Malkapuram
-
పచ్చనికాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య..
సింథియా/మల్కాపురం(విశాఖ పశ్చిమ): జీవితంపై ఎన్నో కలలు కన్నాడు. కుటుంబంతో సంతోషంగా ఉండాలని భావించాడు. అక్క కూతురినే వివాహం చేసుకున్నాడు. కొంతకాలం పాటు సరదాగా సాగిన వీరి కాపురంలో ‘అనుమానం’ పెనుభూతంలా మారింది. జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన అతను.. విచక్షణ మరిచి డంబెల్‌తో భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్య లేని లోకంలో తానెందుకు అనుకున్నాడో లేక భార్య మృతితో తీవ్రంగా ఆందోళన చెందాడో గానీ.. అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలోని గుల్లలపాలెంలో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. కాకినాడ ప్రాంతానికి చెందిన పోలవరపు శివనాగేశ్వరరావు(34) తన అక్క కూతురైన మాధవి(28)ని మూడేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఉపాధి నిమిత్తం కొంతకాలం కిందట విశాఖకు వలస వచ్చి.. శ్రీహరిపురంలోని గొల్లలపాలెం ప్రాంతంలోని కుంచుమాంబకాలనీలో నివాసం ఉంటున్నాడు. వృత్తిరీత్యా వెల్డర్ అయిన శివనాగేశ్వరరావు ఎక్కడ పని ఉండే అక్కడ చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు.పెళ్లయి మూడేళ్లయినా వీరికి పిల్లలు లేరు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి జీవితంలో అనుమానం చిచ్చురేపింది. ఆరు నెలల నుంచి మాధవిపై శివనాగేశ్వరరావు అనుమానం పెంచుకోవడంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శివనాగేశ్వరరావు భార్యపై దాడికి తెగబడ్డాడు. వ్యాయామం కోసం ఉపయోగించే ఇనుప డంబెల్‌తో ఆమె తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో మాధవి అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. భార్య మృతితో తీవ్ర భయాందోళనకు గురైన శివనాగేశ్వరరావు కూడా అదే గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఆత్మహత్యకు ముందుకు తన అన్నయ్య కనకారావుకు వాట్సాప్‌లో మేసేజ్‌లు పంపించాడు. తన భార్యపై అనుమానం ఉందని, పలువురితో చనువుగా ఉంటోందని.. ఆమెకు ఎంత నచ్చజెప్పినా మాట వినలేదని అందులో పేర్కొన్నాడు. వాట్సాప్‌లో రెండు సందేశాలతో పాటు లెటర్‌పై తాను చనిపోవడానికి గల కారణాలు వివరించాడు. ఆందోళనతో కనకారావు వెంటనే తన భార్యతో కలిసి శివనాగేశ్వరరావు ఇంటికి వచ్చాడు. తమ్ముడికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో తలుపులు బలంగా తెరిచారు. గదిలోకి వెళ్లిచూడగా తమ్ముడు భార్య రక్తపు మడుగులో ఉండటం, తమ్ముడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటంతో కేకలు వేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు మల్కాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం కేజీహెచ్‌కు తరలించారు. ఎన్నో ఆశలతో వివాహం చేసుకున్న వీరి జీవితం అనుమానం కారణంగా అర్ధాంతరంగా ముగిసిపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆస్తి కోసం దారుణం! తాతను హతమార్చిన మనవడు.. -
మానసిక రోగి హల్చల్
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ) : గంట కాదు.. రెండు గంటలు కాదు.. ఏకంగా 24 గంటలపాటు ఓ మానసిక రోగి చెట్టుపై కూర్చున్నాడు. ఎవరు ఎంత ప్రయత్నించినా కిందకు దిగలేదు. చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది అతికష్టం మీద కిందకు దించారు. వివరాల్లోకి వెళ్తే... ఓ మానసిక రోగి సోమవారం ఉదయం డాక్‌యార్డ్ మార్గం నుంచి సింథియా వైపు వచ్చాడు. అలా వస్తూ సింథియా మలుపు షిప్‌యార్డ్‌కు వెళ్లే మార్గంలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. గంటలు గడిచినా కిందకు దిగకపోవడంతో సమీపంలోని ఆటో స్టాండ్‌లో గల డ్రైవర్లు కిందకు దించే యత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు వెళ్లిపోయారు. మళ్లీ మంగళవారం ఉదయం స్టాండ్‌కు వచ్చిన ఆటో డ్రైవర్లకు చెట్టుపై మానసిక రోగి కనిపించడంతో మీడియా, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న మల్కాపురం పోలీసులు షిప్‌యార్డ్ ఫైర్ సిబ్బంది సాయంతో రోగిని కిందకు దించారు. అనంతరం మానసిక వైద్యశాలకు తరలించారు. -
'బాబు ఇదంతా బినామీల కోసమే చేస్తున్నారు'
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని పరిపాలన, అభివృద్ధి వికేంద్రికరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజధాని రైతులపై వరాల జల్లు కురిపించిన వైఎస్ జగన్‌కు శ్రీదేవి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉండవల్లి సమక్షంలో రాజధాని రైతులు ,రైతుకూలీలు వైఎస్ జగన్ ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. రాజధాని రైతులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో జరిగేది రాజధాని మార్పు కాదు అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆమె స్పష్టం చేశారు.(‘సీఎం జగన్‌కు గిరిజనుల తరుపున ధన్యవాదాలు’) గత ప్రభుత్వం రాజధాని రైతులకు రూ. 2500 పెన్షన్ ఇచ్చి మోసం చేసిందని, కానీ మా ప్రభుత్వం మాత్రం భూముల లేని రాజధాని రైతులకు ఐదువేలు పెన్షన్ ఇస్తూ వారికి అండగా నిలిచిందని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో పట్టా భూముల కన్నా అసైన్డ్ భూములు కలిగిన రైతులకు ఎక్కువ అన్యాయం జరిగిందని మండిపడ్డారు. రాజధాని భూతల స్వర్గం అంటూ చంద్రబాబు ప్రజలందరిని భ్రమలోకి నెట్టారని, చివరకు అమరావతిని భ్రమరావతి చేశారని ఎద్దేవా చేశారు. రాజధాని పేరిట వందల కోట్లు తిన్న చంద్రబాబు నాయుడు.. ఇసుక ,వరదలు, డ్రోన్ అంటూ రాద్దాంతం చేసి నేడు అమరావతితో రాజకీయ లబ్ధి కోసం తాపత్రయ పడుతున్నారని మండిపడ్డారు. అమరావతిలో రాజధాని పేరుతో లేనివి ఉన్నట్లుగా చూపి గ్రాఫిక్స్ పాలన అందించారన్నారు. చంద్రబాబు బినామీల కోసం ధర్నాలు చేస్తున్నారని, బినామీల భూములు కోసం రైతుల ముసుగులో అరాచాలకు పాల్పడుతున్నారని శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబు సూట్లు వేసుకుని విదేశీ పర్యటనలు చేసి ఎమ్వోయూలు అంటూ హడావిడి చేశారే తప్ప ఒక్క విదేశీ పెట్టుబడి నోటును తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. (టీడీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ రాజీనామా) చంద్రబాబు అసెంబ్లీలో కక్ష పూరిత చర్యలకు దిగుతున్నారని, రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అసైన్డ్ భూముల రైతులకు న్యాయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్ ఒక్కరేనని తెలిపారు. తుళ్లూరును కార్పొరేషన్ గా చేసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్య,వైద్యంతో పాటు ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాలు, అమ్మ ఒడి,నాడు నేడు, మధ్యాహ్న భోజనం పథకoలో నూతన మెనూ విధానాలతో సీఎం ప్రజలకు మరింత చేరువయ్యారని ఉండవల్లి శ్రీదేవి వెల్లడించారు. -
విశాఖ చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్
సాక్షి, విశాఖ : నగరంలోని పోర్టు రోడ్డులో బుధవారం జరిగిన చోరీ కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పనిచేసే సంస్థకే దోపిడీ పేరుతో పంగనామాలు పెడదామనుకున్న ఓ ప్రబుద్ధుడి గుట్టును పోలీసులు 24 గంటల్లోనే రట్టు చేశారు. తనపై దుండగులు దాడి చేసి రూ.20 లక్షలు దోచుకు వెళ్లారంటూ నగర పోలీసులను పరుగులు పెట్టించిన బాధితుడు శ్రీనివాసరావే నిందితుడు అని తేలింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులకు... బాధితుడు పొంతనలేని సమాధానం చెప్పడంతో దీనిపై లోతుగా ఆరా తీశారు. ట్రాన్స్‌పోర్టు కంపెనీ సొమ్ము రూ.20 లక్షలు కాజేసేందుకు అతడు చోరీ నాటకం ఆడినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో శ్రీనివాసరావు దొంగతనం నాటకం బట్టబయలు అయింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు వంటిపై గాయాలు చేసుకుని, కట్టుకథ అల్లినట్లు నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాసరావు పోలీసుల అదుపులో ఉన్నాడు. చదవండి: విశాఖలో పట్టపగలే భారీ దోపిడీ -
విశాఖలో పట్టపగలే భారీ దోపిడీ
సాక్షి, విశాఖ : నగరంలోని పోర్టు రోడ్డులో పట్టపగలే భారీ దోపిడీ జరిగింది. బైక్‌పై వెళుతున్న సిటీ ట్రాన్స్‌పోర్టు కంపెనీ సూపర్వైజర్ శ్రీనివాసరావుపై దుండగులు కత్తితో దాడి చేశారు. అతని వద్ద రూ.20 లక్షల నగదు లాక్కుని పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మల్కాపురం, హార్బర్ పోలీసులు రంగంలోకి దిగి బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గాజువాకకు చెందిన శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై బుధవారం మధ్యాహ్నం పోర్టు పరిధిలోని ఐఎన్ఎస్ డేగా వైపుగా వెళుతున్నాడు. ఆ సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని మధ్యలో ఆపి దాడి చేశారు. ఆ తర్వాత శ్రీనివాసరావు వద్ద ఉన్న రూ.20 లక్షలు పట్టుకుని వెళ్లిపోయారు. వెంటనే బాధితుడు హార్బర్ పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ దోపిడీ తెలిసినవాళ్ల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఎంతటి సర్పమైనా ఇట్టే పట్టేస్తాడు..
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఈ స్నేకింగ్ ఆనంద్.. అందరూ భయపడే పాములను ఎందుకు పడుతున్నాడు.. ఆ విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అది 1999 నవంబరో.. డిసెంబరో సరిగా గుర్తు లేదు.. నేను నిర్వహించే టిఫిన్ సెంటర్లో ఎనిమిది అడుగుల కొండ చిలువ చొరబడింది. దీనిని పట్టుకునేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. కొండ చిలువ కరిస్తే ప్రాణహాని ఉండదని ఎవరో చెబితే తెలిసింది. నాకు నేనే హీరో అవతారమెత్తి సుమారు అరగంట సేపు కొండ చిలువను బంధించే సాహసం చేశా..అదే సమయంలో నా చేయిని గట్టిగా చుట్టేసింది. అయినా ధైర్యంతో పోరాడా.. చివరికి అది ఓడిపోయింది. నేనే గెలిచా... దీనిని అందరూ ఆసక్తిగా తిలకించారే తప్ప సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇలాగే మరో సంఘటన 1997 ఆగస్టులో జరిగింది. సింథియా న్యూ కాలనీ చెందిన 13 ఏళ్ల దిలీప్ అనే విద్యార్థి స్కూల్ వస్తూ ఓ చెట్టు వద్ద స్నేహితులతో ఆడుకుంటున్నాడు. అక్కడే నక్కి ఉన్న కొండచిలువ దిలీప్‌ను చుట్టేసింది. అటువైపు వచ్చిన వారంతా చూస్తున్నారే తప్ప విద్యార్థిని కాపాడేందుకు సాహసించలేకపోతున్నారు. ఎవరో ఈ విషయం చెబితే అక్కడకు వెళ్లా...కొండచిలువతో పోరాడి దిలీప్‌ను కాపాడా.. దీంతో ఆ రోజు నుంచి కాలనీలో నా పేరు మార్మోగిపోయింది. ఇలా అందరూ అభినందిస్తుంటే ఆ కిక్ మాటల్లో చెప్పలేను. పేరు : పడాల ఆనంద్ నివాసం : సింథియా (న్యూకాలనీ) వృత్తి : టిఫిన్ సెంటర్ ప్రవృత్తి : పాములు పట్టడం సెల్ నంబర్ : 9849023327, 9705395737 ఆ కిక్కే వేరు... అందరూ విష సర్పాలను చూసి భయపడుతున్నారు.. ఆ విషసర్పాలకు నేనంటే భయం ఏర్పడాలి అనుకున్నా.. అంతే అప్పటి నుంచి పాములు పట్టడంలో నాకు నేనే శిక్షణ ఇచ్చుకున్నా.. ఇదే వృత్తిలో ఉండిపోయా.. నగర పరిధి, షిప్‌యార్డ్,హెచ్‌పీసీఎల్, నేవల్ ఏరియా తదితర ప్రాంతాలలో ఎక్కడ పాములు కనిపించినా అందరూ నన్నే పిలుస్తారు. తక్షణం అక్కడ వెళ్లి ఎంత పెద్ద విషసర్పమైనా బంధించి సమీప కొండ ప్రాంతంలో విడిచి పెడుతుంటా. విశాఖలో సంచరించే పాములు ఇవే.. విశాఖ పరిధిలో ఎక్కువగా నాగుపాము, కట్లపాము, పొడపాము, గ్రీన్స్నేక్ వంటి విషసర్పాలతో పాటు కొండచిలువలు సంచరిస్తాయి. కొండచిలువ, పొడపాము రెండుచూడటానికి ఒకే మాదిరగా ఉంటాయి. వాటి శరీరంపై ఉన్న చారలు బట్టి అది ఏ జాతో చెప్పవచ్చు. అయితే ఏ విషసర్పమైన కరిస్తే 30 నిమిషాల వ్యవధిలో వైద్యులను సంప్రదించాలి. నగరంలో ఎక్కడైన, ఎవరి ఇంట్లోనైనా సర్పం చొరబడితే 9849023327, 9705395737 నంబర్‌కు ఫోన్ చేయండి. తక్షణం స్పందిస్తా... అంటూ ఆనంద్ ముగించాడు. పది వేల పాములు పట్టిన ట్రాక్ రికార్డ్ ఇప్పటి వరకు సుమారు 10 వేలు వరకు వివిధ రకాల పాములను బంధించి కొండ ప్రాంతంలో విడిచిపెట్టా.. షిప్‌యార్డ్, నేవల్ అధికారులు ఎంతో అభిమానంతో అక్కున చేర్చుకున్నారు. ఎన్నో అవార్డులు, జ్ఞాపికలు, నగదు సాయం అందజేశారు. -
12 మందికి పిచ్చికుక్క కాటు
ధర్మవరం అర్బన్: మల్కాపురం గ్రామానికి చెందిన 12 మందిని మంగళవారం పిచ్చికుక్క కరిచింది. తెల్లవారుజామున ఇళ్ల వద్ద నిద్రిస్తున్న వారిపై ఒక్కసారిగా దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారిని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. పిచ్చికుక్కను గ్రామం నుంచి తరిమేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇలాంటి కొడుకు మరెవరికీ వద్దు!
అన్న తీరుపై చెల్లెళ్ల ఫిర్యాదు మల్కాపురం: కంటే కూతురునే కనాలి అన్న ఓ సినీ కవి భావం అక్షరాలా నిజమైంది. కష్టాల్లో ఉన్న తల్లిని కడచూపు చూసేందుకు మలేసియా నుంచి కూతుళ్లు కదిలారు గానీ, పక్కనే ఉన్న కొడుకు మనసు మాత్రం చలించలేదు. పైగా తల్లి, చెల్లెళ్ల ఆస్తి కాజేసేందుకు కూడా వెనకాడలేదు. వివరాల్లోకి వెళితే.. 46వ వార్డు శ్రీహరిపురం-శ్రీనివాస్‌నగర్‌లో సత్యవతి అనే వృద్థురాలు తన సొంతింట్లో నివసిస్తోంది. ఆమెకు శ్రీదేవి, కనకమహాలక్ష్మి అనే కుమార్తెలతో పాటు శ్రీనివాసరావు అనే కుమారుడున్నాడు. కుమార్తెలిద్దరూ మలేసియాలో ఉంటున్నారు. శ్రీనివాసరావు స్థానికంగా తన భార్య, పిల్లలతో ఉంటున్నాడు. సత్యవతి నుంచి కొడుకు మొదటి నుంచి దూరంగానే ఉంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. కుమార్తెలే ఆమెకు నెల నెలా డబ్బు పంపించేవాళ్లు. ఆమె బాగోగులన్నీ ఇరుగుపొరుగు వాళ్లే చూసేవాళ్లు. సత్యవతి ఇంటిని ఇటీవల తన పెద్ద కుమార్తె శ్రీదేవికి రాసిచ్చేసింది. ఇదిలా ఉంటే యథావిధిగానే గత శనివారం సత్యవతికి పొరుగింటివాళ్లు టీ తెచ్చారు. ఆ సమయంలో ఆమె కింద పడిపోయి ఉన్నట్టు గుర్తించడంతో కలవరం చెంది స్థానిక ఓ ప్రైవేట్ అస్పత్రికి తీసుకువెళ్లారు. ఇదే విషయాన్ని మలేసియాలో ఉంటున్న ఆమె పిల్లలకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌కు విషయం చెప్పారు. కూతుళ్లు పట్టించుకున్నా కొడుకు పట్టించుకోలేదు. తల్లిని ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమె ఇంటిని కూడా శ్రీనివాస్ ఆక్రమించాడని ఆమె పెద్దకుమార్తె శ్రీదేవి ఆరోపించింది. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఈనెల 26న కుమార్తెలిద్దరూ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో ఉన్నా ఆమెను పరామ ర్శించారు. కాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడం తో ఈ నెల 26న రాత్రి మృతిచెందింది. ఆస్పత్రి ఖర్చు లు కూడా భరించనంటూ శ్రీనివాస్ మొండికేశాడు. ఆమె అంత్యక్రియలకు కూడా ముందుకు రాలేదు. దీంతో సత్యవతి మృతదేహం రెండు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సోదరుడి తీరుపై శ్రీదేవి, కనకమహాలక్ష్మిలు పోలీసులకు ఫిర్యాదిచ్చారు. బుధవారం సత్యవతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా.. ఈ ఘటన సత్యవతి ఆస్తిపై వివాదం వల్లేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. ఆస్తిని తనకిప్పిస్తే తక్షణం ఇల్లు ఖాళీ చేస్తానని శ్రీనివాస్ చెప్పడంపై పోలీసులూ ఆశ్చర్య పోయారు. తల్లిని సైతం కాదని ఆస్తిపైనే దృష్టి సారించడంపై స్థానికులు మండిపడుతున్నారు. -
హింసపెట్టి లొంగదీస్తున్నారు?
సురేశ్‌ను ఎక్కడ దాచారో చెప్పాలి భూసమీకరణకు ఒప్పించేందుకు పోలీసుల బెదిరింపులు విచారణ పేరిట ఎక్కడెక్కడికో తిప్పుతున్నారు తుళ్లూరులో చెరకు తోట దహనం కేసు బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు ముందుకు రాని రైతుల్ని లొంగదీసుకునేందుకు పోలీసులు బెదిరింపుల ఎత్తుగడను అమలు చేస్తున్నారని... మల్కాపురం చెరకు తోట దహనంపై బెజవాడ బార్ అసోసియేషన్ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. ఈ ఘటనలో అమాయకులను వేధించడం, హింసించడం మానుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. చెరకు తోట దహనం కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చాలని పోలీసు యంత్రాంగం తహతహ లాడుతున్నట్టు నిర్ధారించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో ఈనెల 23న భూసమీకరణకు సహకరించని రైతు గద్దె చంద్రశేఖర్ చెరుకు పంట దహనం తర్వాత పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఆ ప్రాంత ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు బెజవాడ బార్ అసోసియేషన్ ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. బార్ అసోసియేషన్, ఓపీడీఆర్, పీయూసీఎల్, పీఓడబ్ల్యూ సభ్యులు 8మందితో కూడిన కమిటీ తుళ్లూరు, మల్కాపురం, తుళ్లూరు పోలీసుస్టేషన్, గుంటూరు పోలీసుక్లబ్‌ను సందర్శించడంతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. అనంతరం కమిటీ తరఫున ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కమిటీ నిర్ధారణకు వచ్చిన అంశాలను వివరించారు. అంగీకార పత్రాన్ని రాయించుకున్నట్టు అనుమానం ‘చెరకు తోట దహనం కేసులో పోలీసుల తీరును నిజనిర్ధారణ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. తోట యజమాని గద్దె చంద్రశేఖర్ మేనల్లుడు సురేశ్‌ను విచారణ పేరిట తుళ్లూరు పోలీసులు ఈనెల 28న సాయంత్రం 5 గంటలకు తీసుకువెళ్లారు. ఇప్పుడాయన తుళ్లూరు పోలీసుల వద్ద లేరు. ఎక్కడున్నారో చెప్పడం లేదు. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల ప్రకారం 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసయినా నిందితుణ్ణి 24 గంటల్లోపల విచారించి వదిలిపెట్టాలి. సురేశ్ విషయంలో అలా జరగలేదు. చంద్రశేఖర్, మరో రైతు మీరా ప్రసాద్‌లను విచారించి వదిలిపెట్టారు. సురేశ్ విషయంలో సరైన సమాధానం చెప్పడం లేదు. తన మేనమామ చంద్రశేఖర్ చెప్పినందునే తోటను తగలబెట్టినట్టుగా సురేశ్‌తో బలవంతంగా చెప్పించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. సురేశ్‌తో ఈ మేరకు అంగీకార పత్రాన్నీ రాయించుకున్నట్టు అనుమానిస్తున్నాం. భూసమీకరణకు అంగీకరించని వారందర్నీ ఒప్పించేందుకు పోలీసులు సురేశ్‌ను పావుగా ఉపయోగించుకోబోతున్నారు. ఈ విషయంలో ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా ఉన్నట్టు నాటకం ఆడుతున్నారు. ఈనెల 22న రాజధానికి శంకుస్థాపన జరిగిన రోజు మధ్యాహ్నం 2.30- 4.00 గంటల మధ్యే తోట తగలబడినట్టు పోలీసులు చేస్తున్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదు. ఓ పక్క ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతరత్రా ప్రముఖులు, మరోపక్క శంకుస్థాపనకు వచ్చిన వేల మంది పోలీసు బలగాలున్న సమయంలో తోట తగలబడుతున్నట్టు తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అగ్నిమాపక యంత్రాలను ఎందుకు పంపలేదు? ఈ వ్యవహారంలో పోలీసుల వాదన తప్పు. కేసులో బేరసారాలు మొదలుపెట్టి తామనుకున్న పనిని చేయించాలనుకుంటున్నారు’ అని నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడినట్టు రాజేంద్రప్రసాద్ వివరించారు. సురేశ్‌ను తక్షణమే విడిచిపెట్టకపోతే తదుపరి చర్య ఏమిటనే దానిపై ఈ నిజనిర్ధారణ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో భేటీ అయి భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేస్తుందన్నారు. న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచన కూడా లేకపోలేదన్నారు. ఈ సంఘటనపై నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యుల్లో బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.జయమ్మ, మాజీ అధ్యక్షుడు దుర్గా శ్రీనివాసరావు, సభ్యులు కేవీవీ పరమేశ్వరరావు, ఓపీడీఆర్ నేతలు ఏసు, వి.రాజ్యలక్ష్మీ, పీయూసీఎల్ నాయకులు ఎం.శేషగిరిరావు, పీఓడబ్ల్యూ నాయకురాలు గంగా భవానీ, మంగళగిరి బార్ అసోసియేషన్ ప్రతినిధి లంకా శివరామ ప్రసాద్ ఉన్నారు. -
భూములివ్వని రైతులపై దౌర్జన్యం..
-
భూములివ్వని రైతులపై దౌర్జన్యం..
* పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కుట్రలు * బాధితులనే ముద్దాయిలుగా చిత్రీకరించే యత్నం * విచారణ పేరుతో వేధింపులు * గత డిసెంబరులో జరిగిన పంట దహనం కేసుల్లోనూ ఇదే తీరు * ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు, ప్రజాసంఘాలు సాక్షి, గుంటూరు: రాజధానికి భూమి ఇవ్వనందుకు గుంటూరు జిల్లా మల్కాపురం లో చెరకు పంటను దహనం చేసిన సంఘటనపై బాధిత రైతు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేయడం, ఆయన పొలాన్ని స్వయంగా పరిశీలించడంతో ప్రభుత్వ పరువు మంట కలిసిందనే ఆగ్రహంతో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు మరో కుట్రకు తెర తీశారు. బాధితులను పంట దహనం కేసులో బాధ్యులుగా చేసేందుకు రైతు చంద్రశేఖర్ మేనల్లుడు సురేశ్‌ను రెండు రోజుల క్రితం తీసుకెళ్లి రహస్యంగా విచారణ జరుపుతున్నారు. పంటను తానే దహనం చేసినట్లుగా ఒప్పుకోవాలంటూ పోలీసులు సురేశ్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పంట దహనం సంఘటనకు పాల్పడింది తానేనంటూ సురేశ్ చేతనే చెప్పించి ప్రభుత్వానికి ఆ మరక అంటకుండా చూసేందుకు కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా చంద్రశేఖరే తనను దహనం చేయమని చెప్పినట్లుగా సురేశ్ చేత చెప్పించి కేసులో ఆయన్ను సైతం ఇరికించేందుకు భారీ స్థాయిలో పథక రచన చేశారు. ఇందులో భాగంగా చంద్రశేఖర్‌ను కూడా గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రైతు, ప్రజాసంఘాల నాయకులు, ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఈనెల 23న తుళ్లూరు మండలం మల్కాపురంలో ల్యాండ్‌పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతు గద్దె చంద్రశేఖర్ పొలంలో చెరకు పంటను గుర్తుతెలియని దుండగులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 26న సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వై.ఎస్.జగన్ బాధిత రైతులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం, పోలీసుల వ్యవహార శైలిపై బాధిత రైతు చంద్రశేఖర్ ఆయనకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సర్కారు మాట వినని రైతులపై కక్ష సాధింపులు గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని రైతులకు నిద్ర లేకుండాపోతోంది. భూ సమీకరణ పేరుతో అనేక మంది రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొన్న ప్రభుత్వ పెద్దలు తమ మాట వినని రైతులను టార్గెట్ చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తిరిగి వారిపైనే కేసులు పెడుతూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంత చేస్తున్నా రైతులు లొంగకపోవడంతో పంటలను దహనం చేసే స్థాయికి దిగజారుతున్నారు. గతేడాది డిసెంబర్లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన ఆరు గ్రామాల్లో 13 మంది రైతులకు చెందిన పంట పొలాల్లో వెదురు బొంగులు దహనం చేసిన సంఘటన తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించినప్పటికీ ఇంత వరకు ఈ కేసులో అసలైన బాధ్యులను గుర్తించి అరెస్టు చేసిన దాఖలాలు లేవు. పైగా అప్పట్లో విచారణ పేరుతో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతులను, వైఎస్సార్సీపీకి చెందిన రైతులను స్టేషన్లకు పిలిచి రోజుల తరబడి విచారణ పేరుతో బెదిరింపులకు దిగుతూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇతర నేతలంతా గవర్నర్‌ను కలిసి పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వీరి తీరు మాత్రం మారలేదు. -
టీడీపీకి ఓటు వేసినందుకు...
-
టీడీపీకి ఓటు వేసినందుకు...
మల్కాపురం: 'ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇవ్వనందుకు నా పంటను తగులబెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేశాం. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు మాకు పట్టిన దుర్గతి ఇది' అని గద్దె చిన చంద్రశేఖర్ వాపోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం చెందిన చంద్రశేఖర్ తన గోడును ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు వెళ్లబోసుకున్నారు. రాజధానికి తన పొలం ఇవ్వలేదన్న కక్షతో పంటకు నిప్పుపెట్టారని ఆయన ఆరోపించారు. భూములు ఇవ్వకపోవడం తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. చంద్రశేఖర్ కు చెందిన చెరుకు తోటను దుండగులు శుక్రవారం దగ్ధం చేశారు. కాగా, తాము భూములు ఇవ్వబోమని చెబుతున్నా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని వైఎస్ జగన్ తో పలువురు రైతులు చెప్పారు. తమకు అండగా నిలవాలని జననేతను కోరారు. రైతులను నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. అన్నదాతల తరపున పోరాడతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు. దుండగులు దగ్ధం చేసిన చంద్రశేఖర్ చెరకు తోటను వైఎస్ జగన్ పరిశీలించారు. అనంతరం పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. -
'అధికారమదంతో రాక్షసుడు అవుతున్నాడు'
-
భూములివ్వని రైతుల్లో గుబులు
రాజధాని భూముల్లో పంట దగ్ధం ఘటనపై అనుమానాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు... ఏ రోజు కారోజు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. పది నెలల వ్యవధిలో జరిగిన పలు సంఘటనలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన చెరుకు తోట దగ్ధం టీడీపీ కార్యకర్తల దుందుడుకు చర్యగా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు, పాలకులు స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటున్నారు. భూములు ఇవ్వని రైతులు సాగులో ఉన్న పంటను కాపాడుకునే యత్నంలో ఉంటే, మిగిలిన రైతులు సాగును చేపట్టాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భూములు ఇవ్వలేదన్న కక్షతోనే... తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చిన చంద్రశేఖర్ చెరుకు పంట దగ్ధం వెనుక అధికార పార్టీ కార్యకర్తల హస్తం ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. మొదటి నుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న చంద్రశేఖర్‌పై అక్కడి టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇంకా ఆ పరిసర గ్రామాల్లో 1,000 ఎకరాలకుపైగానే భూములను రైతులు ఇవ్వాల్సి ఉంది. ఆ రైతులంతా చంద్రశేఖర్, మరి కొందరి సూచనల మేరకు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. వీరిని భయపెట్టి దారికి తీసుకువచ్చేందుకు ఈ ప్రయత్నం జరిగినట్టుగా అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ విషయమై చంద్రశేఖర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, భూ సమీకరణకు భూములు ఇవ్వలేదన్న కక్షతోనే తన చెరుకు పంటను దగ్ధం చేశారని, అధికారులు ఈ కేసు విచారణపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. డీఎస్పీ శనివారం పొలాన్ని పరిశీలించారని, ఎవరో సిగరెట్ వేయడం వలన ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు. గతంలోనూ అనేకసార్లు... గత డిసెంబర్లో రాజధాని నిర్మాణానికి భూములను భూ సమీకరణ విధానంలో తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. దీన్ని కొన్ని గ్రామాల రైతులు వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 28న రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఐదు గ్రామాల్లో 13 చోట్ల షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను తగులబెట్టారు. ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లోని పంట పొలాలపై తెగబడ్డారు. రాయపూడి గ్రామస్థులు గోరగంటి శ్రీనివాసరావుకు చెందిన 1,500 వెదురు బొంగులు, షేక్ చినమీరాసాహెబ్కు చెందినవి 2,500, లింగాయిపాలెం గ్రామస్థుడు గుంటుపల్లి సాంబశివరావుకు చెందిన 310, మందడం గ్రామస్థులు ముప్పాళ్ల వెంకటేశ్వరరావుకు చెందిన 1,300, యర్రమనేని శ్రీనివాసరావుకు చెందిన 2,500 వెదురు బొంగులు, యంపరాల అప్పారావుకు చెందిన 500 మీటర్ల డ్రిప్వైరును దుండగులు తగులబెట్టారు. వెంకటపాలెం గ్రామస్థుడు లంకా రఘునాథరావుకు చెందిన అరటి బొత్తలకు నిప్పు పెట్టారు. తాడేపల్లి మండలం పెనుమాక సర్పంచి కల్లం పానకాలరెడ్డికి చెందిన 2,500 బొంగులు, బోనం శంకరరెడ్డికి చెందిన డ్రిప్వైరు, పశువులపాకలను తగులబెట్టారు. నెమలికంటి నాగేశ్వరరావుకు చెందిన 500 బొంగులు కాలిపోయాయి. ఉండవల్లి గ్రామస్థులు కుర్రపోలు మల్లికార్జునరెడ్డికి చెందిన 600 బొంగులు, పల్లప్రోలు సాంబిరెడ్డికి చెందిన 2వేల బొంగులు, 20 బస్తాల ఎరువులు కాలి బూడిదగా మారాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. అప్పట్లో పోలీసులు హడావిడి చేసి కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటికీ ఆయా కేసుల్లో పురోగతి కనిపించలేదు. భూములు ఇవ్వని వారిపై అన్ని రకాల ఒత్తిళ్లు: బోయపాటి సుధారాణి కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బోయపాటి సుధారాణి భూ సమీకరణను వ్యతిరేకిస్తూ అప్పట్లో మీడియా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగట్టారు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి, తనకున్న 70 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఇస్తున్నట్టు ప్రకటన చేయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.శ్రీధర్, ఇతర రెవెన్యూ అధికారులు ఆమెతో గుంటూరులో చర్చలు జరిపి ఆ భూమిని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు ప్రకటన చేయించారు. తాజాగా తుళ్లూరులో జరిగిన సంఘటనను ఆమె వద్ద ప్రస్తావిస్తే, ‘ఈ ప్రభుత్వానికి ఇటువంటివి అలవాటే. భూములు ఇవ్వని వారిపై అన్ని రకాలుగా బంధువులు, స్నేహితులు, అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తారు. బెదిరిస్తారు. మానవ హక్కులకు భంగం కలిగిస్తారు. తీరా భూములు ఇచ్చిన తర్వాత ప్రకటించిన ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తారు’ అని చెప్పారు. -
టెక్స్టైల్ పార్క్‌లో 55 కుట్టుమిషన్లు చోరీ
చౌటుప్పల్: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురంలోని టెక్స్టైల్స్ పార్క్‌లో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. వివరాలు... టెక్స్టైల్స్ పార్క్‌లో కార్మికులకు శిక్షణ ఇచ్చే కేంద్రంలో 55 కుట్టు మిషన్లు ఉన్నాయి. సోమవారం రాత్రి శిక్షణ కేంద్రం వెనకభాగంలోని కిటికీని తొలగించి లోపలికి వెళ్లి అందులో ఉన్న 55 కుట్టుమిషన్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షలు ఉంటుందని అధికారి తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లి చెంతకు చేరిన శిశువు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ కేజీహెచ్ నుంచి అపహరణకు గురైన శిశువు తల్లి చెంతకు చేరింది. వారం రోజులు దర్యాప్తు చేసిన పోలీసులు ఎట్టకేలకు శిశు అపహరణ కేసు ఛేదించి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. కేజీహెచ్ ప్రసూతి వార్డు నుంచి ఈనెల 21 వేకువజామున శిశువు అపహరణకు గురైన విషయం తెలిసిందే. జాలారిపేటకు చెందిన వాసుపల్లి గుణ 21 అర్ధరాత్రి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఒంటిగంట సమయంలో బిడ్డకు పాలిచ్చి గంట నిద్రపోయింది. ఆ సమయంలో కేజీహెచ్‌లో పనిచేస్తున్న నాలుగో తరగతి సిబ్బంది ఇద్దరు, మార్చురి వద్ద అనధికార విధులు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు కలిసి ఆ బిడ్డను అపహరించారు. వార్డు గోడ మీదుగా బిడ్డను మాయం చేసి మల్కాపురం ఎక్స్‌సర్వీస్‌మెన్ కాలనీకి చెందిన ఓ పిల్లలు లేని మహిళకు రూ.30 వేలకు విక్రయించారు. కొద్దిసేపటికి పక్కలో బిడ్డ లేకపోవడం గమనించిన గుణ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారించి వారు బిడ్డను అమ్మేసినట్లు తెలుసుకున్నారు. మల్కాపురం వెళ్లి ఆ శిశువును తీసుకొచ్చి ఆస్పత్రిలో తల్లికి అప్పగించారు. నిందితులతోపాటు బిడ్డను కొనుగోలు చేసిన మహిళను అదుపులో తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది సహకరించనందున కేసు ఛేదించేందుకు వారం రోజులు పట్టిందని వన్‌టౌన్ సీఐ చెప్పారు. -
పురందేశ్వరికి విశ్వాసం లేదు: టిఎస్సార్
మల్కాపురం: కాంగ్రెస్ పార్టీ దయతో ఎనిమిది సంవత్సరాలు కేంద్రమంత్రిగా పనిచేసి, ఇప్పుడు పార్టీని వీడిన దగ్గుబాటి పురందేశ్వరి విశ్వాసం లేనిమనిషి అని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆర్టీసీ డిపోలో శనివారం జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీలో చేరి పురందేశ్వరి విశాఖ ప్రజలను అవమానించారన్నారు. ఇక్కడి ప్రజలకు ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాధ్ సింగ్ సమక్షంలో పురందేశ్వరి బీజేపీ ఆ పార్టీలో చేరారు. తాను బేషరతుగా బీజేపీలో చేరానని, పార్టీ దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తానని ఆమె తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తీరు బాధ కలిగించిందని అన్నారు. -
మనసు పలికిన ప్రేమరాగం
మల్కాపురం(విశాఖపట్నం), న్యూస్‌లైన్: ప్రేమ.. రెండు హృదయాల స్పందన. రెండు మనసుల అంగీకారం. కులమతాలకు అతీతం. త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. పుస్తకాల్లో చదువుతున్న ఈ అక్షరాలకు స్వచ్ఛమైన భాష్యం పలికి తన ఆదర్శాన్ని చాటుకున్నాడో యువకుడు. ఫోన్లో పరిచయమైన యువతిపై మనసు పారేసుకున్నాడు. కాలక్రమంలో వికలాంగురాలని తెలిసినా అవాక్కవ్వలేదు. మరింత ప్రేమను పెంచుకున్నాడు. మనస్సాక్షిగా ఆమెను పెళ్లి చేసుకొని తన పెద్దమనసును చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన జాయ్ కీర్తన రాజు (23) ఎలక్ట్రీషియన్. ప్రైవేట్ పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండేళ్ల క్రితం రాజుకు ఫోన్ ద్వారా మల్కాపురం ప్రాంతానికి చెందిన మేరీరాణి (20)తో పరిచయమైంది. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. ఒకరినొకరు చూసుకోకుండానే పెళ్లి తీరం వరకు వచ్చేశారు. రాజు పెళ్లి ప్రస్తావన చేయడంతో మేరీరాణి అసలు విషయం చెప్పింది. ఏడో తరగతిలో ఉండగా నరాల బలహీనత కారణంగా తన శరీరంలోని అవయవాలన్నీ చచ్చుబడిపోయాయని, వీల్ చైర్ ఆధారంగానే జీవనం సాగిస్తున్నానని చెప్పగానే రాజు అవాక్కవ్వలేదు. తన ప్రేమ మనసుకే నంటూ ఆమెను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇరుకుటుంబాల పెద్దలు కూడా అడ్డు చెప్పకపోవడంతో బుధవారం మల్కాపురం సామాజిక భవనంలో ఒక్కటయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఆదర్శ జంట వివాహానికి పారిశ్రామికవాడ నలుమూలల నుంచి పలువురు పెద్దలు హాజరై ఆశీర్వదించారు. రాజు ఆదర్శాన్ని అభినందించారు. క్రిస్టియన్ మత పెద్దలు ఆశీర్వచనం పలికారు.