Women Under Taliban Rule: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే అఫ్గన్‌లో మాత్రం తాలిబన్ ప్రభుత్వం.. టీవీ ప్రజెంటర్లకు విచిత్రమైన నిబంధన పెట్టాయి. ముఖం కూడా కప్పేసుకుని(పూర్తిగా శరీరాన్ని కప్పేసుకుని) వార్తలు చదవాలని తాజాగా నిబంధం తీసుకొచ్చింది.
అధికారం చేపట్టడం సంగతి ఏమోగానీ.. తాలిబన్ల తలతిక్క నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. హిజాబ్‌లో కాకున్నా.. కనీసం ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించడం, డిస్‌ప్లే బొమ్మలకు తల భాగం లేకుండా షాపుల్లో ప్రదర్శనలకు ఉంచడం లాంటివి.. ఉదాహరణాలు. ఈ క్రమంలో ఇప్పుడు మరోకటి బయటపడింది.
గతంలో తాలిబన్‌ల పాలనలో అరాచకాలను ఎదుర్కొన్న అక్కడి మహిళా లోకం.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ మధ్యే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు తాలిబన్ అధికారులు. ఇప్పుడు యాంకర్లు, టీవీ ప్రజెంటర్లు, కవరేజ్‌కు వెళ్లే రిపోర్టర్లు.. ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ ఆదేశించింది.
మీడియా ఛానెల్స్‌తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్ మంత్రి అఖిఫ్ మహజార్ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment