
ప్రపంచవ్యాప్తంగా బలపడిన సెంటిమెంటు కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు మళ్లీ ర్యాలీ బాటపట్టాయి. ఈ నేపథ్యంలో పలు సానుకూల అంచనాలతో ఉన్నట్లుండి షుగర్ రంగం వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో పలు షుగర్ కౌంటర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. కోవిడ్-19 కట్టడికి విధించిన లాక్‌డవున్ ఆంక్షలను సడలిస్తున్న నేపథ్యంలో షుగర్‌కు డిమాండ్ పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం కనీస విక్రయ ధరను పెంచనున్న అంచనాలు షుగర్ రంగానికి జోష్‌నిస్తున్నట్లు తెలియజేశాయి.
రేసు గుర్రాల్
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో షుగర్ రంగ కౌంటర్లు 20-5 శాతం మధ్య లాభపడి దూకుడు చూపుతున్నాయి. దాల్మియా భారత్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 90 సమీపానికి చేరగా.. ధంపూర్ 17 శాతం దూసుకెళ్లి రూ. 127 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో బలరామ్‌పూర్ 13 శాతం జంప్‌చేసి రూ. 127 వద్ద, ఉగర్ షుగర్ 12 శాతం ఎగసి రూ. 15 వద్ద, అవధ్ షుగర్, మగధ్ షుగర్ 10 శాతం చొప్పున లాభపడి రూ. 172, 106 వద్ద కదులుతున్నాయి. ఇతర కౌంటర్లలో రాజ్‌శ్రీ షుగర్స్, శక్తి షుగర్స్, రాణా షుగర్స్, పొన్ని షుగర్స్ 10 శాతం చొప్పున పురోగమించాయి. ఇక ద్వారికేష్, కేఎం షుగర్, కేసర్ ఎంటర్‌ప్రైజెస్, డీసీఎం శ్రీరామ్, కేసీపీ షుగర్, త్రివేణీ ఇంజినీరింగ్, శ్రీ రేణుకా, ధరణి, బన్నారీ అమ్మన్, ఉత్తమ్, ఈఐడీ ప్యారీ సైతం 9-5 శాతం మధ్య ఎగశాయంటే షుగర్ షేర్లకు కనిపిస్తున్న డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు.
ఇదీ విషయం
కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న పలు ఆంక్షలను ఇప్పటికే ఎత్తివేయగా.. ఈ నెల 8 నుంచీ మాల్స్, రెస్టారెంట్లుసహా పలు బిజినెస్‌లను అనుమతించనున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి పూర్తిస్థాయిలో పుంజుకునే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా షుగర్‌కు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. చెరకు రైతుల బకాయిల చెల్లింపులకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చక్కెర కనీస విక్రయ ధరను కేజీకి రూ. 2 చొప్పున పెంచే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు ఊహిస్తున్నాయి. ఇటీవల చెరకు రైతుల బకాయిలు రూ. 22,000 కోట్లను దాటినట్లు వెలువడిన వార్తలు దీనికి కారణమని చెబుతున్నాయి. గతేడాది ప్రభుత్వం కేజీకి రూ. 2 చొప్పున పెంచడం ద్వారా చక్కెర ధరను రూ. 31గా నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం టీఆర్‌క్యూ కింద అమెరికాకు 3569 టన్నుల ముడి, శుద్ధిచేసిన షుగర్‌ను ఎగుమతి చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment