Cover
-
ఇసుక వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరి
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక రవాణా చేసే ప్రతి వాహనంపైనా టార్పాలిన్ కవర్ కప్పడాన్ని హైకోర్టు తప్పనిసరి చేసింది. ఇసుక రవాణా సమయంలో ఏర్పడుతున్న వాయు కాలుష్యం, రోడ్లపై సంచరించే పాదచారులు, వాహనదారులు పడుతున్న తీవ్ర ఇబ్బందుల నివారణకు హైకోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రతిమ ఇన్ఫ్రా లిమిటెడ్, వారి అసైనీలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎంత జరిమానా విధించాలి, ఇసుక రవాణా చేయాల్సిన సమయాలను తదుపరి విచారణలో తేలుస్తామని తెలిపింది. జరిమానా విషయంలో అడ్వొకేట్ జనరల్, కోర్టు సహాయకారి సలహాలు ఇవ్వొచ్చునంది. తదుపరి విచారణను జూలై 31కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తదుపరి విచారణ వరకు పొడిగించింది. టార్పాలిన్ కవర్ విషయంలో తాము కూడా లీజుదారులకు తగిన ఆదేశాలిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ కోర్టుకు నివేదించారు. ఇసుక రవాణా విషయంలో హైకోర్టు ఎటువంటి షరతులు విధించినా పాటిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాల విషయాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కే వదిలేయాలని ఏజీ శ్రీరామ్, అమికస్ క్యూరీ నోర్మా అల్వరీస్ విన్నవించారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం, ఇసుక విషయంలో మరికొన్ని అంశాలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఇసుక రవాణాకు వేళలు నిర్ణయించాల్సిన అవసరం ఉందని అమికస్ క్యూరీ తెలిపారు. రవాణా ప్రాంతాల్లో కాలుష్యం స్థాయిలను పర్యవేక్షించి, పరిమితులను దాటితే ఆ ప్రాంతాల్లో ఇసుక వాహనాల రాకపోకలను తగ్గించాలని, అవసరమైతే రవాణా మార్గాన్ని మార్చాలని సూచించారు. -
పండ్లకు కవర్ల కవచం
సాక్షి, అమరావతి: మామిడి, జామ, దానిమ్మ, యాపిల్, సీతాఫలంతోపాటు ప్యాషన్, డ్రాగన్ ఫ్రూట్స్ వంటివాటికి కవర్లు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయి. పండ్ల నాణ్యతను పెంచి రైతులకు అధిక ధరను అందిస్తున్నాయి. ప్రస్తుతం కవర్లు తొడగని బంగినపల్లి మామిడి పండ్లు టన్నుకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతుండగా... కవర్లు కట్టిన పండ్లకు రూ.80 వేల నుంచి రూ.1.10లక్షలు వరకు ధర పలుకుతోంది. కవర్లు తొడిగిన ఇతర పండ్లకు సైతం 30శాతం అదనపు ధర లభిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఉద్యాన పంటల నాణ్యతను పెంచడం ద్వారా ఎగుమతులను రెట్టింపు చేయాలన్న సంకల్పంతో పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులకు హెక్టారుకు రూ.28వేలు చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రూ.1.80 కోట్లు సబ్సిడీ సొమ్మును రైతులకు ఇచ్చింది. దీంతో యాపిల్, దానిమ్మ, ద్రాక్షతోపాటు అన్ని రకాల పండ్లకు కవర్లు కట్టేందుకు రైతులు ముందుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా సగటున 10కోట్ల కవర్లు దిగుమతి చేసుకుంటుండగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఉద్యానపంటలు సాగుచేసే రైతులే 3కోట్లకుపైగా కవర్లు వినియోగిస్తున్నారు. తెగుళ్లు.. చీడపీడలకు చెక్ సాధారణంగా పిందె, కాయ మీద వర్షం లేదా మంచు పడితే వాటిని శిలీంధ్రాలు, బ్యాక్టీరియా ఆశించి మచ్చలు ఏర్పడతాయి. వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, తామర (త్రిప్స్), పెంకు పురుగులు దాడి చేస్తుంటాయి. వీటి నివారణ కోసం 10 నుంచి 15సార్లు మందుల పిచికారీ కోసం పంటను బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన స్థాయిలో నాణ్యమైన దిగుబడి, గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పండ్లకు కవర్లను అమర్చటం వల్ల తెగుళ్లు, చీడపీడలకు చెక్ పెట్టగలుగుతున్నారు. ఒక్కో కవర్ రూ.2 కాగా.. అమర్చేందుకు మరో రూపాయి ఖర్చవుతోంది. 10 నుంచి 15 ఏళ్ల వయసుగల తోటలకు 60 నుంచి 70శాతం, ముదురు తోటల్లో 30 నుంచి 40శాతం కాయలకు కవర్లు కట్టగలుగుతున్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న బంగినపల్లితోపాటు రసాలు, సువర్ణరేఖ తదితర మామిడి రకాలకు కవర్లను అమరుస్తున్నారు. రాయలసీమలో దానిమ్మ, జామ, డ్రాగన్ ఫ్రూట్, గోదావరి జిల్లాల్లో సీతాఫలం పండ్లకు కవర్లు కడుతున్నారు. నిమ్మకాయ సైజులోకి వచ్చిన తర్వాత కవర్లు కట్టి కనీసం 40 రోజులపాటు ఉంచితే కాయపై మచ్చలు ఏర్పడవు. వర్షం నీరు కాయకు తాకకుండా కిందికి జారిపోతుంది. ఈదురు గాలులవేళ కాయ రాలడం కూడా ఉండదు. 90 శాతం చీడపీడల నుంచి రక్షణ లభిస్తుంది. కాయల సైజు కూడా కనీసం 20–25 శాతం పెరుగుతుంది. నాణ్యంగా, ఆకర్షణీయంగా మంచి రంగుకొస్తాయి. తొలి కవర్ల తయారీ యూనిట్ ఏపీలోనే.. కవర్లు కట్టే విధానం ఏపీలో శ్రీకారం చుట్టగా.. ఇప్పుడు 12 రాష్ట్రాలకు విస్తరించింది. రాష్ట్రంలో 2వేల టన్నుల పండ్లకు కవర్లు కడుతున్నారు. రానున్న ఐదారేళ్లలో కనీసం లక్ష టన్నులకు కవర్లు కట్టించాలన్న సంకల్పంతో ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది. నాలుగేళ్లుగా తైవాన్, చైనా నుంచి కవర్లను దిగుమతి చేసుకుంటుండగా.. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ కంపెనీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ రూ.10కోట్ల పెట్టుబడితో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వద్ద దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ కంపెనీని ఏర్పాటు చేసింది. విదేశాల్లో మంచి డిమాండ్ కవర్లు కట్టిన కాయలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. మా కంపెనీ ఏటా 50 టన్నుల వరకు యూరప్, యూకే, యూఎస్ఏ దేశాలకు ఎగుమతి చేస్తోంది. డిమాండ్‌కు తగినట్లుగా కవర్లు కట్టిన కాయలు దొరకడం లేదు. – ఉండవల్లి రాజు, యజమాని, మధురమ్స్ లిమిటెడ్ ఉద్యాన పంటలకు ఎంతో ఉపయోగం ఉద్యాన పంటలకు మంచి ధర లభించేందుకు ఫ్రూట్ కవర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలోనే తొలి ఫ్రూట్ కవర్ల తయారీ యూనిట్ ఆగిరిపల్లిలో ఏర్పాటుచేశాం. గతేడాది ఏప్రిల్‌లో ఉత్పత్తి ప్రారంభించాం. రోజుకు 2.50లక్షల కవర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ముందుకెళ్తున్నాం. వచ్చే ఐదేళ్లలో కనీసం లక్ష టన్నుల పండ్లకు కవర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. – శరణాల అప్పారావు, ఎండీ, ఫ్రూట్ టెక్ సొల్యూషన్స్ -
కర్ణాటక కీలక నిర్ణయం: పరీక్షల్లో తలను కవర్ చేయడం నిషేధం..కానీ..!
కర్ణాటక ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. నియామక పరీక్షల సమయంలో తలపై ధరించే అన్ని రకాల దుస్తులను నిషేధించింది. దీనికి సంబంధించి కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ బోర్డు (KEA) కీలక అదేశాలు జారీ చేసింది. కానీ కొన్ని సంస్థల ఆందోళన నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే నల్ల పూసల నెక్లెస్‌లు) మెట్టెలకు అనుమతి ఉంటుందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నియామక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. బ్లూటూత్ డివైసెస్ ద్వారా అభ్యర్థుల మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం విధిస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. తల, నోరు లేదా చెవులను కప్పి ఉంచే ఏదైనా వస్త్రం లేదా టోపీ ధరించినవారికి పరీక్ష హాల్లోకి అనుమతి ఉండదని కేఈఏ స్పష్టం చేసింది. అలాగే పరీక్ష హాల్ లోపల ఫోన్లు ,బ్లూటూత్ ఇయర్ఫోన్లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి ఉండదు. దీంతోపాటు మెటల్ ఆభరణాలపై నిషేధం ఉంటుందని తెలిపింది. అయితే వివాహతులైన హిందూ మహిళలు, మంగళ సూత్రాలు, నల్ల పూసలు,మెట్టెలు ధరించవచ్చని ప్రకటించింది. డ్రెస్ కోడ్ నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్‌ను స్పష్టంగా పేర్కొననప్పటికీ తాజా ఆదేశాలు వివాదాస్పదంగా మారనున్నాయి. ఇది ఇలా ఉంటే అక్టోబర్‌లో జరిగిన రిక్రూట్మెంట్ పరీక్షల సందర్భంగా కేఈఏ హిజాబ్‌లను అనుమతించిన సంగతి గమనార్హం. అయితే బ్లూటూత్ పరికరాల వినియోగంపై ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈసారి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. 2023 అక్టోబర్‌లో KEA నిర్వహించిన పరీక్షల్లో కల్బుర్గి, యాద్గిర్ పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులు బ్లూటూత్ ఉపయోగించారన్న ఆరోపణలపై ప్రభుత్వం నవంబర్ 11న CID విచారణకు ఆదేశించింది. అంతకుముందు 2022లో, రాష్ట్రంలోని తరగతి గదుల్లో హిజాబ్‌ను నిషేధించడంపెద్ద దుమారాన్ని రేపింది. అయితే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఉత్తర్వును 10, 12వ తరగతి వంటి ఇతర బోర్డు పరీక్షలతో పాటు KEA నిర్వహించే సాధారణ ప్రవేశ పరీక్షలకు కూడా పొడిగించిన సంగతి తెలిసిందే. -
ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా?.. ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే?
మన దేశంలో చాలామంది తమ స్మార్ట్ ఫోన్ కవర్ లోపలివైపు 10, 20, 50, 100, 500 నోట్లు పెడుతుంటారు. రూపాయి నోట్లను ఫోన్ కవర్లో పెడితే అత్యవసర సమయంలో పనికి వస్తుందని భావిస్తుంటారు. అయితే ఇలా చేయడం ఎంతవరకూ ప్రమాదకరంగా పరిణమిస్తుందో చాలామందికి తెలియదు. కరెన్సీ నోట్లను ఇలా పెట్టడంవలన ఆ ఫోను కలిగినవారి ప్రాణాలు గాలిలో కలసిపోయే అవకాశం ఉంది. ఫోన్ కవర్లో రూపాయినోట్లను ఉంచడం ఎందుకు ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. వేడిని బయటకు విడుదల కానివ్వదు ఫోన్‌ను నిరంతరం ఉపయోగిస్తున్నప్పుడు అది వేడిగా మారడాన్ని గమనించే ఉంటాం. ఫోన్ వేడెక్కిన వెంటనే ఫోన్ వెనుక భాగంలో దాని ప్రభావం కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫోన్ కవర్లో కరెన్సీ నోటు ఉన్నట్లయితే, అప్పుడు ఫోన్ నుంచి వేడి బయటకు విడుదల కాదు. దీంతో ఆ ఫోను పేలిపోయేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఫోన్‌కు బిగుతుగా ఉండే కవర్‌ను ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అది ఫోన్ పేలిపోయేలా చేస్తుందని అంటుంటారు. నోట్ల రసాయనాలు ప్రాణాంతకం కరెన్సీ నోట్లను కాగితంతో తయారు చేస్తారు. అలాగే అనేక రకాల రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. ఫోన్ వేడెక్కిన సందర్భంలో.. అది బయటకు వెలువడకుండా రసాయినాలతో కూడిన కరెన్సీ నోటు అడ్డు పడితే ఆ పోన్ పేలిపోయేందుకు అవకాశం ఏర్పుడుతుంది. అందుకే పొరపాటున కూడా ఫోన్ కవర్లో ఎలాంటి కరెన్సీ నోటును ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఫోన్ కవర్ బిగుతుగా ఉన్నా, అది పేలిపోయే అవకాశం ఉందని, అందుకే ఫోన్ కవర్ ఎంపికలో జగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
మామిడి కాయకు కవర్, రైతుకు ప్రాఫిట్
జిల్లాలోని ఖరీఫ్ ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం. పంట దిగుబడి నాణ్యంగా ఉంటేనే రైతుకు ఆదాయం. ఇందులో భాగంగానే మామిడి పండ్లు రక్షణ కోసం ఫ్రూట్ కవర్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కీటకాలు, పురుగులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. బయట మార్కెట్లో ఒక్కో ఫ్రూట్ కవర్ ధర రూ.2.5 ఉండగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా రూపాయికే రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు:జిల్లాలోని ఉద్యాన పంటల్లో మామి డితే అగ్రస్థానం. ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. ఇందులో ఎక్కువగా గుజ్జు పరిశ్రమకు ఉపయోగించే తోతాపూరి రకం సాగులో ఉంది. టేబుల్ వైరెటీస్గా పిలవబడే బంగినపల్లి, ఇమామ్ పసంద్, మల్గూబ, రసాలు, మల్లిక వంటి రకాలు సుమారు 40 వేల ఎకరాలలో సాగువుతోంది. గతంలో రసాయనిక ఎరువు లు ఎక్కువగా వాడుతున్నారని యూరోపియన్ దేశా ల వారు మామిడి ఎగుమతులను తిరస్కరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించింది. మామిడిలోనూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టింది. తద్వారా విదేశాల నుంచి కూడా ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి. సబ్సిడీతో రూపాయికే కవర్ మొదటి విడతలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 15.3 లక్షల మ్యాంగో కవర్లు మంజూరు చేసింది. ఇదే కవర్ బయట మార్కెట్లో రూ.2.5 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సి డీతో రూపాయికే రైతుకు కవర్ మంజూరు చేస్తోంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా రైతు భరోసా కేంద్రాల్లోనే కవర్లు అందుబాటులోకి తెచ్చింది. వీటిని సక్రమంగా వాడుకుంటే రెండు సార్లు ఉపయోగించవచ్చని యంత్రాంగం సూచిస్తోంది. నాణ్యమైన దిగుబడి మామిడిలో పూత దశ నుంచి పిందె.. కాయ దశ వరకు అనేక క్రిమికీటకాలు ఆశిస్తుంటాయి. మామిడి కాయలకు మచ్చతెగులు సోకుతుంటుంది. దీనిద్వారా పంట దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన రైతులు మామిడి కాయలకు రక్షణగా కవర్లు కట్టి కాపాడుతున్నారు. వీటి వాడకం వల్ల మామిడి కాయలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని, లోపలికి ఎటువంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కవర్ లోపల భాగం నలుపు రంగులో ఉండడం వల్ల మామిడికాయకు మంచి ఉష్ణోగ్రత కూడా లభిస్తుంది. దీంతో నాణ్యత గల మామిడి దిగుబడి అవుతుంది. ఆశించిన స్థాయిలో మామిడి ధర ఉంటుంది. సలహా మండలి తీర్మానంతో.. మామిడిలో టేబుల్ వైరెటీస్లో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సభ్యులు ఫ్రూట్ కవర్లు కావాలని తీర్మానించారు. ఆమేరకు ప్రభుత్వానికి పంపాము. ప్రభుత్వ అనుమతితో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీతో కూడిన కవర్లు అందజేస్తున్నాం. – పి.రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, చిత్తూరు జిల్లా నాణ్యమైన పంట దిగుబడి జిల్లాలో మొదటి విడతగా 15.3 లక్షల ఫ్రూట్ కవర్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు. రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించవచ్చు. ఇటీవల మామిడిలో భారీ ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి మామిడి కవర్లు అందుబాటులోకి తెచ్చాం. – మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిత్తూరు మామిడి రైతుకు బాసట రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుకు నష్టం వాటిల్ల కూడదని అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించింది. మామిడిలో రక్షణ చర్యలు ప్రారంభించింది. కవర్లు వాడడం వల్ల ఎటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించనవసరం లేదు. ఇలాంటి మామిడి కాయలను ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు. – పి.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు జిల్లా సమాచారం ఉద్యాన పంటలు ఎకరాల్లో మామిడి 58,000 అరటి 1,500 దానిమ్మ 700 బొప్పాయి 400 మంచి లాభదాయకం మామిడికి ఫ్రూట్ కవర్ వాడకం ఎంతో లాభదాయకం. గతంలో ఈ విధానంలో సాగుచేసిన రైతులకు మంచి ధర లభించింది. అందుకే ఈ ఏడాది మేము కూడా ఈ విధానాన్ని అనుసరించాం. కవర్ల వాడకం వల్ల ఎలాంటి క్రిమిసంహారక మందులు కూడా అవసరం లేదు. నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు. – ఈశ్వరబాబు, కొత్తపల్లి, గుడిపాల మండలం అవగాహన పెరిగింది అధికారుల సూచనల మేరకు రైతులకు మామిడి కవర్లను సరఫరా చేశాం. క్షేత్రస్థాయిలో ఈ కవర్లను ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించాం. ఒక రూపాయికే కవర్లు పంపిణీ చేశాం. వీటి వల్ల ఎలాంటి కీటకాలు చేరవు. ఎగుమతులకు ఉపయోగపడే విధంగా మామిడి పంట దిగుబడి చేయవచ్చు. – అఖిల, వ్యవసాయకార్యదర్శి, - చేర్లోపల్లి, చిత్తూరు మండలం కవర్‌ను ఎలా ఉపయోగించాలంటే.. ఒక పెద్ద నిమ్మకాయ సైజు వచ్చిన మామిడికాయకు ఈ కవర్‌ను తొడగాలి. ఆపై కాండంకు కవరు మొదటి భాగం వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయకు ఎటువంటి పురుగులు ఆశించవు. ఇలా దిగుబడి అయిన మామిడి పళ్లకు మార్కెట్లో 40 శాతానికిపైగా అధిక ధర లభిస్తుంది. (చదవండి : మామిడి ఎగుమతి షురూ) -
Hyderabad: పరోటాలో ప్లాస్టిక్ కవర్.. ఇదేమని అడిగితే!
సాక్షి, హైదరాబాద్: అల్పాహారం తిందామని హోటల్‌కు వెళ్లి పరోటా ఆర్డర్ ఇస్తే అందులో ప్లాస్టిక్ కవర్ దర్శనమిచ్చింది. ఇదేమని హోటల్ నిర్వాహకులను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... జి.గణేష్ అనే యువకుడు గురువారం ఉదయం 10 గంటలకు వనస్థలిపురం పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ హోటల్లో పరోటా ఆర్డర్ చేశాడు. తింటుండగా మధ్యలో ప్లాస్టిక్ కవర్ వచ్చింది. ఇదేమని అడిగితే హోటల్ వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆన్లైన్లో జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హోటల్ నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. -
హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్
రాబోయే రోజులన్నీ రీ సైక్లింగ్ డేసే. ఉన్నవాటిని పొదుపుగానే కాదు కళాత్మకంగా వాడుకునే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని గతానుభవాలు కళ్లకు కడుతున్నాయి. వాటిలో ఇంటిని శారీ‘కళ’తో ఇంపుగా తీర్చిదిద్దడం ప్రస్తుత ట్రెండ్. అది ఎలా శోభిల్లుతుందో చూద్దాం.. వాల్ డెకర్ ఎంబ్రాయిడరీ చేసే ఫ్రేమ్స్ మార్కెట్లో లభిస్తాయి. వీటికి మీ పాత చీరలను డిజైన్లను బట్టి ఎంచుకొని, వాటిపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను కావల్సిన విధంగా కట్ చేసుకొని, ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ మీ ఇంటి వాల్‌ను ప్రత్యేకంగా మార్చేస్తాయి. ఎవరి అభిరుచిని బట్టి వారు ఫ్యాబ్రిక్ డిజైన్, కలర్ కాంబినేషన్స్ ఎంచుకోవచ్చు. టేబుల్ మ్యాట్ ఉడెన్ లేదా గ్లాస్ టేబుళ్లు బోసిగా ఉంటే వాటిని చీర అంచులతో మెరిపించవచ్చు. సగం శారీని టేబుల్ కవర్గానూ, మిగతా భాగాన్ని ప్లేట్స్ పెట్టుకునే మ్యాట్స్గానూ డిజైన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మాత్రమే కాదు సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్ సోఫా కవర్గానూ జరీ అంచు చీరను అందంగా మలచవచ్చు. ఆ కళను కళ్లారా చూసుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల మన్ననలూ పొందవచ్చు. కాటన్ ఇక్కత్ల కళ టేబుల్ మ్యాట్స్‌లో విశేషంగా ఆకట్టుకుంటున్న డిజైన్స్ ఇక్కత్ కాటన్ శారీతో రూపొందినవి. గ్లాస్ హోల్డర్స్, బౌల్ మ్యాట్స్గానూ తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది చక్కటి ఈ ఫ్యాబ్రిక్. కిటికీ తెరలు పాత జరీ అంచు చీరలు ఉంటే, వాటిని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించనక్కర్లేదు. చిన్నపాటి మార్పులతో విండోస్‌కి కర్టెన్స్‌గా వాడుకోవచ్చు. శారీ కొనుగోలు చేసిన సందర్భం లేక ఎవరైనా కానుకగా ఇచ్చుంటే ఆ జ్ఞాపకాలను గాలితో పాటు మోసుకొచ్చి మీ మనసును తడతాయి తెరలు తెరలుగా. కుషన్ కవర్ మార్కెట్లో లభించే కవర్స్తోనే కుషన్స్‌ని అలంకరించాలని రూలేం లేదు. ఇప్పుడు జరీ చీరల కవర్లు కుషన్స్‌ని మరింత కళగా మార్చేస్తున్నాయి. వీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే ఇంట్లో ఆ కళాత్మకత అంతగా పెరుగుతందనేది నేటి హోమ్ డెకర్ లవర్స్ మాట. -
ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట!
Women Under Taliban Rule: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే అఫ్గన్‌లో మాత్రం తాలిబన్ ప్రభుత్వం.. టీవీ ప్రజెంటర్లకు విచిత్రమైన నిబంధన పెట్టాయి. ముఖం కూడా కప్పేసుకుని(పూర్తిగా శరీరాన్ని కప్పేసుకుని) వార్తలు చదవాలని తాజాగా నిబంధం తీసుకొచ్చింది. అధికారం చేపట్టడం సంగతి ఏమోగానీ.. తాలిబన్ల తలతిక్క నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. హిజాబ్‌లో కాకున్నా.. కనీసం ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించడం, డిస్ప్లే బొమ్మలకు తల భాగం లేకుండా షాపుల్లో ప్రదర్శనలకు ఉంచడం లాంటివి.. ఉదాహరణాలు. ఈ క్రమంలో ఇప్పుడు మరోకటి బయటపడింది. గతంలో తాలిబన్ల పాలనలో అరాచకాలను ఎదుర్కొన్న అక్కడి మహిళా లోకం.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ మధ్యే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు తాలిబన్ అధికారులు. ఇప్పుడు యాంకర్లు, టీవీ ప్రజెంటర్లు, కవరేజ్‌కు వెళ్లే రిపోర్టర్లు.. ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ ఆదేశించింది. మీడియా ఛానెల్స్‌తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్ మంత్రి అఖిఫ్ మహజార్ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు. చదవండి: షూట్ ఎట్ సైట్ ఆదేశాలపై శ్రీలంక ప్రధాని స్పందన -
వ్యక్తి చుట్టు కుప్పగా హాట్ చిప్స్.. ఫన్నీ వీడియో..
కాన్బెర్రా: సోషల్ మీడియాలో చాలా మంది వెరైటీ చాలెంజ్‌లు వేసుకుంటూ ఓవర్‌నైట్ ఫేమస్ అవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రైస్‌బకెట్ చాలెంజ్, ట్రీ చాలెంజ్ వంటి.. అనేక రకాల చాలెంజ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, మైఖేల్ బ్రోఖుయ్స్, మార్టిన్ సోకోలిన్స్కి జంట ఒక కొత్త రకం స్కిట్‌ను చేశారు. ఈ ఫన్నీ జంట.. ఎప్పటి కప్పుడు కొత్త ప్రయోగాలు, కామెడి స్కెచ్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. తాజాగా వీరు.. ఒక విచిత్రమైన వీడియోను తమ మార్టియండ్ అండ్ మైఖేల్ అనే ఇన్‌స్టాలో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం దాన్ని చూసి నెటిజన్లు ఫన్నీగా ఫీలవుతున్నారు. ఈ వీడియోలో.. ఆస్ట్రేలియాలోని సర్ఫర్స్ ప్యారడైజ్ బీచ్‌లో మైఖేల్ తనను తాను.. హట్ చిప్స్‌తో కప్పించుకున్నాడు. దాదాపు 75వేలరూపాయల.. చిప్స్‌లను అతని చుట్టు కుప్పగా పోశారు. ఈ చిప్స్‌లను తినడానికి అక్కడి పక్షులు.. అతని చుట్టు కొన్ని వందల పక్షులు గుమిగూడాయి. పాపం.. అతను మాత్రం కదలకుండా ఒక శిల్పం మాదిరిగా ఉండిపోయాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘బలే.. ఫన్నీగా ఉంది..’..‘పాపం.. చిప్స్‌లో కప్పేసారుగా..’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Marty and Michael (@martyandmichael) -
జామరైతు ఆలోచన అదుర్స్
సాక్షి, యడ్లపాడు: జామతోట సాగు చేసే రైతులకు పండుఈగతో బాధలెన్నో.. అందులోనూ థైవాన్రకం జామతోటలకు ఈ పండుఈగ ఉధృతి అధికంగా ఉంటుంది. మొక్కకు ఉన్న కాయలు బాగా సైజు పెరిగి పండుదశకు చేరుకునే సమయంలో ఈగలు కాయ ల్లోకి జొరబడి పూర్తిగా పాడు చేస్తాయి. దీంతో థైవాన్ రకాన్ని సాగు చేసిన రైతులు తలలు పట్టుకుంటున్నారు. మూడేళ్లగా పండుఈగతో ఇబ్బందులు.. మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన కౌలు రైతు గడ్డం రామసుబ్బారావు 8 ఎకరాల్లో మూడేళ్ల నుంచి థైవాన్లోని రెడ్, వైట్ జామ రకాలను సాగు చేస్తున్నాడు. అయితే కాయ పక్వానికి వచ్చే సమయంలో ఆశిస్తున్న పండుఈగ నివారణకు తొలుత మలాథిన్ ద్రావణాన్ని వినియోగించాడు. అది కేవలం 24 గంటలు మాత్రమే పనిచేయడంతో రోజు మార్చి రోజు వీటిని చల్లడం పెట్టుబడి పెరిగిపోతుందని గ్రహించాడు. లింగాకర్షణ బుట్టల్ని తెచ్చి ఏర్పాటు చేశాడు. వీటి వల్ల 75శాతం పంటను కాపాడు కోగలిగానని తెలిపాడు. ఇవి 40 రోజులు మాత్రమే పని చేయడం, వర్షం కురిస్తే పనిచేయక ఒక్కసారిగా ఈగ ధాటి అధికమవ్వడంతో విసుగెత్తిపోయింది. ఆలోచన బాగుంది ఖర్చు తగ్గింది! ఆ అనుభవంలోంచి ఓ ఆలోచన పుట్టుకొచ్చింది. ప్లాస్టిక్ పాలిథిన్ పలుచటి కవర్లను తీసుకువచ్చి పిందెలను అందులో ఉంచి పిన్నులు కొట్టాడు. అంతే ఇప్పుడు జామకాయలకు పండుఈగ నుంచి పూర్తిగా రక్షణ కల్పించగలిగినట్లు వెల్లడించాడు. ఇలా కవర్లు తొడిగినపుడు కాయపై అధికంగా అంటుకున్న కవర్లలోని కొన్ని కాయలు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా పెద్దగా పెట్టుబడి లేని ఈ నివారణ వల్ల మనశ్శాంతిగా ఉంటున్నట్టు చెబుతున్నారు. -
ఉల్క శకలాలతో తయారుచేసిన ఈ అరుదైన ఫోన్ ఖరీదు ఎంతో తెలుసా..!
సాధారణంగా మనం తీసుకున్న స్మార్ట్ఫోన్లకు రక్షణ కోసమో, లేదా మరింత అందాన్ని స్మార్ట్ఫోన్లకు తీసుకరావడానికి వివిధ రకాల మొబైల్ కవర్స్‌తో మన ఫోన్లను ముస్తాబు చేస్తాం. లగ్జరీ వర్షన్ స్మార్ట్ఫోన్లకు మరింత అందాన్ని తేవడంకోసం కస్టమైజ్డ్ డిజైన్లతో స్మార్ట్ ఫోన్‌కు మరింత లూక్ వస్తోంది. స్మార్ట్ఫోన్లకు కస్టమైజ్డ్ లూక్‌ను తీసుకురావడంలో, అందంగా మొబైల్ కేసులను తయారుచేయడంలో కేవియర్ దిట్ట. కాగా తాజాగా కస్టమైజ్డ్ లూక్‌తో డిజైన్ చేసిన ఐఫోన్ ఫస్ట్ లూక్‌ను కేవియర్ ఆవిష్కరించింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ఉల్క శకలాలు, విలువైన లోహాలు, ఖరీదైన స్టోన్లను ఉంచాలని కంపెనీ యోచిస్తోంది. ఈ లగ్జరీ బ్రాండ్ లైనప్‌కు “పరేడ్ ఆఫ్ ది ప్లానెట్స్”గా పేరు పెట్టారు. అంతరిక్ష నౌకలకు వాడే టైటానియం లోహంతో ఐఫోన్ బ్యాక్‌ను కవర్ చేయనున్నారు. అంతేకాకుండా డబుల్ గోల్డ్ ప్లేటింగ్‌తో తయారుచేయబడిన గోల్డెన్ వెర్షన్ ఫోన్‌ను కూడా లాంచ్ చేశారు. ఐఫోన్ మోడళ్ల ధర $ 14,290 (సుమారు రూ. 10.60 లక్షలు)నుంచి మొదలవుతుంది. టైటానియంతో చేసిన మోడల్ ధర $ 12,750 (సుమారు రూ. 9.46 లక్షలు) గా కేవియర్ నిర్ణయించింది. ఈ మోడళ్లకు సంబంధించిన వీడియోను కూడా కంపెనీ రిలీజ్ చేసింది. చదవండి: ఆవిష్కరణ: ప్లాస్టిక్ అవుతుంది వెనీలా ఫ్లేవర్! -
గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..
కర్నూలు: నకిలీ విత్తన కవర్ల తయారీదారులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారం రోజుల క్రితం ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, జయరాముడు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వెంకటేశ్, గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి నకిలీ కవర్లు అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో వారిని అరెస్ట్ చేయగా.. హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు బయటకు వచ్చింది. ఆ కంపెనీ సీఈఓ బొగుడ సురేష్..నకిలీ కవర్లు తయారు చేస్తున్నట్లు తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల విలువ చేసే యంత్రాలు, ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ విత్తన ముఠాలపై దృష్టి.. శివారు ప్రాంతాల్లోని పాడుబడిన భవనాలు, మూతపడిన మిల్లులు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా మార్చుకుని నకిలీ విత్తన దందా సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నకిలీ విత్తన ముఠాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఫక్కీరప్ప క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నారో పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. స్పిన్నింగ్ మిల్లుల్లో పత్తిని తీసిన తరువాత మిగిలిన గింజలనుయాసిడ్‌తో శుద్ధి చేసి నిగనిగలాడేలా చేసి ఏదో ఒక బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ చేసి రైతులకు అంటగడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీలపై సమాచారం కోసం.. నకిలీలపై సమాచారం కోసం పోలీసు శాఖ వాట్సాప్ నంబర్‌ను కేటాయించింది. నకిలీ వ్యాపారాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 7993822444 వాట్సాప్ నంబర్‌కు సమాచారమివ్వాలని సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి తెలిపారు. పీడీ యాక్టు నమోదుకు కసరత్తు.. ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా అప్రమత్తం చేసినా రైతులు నకిలీ విత్తన విక్రయదారుల బారిన పడుతున్నారు. తక్కువ ధరకు కావాలని కోరుకుంటుండటంతో నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. విత్తనం నాటిన కొన్నాళ్ల తరువాత ఫలితం రాకపోవడంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది వెల్దుర్తికి చెందిన మునిగొండ రత్నాకరరావు పావని సీడ్స్ పేరుతో లైసెన్స్ లేకుండా విత్తన వ్యాపారం చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై ప్రివెంటివ్ డిటెక్షన్(పీడీ చట్టం) యాక్ట్ ప్రయోగించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నూకల మనోహర్‌రావుపై 14 గుట్కా కేసులు నమోదు కావడంతో గత సంవత్సరం పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపారు. ఇదే తరహాలోనే హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్ రోటో ప్యాకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ బొగుడ సురేష్‌పై కూడా పీడీ చట్టం ప్రయోగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతనిపై పలు స్టేషన్లలో కేసులున్నాయి. ఈ నేపథ్యంలో నిర్బంధ చట్టం ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. చదవండి: స్మార్ట్ కిల్లర్స్.. రక్తం చుక్క బయట పడకుండా.. టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ జాబ్.. ఏమైందో తెలియదు -
వేసవి గ్లేసియర్
ఇటలీలో మంచుదిబ్బలు, మండుటెండలు జోడీగా ఉంటాయి. ఇప్పుడక్కడ సమ్మర్. కొద్ది కొద్దిగా హీటెక్కుతోంది. జూలైలో నడివేసవి. భగభగలు మొదలౌతాయి. వేడి 42 కి రీచ్ అవుతుంది. అది గరిష్టం. జనం ఏసీలు కప్పుకుంటారు. మంచు దిబ్బలకే ప్రాబ్లమ్. ఎండ తీవ్రతకు కరుగుతుంటాయి పాపం. అవి ఉంటేనే స్కీయింగ్, కేబుల్ కార్ స్వారీయింగ్. ఆటల కోసం కాకున్నా మంచును మంచుగానే ఉంచడం కోసం ప్రతి వేసవిలో ఈ దిబ్బలపై టార్పాలిన్లు కప్పి మంచు కరిగే వేగాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రసేనా గ్లేసియర్ (మంచుదిబ్బ) పై టార్పాలిన్ వస్త్రాన్ని పరుస్తున్నారు. ఈ ఏడాది మరికొంచెం ఎక్కువ విస్తీర్ణంలో వేస్తున్నారు. అంత భారీ ఏక వస్త్రం దొరకడమూ కష్టమే, పరవడమూ కష్టమే. అందుకే 70 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు ఉండే టార్పాలిన్ షీట్లను కలిపి కుట్టి, ప్రసేనా గ్లేసియర్‌పై పరిచి, పొడిగాలులకు ఎగరకుండా ఇసుక బస్తాల బరువు పెడుతున్నారు. ప్రకృతి నుంచి ప్రకృతిని కాపాడుకోడానికి మనిషి పడుతున్న పాట్లు ఇవి. 1993 నుంచి ఇప్పటివరకు ప్రసేనా గ్లేసియర్‌లో మూడో వంతు భాగం ఎండల వేడికి తగ్గిపోతూ వచ్చింది. -
కవరింగ్ కోడలు
‘కవర్ ఇవ్వు అర్జంట్’ అంటూ హడావుడిగా లోపలికి వచ్చాడు శ్రీనివాస్. ‘దేనికి?’ అడిగాను. ‘ప్రశ్నలు కాదు. కవర్ కావాలి’ అనేసరికి తప్పదన్నట్టు ఓ వెడల్పాటి బట్టల కవర్ వెతికి ఇచ్చాను. దాంట్లో తెగిపోయిన చెప్పులు వేసుకొని వెళ్లిపోయాడు కుట్టించుకురావడానికి. ముందే చెబితే పాత కవర్ తీసిస్తా కదా, మంచి కవర్.. ఎందుకని అడిగితే చెప్పడానికేంటో.. విసుక్కుంటూ వంటకు కావల్సిన కూరగాయలు తరిగే పనిలో పడ్డాను. ఉదయం ‘డ్రెస్ స్టిచ్చింగ్కి ఇచ్చి రావాలి కవర్ ఇవ్వు’ అంటే తీసిచ్చాను. కూరగాయలు తీసుకురావడానికి కవర్ అడిగితే ఇచ్చా. ఇంట్లో చేసిన ఫలహారాలు బంధువులకు ఇచ్చిరావాలి అంటే కవర్ వెతికిచ్చా. ఇప్పుడు పాత చెప్పులకు కూడా మంచి కవర్ కావాలి.. నేనేమైనా కవర్లు అమ్ముకునే షాప్ పెట్టానా? అడిగిన ప్రతిసారీ కవర్, అందులోనూ మంచి కవర్ ఇవ్వడానికి.. తిట్టుకుంటూనే కుకర్ విజిల్ మోగకుండా అవస్థ పడుతుంటే దాన్నో మొట్టికాయ వేశాను! అది చెయ్యికి చుర్రుమని వేడిగా చురక అంటించింది. ‘అమ్మా, రెడీ అయ్యావా! ఆటో తీసుకొస్తా, నాకు టైమ్ అయిపోతోంది’ హడావుడిగా తయారవుతూనే తల్లిని కేకేశాడు శ్రీనివాస్. ‘ఒరేయ్, మొన్న నువ్వు ఊరెళ్లేటప్పుడు పెద్ద కవరొకటి ఇచ్చాను కదా! అదిటివ్వు. బట్టలు సర్దుకోవాలి’.. ఆఫీసుకెళ్లడానికి లంచ్‌బాక్స్ బ్యాగ్‌లో పెట్టుకుంటూ టైమ్ చూస్తున్న నేను‘ పెద్ద కవర్’ అనే మాట అత్తగారి నోట వినగానే ఉలిక్కిపడ్డాను. ప్రశాంతంగా ఉన్న ఇంటిలో వాయుగుండం ఏర్పడబోతున్న సంకేతాలు అందుతున్నాయి. ‘ఆ కవరే ఉందా, ఐరన్ షాప్‌కి దాంట్లోనే బట్టలు పెట్టిచ్చాను. వాడు సాయంత్రానికి గానీ తీసుకురాడు...’ అంతే ఫాస్ట్‌గా చెప్పేశాడు శ్రీనివాస్. ‘ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చే అలవాటు లేదురా నీకు. మొన్న పాపం ఆ సీతమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఇచ్చింది, పే..ద్ద కవర్.. ఎన్ని బట్టలు పట్టేవో..’ అల్మారా తలుపు దఢేల్న మూసుకున్న సౌండ్. ఆవిడకు కోపం వచ్చుంటుందని అర్థమైంది. ‘ఇంకా నయం ఆవిడ బంగారం పెట్టింది. అది నేను దోచేశాను అనలే..’ అన్నాడు శ్రీనివాస్ మాట పడనివాడిలా! ‘అవున్రా.. నేను బంగారమే కావాలని దాచుకొని ఉండుంటే ఈ రోజుకి మీరిలా ఉండేవారా!’ గదిలో నుండే ఆవిడ కంఠం స్థాయి పెంచి అంది. ‘అవును మరి.. మీ నాయిన కిలో బంగారంబెట్టె. మేమంతా కరగదీసుకుని తినేస్తిం..’ పేపర్ చదువుతున్న మామగారు అత్తగారి మాటకు ఎక్కడో కనెక్ట్ అయ్యి వెంటనే కౌంటర్ ఇచ్చేశారు. కవర్‌తో మొదలైన ఘాటు కనకం దాకా ప్రయాణిస్తూ.. అదెటు వెళుతుందో.. ! డబ్బులు తీసుకుని ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది. కవర్ తీసుకొని ఇవ్వకపోతే కూడా కోపం వస్తుందా?! ఏంటో వీళ్ల కవర్ల గోల. వీళ్లను కవర్ చేయలేక నా తల ప్రాణం తోకకొచ్చేట్టుంది. త్వరగా ఈ వ్యవహారాన్ని బ్యాగ్‌లో చుట్టేయాలి అనుకుంటూ... ‘ఈ బ్యాగ్‌లో పెట్టుకెళ్లండి అత్తయ్య. చిన్న బ్యాగ్. మొన్న శిల్పారామంలో తెచ్చా. బాగుంటుంది కూడా!’ కలంకారీ బ్యాగ్ ఆమె ముందు పెడుతూ సర్దిచెబుతున్నట్టు కాస్తంత హోప్‌తో చెప్పా! ‘ఒక్కరోజు వెళ్లి రావడానికి మూటెందుకు?’ అని దీర్ఘం తీసింది. ‘అల్లుడు ఊరెళ్లాడు, రాత్రికి తోడుగా ఉందువుగానీ రా’ అని కూతురు ఫోన్ చేసిందట. అందుకే ఈ అకస్మాత్తు ప్రయాణం. ఈవిడ కవర్కే ఫిక్స్ అయిపోయింది. ఇక మన మాట వినదు.. నాకీ కవర్ల వెతుకులాట తప్పదు. టైమ్ అయిపోతోందని హెచ్చరిస్తున్న గడియారం నా వైపు జాలిగా చూస్తున్నట్టు అనిపించింది. ‘‘నేనే ఫాస్ట్ చూడు’ అని గడియారం వైపు ఓ లుక్కేసి బీరువా వైపు పరుగులాంటి నడకతో వెళ్లాను. బట్టల షాపింగ్ చేసినప్పుడు వాటిని కవర్లలో పెట్టి ఇస్తుంటారు షాప్‌వాళ్లు. (ఇప్పుడు వాటి ఖరీదు కూడా జత చేస్తున్నారు) అవసరం ఉంటుంది కదా అని వాటిని బీరువా అట్టడుగున ఉన్న రాక్‌లో జాగ్రత్త చేసి ఉంచుతుంటాను. ఓ మోస్తరు కవర్లు ఉంటే బెడ్ కింద చేర్చుతుంటాను. ప్రతి ఇంట్లోనూ కవర్ల అవసరం ఏదో టైమ్‌లో ఉంటూనే ఉంటుంది. కానీ, మా ఇంట్లో మాత్రం కవర్ల కోసమే అప్పుడప్పుడు చిన్న చిన్న యుద్ధాలూ జరుగుతుంటాయి. వాటిని కట్టడి చేయడానికి నేను డబ్బులు పోగేసుకున్నట్టు కవర్లు పోగేస్తుంటాను. నిన్నటికి నిన్న.. ‘మున్సిపల్ ఆఫీసులో పని ఉంది ఈ కాగితాలన్నీ పట్టుకెళ్లాలి. ఓ మంచి కవర్ చూసివ్వమ్మా..’ అన్న మామగారికి ఓ మోస్తరు బాగున్న కవర్ తీసిచ్చా. ‘ఈ రెండూ రోలింగ్ చేసిన చీరలు. బ్యాగులో పెడితే ముడతలు పడతాయిగానీ ఓ కవర్ ఇవ్వు’ అన్న అత్తగారికి ఇంకాస్త బాగున్న కవర్ వెతికి మరీ ఇచ్చాను. ‘నానమ్మ కొబ్బరికాయ, అరటిపళ్లు తీసుకురమ్మంది, కవరివ్వమ్మా’ అన్న నా కూతురికి బలంగా ఉన్న కవర్ ఇచ్చాను. ఏం అవసరం ముంచుకొచ్చిందో అడక్కుండానే కనిపించిన కవర్ని నాలుగు మడతలు వేసి జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు నా కుమారరత్నం. ప్లాస్టిక్ కవర్ వాడకం అంత మంచిది కాదని అప్పటికీ కలంకారీ, ఖాదీ క్లాత్‌తో కుట్టిన సంచులు నాలుగైదు తెచ్చిపెట్టాను. ఇంట్లో ఎవరు కవర్ అడిగినా ఆ బ్యాగ్‌లను ముందు పెడుతున్నాను. కానీ, ఒక్కరూ వాటిని ముట్టుకోవడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి వాటిని విజయవంతంగా వెనక్కి నెడుతున్నారు. అలా ఆలోచిస్తూనే.. ర్యాక్ వెతికితే ముడతలు పడిన మరీ పెద్దగా లేని కవర్ ఒకటి దొరికింది. బీరువా ర్యాక్ ఏమీ అక్షయపాత్ర కాదుగా.. తీసిన కొద్దీ కవర్లు రావడానికి. ఈ కవర్ ఇస్తే మళ్లీ గోడకు కొట్టిన బంతిలా ఇక్కడికే రావాలి, ఎలా.. అనుకుంటూ దిక్కులు చూస్తుంటే పైన అరలో పట్టుచీరను లోపల దాచుకొని రాజసం ఒలకబోస్తున్న కవరొకటి కనిపించింది. పిచ్చిమొద్దు.. ఎంత బాగుందో.. చాలా రోజుల నుంచి నా దగ్గరే ఉంది. పోయినసారి పండక్కి అమ్మవాళ్లు బట్టలు పెట్టారు. వాటితోనే ఆ కవర్ వచ్చింది. ఈవిడ పట్టుచీర అడిగినా బాధ ఉండేది కాదేమో.. అనుకుంటూ చీర బయట పెట్టి.. ఆ కవర్నొకసారి కళ్లనిండుగా చూసుకున్నాను! నెలాఖరుకి చివరి నోటు ఖర్చయిపోతే కలిగే బాధలా ఉంది. ఆ చిట్ట చివరి కవర్.. తీసుకెళ్లి అత్తగారి చేతికిచ్చాను. ‘ఏంటీ ఎక్కడికో రెడీ అయినట్టున్నావ్..!’ అప్పటి వరకు టీవీ రిమోట్‌ని నొక్కీ నొక్కీ అలసిపోయి రూమ్‌లోకి వచ్చిన శ్రీనివాస్ ఆశ్చర్యం మార్క్ ఫేస్‌తో ‘సండే ఎక్కడికి’ అన్నట్టు చూశాడు. ‘మీరూ రెడీ అవండి. షాపింగ్‌కి వెళుతున్నాం. డ్రెస్సులు కొనాలి’ అన్నాను చీర కొంగుకు పిన్ను పెట్టుకుంటూ.. ‘ఇప్పుడెందుకు షాపింగ్? నీ బర్త్ డే నా?’ అన్నాడు. నిరసనగా ఓ చూపు చూశాను! ‘పోయిన నెలలో బర్త్ డే రోజున కనీసం గుర్తు తెచ్చుకొని విష్ కూడా చేయనందుకే కదా! నాలుగు రోజులు మాటల్లేనిది? అప్పుడే మర్చిపోయినట్టున్నాడు. కాదన్నట్టు తల అడ్డంగా ఊపాను. ‘పండగ టైమ్ ఇంకో నెల ఉందిగా, అప్పుడు కొందాంలే!’ మంచం మీద వాలిపోతూ అన్నాడు. ‘కాదు, ఇప్పుడే వెళుతున్నాం. రేపట్నుంచి నాకు కుదరదు. మీకు ఓ పది, మీ అమ్మగారికి ఓ ఐదు, నాన్నగారికి నాలుగు, చిన్నుగాడికి ఓ ఐదు,...’ ‘ఏంటీ డ్రెస్సులే..?!’ ఉన్నఫళంగా లేచి కూర్చుంటూ అడిగాడు. ‘మంచి కవర్లు కావాలి. అన్నీ అయిపోయాయి మరి. రేపటి నుంచి మీ అందరికీ కవర్లు నేనెక్కడ సప్లై చేసేది? ఇంట్లో కవర్ల కోసం జరిగే కత్తియుద్ధాలు ఎక్కడ ఆపేది. రంగు, హంగు ఉన్న కవర్లు కావాలంటే కాస్త బ్రాండెడ్ షోరూమ్స్‌కి వెళ్ళాలి. క్రెడిట్ కార్డ్ తీసుకొని త్వరగా రండి..’ అంటూ బ్యాగ్ భుజానికేసుకొని బయటకు నడిచాను. ఈయన వెనకాల వస్తారా..?! షాపింగ్‌కి. లేకపోతే.. ‘కవర్ అడగనులే.. కలంకారీ బ్యాగ్ చాలు’ అని కవరింగ్ ఇవ్వడానికి వస్తారా? వస్తే కొత్త కవర్లతో పాటు కొత్త బట్టలూ వస్తాయి. రాకపోతే కలంకారీ, ఖాదీ బ్యాగులు కళకళల్లాడుతూ వీళ్లతో పాటు తిరుగుతాయి అనుకుంటే భలే ఖుషీగా అనిపించింది. ‘మంచి కవర్లు కావాలి. అన్నీ అయిపోయాయి మరి. రేపటి నుంచి మీ అందరికీ కవర్లు నెనెక్కడ సప్లై చేసేది? ఇంట్లో కవర్ల కోసం జరిగే కత్తియుద్దాలు ఎక్కడ ఆపేది. రంగు, హంగు ఉన్న కవర్లు కావాలంటే కాస్త బ్రాండెడ్ షోరూమ్స్‌కి వెళ్ళాలి. క్రెడిట్ కార్డ్ తీసుకొని త్వరగా రండి..’ అంటూ బ్యాగ్ భుజానికేసుకొని బయటకు నడిచాను. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
ఇండియన్ రైల్వే భారీ బీమా సౌకర్యం!
న్యూఢిల్లీః ప్రయాణీకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారత రైల్వే ప్రవేశ పెట్టిన కొత్త పథకం అందర్నీ ఆకట్టుకుంటోంది. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేసేవారు సైతం కేవలం పది రూపాయలు చెల్లించి 10 లక్షలు బీమా పొందే అవకాశానికి రైల్వే కొత్త సంస్కరల్లో చోటు కల్పించనుంది. పది రూపాయలు చెల్లించి పది లక్షలు ఇన్సూరెన్స్ పొందే బంపర్ ఆఫర్ ను ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు కల్పించనుంది. వచ్చే రైల్వే బడ్జెట్ లో ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశ పెట్టేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సెప్టెంబర్ నుంచి ముందుగా ఈ-టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం దేశంలోని అన్ని రిజర్వేషన్ కౌంటర్లలోనూ ఈ బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు నెలవారీ సీజన్ టికెట్లు తీసుకునేవారికి కూడ సౌకర్యం వర్తించేట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయాణంలో జరిగే ప్రమాదాలతో వైకల్యం పొందడం, తీవ్ర గాయాలవ్వడం జరిగితే.. సదరు బాధితులకు కొత్త బీమా సౌకర్యంలో భాగంగా 7.5 లక్షల రూపాయలను రైల్వే శాఖ అందిస్తుంది. తాజా ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు ఇప్పటికే రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం శాఖ (ఐఆర్సీటీసీ) 17 వరకూ బీమా కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వాటిలో శుక్రవారం నాటికి మూడు కంపెనీలను ఖరారు చేసే యత్నంలో ఉన్నట్లు సమాచారం. ప్రయాణ సమయం, దూరాన్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేట్లు చర్యలు తీసుకుంటోంది. పది రూపాయల ప్రీమియంతో 10 లక్షల వరకూ ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది. అదే బీమా సౌకర్యాన్ని అదనంగా పొందాలనుకున్న ప్రయాణీకులు ప్రీమియంను అదనంగా చెల్లించి, 50 లక్షల రూపాయల వరకూ పొందేట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ రైల్వే అధికారి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. -
అతిథిని చూసి పరుగులు తీశారు!
సిడ్నీ: అనుకోని అతిథి ఇంటికి వస్తే ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలవుతాం. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అంటూ ఆనందంగా ఆహ్వానిస్తాం. పైగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి కనిపించని అరుదైన అతిథి వస్తే... ఇక ఆనందానికి అవధులే ఉండవు. కానీ ఓ ఆస్ట్రేలియన్ దంపతులు వారింటికి అరుదుగా వచ్చిన అతిథిని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగులు తీశారట. చుట్టుపక్కల వారి సహాయంతో పట్టుకొని బంధించేందుకు ప్రయత్నించారట. ఇంతకూ ఆ భయంకర అతిథి వివరాలేమిటో ఓసారి చూద్దామా...? ఆస్ట్రేలియాలో నార్త్ క్వీన్స్ ల్యాండ్ స్టేట్ లోని వాంగలింగ్ బీచ్ ప్రాంతంలో నివసించే పీటర్, సూ లీచ్ దంపతులు తమ ఇంటికి వచ్చిన జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ పక్షిని చూసి పరుగులు తీశారట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులుగా జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ జాతి పక్షులను చెప్తారు. అటువంటి పక్షి అనుకోకుండా ఆ దంపతుల ఇంటికి అరుచుకుంటూ రావడంతో ముందు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అదో ప్రమాదకర పక్షి అని గుర్తించి పరుగులు తీశారు. రెండు మీటర్ల పొడవు.. సుమారు 70 కిలోల బరువుండే ఆ పక్షి.. నల్లని రెక్కలు, పొడవైన ముక్కు, మెడవద్ద నీలిరంగు, తలపై చిన్నపాటి పించంతో చూసేందుకు మాత్రం పెద్ద సైజు నెమలిని పోలి ఉంటుంది. ముందుగా పక్షిని చూసిన తన భర్త... ఇంటికి ఎవరొచ్చారో చూడు.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడని, తీరా అది ప్రమాదకర కాసోవరీస్ పక్షి అని గుర్తించి అతడు డైనింగ్ టేబుల్ వెనక దాక్కున్నాడని, తాను మాత్రం బయటకు పరుగు తీశానని సూలీచ్ తెలిపింది. విషయం తెలసిన పొరుగువారు ఆ పక్షి అత్యంత ప్రమాదకరమైన పక్షి అని, దగ్గరలోని రైన్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటుందని, ఇంతకుముందెప్పుడూ ఎవరింటికీ రాలేదని తెలిపారని సూలీచ్ అంటోంది. ఆ ప్రమాదకరమైన, అరుదైన కాసోవరీ పక్షి జాతి.. ఆస్ట్రేలియా ఈశాన్య క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని రైన్ ఫారెస్టుల్లోనూ, కొన్ని ఐస్ ల్యాండ్ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అత్యంత బరువైన, పొడవైన ఆపక్షిని ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షిగా గుర్తించారు. అది దాని పొడవైన కాళ్ళతో మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తుంటుంది. 2003 లెక్కల ప్రకారం క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఈ కాసోవరీ పక్షి దాడికి ఎనిమిదిమంది గురైనట్లు, 1926-1999 మధ్య ప్రాంతంలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ జాతి పక్షులు సుమారు 2 వేల వరకూ ఉండొచ్చని పదహారేళ్ళ క్రితంనాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
పొదుపులో అమెరికన్లు వెనుకబడ్డారట!
ఆదాయంలో కొంతభాగం పొదుపు చేయాలి అనేది ఆర్థిక సూత్రం. అయితే ఈ విషయాన్ని అమెరికన్లు అస్సలు పాటించలేకపోతున్నారట. 63 శాతంమంది అమెరికన్లు తమ ఆదాయం.. నిత్యావసర ఖర్చులకే సరిపోవడం లేదంటున్నారట. వారు కనీసం అత్యవసర పరిస్థితుల్లో వాడుకొనేందుకు 5 వందల డాలర్లను కూడ వెనకేసుకోలేకపోతున్నారని తాజా సర్వేలు చెప్తున్నాయి. సంపన్నదేశంగా చెప్పుకునే అమెరికాలో ఇప్పుడు 37శాతం మంది ప్రజలు మాత్రమే వారి ఆదాయంలో అత్యవసరాలకోసం ఐదు వందల డాలర్లనుంచీ వెయ్యి డాలర్ల వరకూ పొదుపు చేయగల్గుతున్నారని, మిగిలిన అరవై మూడు శాతం మంది క్రెడిట్ కార్డుల చెల్లింపులు, అప్పులు, అనుకోని ఖర్చులతో ఏమాత్రం వెనకేసుకోలేకపోతున్నారని సర్వే చెప్తోంది. అమెరికన్లు పొదుపర్లా, కాదా అన్నది ఇక్క్డడ విషయం కాకపోయినా... స్థానిక పేవ్ ఛారిటబుల్ లెక్కలు మాత్రం మూడు అమెరికన్ కుటుంబాల్లో ఒకరు కనీస పొదుపు కూడ చేయలేకపోతున్నారని చెప్తున్నాయి. అలాగే మాగ్నిఫై మనీ చేసిన సర్వేల్లో కూడ 56.3 శాతం మంది అమెరికన్ల సేవింగ్స్ ఖాతాల్లో కనీస మాత్రమైనా డబ్బు నిల్వ ఉండటం లేదని తేలింది. ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం మరింత దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తోందని సర్వేలు తెలుపుతున్నాయి. నిజానికి మధ్య తరగతి కుటుంబాల్లో అత్యవసర ఖర్చులకు కనీసం పదివేల డాలర్లు అవసరమౌతాయని, కానీ అదికూడ వారు పొదుపు చేయలేకపోతున్నారని పేవ్ ఛారిటబుల్ ట్రస్ట్ అంటోంది. 25 వేల డాలర్లకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి పొదుపు మరీ కష్టంగా ఉందని పేవ్ సర్వే ద్వారా తెలుస్తోంది. అయితే ఏభై నుంచి ఎనభై అయిదు వేల డాలర్లకు పైబడి ఆదాయం ఉన్నకుటుంబాల్లో మాత్రం 2,500 డాలర్లు వరకూ పొదుపు చేయగల్గుతున్నట్లు చెప్పారని, ఎనభై అయిదు వేలకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రమే పదివేల డాలర్ల వరకూ పొదుపు చేయగల్గుతున్నట్లు చెప్పారని పేవ్ ఛారిటబుల్ అధ్యయనకారులు అంటున్నారు. ఏది ఏమైనా మధ్యతరగతి వారికి మాత్రం అత్యవసర పరిస్థితులు గడ్డుగానే మారుతున్నాయని లెక్కలు చెప్తుండగా... ఆయా కుటుంబాల్లో ఖర్చులు ప్రణాళికా బద్ధంగా లేకపోవడం వల్ల కూడ సంవత్సరమంతా ఇబ్బందులకు గురౌతున్నారని సర్వేలు తేల్చాయి. ముఖ్యంగా వీరి అనుకోని ఖర్చుల్లో కారు రిపేర్లు వంటివి ఉంటున్నాయని బ్యాంక్ రేట్ డాట్ కామ్ లెక్కల్లో తేలింది. 23 శాతం మంది ఇంటి ఖర్చులకు కాక, అదనంగా 500 నుంచి 1000 డాలర్ల వరకూ రెస్టారెంట్లలో భోజనాలకు, కాఫీలకు ఖర్చుపెడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. వీరి బడ్జెట్లో మాత్రం స్థితి స్థాపకత కాస్త కనిపిస్తోందని సర్వే వెల్లడిస్తోంది. అయితే అనుకోని పరిస్థితుల్లో వచ్చిన ఖర్చులకు క్రెడిట్ కార్డుల వంటివి వాడటం ఇతర వ్యాపరస్తులకు ప్రోత్సాహకరంగా, లాభదాయకంగా మారుతోందని సీనియర్ ఇన్వెస్టింగ్ అనలిస్ట్ షైనా స్టినేర్ చెప్తోంది. చాలామంది ఏ ఖర్చు వచ్చినా వెంటనే క్రెడిట్ కార్డును వాడేస్తుంటారని, అటువంటి ఏదో ఒక ఖర్చును తగ్గించుకోగల్గితే పొదుపు చేయడం అంత కష్టమైన పనేమీ కాదని ఆమె ప్రజలకు సూచిస్తోంది.