విన్నపాలు..వినవలె
● కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక ● పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు ● వివిధ శాఖలకు సంబంధించి 206 అర్జీలు నమోదు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ , జేసీ విద్యాధరి
పట్టాలు ఇప్పించండి సారూ
దయతో పట్టాలను ఇప్పించండి సారూ అంటూ గుడిపాల మండలం రెడ్డిగుంట ఎస్టీ కాలనీకి చెందిన లీలావతి, శశికళ కోరారు. ఈ మేరకు వారు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ..చిత్తూరు రూరల్ మండలం తాళంబేడు రెవెన్యూ దాఖలాల్లో సర్వే నంబర్ 573 లో దాదాపు 10.23 ఎకరాల డీకేటీ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో 4 కుటుంబాలకు పట్టాలు ఇచ్చారని మిగిలిన 6 కుటుంబాలకు పట్టాలు ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామస్థులు రమణి, బేబి తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి వారం కలెక్టరేట్‌కు విచ్చేసి అర్జీలు ఇస్తూనే ఉన్నాం....సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు...తిరిగి తిరిగి వేషారిపోతున్నాం....కాస్త దయ చూపి తమ సమస్యలను పరిష్కరించండి సారూ... అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజలు సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు అందజేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మాట్లాడుతూ.. అర్జీల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్‌వో మోహన్‌కుమార్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఫౌండేషన్ స్కూల్ నివేదిక రద్దు చేయండి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇబ్బందికరంగా మారే ఫౌండేషన్ స్కూల్ నివేదికలను రద్దు చేయాలని గంగవరం మండలం జేఆర్ కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల చైర్మన్, కీలపల్లి పంచాయతీ ఎంపీటీసీ నాగేంద్రరెడ్డి కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి ఆ గ్రామస్థులు సోమవారం కలెక్టర్ ను కలిశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు కేశవ, రమణారెడ్డి, వరద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment