ఈ వేసవిలో పంటలు, పశు పోషక రక్షణ ఎలా? | Sagubadi: Precaution For Crops, Livestock In Summer | Sakshi
Sakshi News home page

ఈ వేసవిలో పంటలు, పశు పోషక రక్షణ ఎలా?

Published Tue, Mar 12 2024 8:22 AM | Last Updated on Tue, Mar 12 2024 8:24 AM

Sagubadi: Precaution For Crops, Livestock In Summer - Sakshi

సాగుబడి

ఈ వేసవిలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5–8 డిగ్రీల సెల్షియస్‌ మేరకు ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం కొద్ది రోజుల క్రితమే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మున్ముందు ప్రచండ వడగాడ్పులు వీచే సూచనలు ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో పంటలు, తోటలను సాగు చేసే రైతులు, పశు పోషకులు గత వేసవిలో కన్నా అధికంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు..

తీవ్రమైన ఉష్ణోగ్రతల వలన పంట పెరుగుదల, దిగుబడి గణనీయంగా  తగ్గుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలో పెరుగుదల మందగించడం, పురుగులు, తెగుళ్ళు పెరగడం, ఆకులు మాడిపోవడం, పువ్వులు, పండ్లు రాలిపోవడంతో పాటు పండ్ల పరిమాణంలో తగ్గుదల కనిపిస్తుంది. వేడి వాతావరణం వలన పాలు ఇచ్చే పశువుల్లో శరీర ఉష్ణోగ్రత 0.5 నుండి 3.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరగడం వలన పశువులు ఎక్కువగా నీటిని తీసుకొని తక్కువ మేత తినడం వలన పాల దిగుబడి 11 శాతం వరకు తగ్గుతుంది. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటలను, పండ్ల తోటలను కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా కొంత వరకు నష్టాన్ని నివారించుకోవచ్చు.

పంటల నిర్వహణ..

  • అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోగల వంగడాలను, రకాలను ఎంచుకోవాలి.   పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పంట దశ, నేల స్వభావాన్ని బట్టి తగినంత నీటి తడులు ఇచ్చుకోవాలి.   నీటి లభ్యత తక్కువగా ఉన్నప్రాంతాల్లో తేమ సున్నిత దశల్లో పంటకు నీటి తడులు ఇవ్వాలి. 
  • వరి పంటలో పొట్ట, పూత దశల్లో (10 శాతం వెన్ను నుండి పూత బయటకు వచ్చినప్పుడు) 0.5% కె.ఎన్‌.03 పిచికారి చేస్తే వరి పంటలో అధిక ఉష్ణోగ్రతలతో కలిగే దిగుబడి నష్టాన్ని తగ్గించవచ్చు.   వరి పంట దుబ్బు చేసే దశ నుంచి అంకురం దశ వరకు పొలంలో 2 సెం.మీ. ఎత్తున నీరు నిలువ ఉంచాలి.  అంకురం దశ నుంచి పూత దశ వరకు నీటి లభ్యతను బట్టి పొలంలో 2 సెం.మీ. లేదా 5 సెం. మీ. నీరు నిలువ ఉంచాలి.  నీటి లభ్యత బాగా తక్కువ ఉన్నప్రాంతాల్లో ఆరుతడి పద్ధతిలో నీటి తడులు ఇవ్వాలి.
  • మొక్కజొన్న పంట పూత దశ ఏర్పడే 10 రోజుల ముందు నుంచి కంకి ఏర్పడిన 25 రోజుల తర్వాత వరకు పంట బెట్ట పరిస్థితులను తట్టుకోలేదు. కాబట్టి, రైతులు పైరుకు జీవసంరక్షక నీటి తడి ఇవ్వాలి.

పండ్ల తోటల్లో ప్రత్యేక జాగ్రత్తలు..

  • నీటి వసతి అధికంగా ఉన్నప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి తరచుగా నీరు ఇవ్వాలి.
  • పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుదైతే, ఒక రోజుకు ఒక చెట్టుకు 150–240 లీటర్ల నీరు అవసరం. అవకాశం ఉన్నచోట సేంద్రియ పదార్థాలైన గడ్డి తదితర పదార్థాలతో మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన (మల్చింగ్‌) చేయటంతో పాటు బిందు సేద్యానికి ్రపాధాన్యత ఇవ్వాలి.   ఆచ్ఛాదన చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి, మొక్కకు అందుబాటులో ఉంటుంది. వరి గడ్డి లేదా స్థానికంగా లభించే సేంద్రియ పదార్థాలు లేదా పాలిథిన్‌ షీట్లను మొక్కల మొదళ్ళ చుట్టూ కప్పాలి. 
  • మామిడి తోటలో ఏప్రిల్‌ – మే మాసంలో 1% పొటాషియం నైట్రేట్‌ (13–0–45) మందును 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.   బెట్ట పరిస్థితుల్లో నల్లి (మైట్‌) ఉధృతి పెరుగుతుంది. నివారణకు 30 మి.లీ.  డైకోఫోల్‌ లేదా 20 మి.లీ.  ్రపొపారై్గట్‌  లేదా 20 మి.లీ. ఇథియాన్‌ మందును 10 లీటర్ల నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.   ఒకటి లేదా రెండేళ్ల వయస్సు గల పండ్ల తోటలు లేదా కొత్తగా నాటిన తోటల చుట్టూ వేసవిలో వడగాల్పుల ప్రభావం తగ్గించడానికి సరుగుడు లేదా వెదురు మొక్కలను నాటుకోవాలి.

కూరగాయ తోటల్లో ఏం చేయాలి?

  • అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల కూరగాయ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి.   తరచుగా నీటి తడులు ఇవ్వడం ద్వారా నేలలో తేమను సంరక్షిచుకోవచ్చు.   బిందు సేద్యం చేసే పంటల్లో ప్రతి రోజూ అరగంట (ఉదయం, సాయంత్రం) 2సార్లు నీరివ్వాలి.
  • ప్రధాన పంటపై వడగాడ్పుల ప్రభావాన్ని తగ్గించడానికి, మొక్కజొన్నను 3–4 వరుసల సరిహద్దు పంటగా వేసుకోవాలి. ప్రతి 20–25 మీటర్ల దూరంలో అంతర పంటగా వేసుకోవాలి.   50% షేడ్‌ నెట్‌ను వాడి పంటలపై అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
  • కోళ్ళు పొడి, వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి షెడ్లల్లో ఫ్యాన్లను, ఫాగర్లను అమర్చాలి. షెడ్లను వరి గడ్డితో కప్పి స్ప్రింక్లర్లు అమర్చాలి.   కోళ్ళు ఎక్కువ మోతాదులో దాణా తినటం కోసం మెత్తటి దాణాతో పాటు చల్లని తాగు నీటిని అందుబాటులో ఉంచాలి. 
    – డా. లీలారాణి, ప్రధాన    శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం, వ్యవసాయ పరిశోధన సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్‌.

పశువులను కాపాడేదెలా?
వేసవి కాలంలో ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు వీచడం వల్ల ఉష్ణతాపానికి గురై పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు తీవ్ర అసౌకర్యానికి, అనారోగ్యానికి లోనుకావడమే కాకుండా వడదెబ్బకు గురవుతూ ఉంటాయి. కాబట్టి, పశుపోషకులు, గొర్రెలు– మేకల పెంపకదారులు వేసవికాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని పశువులు, గొర్రెలు మేకలు అనారోగ్యానికి గురికాకుండా, వడదెబ్బ బారిన పడకుండా సంరక్షించుకోవచ్చు. వాతావరణ మార్పులకు అనుగుణంగా శాస్త్రీయ యాజమాన్య పద్ధతిని పాటించడం ద్వారా ఉత్పాదక శక్తి తగ్గకుండా రైతు ఆశించిన ఫలితాలను పొందవచ్చు.

ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల సంరక్షణ ఇలా..
అధిక ఉష్ణోగ్రత, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, షెడ్లలో అధిక సంఖ్యలో కిక్కిరిసి ఉండటం, ఉక్కపోత, నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్ల పశువులు, గొర్రెలు, మేకలు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువులు క్రమంగా నీరసించి, బలహీనంగా మారతాయి. పశువులు సరిగా నడవలేక, తూలుతూ పడుకోవడానికి ప్రయత్నిస్తాయి. జీవక్రియ తగ్గిపోవడం, ఆకలి మందగించడం, మేత తక్కువగా తీసుకోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గటం వలన ఇతర వ్యాధులు, పరాన్నజీవులు ఆశించే అవకాశం పెరుగుతుంది.

కొన్ని సమయాల్లో దాహంతో ఉన్న పశువులు మురికి గుంటల్లో ఉన్న నీటిని తాగడం వల్ల పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులు రావచ్చు. చూడి పశువుల్లో గర్భస్రావాలు సంభవించే అవకాశాలున్నాయి. వడదెబ్బకు గురైన పశువుల్లో దాహం పెరుగుతుంది. తూలుతూ నడుస్తూ పడిపోవడం, రొప్పుతూ, శ్వాస కష్టమవడంతో ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి వెళ్ళి మరణించే ప్రమాదం ఉంటుంది. 

పశువుల మేపు..
వేసవి తాపంతో జీర్ణక్రియ సన్నగిల్లుతుంది. అందువల్ల సులువుగా జీర్ణించుకునే పిండి పదార్థాలైన గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడం మంచిది. ఎక్కువ శాతం పచ్చిగడ్డి ఇవ్వాలి. ఒకవేళ మాగుడు గడ్డి సమృద్ధిగా ఉంటే అందించవచ్చు. పచ్చిగడ్డిని ఉదయం సమయాల్లో, ఎండుగడ్డిని రాత్రి సమయాలలో వేర్వేరుగా ఇవ్వాలి. అధిక పాలిచ్చే పశువులకు దాణాను నీటితో కలిపి ఇవ్వాలి. మినరల్‌ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది.

మేపు కొరకు పశువుల్ని ఎండవేళల్లో కాకుండా ఉ. పూట 6 నుంచి 10 గంటల వరకు, సా. 5 నుండి 7 గంటల వరకు బయటకు పంపడం మంచిది.  వేసవి తాపానికి గురైన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఇతర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక టీకాలు ఇది వరకు వేయించని పశువులు, గొర్రెలు, మేకలకు గాలికుంటు వ్యాధి, గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. దాహంతో ఉన్న పశువులు మురుగునీరు తాగటం వల్ల పారుడు వంటి జీర్ణకోశ రోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ఎల్లవేళలా మంచి చల్లని తాగునీరు ఇవ్వాలి. అంతర పరాన్న జీవుల నిర్మూలనకు నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా తాగించాలి.

వడదెబ్బకు గురైన పశువులకు ప్రథమ చికిత్స..
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశంలోకి తీసుకెళ్ళి శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి పలుమార్లు నీటితో కడగాలి. తల నుదుటి మీద మంచుముక్కలు ఉంచాలి లేదా చల్లని గోనె సంచిని దానిపై క΄్పాలి. వెంటనే పశువైద్యుని సంప్రదించాలి. పశువైద్యుని పర్యవేక్షణలో గ్లూకోజ్‌ సెలైన్, సోడియం క్లోరైడ్‌ అందించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తగిన చికిత్స చేయించాలి. – డా. జి. మంజువాణి, సంచాలకులు, పశువైద్య, పశు సంవర్థక శాఖ, హైదరాబాద్‌

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

బోరు బావుల రీచార్జ్‌తో నీటి భద్రత!
22న వాటర్‌ అండ్‌ లైవ్‌లీహుడ్‌ ఫౌండేషన్‌ వెబినార్‌
గత వానాకాలంలో రుతుపవనాల వైఫల్యం వల్ల భూగర్భంలోకి వాన నీరు సరిగ్గా ఇంకకపోవటంతో తెలుగు రాష్ట్రాల్లోని అనేకప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతున్నాయి. కాలువ కమాండ్‌ ఏరియాల్లో సైతం పొలాల్లో, నివాసప్రాంతాల్లో కూడా పలువురు ఇప్పటికే కొత్త బోరు బావులు తవ్వుతున్నా, చాలా వాటిల్లో ఆశించినంతగా నీరు లభించని పరిస్థితి. ఎండిపోయిన బోరు బావులు, కొద్దొగొప్పో నీరు పోస్తున్న బోరు బావుల చుట్టూ వాన నీటి ఇంకుడు గుంత (రిచార్జ్‌ పిట్‌)ను నిర్మించుకోవటం ద్వారా కృత్రిమంగా భూగర్భ జలాలను పెంపొందించుకోవటమే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం. వీటిని నిర్మాణం ద్వారా ఈ ఎండాకాలంలోనూ కురిసే అకాల వర్షాలకు వృథాగా పోయే నీటిని సమర్థవంతంగా బోర్ల దగ్గరే భూమిలోకి ఇంకింపజేసుకోవచ్చు.

అయితే, వాననీటిని ఇంకింపజేసే ఇంకుడు గుంత నిర్మాణానికి ఎండిపోయిన బోర్లన్నీ పనికిరావు. ‘ట్యాంకర్‌ టెస్ట్‌’ చేసి నిర్థారించుకోవాల్సి ఉంటుంది. ఈ అత్యాధునిక బోర్‌వెల్‌ రీచార్జ్‌ టెక్నిక్‌ను సికింద్రాబాద్‌లోని ‘వాటర్‌ అండ్‌ లైవ్‌లీహుడ్‌ ఫౌండేషన్‌ (డబ్ల్యూ.ఎల్‌.ఎఫ్‌.)’ గత 14 ఏళ్లుగా ప్రజలకు అందిస్తోంది. ఈ అంశంపై రైతులకు, స్వచ్ఛంద సంస్థలు, ఇంజనీర్లు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు  అవగాహన కల్పించేందుకు డబ్ల్యూ.ఎల్‌.ఎఫ్‌. ఈ నెల 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా.. తెలుగులో ఉచితంగా వెబినార్‌ను నిర్వహిస్తోంది.

ఈ క్యూ.ఆర్‌.కోడ్‌ ద్వారా స్కాన్‌ చేసి గూగుల్‌ ఫామ్‌ ద్వారా పేర్లను ఈ నెల 18 లోగా రిజిస్టర్‌ చేసుకున్న వారికి వాట్సప్‌ ద్వారా వెబినార్‌ లింక్‌ పంపుతారు. ప్రవేశం ఉచితం. రూ.200 చెల్లించిన వారికి బోర్ల వద్ద వాన నీటి సంరక్షణపై ఆంగ్ల పుస్తకాన్ని పంపుతారు. వివరాలకు.. సీనియర్‌ జియాలజిస్ట్‌ రామ్‌మోహన్‌ – 94401 94866, 040 27014467. 

16, 17న సేంద్రియ రైతులతో ముఖాముఖి!
హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 16, 17 తేదీల్లో గ్రామభారతి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో నాబార్డ్‌ తోడ్పాటుతో సేంద్రియ వ్యవసాయ, గ్రామీణ ఉత్పత్తుల ప్రదర్శన ‘కిసాన్‌ ఎక్స్‌పో’ 2వ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సామ ఎల్లారెడ్డి తెలిపారు.

ఆరోగ్యదాయక సేద్యం చేస్తున్న గ్రామీణ సేంద్రియ/ ప్రకృతి వ్యవసాదారులను, వారి ఉత్పత్తులను ప్రత్యక్షంగా నగరవాసులకు పరిచయం చేయటం కోసం వినియోగదారుల కుటుంబాలతో ముఖాముఖి నిర్వహించటం ఈ ఎక్స్‌పో ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ప్రకృతి సేద్య రంగ ప్రముఖులు డా. జీవీ రామాంజనేయులు, విజయరామ్, కొప్పుల నరసన్న తదితరులు అతిధులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 97040 66622.

ఇవి చదవండి: Dr Supraja Dharini: తాబేలు గెలవాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement