జిల్లాలోని ఖరీఫ్ ఉద్యాన పంటల్లో మామిడిదే అగ్రస్థానం. పంట దిగుబడి నాణ్యంగా ఉంటేనే రైతుకు ఆదాయం. ఇందులో భాగంగానే మామిడి పండ్లు రక్షణ కోసం ఫ్రూట్ కవర్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కీటకాలు, పురుగులు ఆశించకుండా జాగ్రత్తలు తీసుకుంది. బయట మార్కెట్‌లో ఒక్కో ఫ్రూట్ కవర్ ధర రూ.2.5 ఉండగా రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ ద్వారా రూపాయికే రైతులకు అందుబాటులోకి తెచ్చింది. దీనిపై జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సాక్షి, చిత్తూరు:జిల్లాలోని ఉద్యాన పంటల్లో మామి డితే అగ్రస్థానం. ఈ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 58 వేల హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. ఇందులో ఎక్కువగా గుజ్జు పరిశ్రమకు ఉపయోగించే తోతాపూరి రకం సాగులో ఉంది. టేబుల్ వైరెటీస్‌గా పిలవబడే బంగినపల్లి, ఇమామ్ పసంద్, మల్గూబ, రసాలు, మల్లిక వంటి రకాలు సుమారు 40 వేల ఎకరాలలో సాగువుతోంది. గతంలో రసాయనిక ఎరువు లు ఎక్కువగా వాడుతున్నారని యూరోపియన్ దేశా ల వారు మామిడి ఎగుమతులను తిరస్కరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించింది. మామిడిలోనూ అధిక దిగుబడులు సాధించేలా చర్యలు చేపట్టింది. తద్వారా విదేశాల నుంచి కూడా ముందస్తు ఆర్డర్లు వస్తున్నాయి.
సబ్సిడీతో రూపాయికే కవర్
మొదటి విడతలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 15.3 లక్షల మ్యాంగో కవర్లు మంజూరు చేసింది. ఇదే కవర్ బయట మార్కెట్‌లో రూ.2.5 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సి డీతో రూపాయికే రైతుకు కవర్ మంజూరు చేస్తోంది. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా రైతు భరోసా కేంద్రాల్లోనే కవర్లు అందుబాటులోకి తెచ్చింది. వీటిని సక్రమంగా వాడుకుంటే రెండు సార్లు ఉపయోగించవచ్చని యంత్రాంగం సూచిస్తోంది.
నాణ్యమైన దిగుబడి
మామిడిలో పూత దశ నుంచి పిందె.. కాయ దశ వరకు అనేక క్రిమికీటకాలు ఆశిస్తుంటాయి. మామిడి కాయలకు మచ్చతెగులు సోకుతుంటుంది. దీనిద్వారా పంట దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన రైతులు మామిడి కాయలకు రక్షణగా కవర్లు కట్టి కాపాడుతున్నారు. వీటి వాడకం వల్ల మామిడి కాయలు వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయని, లోపలికి ఎటువంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. కవర్ లోపల భాగం నలుపు రంగులో ఉండడం వల్ల మామిడికాయకు మంచి ఉష్ణోగ్రత కూడా లభిస్తుంది. దీంతో నాణ్యత గల మామిడి దిగుబడి అవుతుంది. ఆశించిన స్థాయిలో మామిడి ధర ఉంటుంది.
సలహా మండలి తీర్మానంతో..
మామిడిలో టేబుల్ వైరెటీస్‌లో ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తుంది. వ్యవసాయ సలహా మండలి సమావేశంలో సభ్యులు ఫ్రూట్ కవర్లు కావాలని తీర్మానించారు. ఆమేరకు ప్రభుత్వానికి పంపాము. ప్రభుత్వ అనుమతితో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీతో కూడిన కవర్లు అందజేస్తున్నాం.
– పి.రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, చిత్తూరు జిల్లా
నాణ్యమైన పంట దిగుబడి
జిల్లాలో మొదటి విడతగా 15.3 లక్షల ఫ్రూట్ కవర్లు మంజూరయ్యాయి. వీటి ద్వారా నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చు. రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించవచ్చు. ఇటీవల మామిడిలో భారీ ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి మామిడి కవర్లు అందుబాటులోకి తెచ్చాం.
– మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చిత్తూరు
మామిడి రైతుకు బాసట
రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుకు నష్టం వాటిల్ల కూడదని అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించింది. మామిడిలో రక్షణ చర్యలు ప్రారంభించింది. కవర్లు వాడడం వల్ల ఎటువంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించనవసరం లేదు. ఇలాంటి మామిడి కాయలను ఎక్కువగా ఎగుమతి చేయొచ్చు.
– పి.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్, చిత్తూరు
జిల్లా సమాచారం
ఉద్యాన పంటలు ఎకరాల్లో
మామిడి 58,000
అరటి 1,500
దానిమ్మ 700
బొప్పాయి 400
మంచి లాభదాయకం
మామిడికి ఫ్రూట్ కవర్ వాడకం ఎంతో లాభదాయకం. గతంలో ఈ విధానంలో సాగుచేసిన రైతులకు మంచి ధర లభించింది. అందుకే ఈ ఏడాది మేము కూడా ఈ విధానాన్ని అనుసరించాం. కవర్ల వాడకం వల్ల ఎలాంటి క్రిమిసంహారక మందులు కూడా అవసరం లేదు. నాణ్యమైన పంట దిగుబడి పొందవచ్చు.
– ఈశ్వరబాబు, కొత్తపల్లి, గుడిపాల మండలం
అవగాహన పెరిగింది
అధికారుల సూచనల మేరకు రైతులకు మామిడి కవర్లను సరఫరా చేశాం. క్షేత్రస్థాయిలో ఈ కవర్లను ఏ విధంగా ఉపయోగించాలో అవగాహన కల్పించాం. ఒక రూపాయికే కవర్లు పంపిణీ చేశాం. వీటి వల్ల ఎలాంటి కీటకాలు చేరవు. ఎగుమతులకు ఉపయోగపడే విధంగా మామిడి పంట దిగుబడి చేయవచ్చు. – అఖిల, వ్యవసాయకార్యదర్శి,
- చేర్లోపల్లి, చిత్తూరు మండలం
కవర్‌ను ఎలా ఉపయోగించాలంటే..
ఒక పెద్ద నిమ్మకాయ సైజు వచ్చిన మామిడికాయకు ఈ కవర్‌ను తొడగాలి. ఆపై కాండంకు కవరు మొదటి భాగం వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయకు ఎటువంటి పురుగులు ఆశించవు. ఇలా దిగుబడి అయిన మామిడి పళ్లకు మార్కెట్లో 40 శాతానికిపైగా అధిక ధర లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment