=మెట్ట భూములకు లాభదాయకం
=ఆసక్తి చూపుతున్న రైతులు
=మూడు వేల ఎకరాలకు విస్తరించిన సాగు
మాడుగుల, న్యూస్‌లైన్: వరి, చెరకు పంటల సాగుకు సమతల భూములుండాలి. కొండ పరీవాహక ప్రాంతాల్లో భూములు సాధారణంగా ఎగుడు దిగుడుతో ఏటవాలుగా ఉం టాయి. వీటిలో వరి, చెరకు పంటల సాగుకు వీలు కాదు. ఈ భూముల్లో ఒకప్పుడు గిరి రైతులు జొన్నలు, చోళ్లు తదితర పంటలతో అరకొర ఆదాయం పొందేవారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి ప్రభుత్వం అంది స్తున్న ప్రోత్సాహాన్ని మెట్ట భూముల రైతులు అందిపుచ్చుకున్నారు.
గతంలో ఎకరాకు రూ. 1500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయాన్ని చూసిన వారు ఇప్పుడు ఏకంగా రూ.40 నుం చి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పైగా ప్రభుత్వం నుంచి పెట్టుబడితో పాటు రుణం లభించడం రైతులను మరింత ఆకట్టుకుంటోంది. ఐదెకరాల మెట్ట భూమి ఉన్న రైతులు ఆ పొలంలో బోరు తవ్వించుకుంటే ఉద్యానవన శాఖ ఆయిల్ పామ్ తోట ల పెంపకానికి హెక్టారుకు రూ.35 వేల చొప్పున నాలుగేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తోంది. ఏపీఎంఐసీ అధికారులు ఈ మొక్కలకు 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ సిష్టంను ఏర్పాటు చేస్తున్నారు.
రైతు కొద్ది మొత్తం పెట్టుబడి పెట్టగలిగితే ఆ తర్వాత 25 ఏళ్ల పాటు ఏకదాటిగా శాశ్వత ఆదాయం వస్తుందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహంతో పాటు మంచి లాభాలు వస్తుండడంతో మాడుగుల మండలంలో సుమారు మూడు వేల ఎకరాలలో అయిల్ పామ్ తోటలు సాగు చేస్తున్నారు. మొక్కలు నాటాక కొద్ది రోజుల సంరక్షణ అనంతరం అదే భూముల్లో అంతర పంటగా వంగ, బెండ, కంద వంటివి సాగు చేసుకోవచ్చని, దీని వల్ల ఏడాదికి గరిష్టంగా రూ.30 వేల ఆదాయం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
అందుబాటులో మిల్లులు
గతంలో పామాయిల్ మిల్లులు అందుబాటు లో లేక రైతులు ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం మాడుగుల మండలంలో మూడు మిల్లులు ఏర్పాటు చేశారు. గెలలు కోసిన నాలుగైదు గంటలలో మిల్లులకు తరలిస్తున్నారు. ఏటా పెట్టుబడి లేకుండా, పెద్దగా కూలీల అవసరం లేకుండా ఆదాయం వస్తుందని రైతులు సక్కింటి రాంబాబు, డి.రాములు తెలిపారు.
ఇతర రాష్ట్రాలలోకు ఎగుమతి
ఇక్కడ మిల్లుల్లో తయారయ్యే పామాయిల్‌ను మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మండలంలో ఆయిల్‌పామ్ తోటలు, మిల్లుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 9 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారుల అంచనా.
మంచి లాభాలు
ఆయిల్‌పామ్ సాగుతో ఏటా మంచి లాభాలు వస్తున్నాయి. ప్రస్తుతం కూలీలు లభించకపోవడంతో వ్యవసాయం చేయలేక పోతున్నాం. పెద్దగా పెట్టుబడి, కూలీ లు అవసరం లేకపోవడంతో ఆయిల్‌పామ్ తోటలపై ఆసక్తి చూపించాము.
- సురేష్ కుమార్, రైతు, కృష్ణంపాలెం
పెద్ద మొత్తంలో రాయితీలు
ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తోంది. ఐదు నుంచి పదెకరాల్లో సాగు చేసుకునే వారికి 75 శాతం రాయితీ వస్తోంది. రైతులు తమ భూమిలో బోరు నిర్మించుకుని ఉద్యాన వన శాఖాధికారులను సంప్రదిస్తే ఆయిల్‌పామ్ తోటల సాగుకు సహకారం అందిస్తారు.
- పి.శ్రీనివాసరావు, ఫీల్డ్ సూపర్వైజర్
ఆశలు రేపుతున్న ఆయిల్‌పామ్
Published Mon, Dec 9 2013 2:07 AM | Last Updated on Thu, May 24 2018 1:55 PM
Advertisement
Advertisement