పల్లెలప్రగతికి సహకారం
పిలువని పేరంటంలా వైఎస్సార్ జిల్లాను కరువు కబళిస్తే అందులో ముందుగా రాయచోటి నియోజకవర్గంలోని పలు పల్లెలు ముందుంటాయి. వర్షాభావ పరిస్థితులతో పంటలంటేనే హడలిపోయే పల్లె సీమల్లో బంగారు కలలను సాధ్యం చేసేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కంకణం కట్టుకుంది. వర్షపు నీరు వృధా కాకుండా ఫాంపాండ్స్, కరకట్టల నిర్మాణంతో భూగర్బ జలాల పెంపునకు కృషి జరుగుతోంది.
ఎస్సీ, ఎస్టీలతోపాటు అణగారిన వర్గాలకు చెందిన పలువురు రైతులు వాటర్‌షెడ్‌ల ద్వారా ఉద్యానవన పంటలను సాగు చేస్తున్నారు. వాటర్‌షెడ్లతో ఒనగూరుతున్న ప్రయోజనం ఎంత? రైతులకు ఫలాలు అందుతున్నాయా? మొక్కల పంపిణీ సజావుగా సాగిందా? ఫాంపాండ్స్ నిజంగా నిర్మించారా? వాటర్‌షెడ్ కింద అందించిన రుణాలతో యూనిట్లు స్థాపించారా? అన్న అంశాలపై వైఎస్సార్ జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డీడబ్ల్యుఎంఏ) ప్రాజెక్టు డెరైక్టర్ బాలసుబ్రమణ్యం వీఐపీ రిపోర్టర్‌గా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. కొండలు, గుట్టలు, అడవులు, రైతుల పొలాల్లో కలియతిరిగి నిశితంగా పరిశీలించారు.
పీడీ : ఏమయ్యా! వర్షాలు బాగా పడుతున్నాయా? చెట్లు బాగున్నాయా? సమస్యలు ఏమున్నాయి? గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం వాటర్‌షెడ్లు వచ్చాక మీకైమైనా లబ్ధి చేకూరిందా?
రామకృష్ణ : వాటర్‌షెడ్ ద్వారా మొక్కలు ఉచితంగా ఇచ్చారు సార్! కొండలు.. గుండ్లు... గుట్టలు.. రాళ్లతో గతంలో అధ్వానంగా ఉండేది. వాటర్‌షెడ్లు వచ్చాక భూమిని చదును చేయించి మొక్కల పంపిణీతో పాటు అన్ని వసతులు కల్పించడంతో పంటలు బాగా వస్తున్నాయి.
పొద్దు పొడుస్తూనే తట్టాబుట్టా చేతబట్టి.. తలపాగ నెత్తిన చుట్టి.. పార సంకనెట్టి పొలం బాట పడతారు వారు.. అప్పుడు నడుం వాల్చింది మొదలు పొద్దుపోయేదాకా అలుపెరగక పని చేస్తారు. వారే రైతులు.. వారే కూలీలు.. అవును వాటర్‌షెడ్ పథకంలో పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలు, పశువుల బోన్లు.. సోలార్ లైట్లు.. ఇలా ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందినవారు వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతున్నారు.
ప్రభుత్వ పథకాలతో పచ్చని మొక్కలు నాటి కంటికి రెప్పల్లా.. పసి పాపల్లా వాటిని పెంచుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో కొందరు గుంతలు తవ్వుకుంటే.. మరికొందరు సబ్సిడీ డబ్బులతో పారంఫాండ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరి కష్టసుఖాలు ఏంటి.. లాభనష్టాలమాటేంటి.. వీరికి ఇంకా ఏమేం అవసరం.. అనేవాటిపై జిల్లా డ్వామా పీడీ బాల సుబ్రమణ్యం ‘సాక్షి వీఐపీ రిపోర్ట్’గా మారి వారిని పలకరించారు. గట్లు, కొండలు దాటి వారితో ముచ్చటించారు. పల్లెసీమల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు.
పీడీ: వాటర్‌షెడ్ కింద వీరబల్లి రోడ్డులో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు? ఉపయోగం ఉందా?
సి.వెంకట్రామరాజు: వీరబల్లి మెయిన్‌రోడ్డులో చీమ తంగేడు చెట్లు నాటాం. రోడ్డుకు ఇరువైపుల నాటడంతో ప్రస్తుతం అద్బుతంగా ఉన్నాయి. సుమారు రెండు వేల చెట్లకు పైగా నాటాము. చాలా బాగుంది.
పీడీ: వాటర్‌షెడ్ల ద్వారా మీ గ్రామానికి ఉపయోగపడే పనులు ఏమైనా చేశారా?
జగదీశ్వరరెడ్డి: వాటర్‌షెడ్ ద్వారా గుర్రప్పగారిపల్లెలో మంచి ప్రయోజనం ఏర్పడింది. సమీప ప్రాంతాల్లోని కొండలు, గుట్టలు అంతా అడవి ప్రాంతం. అయితే వాటర్‌షెడ్ల నిర్మాణంతో తిండి గింజలు పండించుకుంటున్నాం. గతంలో అడవి ప్రాంతానికి వచ్చేవారే లేరు. ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఎవరు చూసినా వారి పొలాల్లో ఫాంపాండ్స్ తవ్వుకుంటున్నారు. నీటి కుంటలు, చెక్‌డ్యాములు ఉండడంతో నీరు కూడా పైనే లభిస్తోంది.
పీడీ: పండ్ల తోటలకు సంబంధించి మొక్కలు, నెలనెల డబ్బులు అందుతున్నాయా? లేకపోతే ఎవరైనా పట్టుకుని ఇస్తున్నారా?
రంగమ్మ: వాటర్‌షెడ్ పరిధిలో మామిడి చెట్లు అందించారు. మళ్లీ నెలనెల క్రమంగా గుంతలు తీయడానికి, సత్తువులకు నీళ్లు పోసినందుకు డబ్బులు ఇస్తున్నారు. మాకైతే ఎవరూ డబ్బులు పట్టుకోవడం లేదు. ప్రస్తుతం నిర్మించిన కుంటల్లోని నీరే చెట్లకు ఆధారమైంది.
పీడీ: ఇప్పుడే నీటి కోసం కష్టంగా ఉంటే రానున్న వేసవిలో పరిస్థితి ఏంటి?
పి.రంగమ్మ: నాకు నాలుగు ఎకరాలు పొలం ఉంది. ఎండాకాలంలో కూడా నీటికి ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా ఒక్కప్పుడు బీడు భూమి ఉండేది. ఇపుడంతా సాగైంది. కొండల్లో నుంచి కిందికి వస్తున్న నీటిని కరకట్టల ద్వారా ఆపి వేస్తుండడంతో సమస్య లేద్సార్.
పీడీ: వాటర్‌షెడ్ ద్వారా కూరగాయల విత్తనాలు ఇచ్చాం. ఎంతమందికి ఇచ్చారు? అలాగే సాక్షి ఇంటి పంట ఎవరైనా సాగు చేస్తున్నారా?
ఈశ్వరమ్మ: మాకు కూరగాయల విత్తనాలు ఇచ్చారు. బెంగ, వంగ, టమోటా, మిరప, కాకర, బీర, చిక్కుడు, అలసంద, మటిక తదితర పంటలు సాగు చేస్తున్నాం. అయితే మాకు చదువు పెద్దగా రాదు.‘సాచ్చి’లో వచ్చిన ఇంటి పంట గురించి చెబుతుంటే విని పెరట్లో కాకర చెట్లు సాగు చేసి ఇంటికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం.
పీడీ: మొత్తం ఎన్ని వాటర్‌షెడ్లు ఇక్కడ ఉన్నాయి?
చంద్రశేఖర్‌రెడ్డి: నాలుగు ప్రాజెక్టు పరిధిలో సుమారు ఐదు మైక్రో వాటర్‌షెడ్లు ఉన్నాయి. మామిడి చెట్లను 359 మంది రైతులకు అందజేశాం. వీరబల్లిలో పచ్చదనం పెంపుకు ప్రత్యేకంగా చెట్లు పెంచుతున్నాం. పండ్ల తోటలను దాదాపు 60 ఎకరాల్లో సాగు చేస్తున్నాము. గట్లపై ప్రత్యేకంగా ఎర్రచందనం, టేకు మొక్కలను పెంచేందుకు కృషి చేయడంతోపాటు తోటలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా గుంతలు తీసుకుని నీటి నిల్వకు చర్యలు తీసుకుంటున్నారు.
పీడీ(సమీపంలో ఉన్న మహిళా రైతులతో): వాటర్‌షెడ్ పరిధిలో ఇంకా ఏమేమి చేపట్టారు? టేకు, ఎర్రచందనం నాటుకుంటారా? భూమి ఎంత ఉంది? ఏం చేస్తున్నారు?
నాగమ్మ: సార్! నాకు మూడు ఎకరాలుంది. మామిడి చెట్లున్నాయి. నీళ్లతో ఇబ్బందిగా ఉంది. కరెంటు లేదు. టేకు చెట్లు నాటాం. వాటర్‌షెడ్లు మరికొన్ని ఇస్తే బాగుంటుంది. దీంతో నీటి సమస్య ఉండదు.
పీడీ: భూమి అభివృద్ధికి ఇంకా ఏమేమి చేయాలి? ఇంకేం సౌకర్యాలు కావాలా పెద్దాయనా?
రామన్న: డబ్బులు అన్నీ ఒకే సార్...నీటి సమస్య ఉంటే ప్రతి రైతు పొలంలో కుంటలు తవ్వుకునేందుకు అవకాశం కల్పించాలి. గుంతల్లో నీరు ఉంటే చుట్టుపక్కల తడి ఉంటుంది. చెట్లు బతుకుతాయి. చెక్‌డ్యాములు కట్టిస్తే మరింత బాగుంటుంది సార్!
పీడీ: కూలీ పనులు కల్పిస్తున్నారా? మూడు రోజుల పని ఎంతవరకు వచ్చింది?
జయరాం: కల్పించారు సార్, ఇంకా ఏమైనా అవకాశాలుంటే చెప్పండి? చెరువుల్లో మట్టి భయకరంగా ఉందండి...పూడిక తీయిస్తే బాగుంటుంది.
ఫర్లాంగు దూరంలో పొట్టేళ్లు మేపుతున్న మహిళతో...
పీడీ: అమ్మా పొట్టేళ్లు ఎంతకు కొన్నావు? ఎక్కడకొన్నావు?
టి.వెంకటమ్మ: సార్..36 గొర్రెలున్నాయి సార్. మా ఆయప్ప కొనక్కొచ్చాడు సార్...వీటికి సంబంధించి డబ్బు వాటర్‌షెడ్ ద్వారా వచ్చింది సార్. ఒక్కో విత్తన పొట్టేళ్లు రూ. 6500 ప్రభుత్వం వాళ్లు ఇస్తే మేం రెండు వేలు పెట్టుకున్నాం. మా ఊల్లో తొమ్మిది మందికి ఇచ్చారు సార్.
పీడీ: జీవనోపాధులను పెంపొందిస్తున్నారా?
అనూరాధ: మేకలు, ఆవులు, గొర్రెలు గ్రూపు మహిళలకు ఇచ్చారు. వాటిని పెట్టుకుని మహిళలమంతా అంతో ఇంతో సంపాదించుకంటున్నాము సార్, ప్రస్తుతం కరువొచ్చింది సార్...ఇబ్బందిగా ఉంది. ఆవులు, మేకలు ఉండడం వల్ల రోంత మేలు జరుగుతోంది సార్. ఇంకా బీదోళ్లకు ఇస్తే బాగుంటుంది.
శిబ్యాల గ్రామంలో అమ్మవారి గుడి సమీపంలో సోలార్ లైటు వద్ద...
పీడీ: సోలార్ వీధి లైట్లు ఎన్ని ఇచ్చారు? ఎలా పనిచేస్తున్నాయి? లైటింగ్ ఎలా ఉంది? ఎంత ఖర్చు చేశారు?
రాచమ్మ: సార్ చానా బాగుంది సార్...మూడు గ్రామాల్లో 58 లైట్లు ఉన్నాయి. ప్రజలు కూడా కావాలని పదేపదే అడుగుతున్నారు. సోలార్ లైట్ ఆటోమేటిక్ స్విచ్ పెట్టడంతో రాత్రి వెలగడం, పగలు ఆరిపోతాంది. వెలుగు బ్రహ్మాండంగా కానొస్తాంది.
పీడీ: సోలార్ లైటు ఎవరికైనా ఉపయోగపడిందా?
బాలాజీ: ఏంది ఉపయోగం సార్, గ్రామంలోని 30-40 పిల్లోళ్లు రాత్రిళ్లు గుడి వద్దకు వచ్చి చదువుకుంటున్నారు. కొంతమంది ఆడుకుంటున్నారు. ఇంకా కావాలని అడుగుతున్నారు.
స్పందించిన పీడీ....సరేలెండి!
ఈసారికి మరిన్ని ఎక్కువ తెప్పించి ఇస్తాం.
పీడీ: వాటర్‌షెడ్ పరిధిలోని గ్రామాలకు పశువులు, మేకల కోసం బోన్లు ఇచ్చారు. ఉపయోగం ఉందా?
నాగరాజు: ఎందుకు లేదు సార్...మా ఊర్లో బోను లేనపుడు రెండు కిలోమీటర్లు వెళ్లేవాళ్లం. ఇప్పుడు ఇక్కడ పశువులను డాక్టరే వచ్చి చూస్తున్నారు. ఒకేరోజు బోను వద్ద కట్టేసి సూది మందు వేయిస్తున్నాం.