‘మొహమాటం వద్దు.. ఏదైనా నన్ను అడిగేయ్‌!’ | Copilot Vision Game Changer For Generative AI Full Details Here | Sakshi

Copilot Vision VIDEO: వారెవ్వా! ఏది అడిగినా.. ఈ జనరేటివ్‌ ఏఐ టూల్‌ ఏం చేస్తుందో చూసేయండి!

Published Sat, Dec 7 2024 10:57 AM | Last Updated on Sat, Dec 7 2024 1:15 PM

Copilot Vision Game Changer For Generative AI Full Details Here

కృత్రిమ మేధస్సు.. మనిషి జీవితంలో అంతర్లీనంగా మారిపోవడానికి ఇంకా ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే అనేక రంగాల్లో ఇది మనిషి అవసరాలను తీరుస్తోంది. అతిత్వరలో ఆపద్భాందువు అవతారమెత్తబోతోంది. మైక్రోసాఫ్ట్‌వారి కొత్త ఫీచర్‌ కోపైలట్‌ విజన్‌ అందుకు ఒక ఉదాహరణ మాత్రమే!.

కోపైలట్‌.. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ రూపొందించిన జనరేటెడ్‌ ఏఐ చాట్‌బోట్‌. చాట్‌బోట్‌ రూపంలో యూజర్లకు సమాచారాన్ని చేరవేస్తుండడం తెలిసిందే. ఏఐ సాయంతో పనిభారాన్ని తగ్గించడంతో పాటు ఆ పనిని వేగంగా పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతోంది. అంతేకాదు.. తక్కువ టైంలో నాణ్యమైన కంటెంట్‌ను అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే దీనికి నెక్ట్స్‌ లెవల్‌గా కోపైలట్‌ విజన్‌ రాబోతోంది.

👉ఎడ్జ్‌ బ్రౌజర్‌లో ఓ మూలన  నీట్‌గా ‘కోపైలట్‌ విజన్‌’ ఏఐ ఫీచర్‌ను కనిపించనుంది. ఈ టూల్‌ సాయంతో ఇంటర్నెట్‌లో నేరుగా ఇంటరాక్ట్‌ అయ్యి.. ఎలాంటి సాయమైనా కోరవచ్చు. ఉదాహరణకు.. మీరు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఎక్కడ బస చేయాలనే దానిపై మీకు కచ్చితమైన సమాచారం లేదు. ఆ గందరగోళంలో మీరు మీ డివైజ్‌లో వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌ కోపైలట్‌ విజన్‌ను సంప్రదించొచ్చు.

👉మీకు ఎంత బడ్జెట్‌లో రూం కావాలి.. ఎలాంటి సౌకర్యాలు ఉండాలి.. ఇలాంటి వివరాలను చెబితే చాలూ!. కో పైలట్‌ విజన్‌ తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం జల్లెడ పడుతుంది. దానిని మీకు చెబుతూ పోతుంది. తద్వారా మీకు కావాల్సిన పక్కా సమాచారం చేరవేస్తుందన్నమాట.  ఇది ఇక్కడితోనే ఆగిపోదు..

👉రియల్‌ టైంలో వెబ్‌ కంటెంట్‌తో ఇంటెరాక్ట్‌ అయ్యేందుకు కూడా ఈ టూల్‌ ఉపయోగపడుతుంది. మీరు అడిగే ప్రశ్న రాతలు, ఫొటోలు, వీడియోల రూపకంలో కూడా ఉండొచ్చు.  ఉదాహరణకు.. మీ స్మార్ట్‌ టీవీలోగానీ లేదంటే ల్యాప్‌ట్యాప్‌గానీ ఏదైనా సినిమా చూస్తుంటే అందులో నటీనటుల వివరాలను కూడా కోపైలట్‌ విజన్‌ను అడగొచ్చు. అప్పుడు అది తన దగ్గర ఉన్న సమాచారం సమీక్షించుకుని.. పూర్తి వివరాలు మీకు తెలియజేస్తుంది.

👉అలాగే సందర్భోచితంగా సాయం కూడా అందిస్తుంది. అంటే షాపింగ్‌ చేసే టైంలో మీకు కావాల్సిన వివరాల ఆధారంగా ప్రొడక్టును మీకు చెబుతూ చూపిస్తుంది. అంతెందుకు.. సెలవు రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో చెబితే.. ఆరోజు మీ వెసులుబాటును బట్టి ఎలా ఎక్కడ, గడపొచ్చో కూడా మీకు సలహా ఇస్తుందది. అంటే.. బ్రౌజింగ్‌ చేసే టైంలో ఇది మరో జత కండ్ల మాదిరి పని చేస్తుందన్నమాట.

👉ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌లో ఉంచి ఉపయోగించుకోవాలి. ప్రైవసీ విషయంలో గ్యారంటీ ఇస్తోంది మైక్రోసాఫ్ట్‌. ఒకసారి సెషన్ ముగిశాక.. మనం అడిగిన సమాచారం.. దానికి కోపైలట్‌ ఇచ్చిన వివరాలు ఆటోమేటిక్‌గా డిలీట్‌ అయిపోతాయి. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను అమెరికాలో కోపైలట్‌ ల్యాబ్స్‌ ప్రోగ్రాం కింద కోపైలట్‌ సబ్‌స్క్రయిబర్స్‌కు అందజేస్తోంది. ఎడ్జ్‌బ్రౌజర్‌లో ఉన్న ఈ టూల్‌ను.. త్వరలో మిగతా విస్తరించే ఆలోచనలో మైక్రోసాఫ్ట్‌ ఉంది. అప్పుడు యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ ద్వారా లోటుపాట్లను సరిదిద్దుకుని మరింత మెరుగైన సేవలు అందిస్తుందట. ఎందెందు వెతికినా.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ జాడ కనిపిస్తున్న కాలంలో మైక్రోసాఫ్ట్‌ అడుగు గేమ్‌ఛేంజర్‌ అనే చెప్పొచ్చు. ఈ ప్రయత్నంతో.. మిగతా కంపెనీలు పోటీగా కోపైలట్‌ విజన్‌ తరహా జనరేటెడ్‌ ఏఐ సేవలను అందించే అవకాశం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement