
మద్దతు ధర లేక...
చెరకు పంటకు నిప్పు
సింధనూరు టౌన్ : చెరుకు పంటకు ధర పతనం కావడంతో దిక్కుతోచని తాలూకాలోని జాలవాడగి గ్రామానికి చెందిన హంపణ్ణ అనే రైతన్న తన ఏడు ఎకరాల చెరుకు పంటకు నిప్పంటించిన ఘటన శనివారం జరిగింది. రాష్ట్రంలో చెరుకు పంటకు ధర పతనం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగిన నీరు, పండించిన పంటకు ధర లేకపోవడంతో తాము పండించిన పంటను కొనుగోలు చేసేవారే లేకుండాపోయారని, అందువల్లే చెరుకు పంటకు నిప్పంటించానని, వ్యవసాయం చేయడమే కష్టకరంగా మారిందని రైతు హంపణ్ణ వాపోయాడు. తాము పండించిన చెరుకు పంటను విక్రయించినా చేసిన అప్పులు తీరవన్నారు.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో రూ.2 లక్షలు, వ్యవసాయ సేవా సహకార సంఘంలో రూ.50 వేలు, ప్రైవేట్‌గా రూ.2.50 లక్షల అప్పులున్నాయని తెలిపాడు. కరువు పరిస్థితుల మధ్య చెరుకు పంటకు ధర లేకుండా పోయిందని, చెరుకు కటావ్ చేసినా కూలీ ఇచ్చేందుకు కూడా తన వద్ద డబ్బులు లేవని తెలిపారు. రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అమీన్‌పాషా దిద్దగి మాట్లాడుతూ... ప్రభుత్వం రైతుల పంటలకు మద్దతు ధర అందించడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. వెంటనే ఎమ్మెల్యే, తాలూకా యంత్రాంగం ఈవైపు దృష్టి సారించాలని, నష్టానికి గురైన రైతుకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.