ఇండియన్ రైల్వే భారీ బీమా సౌకర్యం!
న్యూఢిల్లీః ప్రయాణీకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారత రైల్వే ప్రవేశ పెట్టిన కొత్త పథకం అందర్నీ ఆకట్టుకుంటోంది. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేసేవారు సైతం కేవలం పది రూపాయలు చెల్లించి 10 లక్షలు బీమా పొందే అవకాశానికి రైల్వే కొత్త సంస్కరల్లో చోటు కల్పించనుంది.
పది రూపాయలు చెల్లించి పది లక్షలు ఇన్సూరెన్స్ పొందే బంపర్ ఆఫర్ ను ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు కల్పించనుంది. వచ్చే రైల్వే బడ్జెట్ లో ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశ పెట్టేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సెప్టెంబర్ నుంచి ముందుగా ఈ-టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం దేశంలోని అన్ని రిజర్వేషన్ కౌంటర్లలోనూ ఈ బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు నెలవారీ సీజన్ టికెట్లు తీసుకునేవారికి కూడ సౌకర్యం వర్తించేట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయాణంలో జరిగే ప్రమాదాలతో వైకల్యం పొందడం, తీవ్ర గాయాలవ్వడం జరిగితే.. సదరు బాధితులకు కొత్త బీమా సౌకర్యంలో భాగంగా 7.5 లక్షల రూపాయలను రైల్వే శాఖ అందిస్తుంది.
తాజా ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు ఇప్పటికే రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం శాఖ (ఐఆర్సీటీసీ) 17 వరకూ బీమా కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వాటిలో శుక్రవారం నాటికి మూడు కంపెనీలను ఖరారు చేసే యత్నంలో ఉన్నట్లు సమాచారం. ప్రయాణ సమయం, దూరాన్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేట్లు చర్యలు తీసుకుంటోంది. పది రూపాయల ప్రీమియంతో 10 లక్షల వరకూ ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది. అదే బీమా సౌకర్యాన్ని అదనంగా పొందాలనుకున్న ప్రయాణీకులు ప్రీమియంను అదనంగా చెల్లించి, 50 లక్షల రూపాయల వరకూ పొందేట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ రైల్వే అధికారి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.