వరి పంట పండించటంలోనే కాదు, పంటను నూర్పిడి చేసి ఆరుబయట కళ్లంలో ధాన్యాన్ని ఆరబెట్టుకోవటంలోనూ రైతులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అకాల వర్షాలకు కళ్ళాల్లో వరి ధాన్యం తడిచిపోవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కళ్లాల్లో పంట కళ్లెదుటే నీటిపాలవ్వకుండా రక్షించుకోవటానికి రైతులు ఎవరికి వారు తమ కళ్లం దగ్గరే నిర్మించుకోదగిన ఓ ఫ్లాట్‌ఫామ్ గురించి సింగరేణి మాజీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీరామ సూచిస్తున్నారు.
ఇది కళ్లం/పొలంలోనే నిర్మించుకునే శాశ్వత నిర్మాణం. నలు చదరంగా ఉండే పొలంలో అయితే, ప్లస్ ఆకారంలో, సుమారు 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తుగల మంచెను పర్మనెంటుగా వేసి ఉంచాలి. దీర్ఘ చతురస్రాకార పొలమైతే, పొడుగ్గా దీన్ని నిర్మిస్తే చాలు. దీనికి, పొలం గట్లపై ఉండే 2 లేక 3 తాడి చెట్లు కొట్టి వేస్తే చాలు. తాటి మొద్దులను 5 అడుగుల ముక్కలుగా కోసి, భూమిలోకి 2 అడుగులు, భూమి పైన 3 అడుగులు ఎత్తున ఉండేలే చూడాలి. రెండు మొద్దుల మధ్య దూరం 6 అడుగులు ఉంటే చాలు.
దీని మీద జీఐ చెయిన్ లింక్ ఫెన్స్ లేదా మెటల్ ఫెన్స్ లేదా రోజ్ హెడ్ నెయిల్స్ సహాయంతో వ్యవసాయ సీజన్ మొదట్లోనే అమర్చి ఉంచుకోవాలి. అకాల వర్షం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన సమయంలో ఈ మంచెపైన టార్పాలిన్ షీట్ పరచి, దానిపైన ధాన్యాన్ని ఎత్తిపోసుకోవాలి. ధాన్యంపైన కూడా టార్పాలిన్ షీట్ కప్పి చైన్‌లింక్ ఫెన్స్‌కి తాళ్లలో గట్టిగా కట్టాలి. ఎంతపెద్ద గాలి అయినా, తుపాను అయినా, 2 అడుగుల లోపు వరద వచ్చినా, ధాన్యం తడవకుండా ఇలా రక్షించుకోవచ్చు. ధాన్యం ధర తగ్గించి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.
చిన్న కమతాల్లో అయితే అకాల వర్షం నుంచి పంటను కాపాడుకోవటానికి రైతు, అతని భార్య ఈ పని చేసుకోవచ్చు లేదా ఇద్దరు మనుషులు చాలు. ఈ మంచెకు పొలం విస్తీర్ణంలో ఒక శాతం అంటే ఎకరానికి ఒక సెంటు స్థలాన్ని కేటాయిస్తే చాలు. ఆ స్థలం కూడా వృథా కాదు. దీన్ని పందిరిగా వాడుకుంటూ బీర, ఆనప, చిక్కుడు తదితర తీగ జాతి కూరగాయలు సాగు చేసుకోవచ్చు.
చిత్రంలో సూచించిన మాదిరిగా మంచెను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ సూచించిన కొలతలను రైతులు తమ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఎకరానికి ఒక సెంటు భూమిలో ఇలా తక్కువ ఖర్చుతో, రైతుకు తేలికగా దొరికే తాడి దుంగలతో వేదికను నిర్మించుకుంటే సరిపోతుందని శ్రీరామ (83095 77123) సూచిస్తున్నారు.
ఇవి చదవండి: పంట సాగుకై.. గుర్రాల విసర్జితాలతోనూ జీవామృతం!
Comments
Please login to add a commentAdd a comment