తాటి పండు నుంచి లభించే ఉత్పత్తుల్లో తేగలు ముఖ్యమైనవి. పలు పోషకాలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న తేగలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. తేగల పిండి తయారీని కుటీర పరిశ్రమగా చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చని పందిరిమామిడి (తూ. గో. జిల్లా) ఉద్యానపరిశోధనా కేంద్రం అధిపతి, ఆహార–సాంకేతిక విజ్ఞాన సీనియర్ శాస్త్రవేత్త డా. పి సి వెంగయ్య (94931 28932) అంటున్నారు.
తాటి టెంక నుంచి 21–30 రోజుల్లో మొలక వస్తుంది. ఈ మొలక భూమిలోకి దాదాపు 45–60 సెం.మీ. పోతుంది. మొలక వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలకు ఏర్పడే దానిని తేగ అంటారు. తేగ పెరిగే కొద్ది కొబ్బరిలా గట్టిగా ఉండే పదార్థం కరిగిపోతుంది. ఇది దాదాపు 6–12 నెలలు అంటే తేగ నుంచి మొక్క వచ్చే వరకు ఆహారంగా ఉపయోగపడుతుంది.
టెంకలను నీడలో పాతర పెడితే తేగలు ఇంకా బాగా పెరుగుతాయి. విత్తనం నుంచి మొక్క రావటం అనేది 50 శాతం వరకు ఉంటుంది. గుజ్జు తీసిన టెంకలు తొందరగా మొలక వచ్చి బాగా పెరుగుతాయి. పెద్ద టెంకల నుంచి మందం గల తేగలు చిన్న టెంకల నుంచి సన్న తేగలు వస్తాయి. పొడవులో మాత్రం వ్యత్యాసం ఉండదు. తేగల ఉత్పత్తిలో ఎరువులు వాడాల్సిన అవసరం లేదు.
తేగల పిండి తయారీ ఇలా...
తాజా తేగలను శుభ్రపరచి ఒక అరగంట పాటు ఉడికించి అమ్మవచ్చు. వీటిలో పలు ఔషద గుణాలు ఉన్నాయి. తేగలను వివిధ రూపాల్లోకి మార్చి సంవత్సరమంతా వాడవచ్చు. దీనికోసం తేగలను ఎండబెట్టి ముక్కలుగా నిల్వ ఉంచాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిండిగా మార్చుకోవచ్చు. పచ్చి తేగలను లేదా ఉడికించిన తేగలను రెండుగా విడదీసి ఆరబెట్టవచ్చు.
చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆరబెట్టటం మరో పద్ధతి. వీటిలో ఏదో ఒక విధానంలో తేగలను పిండిగా మార్చవచ్చు. తేగను పిండి రూపంలోకి మార్చి 250 మైక్రాన్ల జల్లెడ ద్వారా జల్లిస్తారు. పచ్చి పిండిని వాడేటప్పుడు ఒకట్రెండు గంటలు నీటిలో నానపెడితే చేదుపోతుంది. పిండి నుంచి నీటిని తొలగించేందుకు వడపోయాలి. లేదా వేడి చేయాలి.
తేగల పిండితో పలు వంటకాల తయారీ
పిండిని ఉడికించడం ద్వారా వివిధ రకాల ఆహార పదార్థాలు చేయవచ్చు. ఉడికించిన పిండిలో బెల్లం, కొబ్బరి పొడి కలిపి తినవచ్చు. ఈ పిండిలో కొబ్బరిపొడి కలిపి ఆవిరితో ఉడికిస్తే మంచి రుచికరమైన వంటకం తయారవుతుంది. మినపప్పుతో కలిపి ఇడ్లీ, దోశె తయారు చేయవచ్చు. బ్రెడ్, గోధుమ పిండితో కలిపి నూడిల్స్ తయారు చేయవచ్చు. వరి, గోధుమ పిండితో తయారు చేసే అన్ని వంటకాల్లోను దీన్ని వాడవచ్చు.
చదవండి: యాంటీ సూట్ ఇంజక్షన్ కేసు: విదేశంలో డైవర్స్ కేసు వేస్తే..!
తాజా తేగ 46 గ్రా. బరువుంటుంది. ఉడికించి ఆరబెట్టినది 16. గ్రా., పచ్చిది ఆరబెట్టినది 18గ్రా. బరువుంటుంది. సమారు 60 శాతం పిండి పదార్థం ఉంటుంది. తేగల్లో ముఖ్యమైనది పిండి పదార్థం. ఇది తేగ మొదటి భాగంలో ఎక్కువగా ఉంటుది. పోనుపోను తగ్గుతూ ఉంటుంది. తాజా తేగలో సుమారు 55 శాతం తేమ ఉంటుంది. ప్రోటీన్లు 5 శాతం, కొవ్వు పదార్థాలు 0.5 శాతం ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment