అతిథిని చూసి పరుగులు తీశారు!
సిడ్నీ: అనుకోని అతిథి ఇంటికి వస్తే ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలవుతాం. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అంటూ ఆనందంగా ఆహ్వానిస్తాం. పైగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి కనిపించని అరుదైన అతిథి వస్తే... ఇక ఆనందానికి అవధులే ఉండవు. కానీ ఓ ఆస్ట్రేలియన్ దంపతులు వారింటికి అరుదుగా వచ్చిన అతిథిని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగులు తీశారట. చుట్టుపక్కల వారి సహాయంతో పట్టుకొని బంధించేందుకు ప్రయత్నించారట. ఇంతకూ ఆ భయంకర అతిథి వివరాలేమిటో ఓసారి చూద్దామా...?
ఆస్ట్రేలియాలో నార్త్ క్వీన్స్ ల్యాండ్ స్టేట్ లోని వాంగలింగ్ బీచ్ ప్రాంతంలో నివసించే పీటర్, సూ లీచ్ దంపతులు తమ ఇంటికి వచ్చిన జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ పక్షిని చూసి పరుగులు తీశారట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులుగా జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ జాతి పక్షులను చెప్తారు. అటువంటి పక్షి అనుకోకుండా ఆ దంపతుల ఇంటికి అరుచుకుంటూ రావడంతో ముందు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అదో ప్రమాదకర పక్షి అని గుర్తించి పరుగులు తీశారు. రెండు మీటర్ల పొడవు.. సుమారు 70 కిలోల బరువుండే ఆ పక్షి.. నల్లని రెక్కలు, పొడవైన ముక్కు, మెడవద్ద నీలిరంగు, తలపై చిన్నపాటి పించంతో చూసేందుకు మాత్రం పెద్ద సైజు నెమలిని పోలి ఉంటుంది. ముందుగా పక్షిని చూసిన తన భర్త... ఇంటికి ఎవరొచ్చారో చూడు.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడని, తీరా అది ప్రమాదకర కాసోవరీస్ పక్షి అని గుర్తించి అతడు డైనింగ్ టేబుల్ వెనక దాక్కున్నాడని, తాను మాత్రం బయటకు పరుగు తీశానని సూలీచ్ తెలిపింది. విషయం తెలసిన పొరుగువారు ఆ పక్షి అత్యంత ప్రమాదకరమైన పక్షి అని, దగ్గరలోని రైన్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటుందని, ఇంతకుముందెప్పుడూ ఎవరింటికీ రాలేదని తెలిపారని సూలీచ్ అంటోంది.
ఆ ప్రమాదకరమైన, అరుదైన కాసోవరీ పక్షి జాతి.. ఆస్ట్రేలియా ఈశాన్య క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని రైన్ ఫారెస్టుల్లోనూ, కొన్ని ఐస్ ల్యాండ్ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అత్యంత బరువైన, పొడవైన ఆపక్షిని ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షిగా గుర్తించారు. అది దాని పొడవైన కాళ్ళతో మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తుంటుంది. 2003 లెక్కల ప్రకారం క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఈ కాసోవరీ పక్షి దాడికి ఎనిమిదిమంది గురైనట్లు, 1926-1999 మధ్య ప్రాంతంలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ జాతి పక్షులు సుమారు 2 వేల వరకూ ఉండొచ్చని పదహారేళ్ళ క్రితంనాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది.