హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ (ఎన్‌డీఎస్‌ఎల్ ) మూత పడిన నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. ముందస్తు నోటీసు లేకుండా లే ఆఫ్ ప్రకటించడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన బాట పడ్డాయి. నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ పరిధిలో శక్కర్‌నగర్ (బోధన్), మెట్‌పల్లి, మంభోజిపల్లి (మెదక్) యూనిట్లు వుండగా.. నష్టాలను సాకుగా చూపుతూ ప్రస్తుత సీజన్ 2015-16లో చెరకు క్రషింగ్ చేయలేమంటూ యాజమాన్యం చేతులెత్తేసింది.ఓ వైపు చెరుకు క్రషింగ్‌ను నిలిపివేసిన యాజమాన్యం తాజాగా.. లే ఆఫ్‌ను ప్రకటిస్తూ ఈ నెల 23న ఆయా యూనిట్లకు నోటీసులు అంటించింది. క్రషింగ్‌కు అవసరమైన చెరుకు లేకపోవడం, నీటి కొరత మూలంగా లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మూడు నెలలుగా ఫ్యాక్టరీ పరిధిలోని 307 మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు.
కో జెన్ నడిపించాలిః కార్మికులు
ఎన్‌డీఎస్‌ఎల్ యాజమాన్యం సమస్యను పరిష్కరించే అవకాశం లేనందున ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలని కార్మికులు ప్రతిపాదిస్తున్నారు. ఎన్‌డీఎస్‌ఎల్‌కు అనుబంధంగా వున్న డిస్టిలరీ, కో జెన్ యూనిట్‌ను నడిపించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరమ్మతులకు రూ.3 కోట్లు చెల్లిస్తే ఫ్యాక్టరీ తిరిగి నడిపే వీలుందని చక్కెర పరిశ్రమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అయితే ప్రస్తుతం చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించేందుకు రవాణా చార్జీల రూపంలో రూ.7 కోట్ల మేర చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమస్య పరిష్కరిస్తాం: మంత్రి జూపల్లి
ఎన్‌డీఎస్‌ఎల్ కుట్ర పూరితంగా లే ఆఫ్ ప్రకటించిందని ఆరోపిస్తూ ఉద్యోగులు, కార్మికులు మంగళవారం పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సచివాలయంలో కలిశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, చక్కెర పరిశ్రమ శాఖ డైరక్టర్ భద్రు మాలోత్, ఎన్‌డీఎస్‌ఎల్ ప్రతినిధి సుబ్బరాజు, ఎన్‌ఎస్‌ఎల్ జీఎం రమేశ్, ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రి చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్‌డీఎస్‌ఎల్ ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తానని కృష్ణారావు వెల్లడించారు. కార్మికులకు బకాయిలను తక్షణమే చెల్లించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించామన్నారు.
రోడ్డునపడిన నిజాం షుగర్స్ ఉద్యోగులు
Published Tue, Dec 29 2015 8:37 PM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM
Advertisement
Advertisement