చెరకు పంట‌ జాగ్రత్తలు మరవకు! లేదంటే? | - | Sakshi
Sakshi News home page

చెరకు పంట‌ జాగ్రత్తలు మరవకు! లేదంటే?

Published Thu, Dec 21 2023 4:20 AM | Last Updated on Thu, Dec 21 2023 9:20 AM

- - Sakshi

శాస్త్రవేత్త డా.విజయ్‌కుమార్‌

'చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ పంటలు వేసినప్పటీ నుంచి చేతికందే వరకు రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన పద్ధతులు పాటించకుండా పాత పద్ధతులను పాటిస్తే నష్టపోతారు. కొంత మంది రైతులు చెరకు పక్వానికి రాకముందే క్రషింగ్‌కు తరలిస్తూ ఉంటారు. దీంతో చక్కెర ఉత్పత్తి తగ్గడమే కాకుండా సరాసరి చక్కెర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. చెరకు పంట పక్వానికి వచ్చిందా ?లేదా? కొన్ని మెలకువలు పాటించాలి.'

- ప్రస్తుతం చేతికొచ్చిన చెరకు పంటను నరకుటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బసంత్‌పూర్‌–మామిడ్గి గ్రామాల శివారులో గల ఫ్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త ఎం.విజయ్‌కుమార్‌ మాట్లాల్లోనే..

పక్వానికి వచ్చిందా.. లేదా?

  • పక్వానికి వచ్చిన చెరకు తోటల ఆకులు పచ్చ రంగులోంచి పసుపు రంగులోకి మారుతాయి.
  • చెరకులో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి.
  • గడలు లావై అక్కడక్కడ చిరు పగుళ్లు ఏర్పడి కన్నులు బాగా ఉబ్బినట్లు అవుతాయి. తోటలో కొత్తగా మొవ్వుటాకులు రావడం ఆగిపోతాయి.
  • చిట్ట చివర నాలుగైదు కణుపులు దగ్గర దగ్గర ఏర్పడి వాటి నుంచి పుట్టు ఆకులు ఒకే చోట కుచ్చువలె ఏర్పడుతాయి.
  • కొన్ని రకాల్లో పూత పూయడం కనబడుతుంది. శాసీ్త్రయంగా గమనిస్తే చెరకును రెండు భాగాలు నరికి వాటి రసంను వేర్వేరుగా గానుగాడిస్తే వాటిలోని ఘన పదార్థాలు సమానంగా ఉండాలి.
  • చేతి రిఫ్రాక్టో మీటర్‌ ద్వారా కూడా చెరకు పక్వానికి వచ్చింది తెలుసుకోవచ్చు.
  • వాతావరణ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

  • చీడ పీడలు ఆశించిన చెరకును ముందుగా క్రషింగ్‌కు తరలించాలి. లేదా బెల్లం తయారీకి వాడాలి.
  • ఆలస్యం చేస్తే దిగుబడులతో రసం నాణ్యత తగ్గుతుంది. బెల్లం తయారు చేశాక మెత్తగా ఉంటే నిల్వకు పనిరాదు.
  • ఏదైనా ప్రమాదశాత్తు చెరకు కాలిపోతే ముందుగా దాన్ని నరికివేయాలి . లేకపోతే తూకం తగ్గి రోజుకు 3 శాతం చొప్పున తగ్గుతుంది.
  • పూత వచ్చిన, బెండు బారిన చెరకును నరకడం ఆలస్యం చేయరాదు. పూత వచ్చిన చెరకు గడల్లో చివరి ఆరు కండాలు తీసేసి మిగిలిన చెరకును ఫ్యాక్టరీకి తరలించాలి.
  • చెరకును భూ మట్టానికి నరకాలి. రెండు మూడు అంగుళాలు వదిలి నరకడం వల్ల ఎకరానికి రెండు మూడు టన్నులు దిగుబడి తగ్గుతుంది.
  • కింది భాగంలో పంచదార పాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చెరకు వేర్లు భూమిలోకి చొచ్చుకొని పోయి బలమైన గాలులు వీచినా చెరకు ఒరిగిపోదు.
  • చెరకు క్రషింగ్‌కు తరలించే ముందు చెత్త, ఎండుటాకులు, వేర్లు, మట్టి లేకుండా తరలించాలి. చెత్తా చెదారంతో తరలించడం వల్ల పంచదార దిగుబడిలో 10 శాతం నష్టం వాల్లుతుంది.
  • నీటి ముంపునకు గురైన తోటల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కణుపుల వద్ద వచ్చే వేర్లను తొలగించాలి.
  • వేర్లను తీసేయకుండా చెరకును అలాగే క్రషింగ్‌కు తరలిస్తే 0.4 నుంచి 0.6 శాతం మేర పంచదార దిగుబడి తగ్గుతుంది.

నరికిన తర్వాత

  • నరికిన చెరకును 24 గంటల్లో ఫ్యాక్టరీకి సరఫరా చేయాలి. ఆలస్యమైన కొద్ది చెరకు తూకంలో 2 నుంచి 4 శాతం, రసనాణ్యతలో ఒక శాతం తరుగుదల కనిపిస్తోంది.
  • నరికిన చెరకు తొందరగా ఫ్యాక్టరీకి తరలించలేని పక్షంలో కట్టిన చెరకు మోపులను నీడలో పెట్టి వాటిపై చెత్తను కప్పి నీరు పలుచగా పోయాలి.\
  • రైతులు సాగు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకు ఇలాంటి మెలకువలు పాటిస్తేనే లాభాలు సాధిస్తారని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

    ఇవి చ‌ద‌వండి: బడ్డింగ్‌ మెథడ్‌లో గ్రాఫ్టింగ్‌ చేస్తూ.. పనస వైభవం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement