కుంకుడు సాగులో ఎకరానికి ఏటా రూ. 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న నల్గొండ జిల్లా రైతు పద్మారెడ్డి
నీటి వసతి లేని 12 ఎకరాల్లో 33 ఏళ్ల క్రితం 1200 మొక్కలు నాటారు
కుంకుడు కాయలతో టూత్‌పేస్టు తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీప్రారంభం
ఎక్కువ పొలం ఉండి, నీటి వసతి అంతగా లేని బీడు భూముల్లో కుంకుడు తోట ద్వారా అనూహ్యమైన రీతిలో ఎకరానికి రూ. 13 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు నల్గొండ జిల్లా రైతు లోకసాని పద్మారెడ్డి. ఎకరానికి కేవలం రూ. 5 వేల నిర్వహణ ఖర్చుతో ఈ ఆదాయం పొందటం విశేషం. 33 ఏళ్ల క్రితం 12 ఎకరాల్లో 1200 కుంకుడు మొక్కలు నాటి అసాధారణ ఫలితాలు సాధిస్తున్నారు. సరికొత్త కుంకుడు వంగడాన్ని రూపొందించటంతో ΄ాటు కుంకుడు పొడితో సబ్బులు, టూత్‌పేస్టులు తయారు చేస్తున్నారు. కుంకుడు కాయల పొడిని సేంద్రియ పురుగుమందుగా, గ్రోత్ ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా కూడా వాడొచ్చని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ శాస్త్రవేత్తల తోడ్పాటుతో పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేయనున్నారు. రైతు శాస్త్రవేత్త పద్మారెడ్డి సుసంపన్న అనుభవాలు రైతులకు చక్కని వ్యవసాయ, వ్యా΄ార ΄ాఠాలుగా నిలుస్తున్నాయనటంలో అతిశయోక్తి లేదు.
నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్టప్రాంత రైతు చేసిన ప్రయోగం అబ్బుర పరిచే ఫలితాలనందిస్తోంది. డిగ్రీ చదువుకున్న పద్మారెడ్డి(59) వ్యవసాయమే వృత్తిగా స్వీకరించారు. గతంలో హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో పట్టు సాధించారు. ఆయన భార్య శోభారాణి స్వగ్రామంలోనే బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇద్దరు కుమారులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. 1991లో పద్మారెడ్డి నీటి వసతి లేని తమ 12 ఎకరాల పొలంలో 1200 కుంకుడు మొక్కలు నాటించారు. తన ఊరి వారు, మిత్రులు కుంకుడు మొక్కల తోట చూసి నీకేమైనా పిచ్చా? కుంకుడు చెట్లు చేలో ఒకటో రెండో వేసుకుంటే చాలు. ఎవరైనా ఏకంగా 12 ఎకరాల్లో ఇలా తోట ఎవరైనా పెడతారా పటేలా? అని ఎగతాళి చేశారు. కానీ తన ఆలోచన వేరు. తాను వేరే ఏ తోట పెట్టినా ఆ తోటను బతికించుకోవటానికి తగినంత నీరు లేదు. కుంకుడు చెట్లయితే నీరు పెట్టాల్సిన పని లేదు. మొండి చెట్టు కాబట్టి బతికి పోద్దిలే అన్నది పద్మారెడ్డి ఆలోచన. ఆ చెట్లు పెరిగి మంచి కుంకుడు కాయల దిగుబడి ఇస్తుండటంతో ఆయన ఆలోచన ఎంత ముందుచూపుతో కూడినదో అందరికీ అర్థం అవుతున్నది.
8 లక్షల ఎకరాలకు విత్తనాలు..
33 ఏళ్ల చెట్టు ఏటా 100 కిలోల కాయలు కాస్తోంది. ఎకరానికి పది వేల కిలోల దిగుబడి. గత సీజన్‌లో కిలో రూ. 130 చొప్పున అమ్మితే ఎకరానికి రూ. 13 లక్షల ఆదాయం వచ్చిందని పద్మారెడ్డి తెలి΄ారు. ఆనోటా ఈనోటా తెలుసుకున్న అనేక రాష్ట్రాల రైతులు సుమారు 4 లక్షల మంది ఇప్పటికి సందర్శించారు. 8 లక్షల ఎకరాలకు సరిపడే విత్తనాలు అమ్మానని, వారిలో చాలా మంది కుంకుడుతోటలు సాగు చేస్తున్నారన్నారు. కాబట్టి, భవిష్యత్తులోనూ ఇంత ఎక్కువ ఆదాయం వస్తుందని అనుకోలేమని ఆయన స్పష్టం చేశారు. విస్తీర్ణం పెరిగి భవిష్యత్తులో కుంకుళ్ల ఉత్పత్తి పెరిగినప్పుడు ధర తగ్గుతుందన్నారు. ఎంత తగ్గినా, ఎట్టిపరిస్థితుల్లోనూ.. ఎకరానికి రూ. 2.5 లక్షల కన్నా తక్కువగా అయితే ఆదాయం రాదని పద్మారెడ్డి చెబుతున్నారు.
కొత్త వంగడం నమోదుకు యత్నాలు..
దేశంలోనే అరుదైన ఒక అద్భుత కుంకుడు వనంగా పద్మారెడ్డి తోట గుర్తింపు పొందింది. అనేక రాష్ట్రాల నుంచి రైతులు, అధికారులు ఇప్పటికి లక్షలాది మంది తన తోటను సందర్శించారని ఆయన సంతోషంగా చె΄్పారు. 12 ఎకరాల్లో 1200 కుంకుడు చెట్లను 31 ఏళ్లుగా సాగు చేస్తున్న పద్మారెడ్డి తోటలో 3–4 రకాల కుంకుడు రకాలు ఉన్నాయి. వీటిలో 63 చెట్లు అద్భుత ఫలితాలను ఇస్తున్నట్లు ఆయన గుర్తించారు. మెరుగైన చెట్లను ఎంపిక చేసి సరికొత్త కుంకుడు వంగడాన్ని ఆయన రూపొందించారు. శ్రీకొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిపుణులు పద్మారెడ్డి కుంకుడు క్షేత్రాన్ని సందర్శించి ప్రశంసించారు. దీనితో ΄ాటు జాతీయ స్థాయిలో దీన్ని సరికొత్త రైతు వంగడంగా అధికారికంగా గుర్తింపు తెప్పించేందుకు దరఖాస్తు చేయటంలో పద్మారెడ్డికి ఉద్యాన వర్సిటీ తోడ్పాటునందిస్తోంది. పిజెటిఎస్‌ఎయు క్వాలిటీ కంట్రోల్ ప్రయోగశాలలో పద్మారెడ్డి కుంకుడు కాయలపై పరీక్షలు జరిపించారు. ఇందులో అద్భుత ఫలితాలు రావటంతో శాస్త్రవేత్తలే ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఒక్కసారి నాటి, మూడు/ నాలుగు సంవత్సరాలు వాటిని కా΄ాడుకుంటే చాలు.. రైతుకు ఊహించనంత ఆదాయం వస్తుందని పద్మారెడ్డి అనుభవాలు చాటి చెబుతున్నాయి. పెద్ద కమతాలు ఉండి, సీజనల్ పంటలు సాగు చేసుకోలేక బీడు పెడుతున్న రైతులు కుంకుడు తోటలను సులువుగా పెంచి, అధికాదాయం పొందవచ్చని పద్మారెడ్డి సూచిస్తున్నారు.
20×20 దూరంలో నాటాలి..
కుంకుడు సాగులో పద్మారెడ్డి 33 ఏళ్ల అనుభవం గడించారు. 20“20 అడుగుల దూరంలో కుంకుడు మొక్కలు నాటుకోవాలి. డ్రిప్‌తో నీటిని అందించాలి. రెండు కుంకుడు చెట్ల మధ్య తొలి మూడేళ్లు బొ΄్పాయి, మునగ, జామ వంటి పంటలు వేసుకుంటే రైతుకు ఆదాయం వస్తుంది. కుంకుడు మొక్క నాటి డ్రిప్ ఏర్పాటు చేసి, యాజమాన్య పద్ధతులు ΄ాటిస్తే నాలుగో ఏడాది నుంచి 20–30 కిలోల కాపుప్రారంభమవుతుంది. ఐదేళ్ల తర్వాత పూత దశలో నీరు ఇస్తే చాలు. మంచి దిగుబడి వస్తుంది. నవంబర్–డిసెంబర్‌లో పూత వస్తుంది. ఏప్రిల్‌లో కాయలు కోతకు వస్తాయి. కుంకుడు చెట్టు కాపు సీజన్ పూర్తయ్యాక ఆకు రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. ఎండిన మానులా ఉండే చెట్టు మేలో చిగురిస్తుంది. ఒక్కో చెట్టుకు 20–25 కిలోల రాలుతాయి. ఆకులన్నీ చెట్టు మొదట్లోనే కుళ్లి సేంద్రియ ఎరువుగా పోషకాలను అందిస్తాయి.
విలువ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టి!
33 ఏళ్లుగా 12 ఎకరాల్లో కుంకుడు తోట సాగుచేస్తున్నా. ఏటా 1200–1300 క్వింటాళ్ల ఎండు కాయలు ఉత్పత్తి అవుతున్నాయి. 200 సంవత్సరాల వరకు ఈ చెట్లకు ఢోకా ఉండదు. ఎండుకాయలు కిలో రూ. 130కి ఇస్తున్నా. విత్తనాలు కిలో రూ. వెయ్యి, ఇప్పటికి 8 లక్షల ఎకరాలకు అమ్మా. ఇకపై కుంకుళ్లు అమ్మకుండా.. విలువ జోడించి అమ్మాలనుకుంటున్నా. కుంకుడు పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని జోడించి.. కిలో 170కి అమ్ముతున్నా. ఇది పంటలకు పురుగుమందుగా, గ్రోత్‌ప్రమోటర్‌గా, శిలీంధ్రనాశనిగా చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించాం. ఈ పొడిని మరింత మెరుగ్గా తయారు చేసి.. బ్రాండ్ చేసి ప్యాక్‌చేసి మార్కెట్‌లోకి తేబోతున్నా. పండ్ల పొడిగా, టూత్‌పేస్ట్‌గా, కాళ్ల పగుళ్లకు మందుగా.. ఇలా అనేక రకాలుగా కూడా కుంకుడు ఉపయోగపడుతోంది. పలు ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నా. కుంకుడు చెట్లకు తేనెటీగలు విపరీతంగా ఆకర్షితమవుతాయి. ప్రకృతికి కూడా ఈ తోట ఎంతో మేలు చేకూర్చుతోంది. – లోకసాని పద్మారెడ్డి (99481 11931), రైతు శాస్త్రవేత్త, పోలేపల్లి, చందంపేట మండలం, నల్గొండ జిల్లా
– నిర్వహణ: పంతంగి రాంబాబు,సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment