గతంతో పోలిస్తే భారీగా పెరిగిన ఉద్యాన పంటలు
ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉద్యాన పంటల వైపు రైతులు
2019–23 మధ్య 7.49 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటల సాగు
అత్యధికంగా 1.69 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్..
1.26 లక్షల ఎకరాల్లో కొత్తగా మామిడి తోటలు..
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు గడిచి నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలిచ్చింది. ముఖ్యంగా సాగు విస్తీర్ణం తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానంలో ఉద్యాన పంటలు విస్తరించేలా ప్రోత్సహించడంలో సఫలీకృతమైంది. రాష్ట్రంలో 2018–19 నాటికి 42.51 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఉద్యాన పంటలు నేడు 45.76 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. 4.23 లక్షల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించగా, కొత్తగా 3.25 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి.
2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23లో 368.83 లక్షల టన్నులు రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 380 లక్షల టన్నులు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫ్రూట్‌బౌల్‌గా గుర్తింపు పొందిన ఏపీ..కొబ్బరి, బొప్పాయి, టమోటాలో మొదటి స్థానం, బత్తాయి, అరటి, వంగ, మిర్చి, ఆయిల్‌పామ్‌లో రెండో స్థానం, మామిడి, ఉల్లి, జీడిపప్పులో మూడో స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో సంప్రదాయ పంటలైన మామిడి, జీడిమామిడి, సపోటా, బొప్పాయి వంటి పంటలను ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సహించే వారు. ఏడాదికి 50వేల ఎకరాలు సాగులోకి రావడం గగనంగా ఉండేది. పంటల మార్పిడిని ప్రోత్సహించాలన్న ఆలోచన కూడా చేయలేదు.
బోర్ల కింద ఉద్యాన పంటలు..
మరోవైపు.. పంటల వారీగా అమలుచేసిన ఏరియా ఎక్స్‌పాన్షన్ (విస్తరణ) ప్రాజెక్టులు కూడా సత్ఫలితాలిచ్చాయి. పెద్దఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి ప్రోత్సహించడంతో లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటలు సాగుచేసే రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లారు. రాయలసీమ జిల్లాల్లో బోర్ల కింద వేరుశనగ, వరి స్థానంలో అరటి, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, మామిడి.. దక్షిణ కోస్తా జిల్లాల్లో పొగాకు, సుబాబుల్, యూకలిప్టస్ స్థానంలో నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి.. కృష్ణా, గోదావరి రీజియన్‌లో మొక్కజొన్న, చెరకుతో పాటు బోర్ల కింద వరి స్థానంలోనూ ఆయిల్‌పామ్, కొబ్బరి, కోకో, జామ, ఉత్తర కోస్తా జిల్లాల్లో క్యాసిరినాతో పాటు బోర్‌వెల్స్ కింద వరి స్థానంలో ఆయిల్ పామ్, జీడిమామిడి, కొబ్బరి తోటలను విస్తరించగలిగారు. గతంతో పోలిస్తే అంతర పంటల సాగు కూడా పెరిగింది.
పెరిగిన ఆయిల్‌పామ్, మామిడి తోటలు
పంటల మార్పిడి ద్వారా ఈ ఐదేళ్లలో వరుసగా 2019–20లో 1,36,628 ఎకరాలు, 2020–21లో 1,44,298 ఎకరాలు, 2021–22లో 1,56,173 ఎకరాలు, 2022–23 1,58,532 ఎకరాలు, 2023–24లో 1,58,532 ఎకరాల చొప్పున పంటల మార్పిడి ద్వారా ఈ ఐదేళ్లలో 7,54,163 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ప్రధానంగా 1.69 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.26 లక్షల ఎకరాల్లో మామిడి, 92వేల ఎకరాల్లో జీడిమామిడి, 84వేల ఎకరాల్లో బత్తాయి, 51వేల ఎకరాల్లో అరటి, 36వేల ఎకరాల్లో కూరగాయలు, 33వేల ఎకరాల్లో కోకో, 25 వేల ఎకరాల్లో కొబ్బరి, 24వేల ఎకరాల్లో జామ, 22వేల ఎకరాల్లో పూలతోటలు, 19 వేల ఎకరాల్లో నిమ్మ, 12వేల ఎకరాల్లో దానిమ్మతో పాటు నేరేడు, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, చింత, సీతాఫలం వంటి పంటల సాగు విస్తరించింది. ఎకరాకు రూ.15వేల చొప్పున రూ.1,123.82 కోట్లకు పైగా ఖర్చుచేశారు.
రాయితీలు.. ప్రోత్సాహకాలతో..
ఈ 57 నెలల్లో కొత్తగా 269 ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీఓ)ను ఏర్పాటుచేశారు. 143 ఎకరాల్లో షేడ్‌నెట్స్‌కు రూ. 10.52 కోట్లు, 24.55 ఎకరాలలో పాలీహౌస్‌ల నిర్మాణంకోసం రూ. 3.68 కోట్లు ఖర్చుచేశారు. ఈ నాలుగున్నరేళ్లలో 29.83 ఎకరాల్లో కూరగాయల రైతులకు రూ.75.70 లక్షలు, 172.65 ఎకరాల్లో పువ్వులు సాగుచేసే రైతులకు రూ.5.85 కోట్లు చొప్పున ఆర్థిక చేయూతనిచ్చారు. కోత అనంతర నష్టాలను నివారించేందుకు ఎఫ్‌పీఓల కోసం ప్రత్యేకంగా 940 ఉద్యాన సేకరణ కేంద్రాలతోపాటు 340 కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 462 కలెక్షన్ సెంటర్లు, 84 కోల్డ్‌రూమ్స్‌ను ఎఫ్‌పీఓలకు అందించారు. 2,905 మంది రైతులకు వ్యక్తిగతంగా ప్యాక్‌హౌస్‌లను నిర్మించి ఇచ్చారు.
ఫలించిన పంటల మార్పిడి..
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానే ఉద్యాన పంటలను ప్రోత్సహించాం. ఐదేళ్లలో రికార్డు స్థాయిలో పంటల మార్పిడి ద్వారా 7.49 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురాగా, వీటిలో 3.25 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. 4.23 లక్షల ఎకరాల్లో పాత పంటల స్థానే కొత్త పంటలు సాగులోకి వచ్చాయి. వివిధ స్కీమ్‌ల ద్వారా అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలవల్లే ఇది సాధ్యమైంది. – డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ
Comments
Please login to add a commentAdd a comment