భూములివ్వని రైతులపై దౌర్జన్యం..
* పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కుట్రలు
* బాధితులనే ముద్దాయిలుగా చిత్రీకరించే యత్నం
* విచారణ పేరుతో వేధింపులు
* గత డిసెంబరులో జరిగిన పంట దహనం కేసుల్లోనూ ఇదే తీరు
* ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు, ప్రజాసంఘాలు
సాక్షి, గుంటూరు: రాజధానికి భూమి ఇవ్వనందుకు గుంటూరు జిల్లా మల్కాపురం లో చెరకు పంటను దహనం చేసిన సంఘటనపై బాధిత రైతు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేయడం, ఆయన పొలాన్ని స్వయంగా పరిశీలించడంతో ప్రభుత్వ పరువు మంట కలిసిందనే ఆగ్రహంతో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు మరో కుట్రకు తెర తీశారు.
బాధితులను పంట దహనం కేసులో బాధ్యులుగా చేసేందుకు రైతు చంద్రశేఖర్ మేనల్లుడు సురేశ్‌ను రెండు రోజుల క్రితం తీసుకెళ్లి రహస్యంగా విచారణ జరుపుతున్నారు. పంటను తానే దహనం చేసినట్లుగా ఒప్పుకోవాలంటూ పోలీసులు సురేశ్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పంట దహనం సంఘటనకు పాల్పడింది తానేనంటూ సురేశ్ చేతనే చెప్పించి ప్రభుత్వానికి ఆ మరక అంటకుండా చూసేందుకు కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా చంద్రశేఖరే తనను దహనం చేయమని చెప్పినట్లుగా సురేశ్ చేత చెప్పించి కేసులో ఆయన్ను సైతం ఇరికించేందుకు భారీ స్థాయిలో పథక రచన చేశారు. ఇందులో భాగంగా చంద్రశేఖర్‌ను కూడా గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రైతు, ప్రజాసంఘాల నాయకులు, ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు.
ఈనెల 23న తుళ్లూరు మండలం మల్కాపురంలో ల్యాండ్‌పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతు గద్దె చంద్రశేఖర్ పొలంలో చెరకు పంటను గుర్తుతెలియని దుండగులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 26న సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వై.ఎస్.జగన్ బాధిత రైతులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం, పోలీసుల వ్యవహార శైలిపై బాధిత రైతు చంద్రశేఖర్ ఆయనకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
సర్కారు మాట వినని రైతులపై కక్ష సాధింపులు
గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని రైతులకు నిద్ర లేకుండాపోతోంది. భూ సమీకరణ పేరుతో అనేక మంది రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొన్న ప్రభుత్వ పెద్దలు తమ మాట వినని రైతులను టార్గెట్ చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తిరిగి వారిపైనే కేసులు పెడుతూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.
ఇంత చేస్తున్నా రైతులు లొంగకపోవడంతో పంటలను దహనం చేసే స్థాయికి దిగజారుతున్నారు. గతేడాది డిసెంబర్‌లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన ఆరు గ్రామాల్లో 13 మంది రైతులకు చెందిన పంట పొలాల్లో వెదురు బొంగులు దహనం చేసిన సంఘటన తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించినప్పటికీ ఇంత వరకు ఈ కేసులో అసలైన బాధ్యులను గుర్తించి అరెస్టు చేసిన దాఖలాలు లేవు.
పైగా అప్పట్లో విచారణ పేరుతో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతులను, వైఎస్సార్‌సీపీకి చెందిన రైతులను స్టేషన్‌లకు పిలిచి రోజుల తరబడి విచారణ పేరుతో బెదిరింపులకు దిగుతూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇతర నేతలంతా గవర్నర్‌ను కలిసి పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వీరి తీరు మాత్రం మారలేదు.