breaking news
horticulture crops
-
కన్నీటి సాగు.. సీమ రైతు గగ్గోలు
సాక్షి, అమరావతి: రాయలసీమ జిల్లాల్లో వ్యవసాయ రంగంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి, టమాటా, మామిడి, చీనీ, అరటి తదితర పంటలకు కనీస మద్దతు ధరలు దక్కక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటను కొనే వారు లేక నష్టాల బారిన పడుతున్నారు. మార్కెట్లో జోక్యం చేసుకొని ధరల పతనాన్ని అడ్డుకోవల్సిన రాష్ట్ర ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా చేష్టలుడిగి చూస్తుండడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 45.75 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, రాయలసీమ జిల్లాల్లో 19.25 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 346 లక్షల టన్నుల దిగుబడులొస్తుండగా, అందులో సగానికి పైగా.. అంటే 221 లక్షల టన్నుల (63.9 శాతం) దిగుబడులు రాయలసీమ నుంచే వస్తున్నాయి. పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో అగ్రస్థానం రాయలసీమదే. రాష్ట్ర వ్యాప్తంగా 213 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తి జరుగుతుండగా, అందులో 40 లక్షల టన్నుల అరటి, 22.35 లక్షల టన్నుల చీనీ (బత్తాయి) ఉత్పత్తి రాయలసీమ జిల్లాల నుంచే వస్తోంది. మామిడి దిగుబడులు 49 లక్షల టన్నులు కాగా, దాంట్లో 15 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో టమాటా ఉత్పత్తి 42.46 లక్షల టన్నులు కాగా, ఇందులో 41 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే వస్తున్నాయి. ఉల్లి దిగుబడులు 10 లక్షల టన్నులు కాగా, దాంట్లో 7–8 లక్షల టన్నులు రాయలసీమ జిల్లాల నుంచే అందుతోంది. ధరల పతనంతో గగ్గోలు » గతేడాది కూడా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే డ్రాగన్ ఫ్రూట్‌తో పాటు బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ తదితర పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రనష్టాలు చవిచూశారు. ఈ ఏడాది జూలై, ఆగస్టులో «ధర లేక లక్షలాది మంది మామిడి రైతులు నష్టపోగా, తాజాగా ప్రస్తుత ఖరీఫ్‌లో సీజన్ ఆరంభంలోనే ఉల్లి, టమాటా, అరటి, చీనీ వంటి పంటల ధరల పతనంతో సీమ రైతులు విలవిల్లాడి పోతున్నారు. » టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వక పోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ధర లేక కోతకొచ్చిన పంటను చేలల్లోనే వదిలేçస్తుండగా, కొనేవారు లేక రోడ్డుపక్కన పారబోయడం, మేకలు, గొర్రెల మేతకు పెడుతున్న ఘటనలు రోజూ సర్వసాధారణమయ్యాయి. ప్రస్తుతం రైతుల నుంచి క్వింటా ఉల్లి రూ.300 – రూ.400, టమాటా రూ.200– రూ.600కు మించి కొనడంలేదు. » రాయలసీమలో పండే జీ–9 అరటి టన్ను రూ.4 వేల నుంచి రూ.6 వేలు, చీనీ (బత్తాయి) టన్ను రూ.6 వేల నుంచి రూ.12 వేలకు మించి ధర పలకడం లేదు. ఉల్లి క్వింటా రూ.1,200కు తక్కువ కాకుండా కొనుగోలు చేస్తామని నమ్మబలికిన ప్రభుత్వం.. వారం తిరక్కుండానే కొనుగోళ్లను నిలిపివేసింది. మార్కెట్–మద్దతు ధర మధ్య వ్యత్యాసం ఇస్తామంటూ రైతులను ఏమార్చేందుకు యత్నిస్తోంది. » ధర లేక, కొనేవారు లేక పెద్ద ఎత్తున రైతులు పంటను తీసేస్తున్నారు. గతేడాది «ధరల పతనంతో మొదలైన సంక్షోభం ఈ ఏడాది కూడా కొనసాగుతుండడం రైతులను కలవర పెడుతోంది. గిట్టుబాటు ధరకు అమ్ముకోవాల్సిన ప్రధాన పంట ఉత్పత్తులను తక్కువ ధరకు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది. కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితి లేక అల్లాడి పోతున్నారు. 1/3 వంతు కూడా సాగవ్వని వేరుశనగ వ్యవసాయ పంటల విషయానికి వస్తే రాష్ట్రంలో సాధారణ విస్తీర్ణం 77.88 లక్షల ఎకరాలు కాగా, రాయలసీమ జిల్లాల్లో 26.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. దీంట్లో 12.43 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట మాత్రమే సాగవుతోంది. ఈ ఏడాది 14 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యం కాగా, కేవలం 4లక్షల ఎకరాలకు మించి సాగవ్వని పరిస్థితి నెలకొంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో 19–42 శాతం మధ్యే సాగైన పంటలను చూస్తుంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీఫ్‌లో సీమలో ఆగస్టు 7 వరకు అనావృష్టితో ఒక్క కర్నూలు జిల్లాలో తప్ప మిగిలిన జిల్లాల్లో సాగు అంతంత మాత్రంగానే జరిగింది. సాగైన చోట కూడా వర్షాభావ పరిస్థితులకు తోడు అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. నష్టం భరించలేక చీనీ చెట్లు నరికేస్తున్నా ఈ రైతు పేరు సి.కేశవ. వైఎస్సార్ కడప జిల్లా లింగాల గ్రామానికి చెందిన ఈయన 3 ఎకరాలలో చీనీ తోట సాగు చేశారు. 20 ఏళ్లుగా చీనీ పంటను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 2023–24లో మంచి దిగుబడులతో పాటు రికార్డు స్థాయిలో ధర లభించింది. టన్ను రూ.25 వేలకు పైగా ధర పలికింది. ప్రస్తుతం దిగుబడి బాగా వచ్చినా, మార్కెట్ యార్డులో వ్యాపారులు సిండికేట్ అయ్యారు. కొనే వారు లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ప్రస్తుతం క్వింటా రూ.3 వేల నుంచి రూ.7 వేలకు మించి పలకడం లేదు. ధరలు పతనం కావడంతో ఈ ఏడాది రూ.3 లక్షల మేర నష్టపోవాల్సి వచ్చింది. ఈ నష్టాన్ని భరించలేక చీనీ చెట్లను నరికి వేస్తున్నా అంటూ ఈ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.ధర చూస్తుంటే ఏడుపొస్తోంది ఐదెకరాల్లో టమాటా సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. వాతావరణం బాగోలేకపోవడంతో దిగుబడులు తగ్గాయి. ఎకరాకు 400 బాక్సులు (10 టన్నులు) రావాల్సింది కేవలం 50 బాక్సులు (1.25 టన్నులు) మాత్రమే వచ్చింది. ప్యాపిలి మార్కెట్‌కు 20 బాక్సులు తీసుకొస్తే బాక్స్‌కు రూ.200కు మించి ధర లభించలేదు. 2023–24లో బాక్స్ రూ.600కు అమ్ముకున్నా. ఆ ఏడాది కిలో రూ.24 పలుకగా, ప్రస్తుతం రూ.6కు మించి రావడం లేదు. బహిరంగ మార్కెట్లో, సూపర్ మార్కెట్లలో మాత్రం కిలో రూ.40–50కి పైగానే అమ్ముతుండటం చూసి ఏడుపొస్తోంది. – ప్రసాద్, ప్యాపిలి, కర్నూలు జిల్లా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలి రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా సాగయ్యే టమాటా, అరటి, చీనీ, ఉల్లి పంట ఉత్పత్తులను కొనేవారు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతేడాది మామిడి, బొప్పాయి సహా ప్రధాన ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలను చవిచూశారు. ఇంతటి దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవు. ఇదే పరిస్థితి కొనసాగితే సీమ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ధరల స్థిరీకరణ ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకొని ధరల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర దక్కేలా చూడాల్సిన బాధ్యత ఉంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
ఉద్యాన ‘ఘనం’..
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దేందుకు గడిచి నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలిచ్చింది. ముఖ్యంగా సాగు విస్తీర్ణం తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూనే లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానంలో ఉద్యాన పంటలు విస్తరించేలా ప్రోత్సహించడంలో సఫలీకృతమైంది. రాష్ట్రంలో 2018–19 నాటికి 42.51 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఉద్యాన పంటలు నేడు 45.76 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. 4.23 లక్షల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించగా, కొత్తగా 3.25 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. 2018–19 నాటికి 305 లక్షల టన్నులున్న దిగుబడులు 2022–23లో 368.83 లక్షల టన్నులు రాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 380 లక్షల టన్నులు దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫ్రూట్బౌల్గా గుర్తింపు పొందిన ఏపీ..కొబ్బరి, బొప్పాయి, టమోటాలో మొదటి స్థానం, బత్తాయి, అరటి, వంగ, మిర్చి, ఆయిల్‌పామ్‌లో రెండో స్థానం, మామిడి, ఉల్లి, జీడిపప్పులో మూడో స్థానంలో ఉంది. టీడీపీ హయాంలో సంప్రదాయ పంటలైన మామిడి, జీడిమామిడి, సపోటా, బొప్పాయి వంటి పంటలను ఉపాధి హామీ పథకం కింద ప్రోత్సహించే వారు. ఏడాదికి 50వేల ఎకరాలు సాగులోకి రావడం గగనంగా ఉండేది. పంటల మార్పిడిని ప్రోత్సహించాలన్న ఆలోచన కూడా చేయలేదు. బోర్ల కింద ఉద్యాన పంటలు.. మరోవైపు.. పంటల వారీగా అమలుచేసిన ఏరియా ఎక్స్పాన్షన్ (విస్తరణ) ప్రాజెక్టులు కూడా సత్ఫలితాలిచ్చాయి. పెద్దఎత్తున రాయితీలు, ప్రోత్సాహకాలిచ్చి ప్రోత్సహించడంతో లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటలు సాగుచేసే రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లారు. రాయలసీమ జిల్లాల్లో బోర్ల కింద వేరుశనగ, వరి స్థానంలో అరటి, బత్తాయి, బొప్పాయి, దానిమ్మ, మామిడి.. దక్షిణ కోస్తా జిల్లాల్లో పొగాకు, సుబాబుల్, యూకలిప్టస్ స్థానంలో నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి.. కృష్ణా, గోదావరి రీజియన్‌లో మొక్కజొన్న, చెరకుతో పాటు బోర్ల కింద వరి స్థానంలోనూ ఆయిల్‌పామ్, కొబ్బరి, కోకో, జామ, ఉత్తర కోస్తా జిల్లాల్లో క్యాసిరినాతో పాటు బోర్‌వెల్స్ కింద వరి స్థానంలో ఆయిల్ పామ్, జీడిమామిడి, కొబ్బరి తోటలను విస్తరించగలిగారు. గతంతో పోలిస్తే అంతర పంటల సాగు కూడా పెరిగింది. పెరిగిన ఆయిల్‌పామ్, మామిడి తోటలు పంటల మార్పిడి ద్వారా ఈ ఐదేళ్లలో వరుసగా 2019–20లో 1,36,628 ఎకరాలు, 2020–21లో 1,44,298 ఎకరాలు, 2021–22లో 1,56,173 ఎకరాలు, 2022–23 1,58,532 ఎకరాలు, 2023–24లో 1,58,532 ఎకరాల చొప్పున పంటల మార్పిడి ద్వారా ఈ ఐదేళ్లలో 7,54,163 ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. ప్రధానంగా 1.69 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.26 లక్షల ఎకరాల్లో మామిడి, 92వేల ఎకరాల్లో జీడిమామిడి, 84వేల ఎకరాల్లో బత్తాయి, 51వేల ఎకరాల్లో అరటి, 36వేల ఎకరాల్లో కూరగాయలు, 33వేల ఎకరాల్లో కోకో, 25 వేల ఎకరాల్లో కొబ్బరి, 24వేల ఎకరాల్లో జామ, 22వేల ఎకరాల్లో పూలతోటలు, 19 వేల ఎకరాల్లో నిమ్మ, 12వేల ఎకరాల్లో దానిమ్మతో పాటు నేరేడు, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, చింత, సీతాఫలం వంటి పంటల సాగు విస్తరించింది. ఎకరాకు రూ.15వేల చొప్పున రూ.1,123.82 కోట్లకు పైగా ఖర్చుచేశారు. రాయితీలు.. ప్రోత్సాహకాలతో.. ఈ 57 నెలల్లో కొత్తగా 269 ఉద్యాన రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీఓ)ను ఏర్పాటుచేశారు. 143 ఎకరాల్లో షేడ్‌నెట్స్‌కు రూ. 10.52 కోట్లు, 24.55 ఎకరాలలో పాలీహౌస్‌ల నిర్మాణంకోసం రూ. 3.68 కోట్లు ఖర్చుచేశారు. ఈ నాలుగున్నరేళ్లలో 29.83 ఎకరాల్లో కూరగాయల రైతులకు రూ.75.70 లక్షలు, 172.65 ఎకరాల్లో పువ్వులు సాగుచేసే రైతులకు రూ.5.85 కోట్లు చొప్పున ఆర్థిక చేయూతనిచ్చారు. కోత అనంతర నష్టాలను నివారించేందుకు ఎఫ్పీఓల కోసం ప్రత్యేకంగా 940 ఉద్యాన సేకరణ కేంద్రాలతోపాటు 340 కోల్డ్‌స్టోరేజ్‌ల నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా.. ఇప్పటికే 462 కలెక్షన్ సెంటర్లు, 84 కోల్డ్రూమ్స్ను ఎఫ్పీఓలకు అందించారు. 2,905 మంది రైతులకు వ్యక్తిగతంగా ప్యాక్‌హౌస్‌లను నిర్మించి ఇచ్చారు. ఫలించిన పంటల మార్పిడి.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు లాభసాటి కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానే ఉద్యాన పంటలను ప్రోత్సహించాం. ఐదేళ్లలో రికార్డు స్థాయిలో పంటల మార్పిడి ద్వారా 7.49 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురాగా, వీటిలో 3.25 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయి. 4.23 లక్షల ఎకరాల్లో పాత పంటల స్థానే కొత్త పంటలు సాగులోకి వచ్చాయి. వివిధ స్కీమ్‌ల ద్వారా అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలవల్లే ఇది సాధ్యమైంది. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, ఉద్యాన శాఖ -
ప్రతి ఏటా ఉద్యానవన విస్తీర్ణం పెరుగుతోంది: మంత్రి కన్నబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏటా ఉద్యానవన విస్తీర్ణం పెరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాగా, శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉద్యానవన రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని.. కొబ్బరి పంటలపై నిరంతరం అధ్యయనం చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని పేర్కొన్నారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమాట, ఉల్లి పంటలపై ప్రత్యేక దృష్టిపెట్టామని తెలిపారు. అదేవిధంగా.. అరటి, మిరప సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. -
ఉద్యాన పంటల గిట్టుబాటు ధరలకు కృషి
నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ సత్యకృష్ణం రాజు తుని రూరల్ : జాతీయస్థాయిలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు నిరంతరం కృషి చేస్తానని నేషనల్ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్ చోడ్రాజు సత్యకృష్ణంరాజు అన్నారు. పదవీ బాధ్యతలు చేపటి సోమవారం తొలిసారిగా తుని వచ్చిన ఆయనకు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రైల్వే స్టేషన్లో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీఐపీ లాంజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోకో, కొబ్బరి, ఆయిల్‌పామ్, బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, జీడి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం, గిట్టుబాటు ధరల సాధనకు కృషి చేస్తానన్నారు. పండ్లు, కూరగాయల నిల్వకు కోల్డ్ స్టోరీజీలు ఏర్పాటు, రుణ పరపతి పెంపునకు బోర్డులో చర్చకు తీసుకువస్తానని, సాగులో యంత్రీకరణకు అధిక నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్వగ్రామం తేటగుంటకు చేరుకున్నారు. ఈముని అనంతశేషగిరి, ఆకెళ్ల శాస్త్రి, లోవదేవస్థానం ధర్మకర్తలు పుల్లంరాజు, నారాయణాచార్యులు, నియోజకవర్గ కార్యకర్తలు పాల్గొన్నారు. -
పల్లెలప్రగతికి సహకారం
పిలువని పేరంటంలా వైఎస్సార్ జిల్లాను కరువు కబళిస్తే అందులో ముందుగా రాయచోటి నియోజకవర్గంలోని పలు పల్లెలు ముందుంటాయి. వర్షాభావ పరిస్థితులతో పంటలంటేనే హడలిపోయే పల్లె సీమల్లో బంగారు కలలను సాధ్యం చేసేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కంకణం కట్టుకుంది. వర్షపు నీరు వృధా కాకుండా ఫాంపాండ్స్, కరకట్టల నిర్మాణంతో భూగర్బ జలాల పెంపునకు కృషి జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు అణగారిన వర్గాలకు చెందిన పలువురు రైతులు వాటర్షెడ్ల ద్వారా ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. వాటర్షెడ్లతో ఒనగూరుతున్న ప్రయోజనం ఎంత? రైతులకు ఫలాలు అందుతున్నాయా? మొక్కల పంపిణీ సజావుగా సాగిందా? ఫాంపాండ్స్ నిజంగా నిర్మించారా? వాటర్‌షెడ్ కింద అందించిన రుణాలతో యూనిట్లు స్థాపించారా? అన్న అంశాలపై వైఎస్సార్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డీడబ్ల్యుఎంఏ) ప్రాజెక్టు డెరైక్టర్ బాలసుబ్రమణ్యం వీఐపీ రిపోర్టర్‌గా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కొండలు, గుట్టలు, అడవులు, రైతుల పొలాల్లో కలియతిరిగి నిశితంగా పరిశీలించారు. పీడీ : ఏమయ్యా! వర్షాలు బాగా పడుతున్నాయా? చెట్లు బాగున్నాయా? సమస్యలు ఏమున్నాయి? గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం వాటర్షెడ్లు వచ్చాక మీకైమైనా లబ్ధి చేకూరిందా? రామకృష్ణ : వాటర్‌షెడ్ ద్వారా మొక్కలు ఉచితంగా ఇచ్చారు సార్! కొండలు.. గుండ్లు... గుట్టలు.. రాళ్లతో గతంలో అధ్వానంగా ఉండేది. వాటర్షెడ్లు వచ్చాక భూమిని చదును చేయించి మొక్కల పంపిణీతో పాటు అన్ని వసతులు కల్పించడంతో పంటలు బాగా వస్తున్నాయి. పొద్దు పొడుస్తూనే తట్టాబుట్టా చేతబట్టి.. తలపాగ నెత్తిన చుట్టి.. పార సంకనెట్టి పొలం బాట పడతారు వారు.. అప్పుడు నడుం వాల్చింది మొదలు పొద్దుపోయేదాకా అలుపెరగక పని చేస్తారు. వారే రైతులు.. వారే కూలీలు.. అవును వాటర్‌షెడ్ పథకంలో పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలు, పశువుల బోన్లు.. సోలార్ లైట్లు.. ఇలా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినవారు వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పథకాలతో పచ్చని మొక్కలు నాటి కంటికి రెప్పల్లా.. పసి పాపల్లా వాటిని పెంచుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో కొందరు గుంతలు తవ్వుకుంటే.. మరికొందరు సబ్సిడీ డబ్బులతో పారంఫాండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరి కష్టసుఖాలు ఏంటి.. లాభనష్టాలమాటేంటి.. వీరికి ఇంకా ఏమేం అవసరం.. అనేవాటిపై జిల్లా డ్వామా పీడీ బాల సుబ్రమణ్యం ‘సాక్షి వీఐపీ రిపోర్ట్’గా మారి వారిని పలకరించారు. గట్లు, కొండలు దాటి వారితో ముచ్చటించారు. పల్లెసీమల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. పీడీ: వాటర్‌షెడ్ కింద వీరబల్లి రోడ్డులో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు? ఉపయోగం ఉందా? సి.వెంకట్రామరాజు: వీరబల్లి మెయిన్‌రోడ్డులో చీమ తంగేడు చెట్లు నాటాం. రోడ్డుకు ఇరువైపుల నాటడంతో ప్రస్తుతం అద్బుతంగా ఉన్నాయి. సుమారు రెండు వేల చెట్లకు పైగా నాటాము. చాలా బాగుంది. పీడీ: వాటర్షెడ్ల ద్వారా మీ గ్రామానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేశారా? జగదీశ్వరరెడ్డి: వాటర్‌షెడ్ ద్వారా గుర్రప్పగారిపల్లెలో మంచి ప్రయోజనం ఏర్పడింది. సమీప ప్రాంతాల్లోని కొండలు, గుట్టలు అంతా అడవి ప్రాంతం. అయితే వాటర్షెడ్ల నిర్మాణంతో తిండి గింజలు పండించుకుంటున్నాం. గతంలో అడవి ప్రాంతానికి వచ్చేవారే లేరు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఎవరు చూసినా వారి పొలాల్లో ఫాంపాండ్స్ తవ్వుకుంటున్నారు. నీటి కుంటలు, చెక్‌డ్యాములు ఉండడంతో నీరు కూడా పైనే లభిస్తోంది. పీడీ: పండ్ల తోటలకు సంబంధించి మొక్కలు, నెలనెల డబ్బులు అందుతున్నాయా? లేకపోతే ఎవరైనా పట్టుకుని ఇస్తున్నారా? రంగమ్మ: వాటర్‌షెడ్ పరిధిలో మామిడి చెట్లు అందించారు. మళ్లీ నెలనెల క్రమంగా గుంతలు తీయడానికి, సత్తువులకు నీళ్లు పోసినందుకు డబ్బులు ఇస్తున్నారు. మాకైతే ఎవరూ డబ్బులు పట్టుకోవడం లేదు. ప్రస్తుతం నిర్మించిన కుంటల్లోని నీరే చెట్లకు ఆధారమైంది. పీడీ: ఇప్పుడే నీటి కోసం కష్టంగా ఉంటే రానున్న వేసవిలో పరిస్థితి ఏంటి? పి.రంగమ్మ: నాకు నాలుగు ఎకరాలు పొలం ఉంది. ఎండాకాలంలో కూడా నీటికి ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా ఒక్కప్పుడు బీడు భూమి ఉండేది. ఇపుడంతా సాగైంది. కొండల్లో నుంచి కిందికి వస్తున్న నీటిని కరకట్టల ద్వారా ఆపి వేస్తుండడంతో సమస్య లేద్సార్. పీడీ: వాటర్‌షెడ్ ద్వారా కూరగాయల విత్తనాలు ఇచ్చాం. ఎంతమందికి ఇచ్చారు? అలాగే సాక్షి ఇంటి పంట ఎవరైనా సాగు చేస్తున్నారా? ఈశ్వరమ్మ: మాకు కూరగాయల విత్తనాలు ఇచ్చారు. బెంగ, వంగ, టమోటా, మిరప, కాకర, బీర, చిక్కుడు, అలసంద, మటిక తదితర పంటలు సాగు చేస్తున్నాం. అయితే మాకు చదువు పెద్దగా రాదు.‘సాచ్చి’లో వచ్చిన ఇంటి పంట గురించి చెబుతుంటే విని పెరట్లో కాకర చెట్లు సాగు చేసి ఇంటికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. పీడీ: మొత్తం ఎన్ని వాటర్షెడ్లు ఇక్కడ ఉన్నాయి? చంద్రశేఖర్‌రెడ్డి: నాలుగు ప్రాజెక్టు పరిధిలో సుమారు ఐదు మైక్రో వాటర్షెడ్లు ఉన్నాయి. మామిడి చెట్లను 359 మంది రైతులకు అందజేశాం. వీరబల్లిలో పచ్చదనం పెంపుకు ప్రత్యేకంగా చెట్లు పెంచుతున్నాం. పండ్ల తోటలను దాదాపు 60 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. గట్లపై ప్రత్యేకంగా ఎర్రచందనం, టేకు మొక్కలను పెంచేందుకు కృషి చేయడంతోపాటు తోటలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా గుంతలు తీసుకుని నీటి నిల్వకు చర్యలు తీసుకుంటున్నారు. పీడీ(సమీపంలో ఉన్న మహిళా రైతులతో): వాటర్‌షెడ్ పరిధిలో ఇంకా ఏమేమి చేపట్టారు? టేకు, ఎర్రచందనం నాటుకుంటారా? భూమి ఎంత ఉంది? ఏం చేస్తున్నారు? నాగమ్మ: సార్! నాకు మూడు ఎకరాలుంది. మామిడి చెట్లున్నాయి. నీళ్లతో ఇబ్బందిగా ఉంది. కరెంటు లేదు. టేకు చెట్లు నాటాం. వాటర్షెడ్లు మరికొన్ని ఇస్తే బాగుంటుంది. దీంతో నీటి సమస్య ఉండదు. పీడీ: భూమి అభివృద్ధికి ఇంకా ఏమేమి చేయాలి? ఇంకేం సౌకర్యాలు కావాలా పెద్దాయనా? రామన్న: డబ్బులు అన్నీ ఒకే సార్...నీటి సమస్య ఉంటే ప్రతి రైతు పొలంలో కుంటలు తవ్వుకునేందుకు అవకాశం కల్పించాలి. గుంతల్లో నీరు ఉంటే చుట్టుపక్కల తడి ఉంటుంది. చెట్లు బతుకుతాయి. చెక్‌డ్యాములు కట్టిస్తే మరింత బాగుంటుంది సార్! పీడీ: కూలీ పనులు కల్పిస్తున్నారా? మూడు రోజుల పని ఎంతవరకు వచ్చింది? జయరాం: కల్పించారు సార్, ఇంకా ఏమైనా అవకాశాలుంటే చెప్పండి? చెరువుల్లో మట్టి భయకరంగా ఉందండి...పూడిక తీయిస్తే బాగుంటుంది. ఫర్లాంగు దూరంలో పొట్టేళ్లు మేపుతున్న మహిళతో... పీడీ: అమ్మా పొట్టేళ్లు ఎంతకు కొన్నావు? ఎక్కడకొన్నావు? టి.వెంకటమ్మ: సార్..36 గొర్రెలున్నాయి సార్. మా ఆయప్ప కొనక్కొచ్చాడు సార్...వీటికి సంబంధించి డబ్బు వాటర్‌షెడ్ ద్వారా వచ్చింది సార్. ఒక్కో విత్తన పొట్టేళ్లు రూ. 6500 ప్రభుత్వం వాళ్లు ఇస్తే మేం రెండు వేలు పెట్టుకున్నాం. మా ఊల్లో తొమ్మిది మందికి ఇచ్చారు సార్. పీడీ: జీవనోపాధులను పెంపొందిస్తున్నారా? అనూరాధ: మేకలు, ఆవులు, గొర్రెలు గ్రూపు మహిళలకు ఇచ్చారు. వాటిని పెట్టుకుని మహిళలమంతా అంతో ఇంతో సంపాదించుకంటున్నాము సార్, ప్రస్తుతం కరువొచ్చింది సార్...ఇబ్బందిగా ఉంది. ఆవులు, మేకలు ఉండడం వల్ల రోంత మేలు జరుగుతోంది సార్. ఇంకా బీదోళ్లకు ఇస్తే బాగుంటుంది. శిబ్యాల గ్రామంలో అమ్మవారి గుడి సమీపంలో సోలార్ లైటు వద్ద... పీడీ: సోలార్ వీధి లైట్లు ఎన్ని ఇచ్చారు? ఎలా పనిచేస్తున్నాయి? లైటింగ్ ఎలా ఉంది? ఎంత ఖర్చు చేశారు? రాచమ్మ: సార్ చానా బాగుంది సార్...మూడు గ్రామాల్లో 58 లైట్లు ఉన్నాయి. ప్రజలు కూడా కావాలని పదేపదే అడుగుతున్నారు. సోలార్ లైట్ ఆటోమేటిక్ స్విచ్ పెట్టడంతో రాత్రి వెలగడం, పగలు ఆరిపోతాంది. వెలుగు బ్రహ్మాండంగా కానొస్తాంది. పీడీ: సోలార్ లైటు ఎవరికైనా ఉపయోగపడిందా? బాలాజీ: ఏంది ఉపయోగం సార్, గ్రామంలోని 30-40 పిల్లోళ్లు రాత్రిళ్లు గుడి వద్దకు వచ్చి చదువుకుంటున్నారు. కొంతమంది ఆడుకుంటున్నారు. ఇంకా కావాలని అడుగుతున్నారు. స్పందించిన పీడీ....సరేలెండి! ఈసారికి మరిన్ని ఎక్కువ తెప్పించి ఇస్తాం. పీడీ: వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామాలకు పశువులు, మేకల కోసం బోన్లు ఇచ్చారు. ఉపయోగం ఉందా? నాగరాజు: ఎందుకు లేదు సార్...మా ఊర్లో బోను లేనపుడు రెండు కిలోమీటర్లు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఇక్కడ పశువులను డాక్టరే వచ్చి చూస్తున్నారు. ఒకేరోజు బోను వద్ద కట్టేసి సూది మందు వేయిస్తున్నాం.