ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం వద్ద కవర్లు కట్టిన మామిడి తోటలు
ఏటా 2వేల టన్నుల పండ్లకు కవర్లతో రక్షణ
చీడపీడలకు చెక్.. 30శాతం పెట్టుబడి ఆదా
పెరిగిన నాణ్యతతో 30శాతం అదనపు ధర
ఇప్పటి వరకు చైనా, తైవాన్ నుంచి కవర్ల దిగుమతి
దేశంలోనే తొలి కవర్ల తయారీ యూనిట్ మన రాష్ట్రంలో ప్రారంభం
సాక్షి, అమరావతి: మామిడి, జామ, దానిమ్మ, యాపిల్, సీతాఫలంతోపాటు ప్యాషన్, డ్రాగన్ ఫ్రూట్స్ వంటివాటికి కవర్లు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. పండ్ల నాణ్యతను పెంచి రైతులకు అధిక ధరను అందిస్తున్నాయి. ప్రస్తుతం కవర్లు తొడగని బంగినపల్లి మామిడి పండ్లు టన్నుకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతుండగా... కవర్లు కట్టిన పండ్లకు రూ.80 వేల నుంచి రూ.1.10లక్షలు వరకు ధర పలుకుతోంది. కవర్లు తొడిగిన ఇతర పండ్లకు సైతం 30శాతం అదనపు ధర లభిస్తోంది.
ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యాన పంటల నాణ్యతను పెంచడం ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలన్న సంకల్పంతో పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులకు హెక్టారుకు రూ.28వేలు చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రూ.1.80 కోట్లు సబ్సిడీ సొమ్మును రైతులకు ఇచ్చింది. దీంతో యాపిల్, దానిమ్మ, ద్రాక్షతోపాటు అన్ని రకాల పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులు ముందుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా సగటున 10కోట్ల కవర్లు దిగుమతి చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉద్యానపంటలు సాగుచేసే రైతులే 3కోట్లకుపైగా కవర్లు వినియోగిస్తున్నారు.
తెగుళ్లు.. చీడపీడలకు చెక్
సాధారణంగా పిందె, కాయ మీద వర్షం లేదా మంచు పడితే వాటిని శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, తామర (త్రిప్స్), పెంకు పురుగులు దాడి చేస్తుంటాయి. వీటి నివారణ కోసం 10 నుంచి 15సార్లు మందుల పిచికారీ కోసం పంటను బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడి, గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పండ్లకు కవర్లను అమర్చటం వల్ల తెగుళ్లు, చీడపీడలకు చెక్ పెట్టగలుగుతున్నారు.
ఒక్కో కవర్ రూ.2 కాగా.. అమర్చేందుకు మరో రూపాయి ఖర్చవుతోంది. 10 నుంచి 15 ఏళ్ల వయసుగల తోటలకు 60 నుంచి 70శాతం, ముదురు తోటల్లో 30 నుంచి 40శాతం కాయలకు కవర్లు కట్టగలుగుతున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న బంగినపల్లితోపాటు రసాలు, సువర్ణరేఖ తదితర మామిడి రకాలకు కవర్లను అమరుస్తున్నారు. రాయలసీమలో దానిమ్మ, జామ, డ్రాగన్ ఫ్రూట్, గోదావరి జిల్లాల్లో సీతాఫలం పండ్లకు కవర్లు కడుతున్నారు. నిమ్మకాయ సైజులోకి వచ్చిన తర్వాత కవర్లు కట్టి కనీసం 40 రోజులపాటు ఉంచితే కాయపై మచ్చలు ఏర్పడవు. వర్షం నీరు కాయకు తాకకుండా కిందికి జారిపోతుంది. ఈదురు గాలులవేళ కాయ రాలడం కూడా ఉండదు. 90 శాతం చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. కాయల సైజు కూడా కనీసం 20–25 శాతం పెరుగుతుంది. నాణ్యంగా, ఆకర్షణీయంగా మంచి రంగుకొస్తాయి.
తొలి కవర్ల తయారీ యూనిట్ ఏపీలోనే..
కవర్లు కట్టే విధానం ఏపీలో శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు 12 రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్రంలో 2వేల టన్నుల పండ్లకు కవర్లు కడుతున్నారు. రానున్న ఐదారేళ్లలో కనీసం లక్ష టన్నులకు కవర్లు కట్టించాలన్న సంకల్పంతో ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. నాలుగేళ్లుగా తైవాన్, చైనా నుంచి కవర్లను దిగుమతి చేసుకుంటుండగా.. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ రూ.10కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ కంపెనీని ఏర్పాటు చేసింది.
విదేశాల్లో మంచి డిమాండ్
కవర్లు కట్టిన కాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మా కంపెనీ ఏటా 50 టన్నుల వరకు యూరప్, యూకే, యూఎస్‌ఏ దేశాలకు ఎగుమతి చేస్తోంది. డిమాండ్‌కు తగినట్లుగా కవర్లు కట్టిన కాయలు దొరకడం లేదు. – ఉండవల్లి రాజు, యజమాని, మధురమ్స్ లిమిటెడ్
ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం
ఉద్యాన పంటలకు మంచి ధర లభించేందుకు ఫ్రూట్ కవర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ యూనిట్ ఆగిరిపల్లిలో ఏర్పాటుచేశాం. గతేడాది ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభించాం. రోజుకు 2.50లక్షల కవర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కనీసం లక్ష టన్నుల పండ్లకు కవర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. – శరణాల అప్పారావు, ఎండీ, ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్
Comments
Please login to add a commentAdd a comment