బంతి విలాపం... చాందినీ వికాసం | No market for desi bhanti flowers | Sakshi
Sakshi News home page

బంతి విలాపం... చాందినీ వికాసం

Published Fri, Dec 6 2024 5:45 AM | Last Updated on Fri, Dec 6 2024 5:45 AM

No market for desi bhanti flowers

మార్కెట్‌లో నాటురకం బంతిపూలకు ఆదరణ కరువు

రోడ్డుపై పారబోస్తున్న అన్నదాతలు

పాత వెరైటీల సాగుతో నష్టాలబాట

కనీసం కిలో రూ.4 కూడా పలకని నాటురకం బంతి

హైబ్రిడ్‌ రకాలైన కస్తూరి చాందిని సాగుతో అధిక ఆదాయం

రైతులు అప్‌డేట్‌ కావాలంటున్న హార్టికల్చర్‌ అధికారులు

నాటురకం బంతిపూలు కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సాగు చేసిన రైతులు వాటిని రోడ్డుపై పారబోస్తున్నారు. దీంతో అన్నదాతలకు నష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఈ పూలతోటలు సాగు అధికంగా ఉంటుంది. అయితే హైబ్రిడ్‌ రకం పూలకు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉంటోంది. రైతులు ఈ హైబ్రిడ్‌ రకం పూల తోటలు సాగు చేస్తే లాభాలు పొందుతారని హార్టికల్చర్‌ అధికారులు చెబుతున్నారు.  

పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పూలసాగు ఎక్కువగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఉంటుంది. ఈ దఫా ఈ ప్రాంతంలో నాటు రకాలైన బంతి, చామంతిని సాగుచేసిన పూలరైతులు తీవ్ర నష్టాలబాటలో పయనిస్తున్నారు. బంతిపూలు కిలో రూ.4 కూడా పలకపోవడంతో కొనేవారు లేక పూలను రైతులు రోడ్డుపై పారబోస్తున్నారు. ఇదే సమయంలో చామంతిలో హైబ్రిడ్‌ రకాలైన సెంట్‌ రెడ్, ఎల్లో, వైట్, వైలట్‌ రకాలను సాగు చేసిన రైతులు లక్షాధికారులుగా మారుతున్నారు. 

ఇవి వారం రోజులైనా వాడకుండా ఉండడంతో, బొకేలకు, ఫంక్షన్‌ హాళ్ల అలంకరణకు వాడుతుండడంతో వీటికి మంచి డిమాండ్‌ ఉంది. దీంతో వీటి ధర ప్రస్తుతం కిలో రూ.వందకు పైమాటే. పూల రైతులు వారి పొలంలో కాస్త పెట్టుబడి ఎక్కువగా పెట్టి నాటీ రకాల బదులు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న హైబ్రిడ్‌ రకాలను సాగుచేస్తే లాభాల పట్టేవారు. కానీ రైతులు అప్‌డేట్‌ కాకపోవడమే నష్టాలకు కారణమవుతోంది. 

లక్ష పెట్టుబడితో రూ.3 లక్షల లాభం 
హైబ్రిట్‌ రకాల పూల సాగు పంటకాలం నాలుగునెలలు. రెండో నెల నుంచే పూలు కోతకొచ్చి రెండునెలల పాటు కోతలు ఉంటాయి. ఎకరా పొలంలో 7 నుంచి 9వేల హైబ్రిడ్‌ రకాల సీడ్స్‌ అవసరం ఉంటుంది. ఒక్కో సీడ్‌ రూపాయిగా కర్ణాటకలోని తుముకూర్, తమిళనాడులోని రాయకోట నర్సరీలో వీటిని విక్రయిస్తున్నారు. 

ఎకరా పొలానికి పెట్టుబడిగా మల్చింగ్‌తో సహా రూ.లక్ష దాకా అవుతోంది. పంట బాగా వస్తే ఎకరానికి 30 టన్నుల ఉత్పత్తి ఉంటుంది. ప్రస్తుతం హైబ్రిడ్‌ రకాల పూల ధరలు కిలో రూ.100 వరకు ఉన్నాయి. ఈ లెక్కన 30 టన్నులకు రూ.3 లక్షలు వస్తుంది. 

అదే నాటి రకం పూలైతే.. 
నాటి రకమైన బంతి 70 రోజులకు కోతకొచ్చి ఆపై 40 రోజులు కటింగ్‌లు ఉంటాయి. అదే చామంతి అయితే 90 రోజులకు కోతకు వచ్చి ఆరునెలలు కటింగ్‌ ఉంటాయి. వీటి సాగు కోసం ఎకరా పొలంలో రైతు పంట పెట్టుబడిగా రూ.50వేలు పెట్టాలి. పంట దిగుబడి బాగా వస్తే పదిటన్నుల పూల ఉత్పత్తి ఉంటుంది. 

ఇప్పుడు ఉన్న ధర కిలో రూ.4తో రూ.40వేలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతుకు నష్టం తప్పదు. అందువల్ల రైతులు వారిపొలంలో నాటి రకాల పూలకు బదులు హైబ్రిడ్‌ రకాల పూలను సాగు చేసుకుంటే నికర లాభాలు రావడం తథ్యం.

హైబ్రిడ్‌ పూల సాగులో లాభాలు.. 
పూలను సాగుచేసే రైతులు సంప్రదాయ రకాలైన బంతి, చామంతిని ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నారు. వీటికి ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. అదే హైబ్రిడ్‌ రకాలైన కస్తూరి చాందిని రకాలైన సెంట్‌ రెడ్, వైట్, ఎల్లో, వైలట్‌ రకాలను సాగుచేసిన రైతులు లాభాల బాటలో ఉన్నారు. ఎందుకంటే ఈ రకం పూలు వారం రోజులైనా వాడకుండా ప్లాస్టిక్‌ పూలవలే వికసిస్తూ ఉంటాయి. 

వీటిని దూర ప్రాంతాలకు సైతం రవాణా చేసేందుకు వెలుసుబాటుగా ఉంటుంది. అదే నాటి రకాలు మూడురోజుల్లోనే వాడిపోతుంటాయి. దీంతో పూల వ్యాపారులు సైతం హైబ్రిడ్‌ రకాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు ఈ రకం పూలను బొకేలకు సైతం ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో వీటికి ఎప్పుడూ డిమాండ్‌ ఉండడంతో ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.

హైబ్రిడ్‌ రకాలనే సాగు చేయాలి 
నాటి రకాలైన బంతీ, చామంతిలను సాగు­చేసినష్టాలు బాట ప­ట్టాం. అందుకే తమిళనాడులోని రాయ­కో­ట నుంచి సెంట్‌ ఎ­ల్లో, వైట్, రెడ్‌ రకాల హైబ్రిడ్‌ రకాల పూలను సాగుచేసి నికర లాభాలను పొందుతున్నాం. రైతులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ డిమాండ్‌ ఉన్న పూలను సాగుచేయడం అలవర్చుకోవాలి. అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.  – రవీంద్ర, పూలరైతు, కూర్మాయి గ్రామం, పలమనేరు మండలం

అవగాహన కల్పిస్తూనే ఉన్నాం..
సంప్రదాయ రకాలైన బంతి పూలకు ఇప్పుడు కాలం చెల్లింది. వీటికి ఎప్పుడు ధరలుంటాయో తెలియని పరిస్థితి. అందువల్ల రైతు­లు మార్కెట్‌లో ఎక్కువ­గా డిమాండ్‌ ఉన్న హైబ్రిడ్‌ రకాల పూలను సాగు చేసుకోవడం మేలు. ఎందుకంటే అదే పొలంలో కాస్త ఎక్కువగా పెట్టుబడి పెట్టి నికరంగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. దీనిపై రైతులకు అవగాహన కల్పిపస్తూనే ఉన్నాం.  – డా.కోటేశ్వర్‌రావు, సహాయ సంచాలకులు, ఉద్యానశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement