nizam sugers
-
ఆ భూములు మీవా.. మావా?
నిజాం షుగర్స్ భూములపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం హైకోర్టుకు చేరిన 120 ఎకరాల వివాదం సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ లిమిటెడ్(ఎన్ఎస్ఎల్) భూములపై ఏపీ, తెలంగాణల మధ్య వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. పొరుగు రాష్ట్రంలో ఆ సంస్థ ఆధీనంలోని భూములు ఎవరికి దక్కుతాయనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అప్పట్లో ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిజాం షుగర్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ప్రైవేటీకరణలో భాగంగా 1997లో ఈ యూనిట్‌ను ఎన్సీఎస్ షుగర్స్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. యూనిట్‌ను ప్రైవేటుపరం చేసినా బొబ్బిలి, సీతానగరంలో సుమారు 200 ఎకరాలు నేటికీ ఎన్ఎస్ఎల్ అధీనంలోనే ఉన్నాయి. సీతానగరంలోని యూనిట్‌ను విక్రయించగా, బొబ్బిలిలో కొన్ని రేకుల షెడ్లు, కొంత విలువైన ఇనుప సామగ్రి ఎన్ఎస్ఎల్ ఆధీనంలోనే ఉంది. ఇందులో సుమారు 120 ఎకరాలను లేబర్ కాలనీ పేరిట ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఎన్ఎస్ఎల్ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల విభజన కోసం ఏర్పాటైన షిలా బిడే కమిటీ.. ఎక్కడి ఆస్తులు అక్కడే అనే ప్రాతిపదికన బొబ్బిలిలోని ఎన్ఎస్ఎల్ ఆస్తులు ఏపీకి చెందుతాయన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం షిలాబిడే కమిటీ ప్రతిపాదనతో విభేదిస్తోంది. తెలంగాణకు చెందిన ఎన్ఎస్ఎల్ నిధులతో స్థాపించినందున ఏపీలోని ఆస్తులు కూడా తమకే చెందుతాయని వాదిస్తోంది. ఈ కమిటీ ప్రతిపాదనలపై త్వరలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య జరిగే చర్చల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చక్కెర విభాగం అధికారులు వెల్లడించారు. బోధన్ భూములు అన్యాక్రాంతం నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా ఉన్న నిజాం షుగర్స్ లిమిటెడ్ ఆస్తులు క్రమంగా అన్యాక్రాంతమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఐదు మండల పరిధుల్లో ఎన్ఎస్ఎల్కు 17 వేల ఎకరాలున్నాయి. వాటిల్లోని 14 వేల ఎకరాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించింది. మరికొన్ని భూములను ఇళ్లస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరిట స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం 200 ఎకరాలు మాత్రమే ఎన్ఎస్ఎల్ పేరిట మిగిలి ఉన్నాయి. బోధన్ పట్టణాన్ని అనుకుని ఉన్న భూమిని దక్కించుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మంభోజిపల్లి యూనిట్ పరిధిలోని డిస్టిలరీ కూడా సుమారు 50 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. మంభోజిపల్లి యూనిట్‌ను ప్రైవేటుపరం చేసినా డిస్టిలరీ మాత్రం ఎన్ఎస్ఎల్ పరిధిలోనే ఉంది. ఎన్ఎస్ఎల్ పునరుద్ధరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో డిస్టిలరీ ఆస్తులు, భూములు హరించుకుపోయే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిజామ్ షుగర్స్ కథ కంచికి
హైదరాబాద్: నష్టాలను సాకుగా చూపుతూ 2015-16 క్రషింగ్ సీజన్లో చెరుకు గానుగను నిలిపివేసిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ యాజమాన్యం.. ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. గత ఏడాది డిసెంబర్లో లే ఆఫ్‌ను ప్రకటించిన యాజమాన్యం.. కార్మికుల వేతనాలు కూడా చెల్లించడం లేదు. చెరుకు తరలింపులో భాగంగా రవాణాకు సంబంధించిన మొత్తం ప్రభుత్వం నుంచి విడుదల కావడం లేదు. ఇదిలావుంటే.. బ్యాంకర్ల నుంచి ఒత్తిడి, వరుస నష్టాలతో ఫ్యాక్టరీని నడిపించే పరిస్థితిలో లేనందున ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాలో చేర్చాలంటూ ఎన్డీఎస్ఎల్ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం) ఇటీవల పారిశ్రామిక, ఆర్దిక పునర్నిర్మాణ మండలిని (బీఐఎఫ్ఆర్) ఆశ్రయించింది. అయితే బీఐఎఫ్ఆర్ వద్ద పేరుకు పోయిన ఖాయిలా పడిన పరిశ్రమల జాబితాను పరిశీలిస్తే.. ఎన్డీఎస్ఎల్ వ్యవహారం కొలిక్కి వచ్చేందుకు కనీసం నాలుగేళ్లు పడుతుందని చక్కెర పరిశ్రమ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పేరుకు పోయిన వేతన బకాయిలు చెరుకును గానుగ ఆడించలేమని ప్రకటించిన ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం.. గత ఏడాది డిసెంబర్ 23వ తేదీన లే ఆఫ్ ప్రకటించింది. దీంతో ఎన్డీఎస్ఎల్ పరిధిలోని మూడు యూనిట్లలో పనిచేస్తున్న 307 మంది కార్మికులు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలకు సంబంధించి ఇప్పటి వరకు రూ.2.27 కోట్ల బకాయిలతో పాటు, పీఎఫ్ వంటి ఇతర చెల్లింపులు మరో రెండు కోట్ల రూపాయల మేర వుంటాయని అంచనా. వేతన బకాయిలు రూ.4.27 కోట్లు చెల్లించడంతో పాటు, ఫ్యాక్టరీని తిరిగి తెరవాలంటూ ఉద్యోగులు ఆందోళన బట్టినా అటు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదు. ఎన్డీఎస్ఎల్ పరిధిలో రైతులు సాగు చేసిన సుమారు 1.80లక్షల మెట్రిక్ టన్నుల చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు తరలించి గానుగ ఆడించారు. రవాణా వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వగా.. మెట్రిక్ టన్నుకు రూ.300 నుంచి రూ.450 వరకు దూరాన్ని బట్టి చెల్లించాలని నిర్ణయించారు. అయితే క్రషింగ్ ముగిసినా.. ప్రభుత్వం ప్రకటించిన రవాణా వ్యయం రూ.6 కోట్లు విడుదల కాకపోవడంతో.. ప్రైవేటు ఫ్యాక్టరీల నుంచి రైతులకు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగడం లేదు. -
రోడ్డునపడిన నిజాం షుగర్స్ ఉద్యోగులు
హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్ ) మూత పడిన నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించింది. ముందస్తు నోటీసు లేకుండా లే ఆఫ్ ప్రకటించడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఆందోళన బాట పడ్డాయి. నిజాం దక్కను షుగర్స్ లిమిటెడ్ పరిధిలో శక్కర్‌నగర్ (బోధన్), మెట్పల్లి, మంభోజిపల్లి (మెదక్) యూనిట్లు వుండగా.. నష్టాలను సాకుగా చూపుతూ ప్రస్తుత సీజన్ 2015-16లో చెరకు క్రషింగ్ చేయలేమంటూ యాజమాన్యం చేతులెత్తేసింది.ఓ వైపు చెరుకు క్రషింగ్‌ను నిలిపివేసిన యాజమాన్యం తాజాగా.. లే ఆఫ్‌ను ప్రకటిస్తూ ఈ నెల 23న ఆయా యూనిట్లకు నోటీసులు అంటించింది. క్రషింగ్‌కు అవసరమైన చెరుకు లేకపోవడం, నీటి కొరత మూలంగా లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మూడు నెలలుగా ఫ్యాక్టరీ పరిధిలోని 307 మంది ఉద్యోగులకు వేతనాలు అందడం లేదు. కో జెన్ నడిపించాలిః కార్మికులు ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం సమస్యను పరిష్కరించే అవకాశం లేనందున ప్రభుత్వమే బకాయిలు చెల్లించాలని కార్మికులు ప్రతిపాదిస్తున్నారు. ఎన్డీఎస్ఎల్కు అనుబంధంగా వున్న డిస్టిలరీ, కో జెన్ యూనిట్‌ను నడిపించి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరమ్మతులకు రూ.3 కోట్లు చెల్లిస్తే ఫ్యాక్టరీ తిరిగి నడిపే వీలుందని చక్కెర పరిశ్రమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. అయితే ప్రస్తుతం చెరుకును ప్రైవేటు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించేందుకు రవాణా చార్జీల రూపంలో రూ.7 కోట్ల మేర చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పరిష్కరిస్తాం: మంత్రి జూపల్లి ఎన్డీఎస్ఎల్ కుట్ర పూరితంగా లే ఆఫ్ ప్రకటించిందని ఆరోపిస్తూ ఉద్యోగులు, కార్మికులు మంగళవారం పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సచివాలయంలో కలిశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, చక్కెర పరిశ్రమ శాఖ డైరక్టర్ భద్రు మాలోత్, ఎన్డీఎస్ఎల్ ప్రతినిధి సుబ్బరాజు, ఎన్ఎస్ఎల్ జీఎం రమేశ్, ఉద్యోగుల ప్రతినిధులతో మంత్రి చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్డీఎస్ఎల్ ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తానని కృష్ణారావు వెల్లడించారు. కార్మికులకు బకాయిలను తక్షణమే చెల్లించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించామన్నారు.