
హింసపెట్టి లొంగదీస్తున్నారు?
- సురేశ్‌ను ఎక్కడ దాచారో చెప్పాలి
- భూసమీకరణకు ఒప్పించేందుకు పోలీసుల బెదిరింపులు
- విచారణ పేరిట ఎక్కడెక్కడికో తిప్పుతున్నారు
- తుళ్లూరులో చెరకు తోట దహనం కేసు
- బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ
హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు ముందుకు రాని రైతుల్ని లొంగదీసుకునేందుకు పోలీసులు బెదిరింపుల ఎత్తుగడను అమలు చేస్తున్నారని... మల్కాపురం చెరకు తోట దహనంపై బెజవాడ బార్ అసోసియేషన్ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఆరోపించింది. ఈ ఘటనలో అమాయకులను వేధించడం, హింసించడం మానుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. చెరకు తోట దహనం కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చాలని పోలీసు యంత్రాంగం తహతహ లాడుతున్నట్టు నిర్ధారించింది.
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో ఈనెల 23న భూసమీకరణకు సహకరించని రైతు గద్దె చంద్రశేఖర్ చెరుకు పంట దహనం తర్వాత పోలీసులు తమను వేధిస్తున్నారంటూ ఆ ప్రాంత ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు బెజవాడ బార్ అసోసియేషన్ ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.
బార్ అసోసియేషన్, ఓపీడీఆర్, పీయూసీఎల్, పీఓడబ్ల్యూ సభ్యులు 8మందితో కూడిన కమిటీ తుళ్లూరు, మల్కాపురం, తుళ్లూరు పోలీసుస్టేషన్, గుంటూరు పోలీసుక్లబ్‌ను సందర్శించడంతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. అనంతరం కమిటీ తరఫున ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు, బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కమిటీ నిర్ధారణకు వచ్చిన అంశాలను వివరించారు.
అంగీకార పత్రాన్ని రాయించుకున్నట్టు అనుమానం
‘చెరకు తోట దహనం కేసులో పోలీసుల తీరును నిజనిర్ధారణ కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. తోట యజమాని గద్దె చంద్రశేఖర్ మేనల్లుడు సురేశ్‌ను విచారణ పేరిట తుళ్లూరు పోలీసులు ఈనెల 28న సాయంత్రం 5 గంటలకు తీసుకువెళ్లారు. ఇప్పుడాయన తుళ్లూరు పోలీసుల వద్ద లేరు. ఎక్కడున్నారో చెప్పడం లేదు. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల ప్రకారం 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసయినా నిందితుణ్ణి 24 గంటల్లోపల విచారించి వదిలిపెట్టాలి. సురేశ్ విషయంలో అలా జరగలేదు. చంద్రశేఖర్, మరో రైతు మీరా ప్రసాద్‌లను విచారించి వదిలిపెట్టారు.
సురేశ్ విషయంలో సరైన సమాధానం చెప్పడం లేదు. తన మేనమామ చంద్రశేఖర్ చెప్పినందునే తోటను తగలబెట్టినట్టుగా సురేశ్‌తో బలవంతంగా చెప్పించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. సురేశ్‌తో ఈ మేరకు అంగీకార పత్రాన్నీ రాయించుకున్నట్టు అనుమానిస్తున్నాం. భూసమీకరణకు అంగీకరించని వారందర్నీ ఒప్పించేందుకు పోలీసులు సురేశ్‌ను పావుగా ఉపయోగించుకోబోతున్నారు. ఈ విషయంలో ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా ఉన్నట్టు నాటకం ఆడుతున్నారు. ఈనెల 22న రాజధానికి శంకుస్థాపన జరిగిన రోజు మధ్యాహ్నం 2.30- 4.00 గంటల మధ్యే తోట తగలబడినట్టు పోలీసులు చేస్తున్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదు.
ఓ పక్క ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతరత్రా ప్రముఖులు, మరోపక్క శంకుస్థాపనకు వచ్చిన వేల మంది పోలీసు బలగాలున్న సమయంలో తోట తగలబడుతున్నట్టు తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అగ్నిమాపక యంత్రాలను ఎందుకు పంపలేదు? ఈ వ్యవహారంలో పోలీసుల వాదన తప్పు. కేసులో బేరసారాలు మొదలుపెట్టి తామనుకున్న పనిని చేయించాలనుకుంటున్నారు’ అని నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడినట్టు రాజేంద్రప్రసాద్ వివరించారు. సురేశ్‌ను తక్షణమే విడిచిపెట్టకపోతే తదుపరి చర్య ఏమిటనే దానిపై ఈ నిజనిర్ధారణ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో భేటీ అయి భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేస్తుందన్నారు.
న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచన కూడా లేకపోలేదన్నారు. ఈ సంఘటనపై నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యుల్లో బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.జయమ్మ, మాజీ అధ్యక్షుడు దుర్గా శ్రీనివాసరావు, సభ్యులు కేవీవీ పరమేశ్వరరావు, ఓపీడీఆర్ నేతలు ఏసు, వి.రాజ్యలక్ష్మీ, పీయూసీఎల్ నాయకులు ఎం.శేషగిరిరావు, పీఓడబ్ల్యూ నాయకురాలు గంగా భవానీ, మంగళగిరి బార్ అసోసియేషన్ ప్రతినిధి లంకా శివరామ ప్రసాద్ ఉన్నారు.