయి. వరుసల మధ్య ట్రాక్టర్ లేదా కోనోవీడర్‌ను నడిపితే కలుపు నిర్మూలనతో పాటు భూమి గుల్లబారుతుంది. నీటి తడులు ఇలా... నారు మొక్కలను నాటిన తర్వాత 3-4 రోజులకు ఒకసారి నీటి తడి ఇవ్వాలి. మొక్కలు నిలదొక్కుకున్న తర్వాత పైరు బాల్య దశలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి కాలువల్లో నీరు పారించాలి. బిందుసేద్య పద్ధతిని అనుసరించే వారు నత్రజని ఎరువును నీటిలో కలిపి, మొక్కలు నాటిన 10 రోజుల నుంచి వారం రోజుల వ్యవధి ఇస్తూ 20 దఫాలుగా నీటిని అందించాలి. పైరు పెరుగుదలను బట్టి 2-3 జడచుట్లు వేసి మొక్కలను నిలబెట్టాలి. తోటను సరైన సమయంలో భూమట్టానికి నరికి ఫ్యాక్టరీకి తరలిస్తే మంచి ఆదాయం పొందవచ్చు. -
ఈ పురుగుతో జాగ్రత్త సుమీ!
అనకాపల్లి (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని తొలకరి జల్లులు పలకరిస్తున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు అనేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వడగాలులు వీస్తూనే ఉన్నాయి. వాతావరణంలో చోటుచేసుకునే ఇలాంటి మార్పులు పంటలపై ప్రభావం చూపడం సహజమే అయినప్పటికీ దీర్ఘకాలిక పంటలపై ఆ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరిలో నీటి వసతి కింద వేసిన చెరకు పంటలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ పురుగు నివారణకు రైతులు ఎప్పటికప్పుడు సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ ఎం.భరతలక్ష్మి. ఆ వివరాలు... బెడద పెరుగుతోంది చెరకు పంటను సుమారు 100 రకాల కీటకాలు ఆశిస్తున్నప్పటికీ కొన్ని మాత్రమే అధిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది పీక/కాండం తొలుచు పురుగు. ఇటీవలి కాలంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పుల కారణంగా ఈ పురుగుల తాకిడి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈ పురుగుపై రైతులు సరైన అవగాహన ఏర్పరచుకుని, సమగ్ర చర్యల ద్వారా వాటిని నివారించగలిగితే దిగుబడి, రస నాణ్యతలో ఏర్పడే నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. పైరు తొలి దశలో ఉన్నప్పుడు దీనిని పీక పురుగు అంటారు. పైరు కణుపులు వేసిన తర్వాత ఆశిస్తే దానిని కాండం తొలుచు పురుగు అంటారు. గత 3-4 సంవత్సరాలుగా ఈ పురుగు జూలై నుంచి చెరకు పైరుపై దాడి చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఎలా నష్టపరుస్తుంది? తల్లి పురుగు 3-4 రోజుల పాటు జీవిస్తుంది. ఒక్కో పురుగు ఆకుల అడుగు భాగాన, మధ్య ఈనెకు సమాంతరంగా, 2-3 వరుసల్లో 400కు పైగా తెల్లని గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి బయటికి వచ్చే పిల్ల పురుగులు ఐదారు రోజుల్లో ఆకులు, ఆకు తొడిమల్ని ఆశిస్తాయి. వాటిపై ఉండే పచ్చని పదార్థాన్ని గోకి తింటాయి. ఆ తర్వాత అవి క్రమేపీ లేత కణుపుల్లోకి చొచ్చుకుపోయి లోపలి పదార్థాన్ని తినేస్తాయి. దీనివల్ల కణుపులపై రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి, లోపలి కణజాలం ఎర్రబడుతుంది. గొంగళి పురుగులు కింది భాగం నుండి పై భాగం వరకు గడను తొలుచుకుంటూ పోవడం వల్ల మొవ్వులు ఎండిపోతాయి. గొంగళి పురుగులు కోశస్థ దశలోకి ప్రవేశించే ముందు కాండం నుంచి బయటికి వస్తాయి. అవి ఆకు తొడిమల దగ్గర కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత 7-10 రోజుల్లో రెక్కల పురుగులు బయటికి వస్తాయి. పురుగు ఆశించిన చెరకు తోటలో దిగుబడి, రసంలో పంచదార శాతం తగ్గిపోతాయి. ఏం చేయాలి? పీక/కాండం తొలుచు పురుగుల నివారణకు సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన తోటల నుంచి మాత్రమే విత్తన ముచ్చెలు సేకరించాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదులో, సకాలంలో వాడాలి. సమయం దాటితే నత్రజనిని వాడకూడదు. ఆలస్యంగా వచ్చిన పిలకల్ని (వాటర్ షూట్స్) తీసేయాలి. ఈదురుగాలులకు పడిపోకుండా మొక్కలకు జడచుట్లు వేసి నిలగట్టాలి. తోటలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగు నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపాలి. చెరకు తోటలో కాండం తొలుచు పురుగుల్ని నిర్మూలించడానికి ఎకరానికి 10 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చాలి. పైరు 120 రోజుల దశలో ఉన్నప్పటి నుంచి వాటిని గాలి వీచే దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 30 రోజులకు ఒకసారి వాటిలోని ఎరల్ని మార్చాలి. గడల కింది ఆకుల్ని రెలవాలి. ఆ తర్వాత లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ చొప్పున కలిపి 15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. లేకుంటే ఎకరానికి 20 వేల చొప్పున ట్రైకోగామా ఖిలోనిస్ గుడ్ల పరాన్నజీవుల్ని తోటలో వదలాలి. పైరు 120 రోజుల దశకు చేరుకున్నప్పటి నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి చొప్పున ఆరుసార్లు వీటిని తోటలో వదలాల్సి ఉంటుంది. -
చెరకు సాగు ఇక సులువు!
కణుపులు కత్తిరించి, నాటేసే పరికరాలు అందుబాటులోకి.. వ్యవసాయంతో నేరుగా తమకు సంబంధం లేకపోయినా.. సరైన పరికరాలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న రైతులతో సహానుభూతి చెంది పరికరాలు తయారు చేస్తున్న సృజనశీలురు అరుదు. అటువంటి వారిలో మధ్యప్రదేశ్ నర్సింగ్‌పూర్‌కు చెందిన రోషన్‌లాల్ విశ్వకర్మ(47) ఒకరు. చెరకు కణుపులు నరకడానికి ఉపయోగపడే పరికరాన్ని, ట్రాక్టర్ సహాయంతో కణుపులను నాటే పరికరాన్ని ఆయన రూపొందించారు. ఉన్నత పాఠశాలలో ఉద్యోగి అయిన రోషన్‌లాల్ తన వర్క్‌షాప్‌లో వ్యవసాయ పరికరాలకు మరమ్మతు చేస్తూ, పరిశోధన చేస్తుంటాడు. ఇంజనీర్ ఒకరు.. చేతనైతే చెరకు కణుపులను ఒడుపుగా కత్తిరించే పరికరం తయారుచెయ్యి చూద్దాం అని సవాలు విసిరాడు. పట్టుదలతో కృషి చేసిన రోషన్‌లాల్ చెరకు రైతుల సమయాన్ని, డబ్బును, విత్తనాన్ని ఆదా చేసేందుకు ఉపయోగపడే సుగర్కేన్ బడ్ చిప్పర్ను రూపొం దించాడు. ఈ పరికరంలో చెరకు గడను ఉంచి హ్యాండిల్‌తో ఒత్తగానే.. అది చెరకు కణుపులను చెదిరిపోకుండా సున్నితంగా కత్తిరిస్తుంది. తక్కువ సమయంలో విత్తనాన్ని సిద్ధం చేసుకొని నాటుకునేందుకు రైతుకు తోడ్పడుతుంది. చెరకు విత్తనం 70-80 శాతం వరకు ఆదా అవుతుంది. దీనితోపాటు.. ట్రాక్టర్‌కు అమర్చి చెరకు విత్తనం నాటుకునే పరికరాన్ని కూడా రోషన్‌లాల్ ఇటీవల తయారు చేశాడు. ఎకరంలో చెరకు కణుపులను నాటేందుకయ్యే ఖర్చు రూ.6 వేల నుంచి రూ.800కు తగ్గించుకోవడానికి ఈ పరికరం ఉపకరిస్తుంది. వరుసల మధ్య దూరాన్ని మార్చుకోవడానికి వెసులుబాటు ఉండడం విశేషం. సృజనాత్మక పరికరాల రూపకర్తలను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్.ఐ.ఎఫ్.) రోషన్‌లాల్ కృషిని గుర్తించింది. పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయడంతోపాటు.. మైక్రో వెంచర్ ఇన్నోవేషన్ ఫండ్ కింద సహాయం అందించింది. ‘పల్లెసృజన’ స్వచ్ఛంద సంస్ధ ఈ పరికరాలను మన రైతులకు అందుబాటులో ఉంచింది. సంప్రదించాల్సిన చిరునామా: పల్లెసృజన, 67, వాయుపురి, సైనిక్‌పురి పోస్ట్, సికింద్రాబాద్- 500094 ఫోన్: 040-27111959. పోగుల గణేశం: 98660 01678 -
చెరకు రైతుకు నిరాశే!
మద్దతు ధరపై చేతులెత్తేసిన ‘గోవాడ’ టన్నుకు రూ.2100 మాత్రమేనని ప్రకటన గిట్టుబాటు కాదని అన్నదాతల ఆందోళన చోడవరం, న్యూస్‌లైన్ : రైతుల ఆశలపై గోవాడ సుగర్ ఫ్యాక్టరీ నీళ్లు చల్లింది. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో టన్నుకు కనీసం రూ.2500 అయినా చెల్లిస్తారని ఎదురుచూసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. 2014-15 సీజన్‌కు సంబంధించి టన్ను రూ.2100లే ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. టీడీపీకి చెందిన ప్రస్తుత చైర్మన్ మల్లునాయుడు అధికారంలోకి రాకముందు టన్నుకు రూ. కనీసం 2500దాటి ఇవ్వాలని పలుమార్లు తన పార్టీ ఎమ్మెల్యేలు కెఎస్ఎన్ఎస్ రాజు, గవిరెడ్డి రామానాయుడుతో కలిసి ఫ్యాక్టరీ ఎదుటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. రైతులు దీనిని నమ్మి మల్లునాయుడు బృందానికి పట్టం కట్టారు. అధికారం చేపట్టిన వెంటనే గత సీజన్లో టన్నుకు రూ.300 బోనస్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం రూ.2100లుగా మద్దతు ధర ప్రకటించడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతేడాది వరకు కేంద్రం మద్దతు ధర ఆశాజనకంగా ప్రకటించకపోవడం వల్లే తాము ఇవ్వలేకపోతున్నామంటూ ఫ్యాక్టరీలు తప్పించుకునేవి. ఈ సారి టన్నుకు రూ.2125 విధిగా చెల్లించాలని కేంద్రం ముందుగానే ప్రకటించింది. గతంలో కేంద్రం ప్రకటించిన ధరకు అదనంగా మూడు నాలుగు వందలు కలిపి రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యాలు చెల్లించేవి. కేంద్రం ప్రకటించిన రూ.2125 ధరను కూడా గోవాడ ఫ్యాక్టరీ ఇవ్వకపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఈ ఫ్యాక్టరీ కంటే చిన్నదైన ఏటికొప్పాక ఇటీవల జరిగిన మహాజన సభలో రూ.2125లు మద్దతు ధరను ప్రకటించిన విషయం తెలిసిందే. సమీపంలోని ఫ్యాక్టరీ చెల్లిస్తున్న ధరను కూడా గోవాడ ఎందుకు ఇవ్వలేకపోతోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులకు ప్రస్తుత ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పెట్టు బడులు బాగా పెరిగాయి. తుఫాన్లకు పంట ముంపునకు గురయింది. రోజుల తరబడి నీటి నిల్వతో దిగుబడి తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో ఫ్యాక్టరీ గతేడాది కంటే ఎక్కువ ధర ఇచ్చి ఆదుకుంటుందని అనుకుంటే చేతులత్తేయడంతో చెరకు రైతు దిగ్గుతోచని స్థితిలో పడ్డాడు. ఇక చెరకు సాగు చేయలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకు మించి ఇవ్వలేం: చైర్మన్, ఎండీ ప్రస్తుత పరిస్థితుల్లో టన్నుకు రూ.2100 మించి చెల్లించలేమని ఫ్యాక్టరీ చైర్మన్ గూనూరు మల్లునాయుడు,ఎండీ వెంకటరమణారావు బుధవారం తేల్చి చెప్పేశారు. మార్కెట్లో క్వింటా పంచదార ధర రూ.2600కు ఘోరంగా పడిపోవడంతో ఉత్పత్తి ఖరీదే రావడంలేదని వారు చెప్పా రు. పంచదార నిల్వలు అమ్ముడవ్వక ఇప్పటికే ఇబ్బందిపడుతున్నామని చెప్పారు. -
ఆశలు రేపుతున్న ఆయిల్‌పామ్
=మెట్ట భూములకు లాభదాయకం =ఆసక్తి చూపుతున్న రైతులు =మూడు వేల ఎకరాలకు విస్తరించిన సాగు మాడుగుల, న్యూస్‌లైన్: వరి, చెరకు పంటల సాగుకు సమతల భూములుండాలి. కొండ పరీవాహక ప్రాంతాల్లో భూములు సాధారణంగా ఎగుడు దిగుడుతో ఏటవాలుగా ఉం టాయి. వీటిలో వరి, చెరకు పంటల సాగుకు వీలు కాదు. ఈ భూముల్లో ఒకప్పుడు గిరి రైతులు జొన్నలు, చోళ్లు తదితర పంటలతో అరకొర ఆదాయం పొందేవారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం అంది స్తున్న ప్రోత్సాహాన్ని మెట్ట భూముల రైతులు అందిపుచ్చుకున్నారు. గతంలో ఎకరాకు రూ. 1500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయాన్ని చూసిన వారు ఇప్పుడు ఏకంగా రూ.40 నుం చి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పైగా ప్రభుత్వం నుంచి పెట్టుబడితో పాటు రుణం లభించడం రైతులను మరింత ఆకట్టుకుంటోంది. ఐదెకరాల మెట్ట భూమి ఉన్న రైతులు ఆ పొలంలో బోరు తవ్వించుకుంటే ఉద్యానవన శాఖ ఆయిల్ పామ్ తోట ల పెంపకానికి హెక్టారుకు రూ.35 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తోంది. ఏపీఎంఐసీ అధికారులు ఈ మొక్కలకు 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సిష్టంను ఏర్పాటు చేస్తున్నారు. రైతు కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టగలిగితే ఆ తర్వాత 25 ఏళ్ల పాటు ఏకదాటిగా శాశ్వత ఆదాయం వస్తుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంతో పాటు మంచి లాభాలు వస్తుండడంతో మాడుగుల మండలంలో సుమారు మూడు వేల ఎకరాలలో అయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. మొక్కలు నాటాక కొద్ది రోజుల సంరక్షణ అనంతరం అదే భూముల్లో అంతర పంటగా వంగ, బెండ, కంద వంటివి సాగు చేసుకోవచ్చని, దీని వల్ల ఏడాదికి గరిష్టంగా రూ.30 వేల ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుబాటులో మిల్లులు గతంలో పామాయిల్ మిల్లులు అందుబాటు లో లేక రైతులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మాడుగుల మండలంలో మూడు మిల్లులు ఏర్పాటు చేశారు. గెలలు కోసిన నాలుగైదు గంటలలో మిల్లులకు తరలిస్తున్నారు. ఏటా పెట్టుబడి లేకుండా, పెద్దగా కూలీల అవసరం లేకుండా ఆదాయం వస్తుందని రైతులు సక్కింటి రాంబాబు, డి.రాములు తెలిపారు. ఇతర రాష్ట్రాలలోకు ఎగుమతి ఇక్కడ మిల్లుల్లో తయారయ్యే పామాయిల్‌ను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మండలంలో ఆయిల్‌పామ్ తోటలు, మిల్లుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 9 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారుల అంచనా. మంచి లాభాలు ఆయిల్‌పామ్ సాగుతో ఏటా మంచి లాభాలు వస్తున్నాయి. ప్రస్తుతం కూలీలు లభించకపోవడంతో వ్యవసాయం చేయలేక పోతున్నాం. పెద్దగా పెట్టుబడి, కూలీ లు అవసరం లేకపోవడంతో ఆయిల్‌పామ్ తోటలపై ఆసక్తి చూపించాము. - సురేష్ కుమార్, రైతు, కృష్ణంపాలెం పెద్ద మొత్తంలో రాయితీలు ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తోంది. ఐదు నుంచి పదెకరాల్లో సాగు చేసుకునే వారికి 75 శాతం రాయితీ వస్తోంది. రైతులు తమ భూమిలో బోరు నిర్మించుకుని ఉద్యాన వన శాఖాధికారులను సంప్రదిస్తే ఆయిల్‌పామ్ తోటల సాగుకు సహకారం అందిస్తారు. - పి.శ్రీనివాసరావు, ఫీల్డ్ సూపర్వైజర్ -
‘చెరుకు’ను ప్రోత్సహించాలి
కామారెడ్డి, న్యూస్‌లైన్ : చెరుకు సాగును ప్రభుత్వం ప్రోత్సహిం చాలని భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సాయిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అంజిరెడ్డి డిమాండ్ చేశారు. టన్నుకు 3,500 మద్దతు ధర ఇవ్వాలని కోరారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో చెరుకు రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతుల విషయంలో మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రైతుల మధ్య ఐక్యత రాకుండా చూస్తున్నాయని, పార్టీలుగా చీల్చి లబ్ధిపొందుతున్నాయని పేర్కొన్నారు. రైతులను దగా చేస్తున్నాయి విదేశాల నుంచి చక్కెర దిగుమతికి తలుపులు తెరిచిన ప్రభుత్వాలు చెరుకు రైతును దగా చేస్తున్నాయని కె.సాయిరెడ్డి ఆరోపించారు. విదేశాల నుంచి వచ్చే చక్కెరపై 50 శాతం వరకు పన్ను వేసే వీలున్నా, 15 శాతం మాత్రమే వేయడంతో దేశంలో చక్కెర ధరలు పడిపోతున్నాయన్నారు. దీంతో ఫ్యాక్టరీలు చెరుకు ధర పెంచడానికి ససేమిరా అంటున్నాయన్నారు. ప్రభుత్వా లు పన్నులు తీసుకోవడమే తప్ప రైతులకు చే సిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం చక్కెర బస్తాపై * 92 చొప్పున పన్ను వసూలు చేస్తూ, చెరుకు రైతులకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కల్పించడం లేదన్నారు. వస్త్ర వ్యా పారులతో లాలూచీ పడిన ప్రభుత్వాధి నేతలు వస్త్రాలపై వ్యాట్‌ను ఎత్తివేశారని, చక్కెరపై ఉన్న వ్యాట్‌ను మాత్రం తగ్గించడం లేదని ఆరోపించారు. రైతుల విషయంలో పూర్తిగా మోసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇథనాల్‌తో మేలు... పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం వరకు కలిపే అవకాశం ఉన్నా మనదేశంలో కేవలం 5 శాతం మాత్రమే కలుపుతున్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. ఒకవేళ ఇథనాల్‌ను 20 శాతం కలిపితే ఏటా * 80వేల కోట్లు దేశానికి ఆదా అవుతాయ ని పేర్కొన్నారు. ఇథనాల్ ధర లీటర్‌కు * 36 ఉందని, దీంతో చక్కెర ఫ్యాక్టరీలు ఇథనాల్ తయారీకి ముందుకు రావడం లేదని అన్నారు. ఇథనాల్ ధర, పెట్రోల్‌లో కలిపే శాతం పెంచితే ఫ్యాక్టరీలు లాభపడతాయని, రైతులకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రై తులను సమీకరించి, పాలకులపై ఒత్తిడి తేవడానికి జనవరి 23వ తేదీన జాతీయ సెమినార్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే వేదిక ఖరారు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు అంజిరెడ్డి, కుమారస్వామి, నర్సింహారెడ్డి, గో పాల్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, జయసింహారెడ్డి, వీరారెడ్డి, నారాయణరెడ్డి పాల్గొన్నారు. సదస్సులో తీర్మానాలు సదస్సులో పలు తీర్మానాలు చేశారు. చెరుకు ధర టన్నుకు * 3,500 చెల్లించాలి. పక్షం రోజు ల్లో రైతుకు డబ్బులు అందించాలి. చెరుకు నరకడం, తరలింపును ఫ్యాక్టరీ వాళ్లే నిర్వహించాలి. ఎన్డీఎస్ఎల్కు సంబంధించిన మిల్లులపై సభా సంఘం నివేదికను అమలు చేయాలి. సారంగాపూర్ సహకార చక్కెర కర్మాగారాన్ని నడిపించాలి. ఇథనాల్ ధర పెంచాలి. చక్కెరపై విధించిన వ్యాట్‌ను వెంటనే తొలగించాలి. లేనిపక్షంలో వ్యాట్ సొమ్మును రైతులకు చెల్లించాలి. రైతులు అడిగిన వెంటనే 90 శాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు ఇవ్వాలి. -
చెరుకు.. కష్టాల సాగు
సదాశివనగర్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అనకాపల్లి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో చెరు కు సాగయ్యేది నిజామాబాద్ జిల్లాలోనే. నల్లబెల్లం ఉత్పత్తి లో కామారెడ్డి డివిజన్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. ఇదం తా గతం. పాలకుల నిర్ణయాలు చెరుకు ఫ్యాక్టరీల యాజమాన్యాలకు అనుకూలంగా ఉండడం, పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధర లభించకపోవడం, పంటను ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత డబ్బులకోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుండడంతో చాలా మంది రైతులు చెరుకు సాగుకు దూరమవుతున్నారు. ఖర్చులిలా.. ఎకరం విస్తీర్ణంలో చెరుకు సాగు చేసేందుకు అయ్యే ఖర్చుల వివరాలిలా ఉన్నాయి. ఎకరం విస్తీర్ణంలో చెరుకు సాగు చేయాలంటే మూడున్నర నుంచి నాలుగు టన్నుల విత్తనం అవసరం అవుతుంది. దీనికోసం రూ. 10 వేలు ఖర్చవుతా యి. దుక్కి దున్నడానికి రూ. 3 వేలు, కల్టివేటర్ కు రూ. 1,500, గెరకొట్టడానికి వెయ్యి రూపా యలు, మూడు దఫాల్లో రసాయనిక ఎరువుల పిచికారికి రూ. 6 వేలు, 20 మంది మహిళా కూలీలకు రూ. 2 వేలు, 10 మంది మగ కూలీ లకు రూ. 2,500, రెండోసారి కలుపు తీయడాని కి రూ. 2 వేలు, కాలువలు కొట్టేందుకు రూ. 2 వేలు, గెర కొట్టేందుకు రూ. 1,500, వాడె తీయడానికి రూ. 3 వేలు, తోట కట్టుటకు రూ. 6 వేలు, హా ర్వెస్టింగ్కు రూ. 17 వేలు ఖర్చు అవుతాయి. మోటార్ల రిపేర్లు, ట్రాక్టర్ డ్రైవర్ల బత్తా, కూలీల విందు, కత్తి కట్నం తదితర ఖర్చులు అదనం. గతేడాది టన్ను చెరుకుకు రూ. 2,600 ధర లభించింది. ఎకరాకు సరాసరిన 28 టన్ను ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన సుమారు రూ. 72 వేల ఆదాయం వస్తుంది. పెట్టుబడి ఖర్చులు రూ. 60 వేల వరకు అవుతాయి. అంటే ఎకరం విస్తీర్ణంలో చెరుకు సాగు చేస్తే ఖర్చులు పోను రైతుకు మిగిలేది రూ. 12 వేలు మాత్రమే. పది నెలలపాటు రైతు కుటుంబం చేసిన శ్రమకు దక్కేది రూ. 12 వేలే కావడంతో పలువురు చెరు కు సాగుకు దూరమవుతున్నారు. చెరుకు టన్ను కు రూ. 4 వేలు చెల్లిస్తేనే గిట్టుబాటవుతుందని పేర్కొంటున్నారు. రూ. 4వేలు చెల్లించాలి చెరుకు రైతుకు కష్టాని కి తగిన ఫలం లభిం చడం లేదు. గత సీజన్ లో చెరుకు టన్నుకు రూ.2600 చెల్లిం చారు. ఈ సీజన్లో ఫ్యాక్టరీ ఇప్పటివరకు ధర నిర్ణయించలేదు. ప్రభుత్వం స్పందించి చెరుకుకు గిట్టుబాటు ధర కల్పించా లి. టన్నుకు కనీసం రూ. 4 వేలు చెల్లించాలి. -బత్తుల రాంరెడ్డి, రైతు, మర్కల్ బిల్లుల కోసం తిరగాల్సి వస్తోంది చెరుకు బిల్లులు చెల్లించడంలో ఫ్యాక్టరీ ఆలస్యం చేస్తోంది. పంటను తరలించేదాకా ఒక మాట చెబుతున్నారు. తరలించిన తర్వాత మరో మాట చెబుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కొక్కసారి ఈ తిరుగుడు కంటే చెరుకును నాటకపోవడమే మంచిదనిపిస్తోంది. -ముడుపు బాల్‌రెడ్డి, రైతు, తిర్మన్‌పల్లి గిట్టుబాటు కావడం లేదు రోజు రోజుకూ పెట్టుబడులు పెరిగిపోతున్నయి. పంట సాగు కష్టంగా మారింది. చెరుకు పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అధికారులు, ప్రజాప్రతి నిధులు స్పందించి చెరుకుకు గిట్టుబాటు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. -నర్సారెడ్డి, రైతు, ఉప్పల్వాయి