![Emergency windows in trains safety features designed to provide passengers with an alternative exit route](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/12/12/train0002.jpg.webp?itok=SJbMoW1p)
‘రెడ్ విండో’ గురించి తెలుసా..?
రైలు వేగంగా వెళ్తోంది.. బోగీలోని ప్రయాణికుల్లో కొందరు ఫోన్ చూస్తున్నారు.. ఇంకొందరు బంధువులతో ముచ్చటిస్తున్నారు.. చిన్న పిల్లలు ఆడుతున్నారు. పెద్దవారు తమ ఆరోగ్య విషయాలను చర్చించుకుంటున్నారు..అంతలోనే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో అగ్ని జ్వాలలుగా మారాయి. పెద్దగా శబ్దం చేస్తూ ‘మంటలు.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ అంటూ ప్రయాణికులు అరుస్తున్నారు. చెయిన్ లాగినా ట్రెయిన్ ఆగాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో వారికి ‘రెడ్ విండో’ గుర్తొచ్చింది. బోగీలోని యువకుల సాయంతో అందరూ అందులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు రైల్వే బోగీల్లో ‘రెడ్ విండో’ అవసరం ఏమిటి.. దాన్ని గుర్తించడం ఎలా.. అనే విషయాలు తెలుసుకుందాం.
మనుషులు దూరేందుకు వీలుగా..
మీరు రైలు ప్రయాణం చేసినప్పుడు దాదాపు అన్ని కోచ్‌ల్లో ప్రత్యేకమైన ఎరుపు రంగు విండోను గమనించే ఉంటారు. ఈ ఎరుపు రంగు విండో ప్రయాణీకుల భద్రతలో, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. రైలు కోచ్‌ల్లో ఈ విండోను ప్రత్యేకంగా ఎమర్జెన్సీ ఎగ్జిట్‌గా రూపొందించారు. రైల్‌లో ఇతర కిటీకీల మాదిరిగా దీనికి ఇనుప కడ్డీలుండవు. ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా మనుషులు దూరేందుకు వీలుగా ఉంటుంది. అత్యవసర సమయంలో వెంటనే తెరిచేలా దీన్ని డిజైన్ చేశారు.
బోగీ మధ్యలో ఉన్నవారికి అనువుగా..
అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు, రైలు పట్టాలు తప్పడం వంటి మరేదైనా ఎమర్జెన్సీ సమయాల్లో ప్రయాణికులు తమను తాము రక్షించుకోవడానికి ఈ రెడ్ విండోను వినియోగిస్తారు. బోగీ మెయిన్ డోర్‌కు దగ్గరగా ఉన్నవారు ఎలాగైనా ఆ డోర్‌లో నుంచి దూకి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి మధ్యలో ఉన్నవారికి ఆ అవకాశం ఉండదు. కాబట్టి రైల్వే విభాగం బోగీ మధ్యలో ఎమర్జెన్సీ విండోను అందుబాటులో ఉంచింది.
ఇదీ చదవండి: షేర్లు.. ఉరితాళ్లు కాకూడదంటే..!
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు తెరుచుకోని సందర్భాల్లో రెస్క్యూ టీమ్ ఈ ఎమర్జెన్సీ విండోస్ నుంచి బోగీలోకి ప్రవేశించి ప్రయాణికులను కాపాడేందుకు వీలుంటుంది. రైల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యలో ఉన్న వారు డోర్ నుంచి దిగిపోయి తమ వస్తువులను ఈ విండో ద్వారా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment