ఆ భూములు మీవా.. మావా?
నిజాం షుగర్స్ భూములపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం
హైకోర్టుకు చేరిన 120 ఎకరాల వివాదం
సాక్షి, హైదరాబాద్: నిజాం షుగర్స్ లిమిటెడ్(ఎన్‌ఎస్‌ఎల్) భూములపై ఏపీ, తెలంగాణల మధ్య వివాదం ఇంకా కొలిక్కి రాలేదు. పొరుగు రాష్ట్రంలో ఆ సంస్థ ఆధీనంలోని భూములు ఎవరికి దక్కుతాయనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అప్పట్లో ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిజాం షుగర్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేశారు. ప్రైవేటీకరణలో భాగంగా 1997లో ఈ యూనిట్‌ను ఎన్‌సీఎస్ షుగర్స్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించారు. యూనిట్‌ను ప్రైవేటుపరం చేసినా బొబ్బిలి, సీతానగరంలో సుమారు 200 ఎకరాలు నేటికీ ఎన్‌ఎస్‌ఎల్ అధీనంలోనే ఉన్నాయి. సీతానగరంలోని యూనిట్‌ను విక్రయించగా, బొబ్బిలిలో కొన్ని రేకుల షెడ్లు, కొంత విలువైన ఇనుప సామగ్రి ఎన్‌ఎస్‌ఎల్ ఆధీనంలోనే ఉంది.
ఇందులో సుమారు 120 ఎకరాలను లేబర్ కాలనీ పేరిట ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఎన్‌ఎస్‌ఎల్ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల విభజన కోసం ఏర్పాటైన షిలా బిడే కమిటీ.. ఎక్కడి ఆస్తులు అక్కడే అనే ప్రాతిపదికన బొబ్బిలిలోని ఎన్‌ఎస్‌ఎల్ ఆస్తులు ఏపీకి చెందుతాయన్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం షిలాబిడే కమిటీ ప్రతిపాదనతో విభేదిస్తోంది. తెలంగాణకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్ నిధులతో స్థాపించినందున ఏపీలోని ఆస్తులు కూడా తమకే చెందుతాయని వాదిస్తోంది. ఈ కమిటీ ప్రతిపాదనలపై త్వరలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య జరిగే చర్చల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చక్కెర విభాగం అధికారులు వెల్లడించారు.
బోధన్ భూములు అన్యాక్రాంతం
నిజామాబాద్ జిల్లా బోధన్ కేంద్రంగా ఉన్న నిజాం షుగర్స్ లిమిటెడ్ ఆస్తులు క్రమంగా అన్యాక్రాంతమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని ఐదు మండల పరిధుల్లో ఎన్‌ఎస్‌ఎల్‌కు 17 వేల ఎకరాలున్నాయి. వాటిల్లోని 14 వేల ఎకరాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్‌ల ద్వారా నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించింది. మరికొన్ని భూములను ఇళ్లస్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పేరిట స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం 200 ఎకరాలు మాత్రమే ఎన్‌ఎస్‌ఎల్ పేరిట మిగిలి ఉన్నాయి.
బోధన్ పట్టణాన్ని అనుకుని ఉన్న భూమిని దక్కించుకునేందుకు కొందరు రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మంభోజిపల్లి యూనిట్ పరిధిలోని డిస్టిలరీ కూడా సుమారు 50 ఎకరాల పరిధిలో విస్తరించి ఉంది. మంభోజిపల్లి యూనిట్‌ను ప్రైవేటుపరం చేసినా డిస్టిలరీ మాత్రం ఎన్‌ఎస్‌ఎల్ పరిధిలోనే ఉంది. ఎన్‌ఎస్‌ఎల్ పునరుద్ధరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో డిస్టిలరీ ఆస్తులు, భూములు హరించుకుపోయే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.