రాబోయే రోజులన్నీ రీ సైక్లింగ్ డేసే. ఉన్నవాటిని పొదుపుగానే కాదు కళాత్మకంగా వాడుకునే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని గతానుభవాలు కళ్లకు కడుతున్నాయి. వాటిలో ఇంటిని శారీ‘కళ’తో ఇంపుగా తీర్చిదిద్దడం ప్రస్తుత ట్రెండ్. అది ఎలా శోభిల్లుతుందో చూద్దాం..
వాల్ డెకర్
ఎంబ్రాయిడరీ చేసే ఫ్రేమ్స్ మార్కెట్‌లో లభిస్తాయి. వీటికి మీ పాత చీరలను డిజైన్లను బట్టి ఎంచుకొని, వాటిపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను కావల్సిన విధంగా కట్ చేసుకొని, ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ మీ ఇంటి వాల్‌ను ప్రత్యేకంగా మార్చేస్తాయి. ఎవరి అభిరుచిని బట్టి వారు ఫ్యాబ్రిక్ డిజైన్, కలర్ కాంబినేషన్స్ ఎంచుకోవచ్చు.
టేబుల్ మ్యాట్
ఉడెన్ లేదా గ్లాస్ టేబుళ్లు బోసిగా ఉంటే వాటిని చీర అంచులతో మెరిపించవచ్చు. సగం శారీని టేబుల్ కవర్‌గానూ, మిగతా భాగాన్ని ప్లేట్స్ పెట్టుకునే మ్యాట్స్‌గానూ డిజైన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మాత్రమే కాదు సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్ సోఫా కవర్‌గానూ జరీ అంచు చీరను అందంగా మలచవచ్చు. ఆ కళను కళ్లారా చూసుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల మన్ననలూ పొందవచ్చు.
కాటన్ ఇక్కత్‌ల కళ
టేబుల్ మ్యాట్స్‌లో విశేషంగా ఆకట్టుకుంటున్న డిజైన్స్ ఇక్కత్ కాటన్ శారీతో రూపొందినవి. గ్లాస్ హోల్డర్స్, బౌల్ మ్యాట్స్‌గానూ తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది చక్కటి ఈ ఫ్యాబ్రిక్.
కిటికీ తెరలు
పాత జరీ అంచు చీరలు ఉంటే, వాటిని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించనక్కర్లేదు. చిన్నపాటి మార్పులతో విండోస్‌కి కర్టెన్స్‌గా వాడుకోవచ్చు. శారీ కొనుగోలు చేసిన సందర్భం లేక ఎవరైనా కానుకగా ఇచ్చుంటే ఆ జ్ఞాపకాలను గాలితో పాటు మోసుకొచ్చి మీ మనసును తడతాయి తెరలు తెరలుగా.
కుషన్ కవర్
మార్కెట్లో లభించే కవర్స్‌తోనే కుషన్స్‌ని అలంకరించాలని రూలేం లేదు. ఇప్పుడు జరీ చీరల కవర్లు కుషన్స్‌ని మరింత కళగా మార్చేస్తున్నాయి. వీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే ఇంట్లో ఆ కళాత్మకత అంతగా పెరుగుతందనేది నేటి హోమ్ డెకర్ లవర్స్ మాట.
Comments
Please login to add a commentAdd a comment